Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడల ఛాంపియన్లతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

ఆసియా పారా క్రీడల ఛాంపియన్లతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం


క్యాబినెట్లో నా సహమంత్రులు శ్రీ మన్సుఖ్ మాండవీయ, శ్రీమతి రక్షా ఖడ్సే, భారత పారాలింపిక్ కమిటీ, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, ఇతర విశిష్ట అతిథులు, పతక విజేతలందరికీ, సోదరీసోదరులా…

మీ అందరినీ కలుసుకోవడానికి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. కొన్ని వారాల క్రితమే, ఆసియా క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లను కలుసుకున్నాను. ఇప్పుడు ఆసియా పారాక్రీడల్లో పాల్గొన్న మీతో ముచ్చటించే అవకాశం నాకు లభించింది. ప్రపంచ క్రీడారంగంలో ప్రధాన శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోందని మీ అద్భుతమైన ప్రదర్శన తెలియజేస్తోంది. అంతటి పెద్ద వేదికపై మీరు గెలించింది పతకాలను మాత్రమే కాదు. కోట్లాది మంది భారతీయుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. పట్టుదల, ధైర్యంతో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని మీ పారా అథ్లెట్లు మరోసారి రుజువు చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ విజయంలో మీ కుటుంబాలు, మీకు శిక్షణ ఇచ్చినవారు, కోచ్‌లు కీలకమైన పాత్రను పోషించారు. నేను వారినీ అభినందిస్తున్నాను. నేను ముందే చెప్పినట్లుగా, ఒక అథ్లెట్ కోసం కోచ్ పడే శ్రమ అపారమైనది. ఒక పారాలింపిక్ అథ్లెట్ కోసం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ కృషి అవసరం. అప్పుడే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకు నేను వారికి ప్రత్యేక అభినందనలను, ప్రశంసలను తెలియజేస్తున్నాను. 

మిత్రులారా,

ఒకప్పుడు చాలా క్రీడల్లో భారత్ భాగస్వామ్యాన్ని నామమాత్రంగానే పరిగణించేవారు. పారా క్రీడల్లో సైతం దేశం చాలా వెనకబడి ఉంది. 2010 ఆసియా పారా క్రీడలలో భారతదేశం కేవలం ఒక్క స్వర్ణాన్ని మాత్రమే గెలుచుకుంది. మొత్తంగా, ఆ టోర్నమెంట్‌లో మనం కేవలం పద్నాలుగు పతకాలను మాత్రమే గెలుచుకోగలిగాము. పద్నాలుగు. ఈసారి మన క్రీడాకారులు నూట పద్నాలుగు పతకాలతో తిరిగి వచ్చారు. పద్నాలుగు నుంచి నూట పద్నాలుగు వరకు సాగిన ఈ ప్రయాణం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇది మీరు చేసిన కఠోర శ్రమ ఫలితం. క్రీడల పట్ల మీ అంకితభావం, దాని చుట్టూ అభివృద్ధి చెందిన వ్యవస్థ సాధించిన విజయం. ఈసారి ముప్పై స్వర్ణాలు, ముప్పై అయిదు రజతాలు, నలభై తొమ్మిది కాంస్యాలు, అయిదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది ఆసియా రికార్డులు సాధించి దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచారు. మొత్తం యాభై ఆరు మంది మహిళా అథ్లెట్లలో ముప్పై నాలుగు మంది పతకాలను సాధించారు. నాలుగు క్రీడా విభాగాల్లో పోడియంపై మూడు స్థానాలూ భారత్‌వే. ఒకే విభాగంలో స్వర్ణాన్ని, రజతాన్ని, కాంస్యాన్ని భారత్ గెలుచుకుంది. పోటీల చివరి రోజున సైతం తొమ్మిది బంగారు పతకాలను సాధించి అద్భుతమైన ప్రదర్శన చేశారు. క్రీడలు కొనసాగినంత కాలం పతకాల పరంపర ఆగకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపించింది.

మిత్రులారా,

గతంలో భారత్ ఎప్పుడూ విజయం సాధించని క్రీడాంశాల్లో మన క్రీడాకారులు స్వర్ణాలు సాధించారు. మోనా అగర్వాల్ పారా షూటింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. హనీ తన పాత ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టారు. హిమాంశు, రవి, జెహాన్ తమ ప్రదర్శనల ద్వారా శారీరక పరిమితులను ఎలా అధిగమించవచ్చో ప్రపంచానికి చూపించారు.

మిత్రులారా,

అది ఒక క్రీడాకారుడి వ్యక్తిగత విజయమైనా లేదా ఒక దేశం సాధించిన సమష్టి విజయమైనా, ప్రపంచం ఆ గెలుపు కాంతిని మాత్రమే చూస్తుంది. కానీ ఆ క్షణం వెనుక ఉన్న సంవత్సరాల కఠోర శ్రమ, రేయింబవళ్లూ చిందించిన స్వేదం, ఆ స్థాయికి చేరుకోవడానికి అవసరమైన అచంచలమైన అంకితభావం, పట్టుదల – ఇవే విజయమనే మహోన్నత సౌధం నిలబడేందుకు అవసరమైన పునాదిని ఏర్పరుస్తాయి. ఉదాహరణకు ఆసియా పారాక్రీడలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే రింకూ తన తల్లిని కోల్పోయారు. అంతటి బాధలోనూ.. ఆమె తన ధైర్యాన్ని ప్రదర్శించారు. స్వర్ణం సాధించినప్పుడు తన తల్లి ఫొటోను ప్రదర్శించారు. పతకాన్ని ఆమెకు అంకితం చేశారు. ఆ  క్షణం భారతీయుల హృదయాలను తాకింది.

మిత్రులారా,

మీ పోరాటాలు, మీరు సాధించిన విజయాలు ప్రతి భారతీయునికీ స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో మీ మార్గం, దేశ మార్గం దాదాపు ఒకటే.. అందుకే ఈ రోజు మీ కృషి, దేశ కృషి కలిసికట్టుగా మరింత గొప్ప శక్తిని సృష్టిస్తున్నాయి.

మిత్రులారా,

2014 తర్వాత దేశం బృహత్ లక్ష్యాల సాధన దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. తమ పిల్లలను క్రీడారంగంలోకి పంపేందుకు చాలా మంది తల్లిదండ్రులు భయపడేవారు. బాలలు సైతం ఈ విషయంలో సంకోచిస్తూ ఉండేవారు. వనరుల కొరత, మద్దతు లభించకపోవడం, పారదర్శకత లేమి అనే జాడ్యం వ్యవస్థలో ఉండేది.  వ్యవస్థలో ఏ మార్పూ రాదని ప్రజలు అంటూ ఉండేవారు. వారు అదే నిజమని భావించారు. ఏ సవాలు ముందైనా ఓటమిని మీరు అంగీకరించనట్లే… దేశం కూడా తన దృష్టిని కేవలం లక్ష్యాలపైనే నిలిపింది. మన యువ ప్రతిభ వృధా కాకుండా చూడాలని మేము సంకల్పించుకున్నాం. అందుకే మీలాంటి యువత ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యవస్థనే మార్చాలని మేం నిర్ణయించుకున్నాం. దాని ఫలితగా క్రీడల్లో నూతన కోణం ఆవిర్భవించింది. నేడు యువ క్రీడాకారులకు తమ ప్రతిభపై నమ్మకం ఉంటే, దేశం తమకు అండగా నిలుస్తుందనే భరోసా కూడా వారికి ఉంటోంది. దీనికి మన పారా క్రీడల రంగమే గొప్ప ఉదాహరణ. ఒకప్పుడు భారతదేశ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్న ఆటల్లో కూడా ఇప్పుడు మన ఉనికి బలంగా పెరుగుతోంది. విలువిద్య, అథ్లెటిక్స్, షూటింగ్, ఈత, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, జూడో, పవర్‌లిఫ్టింగ్ లాంటి ఎన్నో క్రీడల్లో యువ అథ్లెట్లు వెలుగులోకి వస్తున్నారు. మనం సరికొత్త ఛాంపియన్లను గుర్తిస్తున్నాం. ఈసారి ఆసియా పారా క్రీడల్లో పాల్గొన్న మన క్రీడాబృందంలో అరవై ఒక్క మంది తొలిసారిగా ఈ వేదికపై పోటీపడ్డారు. అరవై ఒక్క మంది కొత్త క్రీడాకారులు.  వారిలో ముప్పై ఆరు మంది పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. సందీప్ తన అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. యువ క్రీడాకారుల ఈ భాగస్వామ్యం నేటి భారతదేశాన్ని ప్రతిబింబిస్తూ, భవిష్యత్ భారతాన్ని చాటిచెబుతోంది.

మిత్రులారా,

మేము క్రీడలను జాతీయ, అంతర్జాతీయ పోటీలుగా మాత్రమే చూడట్లేదు. మా దృష్టిలో వ్యక్తిత్వ నిర్మాణానికి, దేశ నిర్మాణానికి దోహదపడే శక్తివంతమైన మాధ్యమం క్రీడలు. ఓటమి తర్వాత ఎలా గెలవాలో యువతకు క్రీడలే నేర్పిస్తాయి. క్రీడలు క్రమశిక్షణను, బృంద స్ఫూర్తికి ఉన్న అర్ధాన్ని బోధిస్తాయి.

మిత్రులారా,

ఈ లక్ష్యంతోనే దేశంలో కొత్త క్రీడా వ్యవస్థను మేం నిర్మిస్తున్నాం. పాఠశాలల్లో, క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. పెద్ద సంఖ్యలో ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేశాం. క్రీడాకారులు ఒలింపిక్ స్థాయి శిక్షణ పొందేందుకు వీలుగా మేము టాప్స్ పథకాన్ని ప్రారంభించాము. ఒలింపిక్స్‌‌పై దృష్టి సారిస్తూ, ఈసారి టాలెంట్ హంట్ ప్రచారం ద్వారా ముందుకు రావాలని ఎర్రకోట నుంచి యువతకు పిలుపునిచ్చా.

మిత్రులారా,

ఈ ప్రయత్నాలన్నింటిలోనూ పారా క్రీడలకు సమాన ప్రాధాన్యమిస్తున్నాం. వాటి ఫలితంగా, మీలాంటి క్రీడాకారులు ప్రధాన ఈవెంట్లలో అత్యుత్తమంగా రాణిస్తూ దేశానికి పేరు తీసుకువస్తున్నారు. ఇటీవల ముగిసిన పారా క్రీడల్లో దీన్ని మనం మరోసారి చూశాం. ఈ పోటీలో టాప్స్ ద్వారా సహాయం అందుకున్న  క్రీడాకారులు నలభై ఒక్క పతకాలు గెలుచుకోగా, ఖేలో ఇండియా క్రీడాకారులు పందొమ్మిది పతకాలు సాధించారు. ఇవి మన ప్రయత్నాలు సరైన దిశలోనే ముందుకు వెళుతున్నాయని సూచిస్తున్నాయి.

మిత్రులారా,

ఇప్పుడు భారత్‌లో అమలు చేస్తున్న ఆధునిక క్రీడా విధానాలు ఆట మైదానానికి ఆవల అనేక కొత్త అవకాశాలను యువతకు అందిస్తున్నాయి. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడా పరికరాల ఉత్పత్తి, క్రీడా ప్రసారాల ఆర్థిక వ్యవస్థ అన్నీ వేగంగా విస్తరిస్తున్నాయి.

మిత్రులారా,

కొద్ది రోజుల క్రితమే, ప్రభుత్వం రూ. 1,800 కోట్లకు పైగా విలువైన ఖేలో ఇండియా క్రీడా పరికరాల తయారీ పథకాన్ని ఆమోదించింది. ఇప్పుడు మన క్రీడా వస్తువుల తయారీ పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక భారతీయ లేదా విదేశీ క్రీడాకారుడు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, వారి క్రీడా సామగ్రి కూడా మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలి. వారి దుస్తులు, ఫుట్‌వేర్‌ కూడా భారత్‌లోనే తయారవ్వాలి. భారతదేశం ప్రపంచ స్థాయి క్రీడాకారులనే కాకుండా, ప్రపంచ స్థాయి క్రీడా పరికరాలను కూడా ఉత్పత్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. భారతీయ క్రీడా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరాలని మేము ఆశిస్తున్నాం. ఇది భారత ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

మిత్రులారా,

ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం తర్వాత మీ అందరికీ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంస్థలను సందర్శించేందుకు ఆహ్వానాలు అందుతాయి. అక్కడ యువత మీ మాటలు వినడానికి, మీ నుంచి నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీరు వారితో ముచ్చటించే సందర్భంలో వారికి మైదానంలో గెలుపు రహస్యాలను వివరించడంతోపాటు క్రీడలతో ముడిపడి ఉన్న అవకాశాల గురించి కూడా చెప్పండి. అలాగే మన దివ్యాంగ సోదరీసోదరుల జీవితాన్ని సులభతరం చేయడానికి దేశం చేస్తున్న విస్తృతమైన ప్రయత్నాల గురించి కూడా మీరు వారికి వివరించాలి. కొన్ని రోజుల క్రితమే దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి మంత్రివర్గం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పింఛను మొత్తాన్ని పెంచాం. గతంలో 80 శాతంగా ఉన్న దివ్యాంగ ప్రమాణాన్ని 40 శాతానికి తగ్గించాం. గతంలో పింఛనుకు అర్హత పొందాలంటే ఒక వ్యక్తికి పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అర్హులైన బాలలకు కూడా పింఛన్లు పొందే అవకాశం ఇప్పుడు లభించింది. అలాగే భారతీయ సంకేత భాషను ప్రోత్సహించడానికి గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి. పది వేలకు పైగా పదాలున్న సంకేత భాషా నిఘంటువును అభివృద్ధి చేశారు. పాఠశాల పాఠ్యపుస్తకాలను సంకేత భాషలో కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా దివ్యాంగుల కోసం ప్రభుత్వ, ప్రజా ప్రదేశాల్లో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటువుతున్నాయి. దేశంలోని ప్రతి దివ్యాంగునికీ  గౌరవం, సమాన అవకాశాలు రెండింటినీ అందించి, వారి సొంత సామర్థ్యాల బలంతో జీవితంలో ముందుకు సాగేలా చేసేందుకే మేం ప్రయత్నిస్తున్నాం.

మిత్రులారా,

మీ ప్రయాణంలో అయిచి–నగోయా పోడియం తుది గమ్యస్థానం కాకూడదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విజయాన్ని మీరు ఇంకా పెద్ద లక్ష్యాల కోసం ఒక సోపానంగా ఉపయోగించుకోవాలి. భారతదేశానికి, మీలో చాలా మంది అథ్లెట్లకు తదుపరి లక్ష్యం ఎల్ఏ 2028. అవని, మనీష్ ఇప్పటికే లాస్ ఏంజిల్స్ పోటీలకు అర్హత సాధించారు. ఎల్ఏ 2028లో వీలైనంత ఎక్కువ మంది భారతీయ క్రీడాకారులు పాల్గొని, వీలైనన్ని ఎక్కువ పతకాలను దేశానికి తీసుకురావడమే మన లక్ష్యం కావాలి. ఈ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. కానీ వెంటనే తదుపరి సవాలుకు సిద్ధమవ్వడం ప్రారంభించండి. దేశం మీకు అండగా నిలుస్తుంది. నేను కూడా. యావత్ దేశం మీ తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోంది. మరోసారి, మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.

దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది దీపావళిని ఎంతో గర్వంగా, ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించుకోండి. దానితోపాటే మీ తదుపరి లక్ష్యాన్ని కూడా మనసులో నిర్దేశించుకుని, నూతన సంకల్పంతో ముందుకు సాగండి. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

సూచన: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

***