Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ 2018 లో ప్రధాన మంత్రి ప్రసంగం


ఎకనామిక్స్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ కు హాజరు కావడానికి దేశ విదేశాల నుండి వచ్చిన అతిథులు, సోదరులు మరియు సోదరీమణులారా,

సరికొత్త భారతావని ఆవిష్కరణకు సంకల్ప శుద్ధిగా ప్రయత్నం జరుగుతున్న శుభ తరుణంలో కొత్త ఆర్థిక వ్యవస్థ- కొత్త నిబంధనలు అంశంపై చర్చించడానికి మీరంతా ఇక్కడ సమావేశమయ్యారు. అసలు కొత్త అంటే ఏమిటనేదే ప్రశ్న.

ఎకనామిక్స్ టైమ్స్ రోజువారీ ప్రచురణ అయ్యే పత్రిక; పత్రికనాణ్యత రోజూ ఒకేలా ఉంటుంది; ముద్రణ కూడా రోజూ ఒకేలా ఉంటుంది; ప్రతీ రోజూ ఒక కొత్త పత్రిక ప్రచురిస్తున్నాం అని చెప్పుకుంటున్నా మీరు ముద్రించే పేపర్ పేరులో ఫాంట్, స్టైల్ లో కూడా ఒకేలా ఉంటాయి. అయితే కంటెంట్ లో మార్పు ప్రధానంగా చెప్పుకోవలసింది. ఇది కొత్త వార్త, ఇది కొత్త కథనం అని చెప్పుకోవడం ద్వారానే మీరు రోజూ కొత్త పేపర్ అనగలుగుతున్నారు.

మిత్రులారా,

మా ప్రభుత్వం వచ్చే నెలతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. దేశం అదే, పాలనా యంత్రాంగం అదే, కాని భారత్ లోను, విదేశాల్లోను కూడా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సరికొత్త భారతావనికి కొత్త నిబంధనలు, కొత్త ఆర్థిక వ్యవస్థ ఈ మార్పులో ప్రధానం. దేశంలో ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మార్పుతోనే ఇది సాధ్యం. మీ అందరికీ తెలుసు నాలుగు సంవత్సరాల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం మన దేశాన్ని బలహీనంగా ఉన్న ఐదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా వర్గీకరించే వారు. ఆ దేశం మునిగిపోతుంది, దాంతో పాటు మనని కూడా ముంచేస్తుందంటూ మనవైపు చులకనభావంతో చూసేవారు. ఈ రోజు ఏ ఒక్కరూ ఐదు బలహీన దేశాల్లో ఒకటి అనే మాట ఉపయోగించడం లేదు, అందుకు భిన్నంగా ఐదు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు పురోగమిస్తున్న దేశంగా చూస్తున్నారు. భారత్ తో భుజంభుజం కలిపి నడవాలని ప్రపంచం యావత్తు కోరుతోంది.

మిత్రులారా,

భారతదేశం సాధిస్తున్న వృద్ధి అంతర్జాతీయ వృద్ధికి కూడా గణనీయమైన వాటా అందిస్తోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా భారత్ తన స్వంత వృద్ధితో పాటుగా భారత ఆర్థిక వృద్ధిని కూడా బలోపేతం చేసింది.

మనం ప్రపంచ ఆర్థిక గణాంకాలు చూసినట్టయితే అత్యంత ఆసక్తికరమైన ధోరణులు గోచరిస్తాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి గణాంకాల ప్రకారం గతంలో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా 2.4 శాతం ఉండగా ఈ నాలుగేళ్లలో అది 3.1 శాతానికి చేరింది. గతంలో ఎనిమిది సంవత్సరాల కాలంలో అందించిన వాటాను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో అందించగలిగింది. ఐఎంఎఫ్ గణాంకాల నుంచి మరిన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు కూడా చూడవచ్చు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో చోటు చేసుకున్న వృద్ధిలో 21 శాతం భారత ఆర్థిక వృద్ధి ద్వారా సమకూరినదే. ప్రపంచ జిడిపిలో కేవలం మూడు శాతం వాటా ఉన్న దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏడు రెట్లు అధిక వాటా అందిస్తున్నదన్న వాస్తవాన్ని మీరే గమనించండి.

ద్రవ్యోల్బణం కావచ్చు, జిడిపి వృద్ధి రేటు కావచ్చు, వడ్డీరేట్లు కావచ్చు, ఎఫ్డిఐల రాక కావచ్చు.. స్థూల ఆర్థికాంశాలను గమనించినట్టయితే అన్నింటిలోనూ భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని మీకు తెలుస్తుంది. మొదటి మూడు,మూడున్నర సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం కరెంట్ ఖాతా లోటును అత్యంత ప్రమాదరకమైన నాలుగు శాతం స్థాయి నుంచి సగటున ఒక శాతానికి తీసుకువచ్చింది.

గత ప్రభుత్వంలో 4.5 శాతం ఉన్న విత్తలోటును 3.5 శాతానికి దించింది.

మూడున్నర సంవత్సరాల కాలంలో ఎఫ్ డిఐలను అంతకు ముందు మూడు సంవత్సరాల్లో ఆకర్షించిన 117 బిలియన్ డాలర్ల నుంచి 209 బిలియన్ డాలర్లకు పెంచింది.

భారత విదేశీ మారకం నిల్వలు 300 బిలియన్ డాలర్ల నుంచి 419 బిలియన్ డాలర్లకు చేరాయి. 2013 సంక్షోభం సమయంలో తెచ్చుకున్న 24 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లను (ఎఫ్ సిఎన్ఆర్) తిరిగి చెల్లించేసిన తర్వాత కూడా విదేశీ మారకం నిల్వల్లో ఈ వృద్ధిని సాధించగలిగాం.

మనం సాధిస్తున్న అత్యధిక ఉత్పాదకత వల్ల భారత రూపాయి భవిష్యత్తు కూడా మెరుగ్గా కనిపిస్తోంది. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణంరేటును అదుపులో ఉంచగలిగాం. వడ్డీరేట్లు ఒక శాతం కన్నా పై స్థాయిలోనే తగ్గడం కస్టమర్లు, గృహనిర్మాణ రంగం, ఇతర పరిశ్రమలకు లాభదాయకం అయింది.

ఏడాదికేడాది ఆర్థిక సూచిలను మెరుగుపరచడంలో మా ప్రభుత్వం విజయం సాధించింది. పాత ధోరణులనే అనుసరిస్తూ పోతే ఈ పురోగతి సాధ్యం అయ్యేదా? కానే కాదు. సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగడం వల్లనే ఈ మార్పు సాధ్యం అయింది. సొంత సామర్థ్యాలు, సొంత వనరులపై విశ్వాసంతో సరికొత్త భారతావని ఆవిష్కారం సంకల్పంతోనే దేశం పురోగమించగలుగుతోంది.

గత మూడు సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక ప్రపంచం కొత్త అంశాన్ని నేర్చుకుంది, అదే పోటీ సామర్థ్యం. ముందుకు పరుగు తీయాలన్న సంకల్పం, ఆరోగ్యవంతమైన పోటీ లేనిదే వేగం సాధ్యం అయ్యేదే కాదు లేదా మరింత పై స్థాయి గురించి ఆలోచించగలిగే వారమే కాదు.

మిత్రులారా,

ఈ రోజు యావత్ ప్రపంచం భారత పోటీ సామర్థ్యానికి విలువ ఇస్తోంది, మన పోటీ సామర్థ్యానికి శాల్యూట్ చేస్తోంది.

భారతదేశం ప్రపంచంలో ఎఫ్ డిఐలకు ఆకర్షణీయ గమ్యాల్లో ఒకటిగా అంక్టాడ్ కు చెందిన ప్రపంచ పెట్టుబడి నివేదిక వర్గీకరించింది.

ప్రపంచంలో మంచి పురోగమన అవకాశాలున్న మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది.ఎఫ్ డిఐ విశ్వాస సూచిలో ఉన్న రెండు వర్థమాన దేశాల్లో భారత్ ఒకటి.

కేవలం మూడే మూడు సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంకు వాపారానుకూల ర్యాంకింగ్స్ లో మనం 42 పాయింట్లు ముందకు దూసుకుపోయాం. ఈ రోజున మనం 142వ స్థానం నుంచి 100వ స్థానంలో నిలవగలిగాం. ప్రపంచానికి చెందిన పలు రేటింగ్ ఏజెన్సీలు భారత ర్యాంకింగ్ ను మెరుగుపరుస్తున్నాయి. ఈ రోజు ప్రపంచంలో అత్యం బాహిర ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచింది.

మిత్రులారా,

మీరు నిర్వహించిన గత కార్యక్రమానికి నేను హాజరైన తర్వాత జిఎస్ టిని ఆచరణలోకి తీసుకురాగలిగాం. జిఎస్ టి అనేది నేడు వాస్తవం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలోని అతి పెద్ద పన్నుసంస్కరణ ప్రారంభమై ఇప్పుడు ఏడు నెలలు పూర్తయింది. దేశానికి మరింత మెరుగైన పన్ను వ్యవస్థ, మరింత మెరుగైన ఆదాయ వనరు జిఎస్ టి ద్వారా మనకి లభించింది. మరింత త్వరితంగా సరకు రవాణాను ఇది ప్రోత్సహిస్తోంది. రవాణా వ్యయాలను అదుపులోకి తెచ్చింది. ఎగుమతుల రంగంలో పోటీ వాతావరణం ఆవిష్కరించింది.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 6 మిలియన్ల ట్రేడర్లు పన్ను వ్యవస్థలో భాగంగా ఉన్నారు. జిఎస్ టి అమలుపరిచిన ఈ ఏడు నెలల కాలంలోనే 4.4 మిలియన్ల కన్నా ఎక్కువ మంది కొత్త ట్రేడర్లు కొత్త పన్ను వ్యవస్థలో భాగం అయ్యారు. ఇది వ్యాపార సంస్కృతిలో నిజాయతీని పెంచడమే కాదు, పన్ను పరిధి విస్తరించడం వల్ల నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందగలుగుతున్నారు.

మిత్రులారా,

ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ద్వంద్వ బ్యాలెన్స్ షీట్ల విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి వారసత్వం అందిందో మీ అందరికీ తెలుసు. అంతే కాదు, గతంలో బ్యాంకింగ్ వ్యవస్థలో క్రోనీ పెట్టుబడిదారీ విధానం గూడు కట్టుకుని ఉండేది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు దివాలా కోడ్ ను మేం ప్రవేశపెట్టాం. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ రోజు దేశవ్యాప్తంగా 62 ఇన్ సాల్వెన్సీ సంస్థలు, రెండు వేల మందికి పైగా ఇన్ సాల్వెన్సీ వృత్తి నిపుణులు 24 గంటలు అలుపు లేకుండా పని చేస్తున్నారు.

ఎగుమతుల విభాగంలో మరో సవాలు ఉండేది. 2015-16 ఆర్థిక సంవత్సరం ఎగుమతి, దిగుమతి గణాంకాలు పరిశీలించినట్టయితే రెండు రంగాలూ 15 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ క్షీణతకు పలు కారణాలున్నాయి. మరో అవకాశం కూడా మన ముందుంది, ఆర్థిక రంగ నిపుణులు దీనిపై చర్చించాలి.

మిత్రులారా,

2014 సంవత్సరంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్లధనం నిర్మూలనకు సిట్ ఏర్పాటు చేయడం తొలి ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. ఎగుమతి, దిగుమతుల్లో ఓవర్ ఇన్ వాయిసింగ్ తీవ్ర సమస్యగా ఉన్నదని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దీన్ని అదుపులోకి తేవడానికి కఠిన చర్యలు తీసుకుంది. అయితే వాణిజ్యలోటులో పెద్ద తేడా ఏమీ లేకుండానే ఎగుమతులు, దిగుమతుల్లో అదే తరహా క్షీణత చోటు చేసుకున్నట్టు ఈ రోజు ఆర్థికవేత్తలు రూపొందించిన ఒక నివేదికలో పేర్కొన్నారు. దీనికి కారణం ఓవర్ ఇన్ వాయిసింగా లేక బేస్ కరెక్షనా…?

వినీత్ జీ, “ఎగుమతుల క్షీణతకు శ్రీ మోదీ వివరణ ఇచ్చారు” అని మాత్రం రేపటి సంచికలో ప్రచురించకండి. మీరందరూ దీని గురించి ఆలోచించాలనే కోణంలో మాత్రమే ఒక కోణాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. కాని సుదీర్ఘ కష్టనష్టాల అనంతరం పరిస్థితి మెరుగుపడుతున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

మిత్రులారా,

మనందరం రోజువారీ గమనిస్తూనే ఉంటాం. మనం నీటిని వేడి చేస్తున్నప్పుడు నిర్దిష్ట ఉష్ణోగ్రత దాటగానే అది ఆవిరిగా మారుతుంది. కాని ఆ ఉష్ణోగ్రతను చేరకుండానే ఆవిరి సాధ్యం కాదు. అలాగే ప్రభుత్వ చొరవలు ప్రజలను చేరాలంటే వేగం, పరిధి, సునిశితత్వం అత్యంత కీలకం. అది మూడూ సాధించగలిగినప్పుడు విజయం సాధించగలుగుతాం. ప్రతీ ఒక్క దానికి అవరోధాలు కల్పించే గత సంస్కృతిని మేం మార్చగలిగాం, ఎంతో కాలం పాటు పనులు సుషుప్తావస్థలో ఉండే సంస్కృతిలో మార్పు తీసుకురాగలిగాం. ఈ కారణంగానే వ్యవస్థలో కొత్త రకం వేగం చోటు చేసుకుంది.

గత ప్రభుత్వంతో పోల్చితే ఈ రోజు బ్రాడ్ గేజ్ గా రైల్వేలైన్ల మార్పిడి రెండింతలు వేగం అందుకుంది. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారుల నిర్మాణంలో కూడా రెండింతలు వేగం చోటు చేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థల ఏర్పాటు రెండింతలు జోరందుకుంది. విద్యుదుత్పత్తిలో వేగం కూడా గత ప్రభుత్వ హయాంతో పోల్చితే మరింత వేగం అందుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 59 గ్రామాలకే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ అందుబాటులో ఉండేది. ఈ రోజు మూడేళ్ల కాలంలో 1.1 లక్షల గ్రామాలకు ఒఎఫ్ సిని వ్యవస్థను మా ప్రభుత్వం విస్తరించగలిగింది.

గతంలో 28 పథకాల ప్రయోజనాలు మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ రోజు 400 పైగా పథకాల ప్రయోజనాలు ప్రత్యక్ష నగదు బదిలీ కిందకు వచ్చాయి.

మీరే ఆలోచించండి గతంలో చిన్న ఎల్ఇడి బల్బు ధర 350 రూపాయలుండేది. మేం క్రమంగా ఆ ధరను 40-50 రూపాయల స్థాయికి దించగలిగాం. ఈ రోజు కూడా ప్రపంచంలోని పలు దేశాల్లో ఎల్ఇడి బల్బు ధర మూడు డాలర్లుంది, కాని మేం దాన్ని ఒక డాలర్ కన్నా తక్కువ స్థాయికి తీసురాగలిగాం.

2014 సంవత్సరానికి ముందు దేశంలో కేవలం మూడు మొబైల్ తయారీ యూనిట్లుండేవి. ఈ రోజు వాటి సంఖ్య 120కి పెరిగింది. ఫలితంగా దేశంలోకి మొబైల్ హ్యాండ్ సెట్ల దిగుమతి విలువ 2014-15 సంవత్సరంలో నమోదైన 50 వేల కోట్ల నుంచి సగం మేరకు దిగి వచ్చింది. ఈ మార్పులన్నీ వాటికవే వచ్చాయా? సంకల్ప బలంతో, ఆత్మ విశ్వాసంతోనే ఏదైనా సాధించగలం అని ఈ ప్రభుత్వం నిరూపించింది.సూక్ష్మంగా ఇవే కొత్త ఆర్థిక వ్యవస్థ నియమనిబంధనలు.

సోదరులు మరియు సోదరీమణులారా,

వనరులన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేల బడ్జెట్ ఉండాలని మేం చెబుతూ వచ్చాం. అభివృద్ధి పాలసీల ఆధారంగానే బడ్జెట్ ఉండాలన్నది మా లక్ష్యం.

ఈ రోజు వ్యవసాయం, టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక రంగాల్లో పెట్టిన పెట్టుబడులు గతంలో ఏనాడూ కనివిని ఎరుగనివి. తొలిసారిగా దేశంలో ఏవియేషన్ విధానం తీసుకువచ్చాం. రక్షణ రంగంలో కూడా ఎఫ్ డిఐలు తీసుకువచ్చేందుకు కొత్త అవకాశాలు కల్పించాం. గతంలో ఎవరూ దీని గురించి ఆలోచించనైనా లేదు.

రవాణా రంగాన్ని మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 21వ శతాబ్ది అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఆ రంగాన్ని సంఘటితం చేస్తోంది. ఈ పెట్టుబడులు, ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలన్నీ లక్షలాది ఉద్యోగావకాశాలు మన ముందుకి తెచ్చాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం వృద్ధి ఆధారిత, ప్రజలే కేంద్రంగా విధానాలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మధ్యతరగతి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూనే సమ్మిళిత ఆర్థిక ధోరణులకు పెద్దపీట వేశాం.

మిత్రులారా,

మా ఒక్కరికే అన్నీ తెలుసు అనే తరహా దుడుకు స్వభావం మా ప్రభుత్వంలో లేదు. సబ్ కా సాథ్-సబ్ కా వికాస్ మంత్రాన్ని ఆచరణీయం చేయడంలో ప్రతీ ఒక్కరి అభిప్రాయం తీసుకుంటూ ప్రతీ ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం. వారందరి ఆవసరాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటూ సంపూర్ణమైన అవగాహనతో పని చేస్తున్నాం. దీని వల్ల దీర్ఘకాలిక సమస్యలకు సరికొత్త పరిష్కారాలు సాధ్యమయ్యాయి.

ఈ సునిశితత్వాన్ని వ్యవస్థలో అన్ని విభాగాలకు, అన్ని ప్రదేశాలకు విస్తరించడం కోసం మా ప్రభుత్వం మొదటి రోజు నుంచి కృషి చేస్తోంది. నేను స్వయంగా రైతులు, యువత, విద్యార్థులు, యువ సిఇఒలతో భిన్న వేదికలపై పలు మార్లు సమావేశమై వారితో చర్చించాను. మా కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు నేరుగా అందుకునే వ్యవస్థను మేం ఏర్పాటు చేశాం. ఫిర్యాదుల పరిష్కారంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం.

మిత్రులారా,

కొన్ని సార్లు ఎంతో సైద్ధాంతికంగా ఎంతో చక్కగా ఉన్నాయనుకున్న పరిష్కారాలు కూడా ఆచరణలో సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. అయితే ప్రతీ ఒక్క అంశాన్ని ప్రభుత్వం సునిశిత దృక్పథంతోనే అర్ధం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి వెదురు, నూరు శాతం వేప పూత పూసిన యూరియా పంపిణీ, గ్రూప్ సిడి పోస్టులకు ఇంటర్వ్యూల రద్దు, ధ్రువీకరణ పత్రాలకు గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ తీసుకునే విధానానికి స్వస్తి చెప్పడం వంటి నిర్ణయాలన్నీ చాలా కాలం ముందే తీసుకుని ఉండాల్సింది. కాని అప్పటి ప్రభుత్వాలకు ప్రజాసమస్యలపై సరైన అవగాహన లోపించడం, ప్రజలతో అనుసంధానం కాకపోవడం వల్ల అవి చేయలేకపోయారు.

మిత్రులారా,

మన దేశంలో ఆరోగ్య రంగంపై ఎప్పుడూ పరిపూర్ణంగా దృష్టిని సారించలేదు. గతంలో కూడా ఆరోగ్య రంగానికి సంబంధించిన విధానాలు రూపొందించినా సమగ్ర అవగాహన లోపించింది. మంచి ఆరోగ్య సంరక్షణతో పాటుగా మంచి ఆరోగ్యానికి మేం రక్షణ కల్పిస్తున్నాం.

మిషన్ ఇంద్రధనుష్ సహాయంలో టీకాల కార్యక్రమం పరిధిని ఆరు రెట్లు విస్తరించగలిగాం. మూడు వేలకు పైగా జన్ ఔషధి దుకాణాల ద్వారా 800 ఔషధాలను అందుబాటు ధరల్లోకి తీసుకురాగలిగాం. స్టెంట్ల ధరలు 80 శాతం వరకు తగ్గించాం. మోకాలి ఇంప్లాంట్ల ధరలు కూడా నియంత్రించగలిగాం. 250000 మంది డయాబెటిస్ రోగులకు 2 నుంచి 2.5 మిలియన్ ఉచిత సెషన్లు అందుబాటులోకి తెచ్చాం.

ఈ ఏడాది బడ్జెట్ లో మేం 10 కోట్ల పేద కుటుంబాలకు బీమా రక్షణ కల్పించే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను ప్రకటించాం. ఈ పథకం కింద ప్రతీ నిరుపేద కుటుంబానికి తీవ్ర అనారోగ్యాలకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజ్ కల్పిస్తున్నాం.

మిత్రులారా,

మన సమాజంలో డిజిటల్ సాధికారత తీసుకురావడ , ఆర్థిక వ్యవస్థ అంతటినీ మేథోసంపత్తి ఆర్థిక వ్యవస్థగా మార్చడం డిజిటల్ ఇండియా లక్ష్యం. ఒక బిలియన్ బ్యాంకు ఖాతాలు, ఒక బిలియన్ ఆధార్ కార్డులు, ఒక బిలియన్ మొబైల్ ఫోన్లు గల మన వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది.

మిత్రులారా,

దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ ఎంఇలు వెన్నెముక వంటివి. ఈ రంగాన్ని పటిష్ఠం చేసేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. వారికి మరింత రుణాల మద్దతు ఇచ్చేందుకు, మూలధనం సమకూర్చేందుకు, వడ్డీ సబ్సిడీలు ఇచ్చేందుకు, గరిష్ఠ సంఖ్యలో చిన్న పరిశ్రమలను వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చాం.

ఈ అంశంలో ఆర్థిక టెక్నాలజీ లేదా ఫిన్ టెక్ అత్యంత కీలకం. ఎంఎస్ ఎంఇలకు ఆర్థిక సహాయం అందుబాటులోకి తెచ్చేందుకు, వాటి వృద్ధిరేటును పెంచేందుకు ఫిన్ టెక్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం. వాటి సమర్థవంతమైన వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది.

మిత్రులారా,

నేను గతంలో ఈ కార్యక్రమానికి హాజరైనప్పుడు అందరికీ ఇల్లు, అందరికీ విద్యుత్తు, అందరికీ స్వచ్ఛమైన ఇంధనం, అందరికీ ఆరోగ్యం, అందరికీ బీమా గురించి ప్రస్తావించాను.

గత మూడేళ్ల కాలంలో నిరుపేదలు, అల్పాదాయ వర్గాల కోసం కోటికి పైగా ఇళ్లు నిర్మించాం. సౌభాగ్య యోజన కార్యక్రమం కింద నాలుగు కోట్ల ఇళ్లకు విద్యుత్ వెలుగులు అందించాం. ఉజ్వల స్కీమ్ కింద 3.4 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాం.

రోజుకి 90 పైసలు, నెలకి రూపాయి ప్రీమియంతో 18 కోట్ల మంది ప్రజలకు బీమా రక్షణ అందించాం. ఈ స్కీమ్ కింద పేద ప్రజల నుంచి వచ్చిన రెండు వేల కోట్ల రూపాయల విలువ గల క్లెయిమ్ లు పరిష్కరించాం.

మిత్రులారా,

ప్రభుత్వ విధానాలు, నియామకాలు, నిర్ణయాలు, ఉద్దేశాలు, నిబంధనలన్నింటి లక్ష్యం ఒక్కటే. దేశాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఫార్ములా ద్వారా మేం పేదల్లో సాధికారత తెస్తున్నాం.

జన్ ధన్ యోజన స్కీమ్ కింద గత మూడున్నర సంవత్సరాల కాలంలో 31కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరిచాం. అవి నామమాత్రంగా తెరిచిన ఖాళీ బ్యాంకు ఖాతాలు కావు, ఈ ఖాతాల్లో ఈ రోజు 75 వేల కోట్ల రూపాయలకు పైగా జమ అయింది.

ఇదే కాలంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించింది. గ్రామీణ పారిశుధ్య విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 2014లో 40 శాతం ఉన్న గ్రామీణ పారిశుధ్యం ఇప్పుడు 78 శాతం దాటింది.

ముద్ర యోజన స్కీమ్ కింద ప్రభుత్వం 11 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసింది. ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు లేకుండానే 4.5 లక్షల మంది యువకులు, మహిళలకు రుణాలు పంపిణీ చేశాం. ఈ స్కీమ్ ప్రభావం వల్ల మూడు కోట్ల మందికి పైగా కొత్త పారిశ్రామికులు రంగంలోకి వచ్చారు.

దేశంలో ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా భూసార ఆరోగ్య కార్డుల జారీ పూర్తయింది. 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చాం.

మిత్రులారా,

నవ్య ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణ దిశగా మరో ప్రధాననిర్ణయం ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించాం.

షెడ్యూల్డ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు అందించాలని నిర్ణయించాం. రైతన్నలు వ్యవసాయ కార్యకలాపాల కోసం కార్మికులను నియమించుకోవడం నుంచి సొంత పశువులు/యంత్రసామగ్రి వినియోగం, ఇతరుల పశువులు/యంత్రసామగ్రి అద్దెకు తీసుకోవడం, విత్తనాలకు చెల్లింపులు, కంపోస్ట్ ఎరువుల వ్యయాలు, భూమికి నీటి పారుదల వసతి కల్పన, భూమిని కౌలుకు తీసుకునేందుకు అయ్యే వ్యయాలు అన్నింటినీ దీని పరిధిలోకి తీసుకువచ్చాం. రైతులు స్వయంగాను, వారి కుటుంబాల సహాయంతోను చేసే శ్రమశక్తిని కూడా కనీస మద్దతు ధరల మదింపులో పరిగణనలోకి తీసుకుంటున్నాం.

రైతుల శ్రమకు ఆదాయం అందించడంలో ఇది అత్యంత కీలకమైన నిర్ణయం. కొందరు ఆర్థికవేత్తలు ఈ నిర్ణయం ధరల పెరుగుదలకు దారి తీస్తుందంటున్నారు.

మిత్రులారా,

ఇలా చెప్పే ఆర్థికవేత్తలందరూ మన వ్యవసాయదారులపై ఉన్న దేశానికి ఆహారం అందించే బాధ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. రైతాంగం ఆదాయం పెంపు దిశగా తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయానికి అందరూ మద్దతు ఇవ్వాలన్నది నా అభిప్రాయం. ఇలాంటి చర్యల ద్వారా ఏదైనా ఆదాయవనరు ఏర్పడినట్టయితే ఎలాంటి సంకోచం లేకుండా వారి భాగస్వామ్యాన్ని మనం పెంచగలుగుతాం.

మిత్రులారా,

గత మూడేళ్లుగా నిజాయతీకి పట్టం కట్టడానికి మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకత పెంచడంతో పాటు లీకేజిలు అరికట్టగలిగాం.

డిబిటిని అడ్డు పెట్టుకుని 57 వేల కోట్ల రూపాయలు స్వార్ధపరుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించగలిగాం. రెండు లక్షలకు పైగా అనుమానాస్పద కంపెనీల గుర్తింపు రద్దు చేశాం. ఇలాంటి కంపెనీల డైరెక్టర్ల బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయడంతో పాటు వారు ఏ ఇతర కంపెనీలోను డైరెక్టర్ గా పని చేసేందుకు అర్హులు కాకుండా చేశాం.

దేశ భవిష్యత్ అవసరాలు ఏమిటన్నది దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, అన్ని రంగాలకు చెందిన ప్రజలు, అందరు వృత్తి నిపుణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

ఆర్థిక సంస్థలు నిబంధనలు, నైతిక విలువలకు కట్టుబడేలా చూసే బాధ్యత అప్పగించిన వారు ప్రత్యేకించి పర్యవేక్షణ, నిఘా బాధ్యలున్న వారంతా తమ విధిని చిత్తశుద్ధితో, నిజాయతీతో నిర్వహించాలని కూడా నేను కోరుతున్నాను.

ఆర్థిక రంగంలో అక్రమాల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని నేను స్పష్టం చేస్తున్నాను. ప్రజాధనం దుర్వినియోగాన్ని ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుమతించదు. కొత్త ఆర్థిక వ్యవస్థ, కొత్త నిబంధనల ఫార్ములా మౌలిక లక్ష్యం ఇదే.

మిత్రులారా,

కొత్త ఆర్థిక వ్యవస్థ అంశం గురించి ఇక్కడ చర్చించారు. ఇక్కడ నిర్వహించిన వివిధ సెషన్లకు సంబంధించిన సమాచారం నేను సేకరించినప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో లోతైన బంధం ఉన్న ఆలోచన అది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించాలంటే లోక్ సభ, విధాన సభ ఎన్నికలు సమాంతరంగా నిర్వహించే అంశం కూడా ఇలాంటి వేదికలపై చర్చకు రావాలి. ఇది భారత్ కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దీని వల్ల విదేశీ కంపెనీలు కూడా ప్రభావితం అవుతున్నాయి. పెట్టుబడులపై ప్రభావం పడుతోంది. కొన్ని దేశాల్లో ఇలాంటి సమాంతర ఎన్నికలు జరిగే సమయం, నెల, తేదీలు కూడా ఒక్కటిగానే ఉన్నాయి. ఇలాంటి చర్య ప్రభావం ఆయా దేశాల పారిశ్రామికాభివృద్ధిపై ఉన్నదన్న విషయం కూడా ఇలాంటి వేదికలపై చర్చించాలి.

సత్పరిపాలన అందించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం, సమగ్ర ఆర్థిక, వాణిజ్య దృక్కోణం, సుస్థిర అభివృద్ధి సాధనే నవకల్పనల లక్ష్యంగా నిర్దేశించుకోవడం వంటి చర్యలన్నింటినీ ప్రపంచం బాగా అర్థం చేసుకొని భారత్ వైపు ఆకర్షితం అవుతోంది. ఆధునిక కాలం, కొత్త అంతర్జాతీయ వాతావరణంలో తొలివరుసలో నిలిచే శక్తిగా భారత్ తయారవుతోంది. టెక్నాలజీ, నవకల్పనల విభాగాల్లో ప్రపంచానికి నాయకత్వం అందించగల స్థాయిలో భారత్ ఉంది.

సరికొత్త భారత నిర్మాణాన్ని ఆచరణీయం చేయగల సామర్థ్యాలు, వనరులు మనకున్నాయి. మన అభివృద్ధి మనకొక్కరికే పరిమితం కాదు, యావత్ ప్రపంచానికి సుసంపన్నత తెస్తుంది.

మనం ఈ పవిత్ర సంకల్పాన్ని ఆచరణీయం చేసే విషయంలో మీరందరూ ముందుకు వచ్చి చేతులు కలపండి. మన ముందున్న ప్రతి సవాలును అవకాశంగా చేసుకుని న్యూ ఇండియా ను నిర్మిద్దాం.

ముగించే ముందు మీ అందరికీ మరోసారి శుభాభినందనలు తెలియచేస్తున్నాను.

అందరికీ ధన్య వాదాలు.

(కొత్త ఆర్థిక వ్యవస్థ- కొత్త నిబంధనలు అనే అంశంపై నిర్వహించిన ఇటి గ్లోబల్ బిజినెస్ సదస్సు 2018లో ప్రెజెంటేషన్ ఇది.)