Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త బిల్లు, 2018 ను తీసుకు వ‌చ్చే ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం


ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త బిల్లు, 2018 ని పార్ల‌మెంటు లో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌తిపాద‌న‌ కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్ర‌యోజ‌నాలు :

దీనివ‌ల్ల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించి ఒకే విధ‌మైన భ‌ద్ర‌త ప్ర‌క్రియ‌లను చేప‌ట్టేందుకు వీలు క‌లుగుతుంది. ఇది ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు, ఈ ఆన‌క‌ట్ట‌ల‌ నుండి ల‌భించే ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌ కు ఇది వీలు క‌ల్పిస్తుంది. ప్రజ‌ల ప్రాణాలను, ప‌శు గణాన్ని, ఆస్తులను కాపాడుకోవడంలో కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌న దేశానికి చెందిన నిపుణులు, అంత‌ర్జాతీయ నిపుణుల‌తో విస్తృతంగా సంప్ర‌దింపులు జ‌రిపిన తరువాత ఈ ముసాయిదా బిల్లును ఖ‌రారు చేయడమైంది.

వివ‌రాలు :

దేశం లోని అన్ని నిర్దేశిత ఆన‌క‌ట్ట‌లు సుర‌క్షితంగా ప‌నిచేసేందుకు అనువుగా త‌గిన నిఘా కు, త‌నిఖీ కి, వాటి కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌ మరియు మరమ్మతుకు ఈ బిల్లు వీలు క‌ల్పిస్తుంది.

ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌ కు సంబంధించి ఒక జాతీయ సంఘం ఏర్పాటు కు ఈ బిల్లు అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. ఈ సంఘం సదరు ఉద్దేశం నెరవేరేందుకు ఆనకట్టల భద్రత సంబంధ విధానాలను రూపొందించడం మరియు అవసరమైనటువంటి నియమనిబంధనలను సూచించడం చేస్తుంది.

జాతీయ ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త ప్రాథికార సంస్థ ఏర్పాటుకు కూడా బిల్లు వీలు క‌ల్పిస్తుంది. ఇది దేశంలోని ఆన‌కట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన విధానాలను, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, మరియు ప్ర‌మాణాల‌ను అమ‌లు చేసే కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌ర్తిస్తుంది.
రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌పై రాష్ట్ర సంఘం ఏర్పాటు కు అవ‌కాశం క‌ల్పిస్తుంది.

జాతీయ ఆన‌కట్ట‌ల భ‌ద్ర‌త ప్రాథికార సంస్థ

ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన వివిధ అంశాలు, డాటాబేస్, ఇత‌ర ప‌ద్ధ‌తుల ప్రామాణీక‌ర‌ణ విష‌యంలో ఇది రాష్ట్రాల‌ ఆనకట్టల భద్రత సంస్థలు , ఆనకట్ట యాజ‌మాన్యాల‌తో అనుసంధానాన్ని క‌లిగివుంటుంది.

ఇది రాష్ట్రాల‌కు, ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త సంస్థ‌ల‌కు సాంకేతిక‌ప‌ర‌మైన‌, యాజ‌మాన్య ప‌ర‌మైన స‌హాయాన్ని అందిస్తుంది.

ఇది దేశం లోని అన్ని ఆన‌క‌ట్ట‌ల‌కు సంబంధించి జాతీయ‌ స్థాయి లో స‌మాచారాన్ని, ప్ర‌ధాన ఆన‌క‌ట్ట‌ల వైఫ‌ల్యాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రిస్తుంది.

ఇది ఆన‌కట్ట‌ల‌కు సంబంధించి ప్ర‌ధాన వైఫ‌ల్యాల‌కు గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తుంది.

ఆన‌క‌ట్ట‌లు, వాటి అనుంబంధ వ్య‌వ‌స్థ‌ల‌ స‌మ‌గ్ర‌ త‌నిఖీ కి సంబంధించి గ‌మ‌నించాల్సిన అంశాల జాబితాకు సంబంధించి ప్రామాణిక మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చురిస్తుంది.

కొత్త ఆన‌క‌ట్ట‌ల నిర్మాణం, డిజైన్ రూప‌క‌ల్ప‌న‌, ఇన్వెస్టిగేశన్ ప‌నుల‌ను అప్ప‌గించ‌డానికి వీలున్న సంస్థ‌ల‌కు అక్రడిటేశన్ లేదా గుర్తింపును ఇది మంజూరు చేస్తుంది.

ఇరు రాష్ట్రాల‌కు సంబంధించిన ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త సంస్థ‌ ల మ‌ధ్య అప‌రిష్కృతంగా ఉన్న అంశాల‌ను లేదా ఒక ఆన‌క‌ట్ట భ‌ద్ర‌త సంస్థ‌ కు, ఆ రాష్ట్రం లోని ఆన‌క‌ట్ట యాజ‌మాన్యానికి మ‌ధ్య అప‌రిష్కృత అంశాలు ఏవైనా ఉంటే వాటి ప‌రిష్కారానికి కృషి చేస్తుంది.

కొన్ని సంద‌ర్భాల‌లో, ఒక రాష్ట్రానికి చెందిన ఆన‌క‌ట్ట మ‌రో రాష్ట్ర భూభాగంలో ఉన్న‌ప్పుడు ఈ జాతీయ ప్రాధికార సంస్థ, ఆన‌క‌ట్ట భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ పాత్ర‌ ను పోషిస్తుంది. దీనివ‌ల్ల అంత‌ర్ రాష్ట్ర సంఘ‌ర్ష‌ణ‌ల‌కు అవ‌కాశం లేకుండా పోతుంది.

ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌పై రాష్ట్ర సంఘం

ఇది ఆ రాష్ట్రం లోని నిర్దేశిత ఆన‌క‌ట్ట‌ల విష‌యంలో త‌గిన నిఘాను, తనిఖీ ని, నిర్వ‌హ‌ణ ను చేప‌ట్ట‌డం ద్వారా ఆయా ఆన‌క‌ట్ట‌లు సుర‌క్షితంగా ప‌నిచేయ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. ప్ర‌తి రాష్ట్రం రాష్ట్ర ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త సంస్థ ఏర్పాటు చేసేందుకు ఇది వీలు క‌ల్పిస్తుంది. ఇందులో ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన అధికారులు, ఆన‌క‌ట్ట డిజైన్‌, హైడ్రో మెకేనిక‌ల్ ఇంజనీయరింగ్, హైడ్రోల‌జీ, జియో టెక్నిక‌ల్ ఇన్వెస్టిగేశన్‌, ఇన్‌స్ట్రుమెంటేశన్‌, ఆనకట్ట పునరావాస రంగాల‌కు చెందిన నిపుణులు ఉంటారు.

పూర్వరంగం :

భార‌తదేశంలో 5200 భారీ ఆన‌క‌ట్ట‌లు ఉన్నాయి. మ‌రో 450 ఆన‌క‌ట్ట‌లు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. ఇవికాక వేలాది మ‌ధ్య‌త‌ర‌హా, చిన్న‌త‌ర‌హా ఆన‌క‌ట్ట‌లు ఉన్నాయి. భార‌త‌దేశంలో ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించి త‌గిన చ‌ట్ట‌ప‌ర‌మైన‌, వ్య‌వ‌స్థాగ‌త‌మైన ఏర్పాట్లు లేక‌పోవ‌డంతో ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త ఆందోళ‌న క‌లిగించేదిగా త‌యారైంది.

సుర‌క్షితం కాని ఆన‌క‌ట్టలు ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. ఆన‌క‌ట్ట‌లు తెగిపోతే అది పెనువిప‌త్తుకు దారితీయ‌డ‌మే కాకుండా పెద్ద ఎత్తున ప్రాణ , ఆస్తి న‌ష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది.

ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన అన్ని అంశాల‌ను, అంటే, ఆన‌క‌ట్ట‌లను క్ర‌మం త‌ప్ప‌కుండా త‌నిఖీ, అత్యవ‌స‌ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌, ఆన‌క‌ట్ట‌ల స‌మ‌గ్ర భ‌ద్ర‌తా స‌మీక్ష‌, ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన మ‌ర‌మ్మ‌తులు, ఆన‌క‌ట్ట భ‌ద్ర‌తా నిర్వ‌హ‌ణ‌కు నిధులు, ప‌రిక‌రాలు, భ‌ద్ర‌త ప్ర‌మాణాల వంటి వాటికి సంబంధించిన అంశాలు ఆన‌కట్ట‌ల భ‌ద్ర‌త, 2018 బిల్లు ప‌రిధి లోకి వ‌స్తాయి. ఆన‌క‌ట్ట భ‌ద్ర‌త విష‌యంలో ఆన‌క‌ట్ట య‌జ‌మాని ని బాధ్యులుగా చేస్తుంది. కొన్ని ర‌కాల చ‌ర్య‌ల‌కు వారిని శిక్షించేందుకు కూడా బిల్లులో పొందుప‌రిచారు.