పిఎంఇండియా
ఆంధ్ర ప్రదేశ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి)కి ఒక డైరెక్టర్ పదవిని మరియు మూడు బోధనేతర పదవులను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డైరెక్టర్ పదవికి మూల వేతనం 75,000 వేల రూపాయలు + 5,000 రూపాయల ప్రత్యేక అలవెన్సు ఉంటాయి. మూడు బోధనేతర పదవులు రిజిస్ట్రారు, లైబ్రేరియన్ మరియు ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ & స్పోర్ట్స్ (ఎస్ఎఎస్) ఆఫీసర్ అనే పదవులు. వీటికి 10,000 రూపాయల గ్రేడ్ పే ఉంటుంది.
పూర్వరంగం:
ఎన్ఐటి లు జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలు. ఈ సంస్థలు ఇంజినీరింగ్ మరియు సాంకేతిక విజ్ఞాన రంగంలో ఉత్తమ బోధన సంస్థల కోవకు చెందుతాయి. ఈ సంస్థలు వాటి ఉన్నత స్థాయి సాంకేతిక విద్యా బోధనతో ప్రశంసాయోగ్యమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఇప్పుడు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలలో ఒక డైరెక్టర్ పదవి మరియు మూడు నాన్ ఫేకల్టీ పోస్టులు ఉంటాయి. నాన్ ఫేకల్టీ పోస్టులలో రిజిస్ట్రారు, లైబ్రేరియన్ మరియు ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ & స్పోర్ట్స్ (ఎస్ఎఎస్) ఆఫీసర్ పదవులు ఉంటాయి. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఎన్ఐటి నిర్వహణకు బాధ్యులుగా ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్ఐటి ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందిని అందిస్తుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు ఉద్యోగ అవకాశాల కల్పనకు అండదండలు లభించగలవు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు 2014 మార్చి 1వ తేదీన భారతదేశ రాష్ట్రపతి అనుమతిచ్చిన దరిమిలా మానవ వనరుల అభివృద్ధి (హెచ్ ఆర్ డి) మంత్రిత్వ శాఖ విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఐటి ని ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2014 యొక్క 13వ షెడ్యూలు (విద్య) ప్రకారం నెలకొల్పింది.
*****