పిఎంఇండియా
నమస్తే!
నమస్కారం!
అందరూ హాలిడే మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.
మిత్రులారా,
కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.
ఇక్కడ తమిళులు, పంజాబీలు, గుజరాతీలు, మరాఠీలు, బెంగాలీలున్నారు. భారతదేశంలోని ప్రతి ప్రాంత ప్రాతినిధ్యం ఇక్కడ కనిపిస్తుంది.
మిత్రులరా,
జూన్ 14న నేను నీస్ నగరానికి చేరుకుని, హాజరైన మొదటి కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్. నేడు ఫ్రాన్స్ నుంచి నేను తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కనెక్ట్స్ కార్యక్రమానికి చేరుకున్నట్లు అనిపిస్తోంది.
ఫ్రాన్స్‌లో నివసిస్తున్న మీరంతా 21వ శతాబ్దంలో భారత్–ఫ్రాన్స్ సంబంధాలను అనుసంధానించి, బలోపేతం చేసిన తీరు మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలకంగా మారింది. మీ అందరి కోసం 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను నేను తీసుకొచ్చాను. మీరందించిన హృదయపూర్వక, ఆత్మీయ స్వాగతానికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
మా ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో నేడు నేను ఫ్రాన్స్‌కు వచ్చాను. ఎన్నికైన ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు దేశానికి నిరంతరాయంగా సేవ చేయటం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటి. టీ అమ్మే వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవటానికి కారణం.. భారతదేశ ప్రజాస్వామ్య బలం.
మిత్రులారా,
140 కోట్ల మంది భారతీయుల అసాధారణ సామర్థ్యాలకు నిదర్శనంగా గడచిన 12 ఏళ్లు నిలిచాయి. ఈ సమయంలో భారతదేశ జీడీపీ రెట్టింపు అయింది. విమానాశ్రయాల సంఖ్య, విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా రెట్టింపయింది. జాతీయ రహదారుల నిర్మాణ వేగం మూడు రెట్లు, మెట్రో వ్యవస్థ నాలుగు రెట్లు విస్తరించింది.
భారత్ ఎంత వేగంతో, ఏ స్థాయిలో పురోగమిస్తుందో మీకు అర్థమయ్యేలా మరిన్ని వాస్తవాలను చెబుతాను. గత 12 ఏళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతులు 35 రెట్లు పెరిగాయి.
మరో ముఖ్యమైన విషయం: భారత్‌లో మొబైల్ తయారీ యూనిట్ల సంఖ్య 100 రెట్లు పెరిగింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఈ వేగం, పురోగతి ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.
మిత్రులారా,
నేటి భారత్ కథ కేవలం ఆర్థిక పురోగతికి సంబంధించినది మాత్రమే కాదు. అది అక్కడితోనే ఆగిపోదు. ఇదొక సామాజిక పరివర్తన కథ.
గడిచిన 12 ఏళ్లలో భారత్‌లో 250 మిలియన్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. మరో విధంగా చెప్పాలంటే.. ఈ పురోగతి ఫలాలు సమాజంలోని ప్రతీ వ్యక్తికి చేరుతున్నాయి. 12 ఏళ్లలో ఫ్రాన్స్ దేశంలోని మొత్తం ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువగా నిరుపేదల కోసం మేం శాశ్వత గృహాలను నిర్మించాం.
ఎంతటి పేద కుటుంబానికైనా నేడు ఒక బ్యాంకు ఖాతా ఉంది. ఆర్థిక సమ్మిళితత్వం ఇప్పుడు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోలేదు.. సామాజిక పరివర్తన ఉద్యమంగా మారింది.
మిత్రులారా,
ఈ 12 ఏళ్ల విజయాల్లో ఏ గణాంకాలు, సంఖ్యలతోనూ కొలవలేని గొప్ప విజయాలున్నాయి. ఈ విజయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం.
నేటి భారతదేశం, ఇవాళ్టి భారత యువత పెద్ద పెద్ద కలలు కంటున్నారు. భారతదేశ రైతులు సరికొత్త అవకాశాలతో ముందుకు సాగుతున్నారు. దేశ మహిళలు అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నారు. ఇవి కేవలం 12 ఏళ్ల విజయాలు మాత్రమే కాదు.. భారతదేశ ఆకాంక్షలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన అద్భుతమైన కాలం.
మిత్రులారా,
ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో ఆధునిక వసతుల కల్పన కష్టంగా ఉండేది. నేడు అదే గ్రామాల్లో విద్యుత్, ఇంటర్నెట్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవల సరికొత్త ప్రపంచమే అందుబాటులోకి వచ్చింది. ఈ రోజుల్లో కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలు సులభంగా పొందవచ్చు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు భారత పౌరులను రకరకాల సేవలతో, అవకాశాలతో అనుసంధానిస్తున్నాయి. మన రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ సాంకేతికత ద్వారా సాధికారత సాధిస్తూ, స్వయంగా నూతన అవకాశాలను సృష్టించుకుంటున్నారు.
మిత్రులారా,
మీరు 1.25 కోట్లకు పైగా ఆధార్ ఐడీల గురించి వినుంటారు. భారత్ కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే డిజిటలైజ్ చేయటం లేదు. ప్రస్తుతం దాదాపు 900 మిలియన్ల భారతీయులకు యూనిక్ డిజిటల్ హెల్త్ ఐడీలు ఉన్నాయి. ఫలితంగా వైద్య రికార్డులు భద్రపరచటమే కాక, అవసరమైనప్పుడు సులభంగా పొందే వీలుంటుంది. ఈ ఐడీల ద్వారా మరింత సులభంగా, సమర్థవంతంగా ఆరోగ్య సేవలందించవచ్చు.
మిత్రులారా,
ఈ విజయాలన్నింటిలో విశేేషమైన అంశాలున్నాయి. కొన్నేళ్ల కిందటి వరకు వీటిలో చాలా వరకు ఊహకు కూడా అసాధ్యంగా అనిపించేది. ప్రతి గ్రామానికి హై–స్పీడ్ ఇంటర్నెట్ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మారుమూల గ్రామాల్లోనూ క్యూఆర్ కోడ్లు దైనందిన జీవితంలో భాగం అవుతాయని ఎవరైనా ఊహించి ఉంటారా? ఒక గ్రామీణ మహిళ డ్రోన్ సహాయంతో వ్యవసాయ పనులు చేస్తుందని అనుకోవటం ఒకప్పుడు అసాధ్యంగా అనిపించేది.
కానీ నేడు కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ఇదంతా క్రమంగా సాధారణంగా మారిపోతోంది. మిత్రులారా, దీన్ని చూసి మీరు గర్విస్తారు.. ఎందుకంటే ఇదే నవభారత గుర్తింపు. ఒకప్పుడు కలగా అనిపించేదే నేడు నిజమైంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న విషయం ఇప్పుడు సాధ్యమైంది. ఇదంతా జరగటం వెనకున్న అతిపెద్ద శక్తేమిటి? దీనికి ఎవరు కారణం? ఇది మోదీ వల్ల జరిగింది కాదు.. ఇది భారత ప్రజాస్వామ్య శక్తి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ భావనతో కూడిన భారతదేశ ప్రజాస్వామ్యమే ఇందుకు కారణం.
మిత్రులారా,
యాభై, వందేళ్ల తర్వాత భారతదేశ చరిత్రలోని ఈ కాలాన్ని సమీక్షిస్తే.. భారత్ ఆకాంక్షలే ఈ యుగాన్ని నడిపించాయని స్పష్టమవుతుంది. ఇది భారతదేశ ఆకాంక్షల నవయుగం.
విద్యుత్ సరఫరా ఉన్నచోట ప్రజలు కేవలం విద్యుత్‌ను మాత్రమే కోరుకోవటం లేదు.. ఆధునిక జీవనశైలిని ఆశిస్తున్నారు. రైళ్లు చేరుకున్న చోట ప్రజలు హై–స్పీడ్ అనుసంధానాన్ని కోరుకుంటున్నారు. రహదారులు నిర్మించిన చోట, ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేలను కోరుకుంటున్నారు. ఇంటర్నెట్ అనుసంధానమైన చోట ఏఐ, డిజిటల్ ఆవిష్కరణల్లో నాయకత్వాన్ని ఆశిస్తున్నారు. చెప్పాలంటే.. నేటి భారతదేశ ప్రజలు జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకోవటమే కాక, భారతదేశాన్ని కూడా తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నారు. అదే వారి లక్ష్యం, సంకల్పం, కల.
మిత్రులారా,
భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని నడిపించే అతిపెద్ద శక్తి ఈ ఆకాంక్షలే. భారతదేశ అంతరిక్ష ప్రయాణాన్ని ఉదాహరణతో వివరిస్తాను. చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రయాన్-3ని భారత్ విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించారు. అయితే, దీన్నే చివరి గమ్యస్థానంగా భారత్ భావించలేదు. నేడు దేశం గగన్‌యాన్ కోసం సిద్ధమవుతోంది. సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.
ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో బలమైన ముద్ర వేసేందుకు భారతదేశ అంతరిక్ష అంకుర సంస్థలు గొప్ప సంకల్పంతో, ఆవిష్కరణలతో పనిచేస్తున్నాయి.
మిత్రులారా,
గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ చేస్తున్న కృషిలోనూ ఇవే ఆకాంక్షలు ప్రతిబింబిస్తున్నాయి. సౌరశక్తి రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారు. స్వచ్ఛమైన ఇంధన రంగంలో తదుపరి దశ వృద్ధి, ఆవిష్కరణల కోసం భారత్ సిద్ధమవుతోంది.
గ్రీన్ హైడ్రోజన్‌లో భారత్ భారీ పెట్టుబడులు పెడుతోంది. అత్యాధునిక అణుశక్తి రంగంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. భారతదేశ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ సాధించిన పురోగతి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది భారత శాస్త్రవేత్తలు సాధించిన కీలక విజయం. భారతదేశ అణుశక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే సామర్థ్యం దీనికి ఉంది.
మిత్రులారా,
భవిష్యత్తు కోసం బలమైన వ్యవస్థను భారత్ నిర్మిస్తోంది. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచాన్ని తీర్చిదిద్దే, పురోగతిని నడిపించే అన్ని కీలక రంగాల్లో మేం పెట్టుబడులు పెడుతున్నాం.
కొన్నిరోజుల కిందట నీస్ నగరంలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ఈవెంట్.. భారతదేశ ఆవిష్కరణలను, డీప్–టెక్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో 120కి పైగా డీప్–టెక్ అంకుర సంస్థలు పాల్గొన్నాయి. పరస్పర సహకారానికి కొత్త అవకాశాలను సృష్టిస్తూ దాదాపు 1,400 బీటుబీ సమావేశాలు జరిగాయి. పలు అంకుర సంస్థలు పెట్టుబడి నిర్ణయాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లటంతో పాటు, వాణిజ్య అవకాశాలకు నూతన మార్గాలను తెరిచాయి. ఫ్రెంచ్, యూరోపియన్ విశ్వవిద్యాలయాలతో, ఇంక్యుబేటర్లతో ఉన్న అనుబంధం మరింత బలోపేతమైంది.
విద్యార్థుల పరస్పర మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణలకు మద్దతిచ్చేందుకు కొత్త అవకాశాలను కూడా ఈ కార్యక్రమం సృష్టించింది. ఫలితంగా భారత్ ఇన్నోవేట్స్ కేవలం ఒక సదస్సుగానే మిగిలిపోకుండా.. ఆవిష్కరణల దౌత్యానికి కొత్త నమూనాగా ఆవిర్భవించింది.
పారిస్‌లో జరిగిన వివాటెక్ కార్యక్రమం ద్వారా మనం ఈ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాం. నీస్ నగరంలో ఆలోచనలను పెట్టుబడితో అనుసంధానించాం. పారిస్‌లో భారత ఆవిష్కరణలను అంతర్జాతీయంగా విస్తరించాం. భారత్ కేవలం భవిష్యత్తు కోసం సిద్ధమవటమే కాక భవిష్యత్తును తీర్చిదిద్దటంలో సహాయపడుతోందని ప్రపంచం గుర్తిస్తోంది.
మిత్రులారా,
ఒకప్పుడు కేవలం వాణిజ్యం ద్వారా మాత్రమే దేశాల మధ్య సంబంధాలుండేవి. కానీ నేడు వాణిజ్యంతో పాటు విశ్వసనీయత కీలకంగా మారింది. ప్రతి దేశం విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను, స్థిరమైన భాగస్వామ్యాలను కోరుకుంటోంది. దీర్ఘకాలంలో ఆధారపడగలిగే భాగస్వాముల కోసం దేశాలు అన్వేషిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రపంచానికి విశ్వసనీయమైన, స్థిరమైన భాగస్వామిగా భారత్ అవతరిస్తోంది.
ఏవియాన్‌లో జరిగిన జీ7 సదస్సులో విశ్వసనీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని నేను స్పష్టం చేశాను. గ్లోబల్ సౌత్‌తో సమాన భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చాను. జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత్ ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. సమ్మిళిత ప్రపంచపాలన ప్రభావవంతంగా ఉంటుంది. అందరి భాగస్వామ్యం ద్వారానే ప్రపంచ వృద్ధి స్థిరంగా ఉంటుంది. విశ్వసనీయ ప్రపంచ సాంకేతికత మానవాళికి నిజమైన సేవ చేయగలదు.
మిత్రులారా,
ప్రపంచంతో భారతదేశ వాణిజ్య సంబంధాల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. భారత్, ఫ్రాన్స్ మధ్య వాణిజ్యం స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో పలు దేశాలు, ప్రాంతాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్, యూకే, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వాములతో వాణిజ్య ఒప్పందాల ద్వారా భారత్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తూ, సహకారాన్ని విస్తరిస్తోంది.
వచ్చే నెల నుంచి భారత్, యూకే మధ్య వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం భారతదేశ రైతులు, కార్మికులు, ఆవిష్కర్తలకు నూతన అవకాశాలను సృష్టిస్తుంది. అదే సమయంలో ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
నేడు ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో భారత్, ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యం విశ్వసనీయతకు, స్థిరత్వానికి, సహకారానికి మూలాధారంగా ఆవిర్భవిస్తోంది.
భారత్–ఫ్రాన్స్ సంబంధాలను ఈ ఏడాది ప్రపంచ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాం. ప్రపంచ సంక్షేమానికి మన భాగస్వామ్యం కీలక శక్తిగా ఎలా మారగలదనే అంశంపై నీస్ నగరంలో ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, నేను చర్చించాం. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి నుంచి మొదలుకుని ఏఐ, కీలక ఖనిజాలు, హై–స్పీడ్ రైలు వరకు అనేక వ్యూహాత్మక రంగాల్లో మనం కలిసి ముందుకు సాగుతూనే ఉంటాం.
మిత్రులారా,
సమస్త మానవాళికి ప్రయోజనం చేకూర్చే పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు సౌరశక్తి, ఏఐ రంగంలో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయి. గతేడాది పారిస్‌లో, ఈ ఏడాది న్యూఢిల్లీలో నిర్వహించిన ఏఐ సదస్సుకు మనం సహ–అధ్యక్షత వహించాం.
వచ్చే ఏడాది సంయుక్తంగా చేపట్టనున్న తృష్ణ ఉపగ్రహ ప్రయోగానికి మనం సిద్ధమవుతున్నాం. ఈ మిషన్ ప్రపంచ ఆహార, నీటి భద్రతకు సహకారాన్ని అందిస్తుంది.
మిత్రులారా,
ప్రభుత్వ కార్యక్రమాలకు మీరందించే సహకారం ఎంతో ముఖ్యమైనది. భారత్, యూరప్‌కు మధ్య మీరే అత్యంత బలమైన వారధి. ఇరుదేశాల ప్రజలను, మార్కెట్లను మీరు చక్కగా అర్థం చేసుకోగలరు. రాబోయే ఏళ్లలో ప్రతిభ, వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం, పెట్టుబడుల రంగాల్లో సరికొత్త అవకాశాలను కల్పించటంలో మీ పాత్ర మరింత కీలకం కానుంది.
మిత్రులారా,
ఉమ్మడి చరిత్ర, పరస్పర విలువలు, విశ్వసనీయత భారత్, ఫ్రాన్స్ దేశాలను మరింత దగ్గర చేశాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో ఫ్రాన్స్ గడ్డపై ప్రాణాలర్పించిన భారత సైనికుల స్మృతులు ఉభయదేశాల మధ్య శాశ్వతమైన బంధానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
న్యూవ్–చాపెల్ వద్ద వారికి నివాళులర్పించే భాగ్యాన్ని పొందాను. గతేడాది అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఈ ప్రదేశాలు మన ఉమ్మడి వారసత్వానికి చిహ్నాలు.
భారతీయుల సహకారాన్ని ఫ్రాన్స్ పరిరక్షించటమే కాక అభినందిస్తుంది కూడా. ఫ్రెంచ్ ప్రతిఘటన కోసం ప్రాణాలను అర్పించిన నూర్ ఇనాయత్ ఖాన్, మహారాజా రంజిత్ సింగ్‌తో కలిసి పనిచేసిన జీన్–ఫ్రాంకోయిస్ అలార్డ్.. వీరిద్దరూ భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉమ్మడి వారసత్వానికి శాశ్వత చిహ్నాలు.
భారత్‌లోని పుదుచ్చేరిలోనూ ఫ్రెంచ్ వారసత్వాన్ని స్పష్టంగా చూడవచ్చు. అక్కడి నిర్మాణశైలి, కళలు, సంస్కృతి, వంటకాల వంటివి మన ఉమ్మడి చరిత్ర ప్రభావాన్ని.. భారత్, ఫ్రాన్స్ మధ్యనున్న అత్యంత సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తాయి.
మిత్రులారా,
ఫ్రాన్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు కీలక పాత్ర పోషించిన శ్రీ మహేశ్ ఘట్రద్యాల్‌కు నేను గౌరవపూర్వక నివాళులు అర్పించాలనుకుంటున్నాను. వందేళ్ల వయసులోనూ యోగా ద్వారా ఫ్రాన్స్‌ను భారతదేశ వారసత్వంతో అనుసంధానించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి షార్లెట్ చోపిన్‌కు నా ప్రణామాలు. “యోగా, జీవితానికి సంవత్సరాలను మాత్రమే జోడించదు.. ఆ సంవత్సరాలకు జీవం పోస్తుంది” అని ఆమె జీవితం నిరూపించింది.
మిత్రులారా,
నేను శ్రీ ఫ్రెడ్ నెగ్రిట్‌ను కూడా ఎంతో గౌరవపూర్వకంగా, భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటున్నాను. భారతదేశ వారసత్వాన్ని కాపాడటంలో ఆయన అందించిన సహకారం ఎంతో అమూల్యమైనది.
మిత్రులారా,
భారత్, ఫ్రాన్స్‌ను అనుసంధానించే మరో అంశం ఫుట్‌బాల్. ప్రస్తుతం ఇక్కడ ఫుట్‌బాల్ క్రేజ్ పతాక స్థాయిలో ఉంది. దీనిపై ఉన్న మక్కువ ఫ్రాన్స్ అంతటా స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌లోనూ ఫుట్‌బాల్ పట్ల చాలా క్రేజ్ ఉంది.
ఫ్రెంచ్ జట్టుకు భారత్‌లోనూ పెద్దఎత్తున అభిమానులున్నారు. ఈ ప్రపంచ కప్ ప్రచారాన్ని ఫ్రాన్స్ ఘనంగా ప్రారంభించింది. ఫ్రెంచ్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
ప్రసంగం ముగించే ముందు మీకు కొన్ని శుభవార్తలు చెప్పాలి. ఇవి ప్రత్యేకంగా మీ కోసమే. గతేడాది మార్సెయిల్‌లో దౌత్య కార్యాలయం ప్రారంభమైంది. ఇది పనులను మరింత సులభతరం చేసింది. కేవలం కొన్ని వారాల క్రితమే భారత పౌరుల కోసం ఫ్రెంచ్ విమానాశ్రయాల్లో వీసా రహిత రవాణా సౌకర్యాన్ని ప్రవేశపెట్టాం.
విద్యార్థులు, నిపుణుల స్థానచలనం, విద్యా అర్హతల పరస్పర గుర్తింపును ముందుకు తీసుకెళ్లడం, ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను తెరిచేలా ప్రోత్సహించటం వంటి అన్ని రంగాల్లో మనం కలిసి ముందుకు సాగుతున్నాం.
ఫ్రాన్స్‌లో యూపీఐ వినియోగ పరిధి మరింత విస్తృతం కానుంది. దీనిద్వారా భారత్–ఫ్రాన్స్ మధ్య అనుసంధానం వేగంగా జరుగుతుంది. పరస్పర చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతాయి.
మిత్రులారా,
ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా భారత్, ఫ్రాన్స్ మరింత చేరువవుతాయి. ఈ భాగస్వామ్యానికి ఆధారం, ఈ బంధానికి అసలైన బలం మీరేనని నేను మరోసారి స్పష్టం చేస్తున్నా. మీరంతా నా తోటి దేశస్థులు.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా భారత్ వేగంగా దూసకెళ్తున్న తరుణంలో మీరంతా భారత్‌తో అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఇది భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. మీ పూర్వీకుల భూమికి సేవ చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తుంది.
మీ అందరి ఆప్యాయతకు, ఉత్సాహానికి, ఈ హృదయపూర్వక స్వాగతానికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
భారత్ మాతాకీ జై!
ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.
***
Addressing the Indian community in Paris. Their deep affection for India and contribution to stronger India-France ties are truly commendable. https://t.co/sNLYVfzaV1
— Narendra Modi (@narendramodi) June 18, 2026
In the last 12 years, India has witnessed transformative growth across sectors. pic.twitter.com/xNqrf2sMDA
— PMO India (@PMOIndia) June 18, 2026
Beyond economic growth, India's journey is about empowering people and transforming lives. pic.twitter.com/eC2dxDTcfM
— PMO India (@PMOIndia) June 18, 2026
This is a defining period in India's journey, where aspirations are reaching new heights pic.twitter.com/zgCvkutax0
— PMO India (@PMOIndia) June 18, 2026
India is investing across sectors that will drive growth, innovation and opportunity for generations to come. pic.twitter.com/bM4pTf2VED
— PMO India (@PMOIndia) June 18, 2026
India is emerging as a trusted partner to the world. pic.twitter.com/STnp3ngaDN
— PMO India (@PMOIndia) June 18, 2026