Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 వ సంవత్సరం నవంబర్ 29 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 140 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. ‘మన్ కీ బాత్’ దేశంలోని ప్రతి ప్రాంతంలో, సమాజంలోని ప్రతి వర్గం సాధించిన విజయాలను వెలుగులోకి తెచ్చే వేదిక. ఇందులో సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించుకుంటాం. వాటిపై అవగాహన కూడా కల్పిస్తాం. ఈరోజు ‘మన్ కీ బాత్’లో నేను మొదటగా అలాంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఆ అంశం ‘డ్రగ్స్’ లేదా మాదకద్రవ్యాలు. మిత్రులారా! ఈరోజు భారతదేశ యువత ప్రతిభ గురించి యావత్ ప్రపంచం ఎంతో చర్చిస్తోంది. మన యువత పెద్ద కలలు కంటూ, వాటిని సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. అయితే ఈ కలలకు డ్రగ్స్- మాదక ద్రవ్యాల వ్యసనం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈరోజు దేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామాజిక క్రియాశీలత పెరుగుతుండటం నాకు సంతోషాన్నిస్తోంది. మాదకద్రవ్య రహిత యువ ఉద్యమం- నషా ముక్త్ యువ అభియాన్ -కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. యువత తమ సంకల్ప బలంతో, అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులను అధిగమించి మాదకద్రవ్యాల వ్యసనాన్ని జయిస్తున్న లెక్కలేనన్ని స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలను మనం చూస్తున్నాం. వారు తమతో తామే పోరాడి, తమ జీవితాలకు ఒక కొత్త దిశను ఇచ్చారు. ఈరోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నేను అలాంటి ఒక యువ మిత్రుడికి ఫోన్ చేశాను. మాదకద్రవ్యాలపై తన జీవిత పోరాటంలో అతను ఎలా గెలిచాడో అతని మాటల్లోనే విందాం. అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడో అతని మాటల్లోనే విందాం.

*******

యువ మిత్రుడు: నమస్కారం సార్. మీరు ఎలా ఉన్నారు?

ప్రధానమంత్రి: నమస్కారం. ఈరోజు నేను ఒక కొత్త మిత్రుడిని కలుస్తున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు. కానీ మీ గురించి నేను విన్నదాని ప్రకారం….

యువ మిత్రుడు: అవును సార్.

ప్రధానమంత్రి: అందుకే మీతో మాట్లాడాలనిపించింది.

యువ మిత్రుడు: అవునవును… తప్పకుండా సార్.

ప్రధానమంత్రి: మిత్రమా! మీరు మాదకద్రవ్యాల బారిలో ఎలా చిక్కుకున్నారో  చెప్పండి.

యువ మిత్రుడు: సార్… నేను ఢిల్లీలోని సదర్ బజార్‌లో నివసించేవాడిని. మా అమ్మమ్మ ఇల్లు అక్కడ ఉండేది. అక్కడి వాతావరణం ఎలా ఉండేదంటే చిన్నచిన్నపిల్లలు మత్తుపదార్థాలు తీసుకునేవారు. అందుకే నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళు కాంతిహీనంగా కనబడేవి. వాళ్ళు ఏదో చేస్తున్నారని నాకు అనిపించేది. సార్… ఆ తర్వాత స్కూల్లో నాకంటే సీనియర్లు కూడా కాస్త భిన్నమైన జీవితం గడిపేవారు. నేను ఎక్కువగా అలాంటి విషయాల మీదే దృష్టి పెట్టేవాడిని. 10వ తరగతి చదువుతున్నప్పుడు నేను కొద్ది మోతాదులో మత్తుపదార్థాలు తీసుకోవడం మొదలుపెట్టాను. క్రమంగా నా మోతాదు పెరుగుతూ పోయింది. నేను సరదాగా చేసే పనులన్నీ ఎప్పుడు అలవాటుగా మారాయో నాకే తెలియదు. అది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. అది కావాలంటే కావాలి అంతే. అది లేకుండా నేను ఏమీ చేయలేను అనిపించేది. నేను దాన్ని చాలా ఆనందంగా ఆస్వాదించేవాడిని. సరదా కోసం చేయడం మొదలుపెట్టాను. అదొక ప్రవాహంలా ఉండేది. నాకు బాగుండేది. అంతా సవ్యంగా సాగుతున్నట్టు, నిశ్చింతగా ఉన్నట్టు అనిపించేది. భవిష్యత్తులో దీనికి నేను ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో అప్పుడు నాకు తెలియదు.

ప్రధానమంత్రి: ఆ కారణంగా మీరు చాలా డబ్బు ఖర్చుపెట్టి ఉంటారు. అది చెడు అలవాట్లకు దారితీసి ఉంటుంది కదా!

యువ మిత్రుడు: అవును సార్. పుస్తకం కొనాలి, ఫీజులు కట్టాలి, పిక్నిక్ కు  వెళ్ళాలి అని చెప్పి ఇంటి నుండి డబ్బులు తీసుకునేవాడిని. కానీ అదంతా మత్తుపదార్థాల కోసమే ఖర్చుపెట్టేవాడిని.

ప్రధానమంత్రి: అయితే వ్యసనం నుండి బయటపడి, మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వాలని మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు?

యువ మిత్రుడు: సార్… నేను మొదటి నుండి మా అమ్మమ్మ-తాతయ్యల దగ్గరే పెరిగాను. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. దాంతో మా అమ్మమ్మ “ఇకపై మీరు నాతోనే ఉంటారు” అని చెప్పి నన్ను, మా అమ్మను తన దగ్గరికి తీసుకెళ్లింది. ఆ తర్వాత నేను క్రమంగా పెరిగాను. నేను మంచి వ్యక్తిగా ఎదగాలని వాళ్ళు నా గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ వాళ్ళు నన్ను మంచి వ్యక్తిగా ఏమీ చూడలేదు.

మొదట మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత కొద్దికాలానికే మా అమ్మమ్మ కూడా చనిపోయింది. ఆ సమయంలో ఆమె తప్ప నన్ను చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో నా జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేను అనాథనయ్యాను.  అక్షరాలా నా జీవితం రోడ్డు మీదికొచ్చింది. సమయమంతా రోడ్ల మీదే గడిపేవాడిని.

చలికాలంలో బంగాళాదుంపల బస్తాలు ఖాళీ చేసి నిద్రపోయేవాడిని. నేను సామూహిక వంటశాలల్లో రొట్టెలు తినేవాడిని. ఉచిత సత్రాల్లో భోజనం చేసేవాడిని. మత్తు పదార్థాల వ్యసనం కారణంగా నేను చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాను.  

మృత్యువు నా ఎదురుగా నిలబడి “నా చేయి పట్టుకో, నిన్ను నా చేతుల్లోకి తీసుకుంటాను” అని నా చేయి పట్టుకోవాలనుకుంటున్నట్టుగా అనిపించేది. కానీ నేను దాన్ని నా వేలు కూడా పట్టుకోనివ్వలేదు. సార్… ఇవన్నీ చూసి, చూసి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ నేను లోలోపల పూర్తిగా కుంగిపోయాను. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో నా కుటుంబం నన్ను పూర్తిగా వదిలేసింది. నన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది.

అమ్మ నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. అప్పటినుంచి నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు. మా తాతయ్య, నానమ్మలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మా మేనమామ, అత్త కూడా “ఈ పాడు అలవాటు మన పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది” అని నన్ను వదిలేశారు. సార్… బంధువులు నా గురించి ఎవరు అడుగుతారు సార్.. నా గురించి ఎవరూ అడగలేదు. నేను పూర్తిగా దారి తప్పిపోయాను. నాకు ఉన్న స్నేహితులందరూ వ్యసనపరులే. తప్పుడు పనులు చేసే వ్యసనపరులైనవాళ్ళే. డ్రగ్స్ ను ఎలా సంపాదించాలి? ఏం పని చేయాలి? తప్పుడు పనులు ఎలా చేయాలి? నేను ఈ విషయాలన్నింటిలో చిక్కుకుపోయాను.

ప్రధానమంత్రి: ఈ చెడు నుండి, ఈ నరకప్రాయమైన జీవితం నుండి బయటపడాలని మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఆ మలుపు ఏమిటి? ఆ క్షణం ఏది?

యువ మిత్రుడు: సార్… నాకు కొంచెం సహకరించే ఒక మిత్రుడు ఉన్నప్పుడు ఆ క్షణం వచ్చింది. నేను అతనితో “అన్నా! నేను మత్తుపదార్థాలు మానేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకారం ఇవ్వు” అని అడిగాను. అతనిపై నాకు చాలా ఆశలు ఉండేవి. కానీ చివరి క్షణంలో అతను చేతులెత్తేశాడు. “లేదు సోదరా… నేను నీకు సపోర్ట్ చేయలేను” అని చెప్పాడు. నేను ఆ తర్వాత పూర్తిగా కుంగిపోయాను. అది నా చివరి ఆశ. వ్యసనం కారణంగా నేను మా అమ్మను, మా అమ్మమ్మను, మా కుటుంబాన్ని కోల్పోయాను. నేను కోల్పోయిన చివరి సపోర్ట్ ఇదే. కాబట్టి “ఇప్పుడు నేను తప్పక మెరుగుపడాలి” అనుకున్నాను.. ఆ తర్వాత నాకు SPYM అంటే సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ యూత్ అండ్ మాసెస్  అనే పునరావాస కేంద్రం గురించి తెలిసింది. దాని హెడ్డాఫీసు ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉంది.

నేను అక్కడికి వెళ్లి చికిత్స తీసుకున్నాను. నేను బయటకు వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. సార్..  నేను మళ్లీ వ్యసనానికి లోనయ్యాను. అంతా నాశనం చేసుకున్నాను. దాంతో వాళ్లు నన్ను తిరిగి రమ్మని పిలిచారు. ఇలా మూడుసార్లు కొనసాగింది. అప్పుడు నేను నా సమస్య మొత్తం వివరించాను. నేను ఎందుకు పదేపదే వ్యసనానికి లోనవుతున్నానని వారు నన్ను అడిగారు. నేను ఒంటరిగా ఉన్నానని వారికి చెప్పాను.

అక్కడి నుండి బయటకు వచ్చాక నేను ఎక్కడికి వెళ్లాలో, నా ఇల్లు ఎక్కడ ఉందో, ఎక్కడ ఉండాలో నాకు ఏమాత్రం తెలియదు. సార్… నాకు ఏమీ తోచలేదు. ఈ క్రమంలో నేను ఉండటానికి చోటు గానీ, వెళ్ళడానికి గమ్యం గానీ దొరకలేదు. ఒక చోట స్థిరంగా ఉండలేక నా పాత స్నేహితులైన వారినే కలుస్తూ తిరిగేవాడిని. ఎందుకంటే నాకు ఉండడానికి మరో స్థలం లేదు.

ప్రధానమంత్రి: మీరు చాలా గడ్డు రోజులను అనుభవించారు. వ్యసనం నుండి బయటపడటానికి మీరు చేసిన ప్రయత్నాలకు కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. అంటే ఆ కాలం చాలా సవాలుగా ఉండి ఉండాలి. బయటపడాలనే కోరిక కూడా కష్టంగా ఉండి ఉండాలి. కదా!

యువ స్నేహితుడు: సార్… లోలోపల ఆ అలవాటు మానేయాలనిపించేది. నాలో ఇంకా కొద్ది జీవితమే మిగిలి ఉందని లోలోపల అనిపించేది. ఉన్న కొద్దికాలం మత్తుపదార్థాలు తీసుకుంటూ బతికితే నా అధ్యాయం ముగిసిపోతుందని అనిపించేది. సార్.. నేను ఆ మాట వినిపించుకోలేదు. బదులుగా మరో ఆలోచన నా లోపలినుండి  విన్నాను: “నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. నా కోసం నేను ఏదైనా చేసుకోవాలి.” అని. అందరూ నాతో “నువ్వు ఎప్పటికీ ఏమీ సాధించలేవు” అని చెప్పేవారు. నా కుటుంబం నన్ను వదిలేసింది. అందరూ నన్ను వదిలేశారు.

ప్రధానమంత్రి: మీ సొంత అనుభవం ఆధారంగా ఇప్పటికీ మాదకద్రవ్యాల వ్యసనానికి బలి అవుతున్న మన దేశ యువతకు మీరు ఏదైనా చెప్పాల్సి వస్తే, అలాంటి పిల్లలకు మీరేం చెప్తారు?

యువ మిత్రుడు: సార్… నేను వారికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే మొదట్లో ఇవన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత కలిగే హానిని మనం, మన కుటుంబాలు భరించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ప్రయోజనం లేదు.  అసలు ఇందులో ఏమీ లేదు – కేవలం హాని, హాని, హాని మాత్రమే. ఈ వ్యసనంలో కూరుకుపోయిన వారికి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను: “మన జీవితం చాలా అందమైనది, చాలా మంచిది. మనం ఆ విధంగా ఒక పద్ధతిగా జీవిస్తే, మనం ప్రతి విషయాన్నీ ఆస్వాదించగలుగుతాం.”

ప్రధానమంత్రి: సరే… మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఇప్పటికే గెలిచిన ఈ పోరాటంలో విజయం సాధిస్తూనే ఉండండి. మళ్లీ ఈ వ్యసనంలో పడకూడదనే దృఢ సంకల్పంతో జీవించండి. మీరు కలిసే ప్రతి ఒక్కరికీ ఇది తప్పుడు మార్గమని వివరిస్తూనే ఉండండి.

యువ మిత్రుడు: సరే సార్.. థాంక్యూ సార్.

ప్రధానమంత్రి: శుభాకాంక్షలు మిత్రమా… చాలా చాలా శుభాకాంక్షలు.

యువ మిత్రుడు: ధన్యవాదాలు సార్.

***********

     మిత్రమా! ఈ భయంకరమైన మాదకద్రవ్యాల వ్యసనాన్ని అధిగమించినందుకు నేను మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను. సంకల్ప బలం ఉంటే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని మీరు నిరూపించారు. మీ మాటలు మాదకద్రవ్యాల వ్యసనాన్ని విడిచిపెట్టాలనుకునే ఎంతో మంది యువతకు బలాన్నిస్తాయి. యువతరం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం కుటుంబానికి, దేశానికి చాలా ముఖ్యం. మీకు అనేకానేక శుభాకాంక్షలు.

ప్రియమైన దేశప్రజలారా! జీవితంలో మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడల్లా ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవిస్తాం. నేర్చుకోవడానికి వయోపరిమితి లేదు. ఈ రోజు నేను దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. వారిలో చాలా మంది 20-25 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో ఉన్నారు. ఇంత విస్తృతమైన అనుభవం ఉన్నప్పటికీ వారు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. దీని కోసం వారు ఒక డిజిటల్ వేదిక సహాయం తీసుకుంటున్నారు. దాని పేరే ‘ఐగాట్ కర్మయోగి’ (iGOT కర్మయోగి). ఈ డిజిటల్ వేదికపై ప్రభుత్వ ఉద్యోగుల కోసం 17 భారతీయ భాషల్లో 7 వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు అనేక కోర్సులను పూర్తి చేశారు. కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభ్యసిస్తున్నారు. మరికొందరు మూగవారు ఉపయోగించే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. కృత్రిమ మేధ, నూతన సాంకేతికతలను అభ్యసించే విషయంలో మన ఉద్యోగులలో నేను ప్రత్యేక ఉత్సాహాన్ని చూస్తున్నాను. దీనికి సంబంధించి 200కు పైగా కోర్సులు ఉన్నాయి. వాటిలో 3.25 కోట్లకు పైగా కోర్సులు పూర్తయ్యాయి.

మిత్రులారా! కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులకు కూడా దీనితో అనుబంధం ఉంది. మన ఆశా సోదరీమణులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు-  వీరందరూ దేశ ప్రజలు రోజూ సంప్రదించే ప్రభుత్వ వ్యవస్థలోని ఉద్యోగులే. ఈ ఉద్యోగులు ‘ఐగాట్ కర్మయోగి’ కోర్సు చేయడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకుని కర్మయోగులుగా మారినప్పుడు దాని ప్రయోజనాలు ప్రజలందరికీ చేకూరుతాయి. మిత్రులారా! ‘నాగరిక్ దేవో భవ’ అనేది మిషన్ కర్మయోగి మూల మంత్రం. అభివృద్ధి చెందిన భారతదేశం వైపు సాగే ప్రయాణంలో దేశంలోని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న అభ్యసనోత్సాహం ఒక గొప్ప బలం.

ప్రియమైన దేశవాసులారా! మీ మొబైల్ ఫోన్ పోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీ మొబైల్ ఫోన్‌లో మీ కాంటాక్ట్‌లు, ఫోటోలు, ముఖ్యమైన పత్రాలు ఉంటాయి. చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఒకసారి మీ ఫోన్ పోతే అది తిరిగి దొరుకుతుందనే ఆశ క్రమంగా తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు పోగొట్టుకున్న మీ మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందవచ్చు. ఈ విషయంలో భారత ప్రభుత్వ డిజిటల్ వేదిక మీకు ఎంతో సహాయపడుతుంది. ఆ వేదిక పేరే ‘సంచార్ సాథీ’. ఇప్పటివరకు ‘సంచార్ సాథీ’ పోర్టల్ 30 కోట్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ యాప్ దాదాపు 30 కోట్ల సార్లు డౌన్‌లోడ్ అయింది.

మిత్రులారా! ‘సంచార్ సాథీ’ ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడు ప్రశ్న.  వాస్తవానికి ప్రతి మొబైల్ ఫోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది.  దీన్ని IMEI నంబర్ అంటారు. మీరు పోగొట్టుకున్న మీ మొబైల్ ఫోన్‌ను కనుగొనడంలో సహాయపడటానికి ‘సంచార్ సాథీ’ ఈ గుర్తింపు సంఖ్యను ఉపయోగిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మీరు మీ మొబైల్ IMEI నంబర్‌ను ‘సంచార్ సాథీ’లో కూడా నమోదు చేయవచ్చు. ఆ నంబరుతో పాటు కొంత ముఖ్యమైన సమాచారాన్ని అందించడం ద్వారా మీరు దాన్ని బ్లాక్ చేయవచ్చు. దీని తర్వాత కొత్త సిమ్ పెట్టినప్పటికీ ఎవరూ దాన్ని ఉపయోగించలేరు. కానీ దీని ప్రత్యేకత ఇంతటితో ముగియదు. ఎవరైనా ఆ మొబైల్‌లో కొత్త సిమ్ పెట్టి నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే పోలీసులకు దాన్ని గుర్తించడం సులభం అవుతుంది. మిత్రులారా! ఈ వ్యవస్థ సహాయంతో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి లభించాయి. వాటి యజమానులు వాటిని తిరిగి పొందారు. ఒకప్పుడు ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ లేని చోట ఇప్పుడు సాంకేతికత మనకు ఆశ కల్పిస్తోంది.

మిత్రులారా! ‘సంచార్ సాథీ’ ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశాన్ని కూడా మనకు ఇస్తుంది. ఉదాహరణకు మీకు ఒక కాల్ వచ్చి, మోసం చేయడానికి ఎవరో మిమ్మల్ని ఓటీపీ అడిగారనుకోండి. అది మోసం అని మీరు గ్రహించి కాల్ కట్ చేస్తారు. కానీ మీరు తప్పించుకున్న ఆ మోసగాడి నుండి వచ్చే తదుపరి కాల్ అతని ఉచ్చులో పడే అవకాశం ఉన్న ఒక వృద్ధుడికి వెళ్ళవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఆ అనుమానాస్పద కాల్‌ను ‘సంచార్ సాథీ’లో తప్పకుండా రిపోర్ట్ చేయాలి. పూణే నివాసి హిమాన్షు సింగ్, ఇలాంటి 300కు పైగా నంబర్లను ‘సంచార్ సాథీ’లో రిపోర్ట్ చేశారు. ఆయన ప్రయత్నాలు గత సంవత్సరంలో దాదాపు 18,000 మొబైల్ కనెక్షన్‌లను రద్దు చేయడంలో సహాయపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నివాసి అయిన వివేక్ అల్హరి కూడా ఇదే విధంగా కృషి చేస్తున్నారు. ఒక అప్రమత్తమైన పౌరుడిగా వ్యవహరిస్తూ ఆయన 900కు పైగా మోసపూరిత నంబర్లను ‘సంచార్ సాథీ’లో పంచుకున్నారు. ఆయన ప్రయత్నాలు దాదాపు 17,000 మొబైల్ కనెక్షన్‌లను నిలిపివేయడంలో సహాయపడ్డాయి. మీరు ఆయన నుండి నేర్చుకోవాలి. మీరు తీసుకునే ఈ చిన్న చర్య దేశంలోని మరో మూలలో ఒక కుటుంబం జీవితకాల పొదుపును కాపాడగలదు.

మిత్రులారా! పోలీసులు మాత్రమే కాకుండా బ్యాంకులు, పేమెంట్ యాప్‌లు, టెలికాం కంపెనీలతో సహా 1,600కు పైగా సంస్థలు ‘సంచార్ సాథీ’తో అనుసంధానమయ్యాయి. ఇది అనేక సైబర్ మోసాల ప్రయత్నాలను సకాలంలో అడ్డుకోవడానికి సహాయపడుతోంది. ఈ వ్యవస్థ ఇప్పటివరకు 5 వేల కోట్లరూపాయలకు పైగా నష్టాలు జరగకుండా కాపాడింది. ఈ యాప్ 23 భాషలలో అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. మీరు కూడా ‘సంచార్ సాథీ’ గురించి వీలైనంత ఎక్కువ మందికి చెప్పాలి. మన చిన్నపాటి జాగ్రత్తలు డిజిటల్ ప్రపంచాన్ని మనందరికీ మరింత సురక్షితంగా మార్చగలవు.

నా ప్రియమైన దేశప్రజలారా! మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా అక్కడి ప్రసిద్ధ ప్రదేశాలను చూడాలని, అక్కడి ఆహారపానీయాలను ఆస్వాదించాలని కోరుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడి మ్యూజియాలను కూడా సందర్శించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇటీవల భారతీయ మ్యూజియాల గురించి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు వచ్చాయి. మిత్రులారా! పాట్నాలోని బీహార్ మ్యూజియం ప్రపంచంలోని 100 ఉత్తమ మ్యూజియాల జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బీహార్ మ్యూజియం ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. మీరు పారిస్‌లోని Louvre మ్యూజియం గురించి విని ఉంటారు. న్యూయార్క్‌లోని ద మెట్ మ్యూజియం కూడా ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జాబితాలో బీహార్ మ్యూజియం ఈ రెండింటి కంటే ముందుంది. మిత్రులారా! గుజరాత్‌లోని వడ్ నగర్‌లో కూడా ఒక చాలా ప్రత్యేకమైన మ్యూజియం ఉంది. దాని పేరు ‘అనంత అనాది వడ్ నగర్‌ ఆర్కియలాజికల్ ఎక్స్‌పరిమెంటల్ మ్యూజియం’. వడ్ నగర్‌ లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో చరిత్రలోని వివిధ కాలాలకు చెందిన అనేక కళాఖండాలు బయటపడ్డాయి. ఈ మ్యూజియాన్ని తవ్వకాలు జరిగిన ప్రదేశంలోనే అభివృద్ధి చేశారు. భూమికి కొన్ని మీటర్ల లోతున ఉన్న తవ్వకాలను వీక్షించేందుకు వీలుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. వడ్ నగర్‌ మ్యూజియంలో ఐదు వేలకు పైగా పురాతన కళాఖండాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. ఈ నెలలో వడ్ నగర్‌ మ్యూజియం బెర్లిన్‌లో ప్రతిష్టాత్మకమైన ‘రెడ్ డాట్: బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవార్డు’ను అందుకుంది. ఈ గౌరవాన్ని పొందిన భారతదేశంలోని మొట్టమొదటి మ్యూజియంగా ఇది నిలిచింది. మిత్రులారా! కాశీ లాగే వడ్ నగర్‌ కూడా వేల సంవత్సరాలుగా చైతన్యవంతంగా ఉన్న నగరం. యాదృచ్ఛికంగా నేను వడ్ నగర్‌ లో పుట్టాను. కాశీ నుండి పార్లమెంట్ సభ్యుడినయ్యాను. కొద్ది రోజుల కిందటే కంచి కామకోటి పీఠ పూజ్య శంకరాచార్యులు కూడా వడ్ నగర్‌ ను సందర్శించారు. ఆయన వడ్ నగర్‌ ను ‘గుజరాత్ కాశీ’గా గుర్తించారు.

మిత్రులారా! కళా ప్రపంచంలో కూడా భారతదేశం ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కళా ప్రదర్శన వెనిస్ ఆర్ట్ బినాలే ఇటలీలోని వెనిస్‌లో జరుగుతుంది. దీన్ని కళా ప్రపంచ ఒలింపిక్స్‌గా కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం భారతదేశపు పెవిలియన్‌ను దాదాపు నాలుగున్నర లక్షలమంది సందర్శించారు. విశేషం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులు భారతదేశ పెవిలియన్‌ను అత్యుత్తమమైనదిగా ఓటు ద్వారా ఎన్నుకున్నారు. భారతదేశ సాంప్రదాయిక కళలను నూతన రూపాల్లో ప్రదర్శించినప్పుడు అవి యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తాయని మన కళాకారులు నిరూపించారు. మిత్రులారా! భారతదేశంలో కూడా కళ, వాస్తుశిల్పం, డిజైన్ రంగాలలో ఒక మహోత్సవం జరగబోతుంది. ‘ఇండియా బినాలే’ డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈసారి 108 రోజుల పాటు దేశంలోని చారిత్రక కట్టడాలు, మ్యూజియాలు, ఆర్ట్ గ్యాలరీలు ఈ వేడుకలో భాగంగా ఉంటాయి. మీరందరూ సమయం కేటాయించి, మీ పిల్లలను ఈ కార్యక్రమానికి తీసుకురావాలని నేను కోరుతున్నాను. మనం మన వారసత్వం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే  భారతదేశాన్ని గురించి మరింత తెలుసుకోవాలనే మన ప్రయాణం అంతగా సుసంపన్నమవుతుంది.

ప్రియమైన దేశప్రజలారా! మనం చలికాలం గురించి మాట్లాడుకున్నప్పుడు, బెల్లం తియ్యదనం గురించి ప్రస్తావించకుండా ఎలా ఉండగలం? శతాబ్దాలుగా మన ఇళ్లలో రుచికి, ఆరోగ్యానికి నిధిగా ఉన్న బెల్లం ఇప్పుడు ప్రపంచం లోని వివిధ ప్రాంతాలను చేరుతోంది. తమిళనాడులోని ఈరోడ్ నుండి వచ్చిన సేంద్రియ తాటి బెల్లం మొదటిసారిగా ఐరోపాకు చేరుకుంది. ఇది బెల్లం సంప్రదాయ రుచి, నాణ్యతతో నిండి ఉంది. మనం ఇంతకుముందు ‘మన్ కీ బాత్’లో తేనె తియ్యదనం, తీపి విప్లవం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మన బెల్లం తియ్యదనం కూడా కొత్త మార్కెట్లకు చేరుతోంది.

మిత్రులారా! భారతీయ చాక్లెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది. గత ఏడాదిలోనే చాక్లెట్, కోకో ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 25 శాతం పెరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని చాక్లెట్ తయారీ పారిశ్రామికవేత్తలు కూడా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. మన స్టార్టప్‌లలో చాలా వరకు ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయి. అనేక స్టార్టప్‌లు స్థానిక పదార్థాలను ఉపయోగించి కొత్త రుచులను సృష్టించాయి. ఇది మన రైతులకు, తల్లులకు, సోదరీమణులకు, యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. మిత్రులారా! గుజరాత్‌లోని కచ్‌కు, చాక్లెట్‌కు మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉందని మీకు తెలుసా? ఒంటె పాలతో తయారు చేసిన చాక్లెట్ దీనికి ఒక ముఖ్యమైన అనుసంధానం. ఇక్కడి ఒంటెల కాపరులు అందించే పాలను ఉపయోగించి అమూల్ సంస్థ చాక్లెట్, కుంకుమపువ్వు రుచి ఉండే పాలు, రాజ్‌భోగ్ ఐస్ క్రీమ్ తయారు చేస్తోంది. ఒంటె పాలకు సంబంధించిన గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సర్హద్ డెయిరీలో రోజువారీ ఒంటె పాల సేకరణ 1300 లీటర్ల నుండి ఐదున్నర వేల లీటర్లకు పెరిగింది. ఇది 2017-18 నాటి సేకరణ కంటే నాలుగు రెట్ల కంటే అధికం. ఇప్పుడు ఒంటె పాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండే ప్యాక్‌లలో కూడా లభిస్తున్నాయి. దీని పొడిని కూడా తయారు చేస్తున్నారు. దీనివల్ల కచ్‌కు దూరంగా నివసించే వినియోగదారులకు కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా! ఒంటె పాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి దీన్ని మంచిదిగా పరిగణిస్తారు. లాక్టోస్ పడనివారికి కూడా ఇది ఒక అద్భుతమైన ఎంపిక కావచ్చు. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటాయి.

మిత్రులారా! సూరత్‌కు చెందిన ష్మిటన్ చాక్లెట్ మేడ్ ఇన్ ఇండియా ఫైన్  చాక్లెట్‌గా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోంది. ఈ రోజుల్లో మన దేశంలో స్టైలిష్ చాక్లెట్ బొటిక్‌ల కొత్త ట్రెండ్ కూడా కనిపిస్తోంది. ఇక్కడ మీకు చాక్లెట్‌తో పాటు భారతీయతను ప్రతిబింబించే ఒక విలాసవంతమైన అనుభవం లభిస్తుంది. మన శతాబ్దాల నాటి తీపి పరంపర కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. దాని మాధుర్యం మన రైతులు, యువ పారిశ్రామికవేత్తల జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తోంది. మిత్రులారా! మనం చాక్లెట్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వ్యాయామం గురించి కూడా మాట్లాడుకోవాలి కదా! దీనికి సైక్లింగ్ ఒక గొప్ప మార్గం. ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ 100 కార్యక్రమాలను పూర్తి చేసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. 2024 డిసెంబరులో ఇది ప్రారంభమైనప్పటి నుండి ఈ కార్యక్రమం జరగని ఆదివారం ఒక్కటి కూడా లేదు. 30 వేలకు పైగా ప్రదేశాలలో దాదాపు 37 లక్షల మంది ఇందులో పాల్గొన్నారు. పూణే నుండి మరో శుభవార్త వచ్చింది. 2032 యూసీఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇక్కడ జరుగుతుంది. క్రీడల్లో భారతదేశం నిరంతరం కొత్త విజయాలు సాధిస్తోంది. మన ఫుట్‌బాల్ జట్టు రికార్డు స్థాయిలో 10వసారి సాఫ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. బ్యాడ్మింటన్‌లో లక్ష్యాసేన్ జర్మనీ, జపాన్‌లలో వరుసగా రెండు సూపర్ 500 టైటిళ్లను గెలుచుకున్నారు. కుమామోటో మాస్టర్స్‌ను గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచారు. పి.వి. సింధు హైలో ఓపెన్ గెలిచి భారతదేశానికి మరో టైటిల్‌ను అందించారు. మన యువ ఛాంపియన్‌లకు మరో పెద్ద అవకాశం రాబోతోంది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ డిసెంబర్ 11 నుండి 22 వరకు తెలంగాణలోని ఆరు నగరాల్లో జరుగుతాయి. ‘ఖేల్తే రహియే- ఖిల్తే రహియే”- అంటే “ఆడుతూ ఉండండి. వికసిస్తూ ఉండండి” అని క్రీడాకారులు, అథ్లెట్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా! దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతాకాలం ప్రారంభమైంది. మారుతున్న వాతావరణంలో మనం మన ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ వహించాలి. మనం ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లాలి. వంటలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించమని నేను మీకు చేసిన వినతిని కూడా గుర్తుంచుకోండి. ఊబకాయం మన దేశానికి ఒక పెద్ద సవాలు. మనం దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. పెరుగుతున్న ఊబకాయం అనేక వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల మనం ఆహారం, వ్యాయామం విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

మిత్రులారా! మన భారతదేశ గడ్డపై ప్రవహించే సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చేరుతోంది. వివిధ దేశాల్లోని మన ప్రవాస భారతీయులు కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలకు చురుకుగా సహకరిస్తున్నారు. నేను ఎప్పటికప్పుడు ‘మన్ కీ బాత్’లో వివిధ దేశాలలో జరుగుతున్న ఇటువంటి సేవా కార్యక్రమాల గురించి మీతో పంచుకుంటూ ఉంటాను. ఇటీవల కెనడాలో జరుగుతున్న ఇటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తెలిసింది. అటువంటి ఒక కార్యక్రమమే ‘సాయి ధామ్ ఫుడ్ బ్యాంక్’. ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనేది దీని లక్ష్యం. ఈ కార్యక్రమం కింద గ్రేటర్ టొరంటో, హామిల్టన్‌లలో ప్రతి నెలా సుమారు 60 వేల మందికి సహాయం అందుతోంది. ఈ ఫుడ్ బ్యాంక్ వృద్ధులకు, దివ్యాంగులకు కూడా ఆహారాన్ని అందిస్తుంది. కెనడాలోని రెడ్ ఎఫ్ఎమ్‌తో అనుబంధం ఉన్న కుల్విందర్ సంఘేరా గారు  ఇటువంటి ఒక ప్రశంసనీయమైన ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ప్రజలను అనుసంధానించడానికి, సేవ అందించడానికి కమ్యూనిటీ రేడియోను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నారు. ఆయన ప్రయత్నాలకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు, సిక్కు మత సేవా స్ఫూర్తి ప్రేరణగా నిలిచాయి.

నా ప్రియమైన దేశవాసులారా! కొద్ది రోజుల కిందటే మనం ‘ప్రకాష్  పర్వ్’ జరుపుకున్నాం. ఢిల్లీలో జరిగిన ‘శబద్ కీర్తన్’లో పాల్గొనే భాగ్యం నాకు కూడా కలిగింది. ఈ పవిత్రమైన అనుభవం ఎల్లప్పుడూ నా మదిలో నిలిచి ఉంటుంది. మిత్రులారా! మన సిక్కు గురువుల చిత్రాలను చూస్తే మన హృదయాలు భక్తిభావంతో నిండిపోతాయి. ఇంతటి పవిత్రమైన చిత్రాలను ఎవరు గీశారని కొందరు ఆశ్చర్యపోవచ్చు. సిక్కు గురువుల అద్భుతమైన చిత్రాలను గీసిన మహనీయ చిత్రకారులు శోభాసింగ్ గారు. ఈ రోజు నవంబర్ 29న ఆయన 125వ జయంతి. శోభా సింగ్ గారు కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో డ్రాఫ్ట్స్‌మన్‌గా కూడా పనిచేశారు. ఈ సమయంలో ఆయన బాగ్దాద్‌లో కూడా సేవలందించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం ఒక స్మారక నాణెం విడుదల చేయడం పట్ల సిక్కు సమాజం కూడా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా! ‘మన్ కీ బాత్’ శ్రోతలకు నేను చెప్పాలనుకుంటున్న మరో మహనీయుడు బి.ఎన్. రావు గారు. మన రాజ్యాంగ రూపకల్పనలో బి.ఎన్. రావు గారు కీలక పాత్ర పోషించారు. రెండు రోజుల కిందటే మనం రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. రేపు- అంటే నవంబర్ 30వ తేదీన రావు గారి వర్ధంతి. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో ఆయన చేసిన చారిత్రాత్మక కృషిని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. నేను కూడా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! మీరు ప్రతి నెలా ‘మన్ కీ బాత్’ కోసం పంపే సందేశాలు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అద్భుతమైన కృషి గురించి తెలుసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తున్నాయి. మీ వల్లే ఎంతో మంది చేస్తున్న మంచి పనులు యావత్ దేశం దృష్టికి వస్తున్నాయి. మీ అనుభవాలను, మీ ఆలోచనలను, మీ సూచనలను ఇలాగే నాతో పంచుకుంటూ ఉండండి. వచ్చే నెల మనం మళ్ళీ కలిసినప్పుడు మన దేశవాసులకు సంబంధించిన ఇలాంటి కొన్ని స్ఫూర్తిదాయకమైన గాథల గురించి చర్చిద్దాం. మీరు మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవును…. ఫిట్ ఇండియాను మర్చిపోకండి. వాతావరణం చాలా బాగుంది. కాబట్టి కొద్దికొద్దిగా వ్యాయామం చేయండి. చాలా చాలా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

***