Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభ సందర్భంగా కాశీ సందర్శనకు విచ్చేస్తున్న వారందరికీ సాదర స్వాగతం పలికిన ప్రధానమంత్రి


‘కాశీ తమిళ సంగమం’ ఐదో ఎడిషన్ ప్రారంభం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంగమంలో పాల్గొనడం ద్వారా తమిళనాడు సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సనాతన నగరమైన కాశీ సందర్శనకు విచ్తేస్తున్న వారందరికీ ఆయన సాదర స్వాగతం పలికారు.

ఈ ఏడాది ఇతివృత్తం ‘తిరుక్కురళ్ పయిల్‌వోమ్’ ప్రత్యేక ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ… గొప్ప కవి, సాధువు అయిన తిరువళ్ళువర్ అందించిన శాశ్వత జ్ఞానం మానవ జీవితంలోని అనేక అంశాలపై అమూల్య మార్గదర్శనం అందిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తిరుక్కురళ్‌ను 10 విదేశీ భాషలు సహా మొత్తం 50 భాషల్లోకి అనువదించి విడుదల చేయడాన్ని ఆయన అభినందించారు. తిరువళ్ళువర్ తత్వశాస్త్రాన్ని యువతలో మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇటువంటి ప్రయత్నాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఈ రోజు ‘కాశీ తమిళ సంగమం 5.0’ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది!

తమిళనాడు సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సనాతన నగరమైన కాశీకి విచ్చేస్తున్న వారందరికీ సాదర స్వాగతం.

ఈ ఏడాది ‘సంగమం’ కార్యక్రమ ఇతివృత్తం ‘తిరుక్కురళ్ పయిల్‌వోమ్’ ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప కవి తిరువళ్లువర్ అందించిన జ్ఞానం, మానవ జీవితంలోని అనేక అంశాలకు అమూల్య మార్గదర్శనం అందిస్తుంది. తిరుక్కురళ్‌ను 10 విదేశీ భాషలు సహా మొత్తం 50 భాషల్లోకి అనువదించి విడుదల చేయడం ఎంతో అద్భుతమైన విషయం. ఇటువంటి ప్రయత్నాల ద్వారా, గొప్ప కవి తిరువళ్లువర్ ఆలోచనలు యువతలో మరింత ప్రాచుర్యం పొందుతాయని ఆశిస్తున్నాను.

గత కొన్ని సంవత్సరాలుగా, ‘కాశీ తమిళ సంగమం’ సాంస్కృతిక, మేధోపరమైన జ్ఞానాన్ని పరస్పరం పంచుకునే ఒక శక్తిమంతమైన వేదికగా ఎదిగింది. దీనివల్ల ‘శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి మరింత బలపడింది.