పిఎంఇండియా
ఇటలీ రిపబ్లిక్ ప్రధానమంత్రి మిస్ జార్జియా మెలోనీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 20న రోమ్‌లో అధికారికంగా సమావేశమయ్యారు.
అత్యున్నత స్థాయి సమావేశాలు వేగవంతం కావడాన్నీ, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన వృద్ధినీ, వైవిధ్యాన్నీ ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. భారత్-ఇటలీ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకు వెళ్లేందుకు వారు అంగీకరించారు. బహుపాక్షిక కార్యక్రమాల సందర్భంగా వార్షిక మంత్రిత్వ స్థాయి, సంస్థాగత స్థాయి సమావేశాలతో సహా నాయకుల వార్షిక సమావేశాలను కూడా నిర్వహించేందుకు వారు అంగీకరించారు.
భారత్-ఇటలీ భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర చర్చల్లో ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 పరిధిలోని అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, శాస్త్ర-సాంకేతికతలు, పరిశోధన-ఆవిష్కరణ, అంతరిక్షం, ఇంధనం, ఏఐ, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు. ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను క్రమం తప్పకుండా సమీక్షించేందుకు విదేశాంగ మంత్రిత్వ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.
ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో సాధించిన వేగం కారణంగా పెరుగుతున్న పెట్టుబడులు, దీర్ఘకాలిక సహకారాలను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలను నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన మూడు వ్యాపార వేదికల ఆదానప్రదానాలను వారు స్వాగతించారు. రక్షణ, డిజిటల్, ఇంధన పరివర్తన, మౌలిక వసతులు, రవాణా లాంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపిక చేసిన ఇటలీ, భారత్ సీఈవోలతో వారు సమావేశమయ్యారు. 2029 నాటికి 20 బిలియన్ యూరోలకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ.. ఇండియా-ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
మంత్రిత్వ స్థాయి, అధికారిక స్థాయి చర్చలు, పరస్పర ఓడరేవు సందర్శనలు, రక్షణ దళాల క్రమబద్ధమైన కార్యకలాపాల ద్వారా రక్షణ సహకారం బలోపేతం కావడం పట్ల నాయకులు ఇరువురూ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ పరికరాలను సంయుక్తంగా రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో, ఉత్పత్తి చేయడంలో సహకారం కోసం సిద్ధం చేసిన ఉమ్మడి ఉద్దేశ ప్రకటనపై, పారిశ్రామిక విధానంపై సంతకం చేయడాన్ని వారు స్వాగతించారు.
రెండు దేశాల పరిశోధకులు, శాస్త్రీయ సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటాలియన్ అంతరిక్ష సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని, వాణిజ్య అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలను వారు స్వాగతించారు. ఏఐ, సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యవంతులైన భారతీయ శ్రామికశక్తిని, ఇటలీ సాంకేతిక శక్తిని సమన్వయం చేసేలా విస్తృత సహకారానికి పిలుపునిచ్చారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ బలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. ద్వైపాక్షిక, బహుపాక్షిక స్థాయుల్లో సహకారాన్ని కొనసాగించేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు. 2025 నవంబరులో స్వీకరించిన ఉగ్రవాదానికి ఆర్థిక సాయాన్ని నిరోధించే ఉమ్మడి కార్యక్రమం అమలు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటలీలోని ప్రవాస భారతీయులు అందిస్తున్న విలువైన సేవలను నాయకులిద్దరూ గుర్తించారు. విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తల రాకపోకలను సులభతరం చేసేందుకు వారు అంగీకరించారు. 2027ను ‘‘భారత్ ఇటలీ మధ్య సంస్కృతి, పర్యాటక సంవత్సరం’’గా నిర్వహించడానికి వారు అంగీకరించారు. గుజరాత్‌లోని లోథాల్‌లో జాతీయ నౌకావాణిజ్య వారసత్వ సముదాయ అభివృద్దికి, భారతీయ నర్సుల నియామకానికి సంబంధించిన అవగాహనా ఒప్పందాలు ఖరారు కావడాన్ని వారు స్వాగతించారు.
నిర్దిష్ట ప్రాజెక్టుల ద్వారా అనుసంధాన మౌలిక వసతులను నిర్మించాలనే బలమైన ఆకాంక్షను నాయకులిద్దరూ వ్యక్తం చేశారు. భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ)ను అమలు చేయడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఇండో-పసిఫిక్ పరిణామాలు, భారత్-ఈయూ సంబంధాలు, పశ్చిమాసియా, ఐరోపాలోని సంఘర్షణలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను నాయకులు పంచుకున్నారు. కొనసాగుతున్న సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాన్ని అందించడంలో చర్చలు, దౌత్యానికున్న ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన ప్రధాని మెలోని, ఇటలీ ప్రభుత్వం, ప్రజలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఉభయపక్షాలకు అనుకూలమైన సమయంలో భారత్‌ను సందర్శించాలని ప్రధాని మెలోనీని ఆహ్వానించారు.
****
Prime Ministers @narendramodi and @GiorgiaMeloni held fruitful talks in Rome, during which India and Italy decided to elevate their ties to a Special Strategic Partnership.
— PMO India (@PMOIndia) May 20, 2026
The two leaders reviewed progress under the India-Italy Joint Strategy Action Plan 2025-2029. They… pic.twitter.com/Ivvb8wQT7u
PM Meloni and I reviewed the progress on the India-Italy Joint Strategy Action Plan 2025-2029. We agreed that investment and economic linkages have to be strengthened even further. The India-EU FTA presents a historic opportunity to do so. We even talked about areas such as… pic.twitter.com/q44wAiRMbZ
— Narendra Modi (@narendramodi) May 20, 2026
The talks with Prime Minister Meloni were excellent. Her commitment to furthering the India-Italy friendship is commendable. Bilateral ties between our nations have advanced significantly in sectors like trade, space, technology and more. In order to further deepen linkages, we… pic.twitter.com/0Q6m7C9Sub
— Narendra Modi (@narendramodi) May 20, 2026
Il Primo Ministro Meloni ed io abbiamo esaminato i progressi del Piano d'Azione Strategico Congiunto India-Italia 2025-2029. Abbiamo concordato sulla necessità di rafforzare ulteriormente gli investimenti e i legami economici. L'accordo di libero scambio tra India e UE… pic.twitter.com/8rvMRPjvuc
— Narendra Modi (@narendramodi) May 20, 2026
I colloqui con il Primo Ministro Meloni sono stati eccellenti. Il suo impegno nel promuovere l'amicizia tra India e Italia è encomiabile. I legami bilaterali tra le nostre nazioni hanno compiuto progressi significativi in settori come il commercio, lo spazio, la tecnologia e… pic.twitter.com/Rr40MXzVZZ
— Narendra Modi (@narendramodi) May 20, 2026