పిఎంఇండియా
భారతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎ ఎ ఐ) కి చెందిన 1500 చదరపు మీటర్ల భూమిని మెస్సర్స్ ఎమ్.పి. వేర్ హౌసింగ్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ కు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఎ ఎ ఐ బోర్డు తీర్మానించిన మేరకు ఇండోర్ లోని ఇండోర్ విమానాశ్రయంలో సెంటర్ ఫర్ పెరిషబుల్ కార్గో (సి పి సి) ని నెలకొల్పుతారు. ఇందుకోసమే ఎ ఎ ఐ కి చెందిన భూమిని మెస్సర్స్ ఎమ్.పి. వేర్ హౌసింగ్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ (ఎమ్ పి డబ్ల్యు ఎల్ సి) కి లీజుకు ఇస్తున్నారు.
సి పి సి రాష్ట్రం లోని ట్రాన్సిట్ ఏర్ పోర్టుల నుండి త్వరగా నశించే సరుకులకు సంబంధించిన అత్యాధునిక నిష్క్రమణ కేంద్రం గా ఉంటుంది. వ్యాపారుల అవసరాలన్నింటిని తీర్చి, ఉత్పత్తి నాణ్యతను కాపాడే ప్రపంచ శ్రేణి సదుపాయాలను ఒకే కప్పు కింద ఈ సి పి సి సమకూర్చనున్నది. సి పి సి ని ఎమ్ పి డబ్ల్యు ఎల్ సి పి పి పి పద్ధతిలో ఏర్పాటు చేయవలసివుంది.
సెంటర్ ఫర్ పెరిషబుల్ కార్గో కు గణనీయమైన స్థాయిలో ఉపాధిని అందించగల సత్తా ఉంటుందని, ఇది స్థానిక జనాభా ఉపాధి అవసరాలను నెరవేర్చగలదని భావిస్తున్నారు. సి పి సి ని నిర్వహించేందుకు మొత్తం 113 మంది వ్యక్తులు అవసరమవుతారు.
పూర్వ రంగం:
ఇండోర్ లోని దేవి అహిల్య బాయి విమానాశ్రయం వద్ద సి పి సి ని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్లు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మధ్య ప్రదేశ్ లోని మాల్వా క్షేత్రంలో నుండి ఫార్మాస్యూటికల్స్, పౌల్ట్రీ ప్రోడక్ట్స్, ఇంకా ఉద్యాన పంటల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సంబంధించిన డిమాండ్ భారీ స్థాయిలో ఉండటమే దీనికి కారణం.
ఈ భూమిని కౌలుకు ఇవ్వడం వల్ల మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇండోర్ విమానాశ్రయం వద్ద సెంటర్ ఫర్ పెరిషబుల్ కార్గో ను స్థాపించి తద్వారా తన వ్యవసాయ రంగాన్ని, ఉద్యాన రంగాన్ని వృద్ధి పరచుకొనేందుకు అవకాశం ఏర్పడగలదు.