Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎస్ ఎస్ పి తయారీ యూనిట్లకు కనీస స్థాయి వినియోగం నిబంధనను తొలగించి.. పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బీ ఎస్) పథకం కింద సబ్సిడీకి ఆ యూనిట్లకు అర్హతను కల్పించడం


ఎరువుల రంగంలో ప్రధానమైన సంస్కరణలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (ఎస్ ఎస్ పి) యూనిట్లకు కనీస స్థాయి వినియోగం నిబంధనను తొలగించి, పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బీ ఎస్) పథకం కింద ఆ యూనిట్లను సబ్సిడీకి అర్హమైనవిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ ప్రతిపాదన వెనువెంటనే అమలులోకి రానుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఇది కొత్తగా రూపొందించిన 2015 సంవత్సర నూతన యూరియా విధానం, ఇంకా యూరియా ఉత్పత్తి కోసం గ్యాస్ పూలింగ్ ల వంటి ఇతర విధానపరమైన సంస్కరణలకు కొనసాగింపు అని చెప్పవచ్చు. శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడంపైన, గ్యాస్ ధరల నిర్ణయ పద్ధతి క్రమబద్ధీకరణపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఫలితంగా ఈ ఏడాదిలో ఇంత వరకు అత్యంత అధిక స్థాయిలో యూరియా ఉత్పత్తిని సాధించడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 17 లక్షల ఎమ్ టి యూరియా ఉత్పత్తి ఈ సంవత్సరంలో సాధ్యపడవచ్చని భావిస్తున్నారు. ఇంతే కాకుండా, వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించడాన్ని అరికట్టేందుకు, ఉత్పాదకతను పెంపొందించేందుకు ప్రస్తుతం వంద శాతం యూరియాకు ఇప్పుడు వేప పూత పద్ధతిని ప్రవేశపెట్టారు.

అదీ కాక, సిటీ కంపోస్టును ప్రోత్సహించే విధానం మరొక ప్రధానమైన చొరవగా చెప్పాలి. నగరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న, భూమి స్వస్థతను మెరుగుపరచడం కోసం నగరాలలోని చెత్తను కంపోస్టు ఎరువుగా వినియోగించాలన్న జంట ధ్యేయాలు ఈ చొరవలో ఇమిడి ఉన్నాయి. ఈ విధానంలో భాగంగా, ఉత్పత్తి వినియోగాన్ని పెంచేందుకు మొట్టమొదటి సారి ప్రతి ఒక్క ఎమ్ టి కి రూ.1,500 మార్కెట్ అభివృద్ధి సహాయం రూపంలో అందించనున్నారు.

ఎస్ ఎస్ పి అనేది ఫాస్ఫేటిక్, మల్టి-న్యూట్రియెంట్ ఎరువు. దీనిలో 16 శాతం ఫాస్పేట్, 11 శాతం సల్ఫర్, 16 శాతం కాల్షియంతో పాటు మరి కొన్ని అత్యవసరమైన సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి. దీని ఉత్పత్తి ప్రక్రియ సులభంగా ఉండటం వల్ల, ఇది అందుబాటులో ఉన్న అత్యంత చౌక అయిన రసాయనిక ఎరువు అని చెప్పాలి. ఇది నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కాయగూరలు, చెరుకు, తోట పంటల వంటి పంటలకు మరింత ఎక్కువ అనువుగా ఉంటుంది కూడా.

01.10.2009 నాటి నుంచి ఎస్ ఎస్ పి యూనిట్లు ఒక సంవత్సర కాలంలో వాటి గుర్తింపు పొందిన ఉత్పత్తి సామర్థ్యంలో కనీసం 50 శాతం సామర్థ్యాన్ని వినియోగించడమనేది గాని, లేదా 40,000 ఎమ్ టి ఉత్పత్తి చేయడమనేది గాని.. ఈ రెండింటిలో ఏది తక్కు అయితే అది.. పాటించి సబ్సిడీకి అర్హత పొందడాన్ని తప్పనిసరి చేశారు. ఆరంభంలో కొంత సామర్థ్యం జోడింపు జరిగింది. కానీ గత నాలుగు సంవత్సరాలుగా దేశంలో ఎస్ ఎస్ పి ఉత్పత్తి, వినియోగం దరిదాపుగా స్తంభించిపోయాయి.

ఈ కనీస సామర్థ్య వినియోగ నిబంధన వల్ల- ఈ స్థాయికి చేరుకోవడంలో విఫలమైన చిన్న తరహా ఎస్ ఎస్ పి యూనిట్లలోని చాలా యూనిట్లు.. తక్కువ ఎమ్ ఆర్ పి తో రైతుకు సబ్సిడీ ప్రయోజనాన్ని బదలాయించినప్పటికీ.. కేంద్రం ఇచ్చే సబ్సిడీని అందుకోలేకపోతున్నాయి. ఈ ఆందోళన కారణంగానే అనేక యూనిట్లు ఉత్పత్తిని మొదలుపెట్టలేదు. సబ్సిడీ పొందేందుకు అర్హతను కోల్పోవడంతో ఎస్ ఎస్ పి యూనిట్లకు నిర్వహణ మూలధన సమస్యల వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురై సామర్థ్యం మేరకు ఆ యూనిట్లు పని చేయలేకపోవడం కూడా జరిగింది. తమకంటూ ఒక బ్రాండ్ ను నెలకొల్పుకోవడానికి కొంత సమయం పడుతుంది; అటువంటి సమయం దొరకకపోవడం, మార్కెట్ వాటాను పెంచుకోవాలంటే డీలర్ల నెట్వర్క్ తగినంతగా అందుబాటులోకి రాకపోవడంతో కొత్త యూనిట్లకు ఈ విధమైన ఉత్పత్తి నిబంధనను సాధించడం గగనమైపోతోంది. అదీ కాక, ఈ కనీస ఉత్పత్తి నిబంధన ఎస్ ఎస్ పి కి మాత్రమే అమలయ్యేది. ఇతర పీ&కే ఎరువులకు వర్తించేది కాదు.

కనీస సామర్థ్య వినియోగం నిబంధనను తొలగించాలన్న ఈ కొత్త విధానం ఎస్ ఎస్ పి యూనిట్లను ఇతర ఎరువుల యూనిట్ల మాదిరిగానే ఒకే ప్రమాణంపైన నిలుపుతుంది. అవి ఎంత మొత్తంలో ఎస్ ఎస్ పి ని ఉత్పత్తి చేసి, వ్యవసాయ ప్రయోజనాల కోసం విక్రయించాయన్న అంశానికి అతీతంగా- సబ్సిడీ పొందే అర్హతను సంపాదించుకొంటాయి.

ఈ కొత్త విధానం చిన్న తరహా ఎస్ ఎస్ పి యూనిట్ల పునరుద్ధరణకు దోహదపడుతుంది. ఇంకా- ఎస్ ఎస్ పిని దేశంలోనే మరింతగా ఉత్పత్తి చేయడానికి ఒక ఉత్తేజాన్ని అందించేందుకు దేశంలో కొత్త ఎస్ ఎస్ పి యూనిట్లు పుట్టుకు రావడాన్ని ఈ నూతన విధానం ప్రోత్సహిస్తుంది. మార్కెట్ అవసరాల ప్రకారం ఎస్ ఎస్ పి యూనిట్లు తాము ఎంత మేరకు ఉత్పత్తిని చేపట్టాలి అనే అంశంలో స్వేచ్ఛను కూడా ఈ విధానం ప్రసాదిస్తుంది. చాలావరకు దిగుమతి చేసుకొంటున్న డి ఎ పి కి ఒక ప్రత్యామ్నాయంగా ఎస్ ఎస్ పి ఉండగలదని భావిస్తున్నారు. ఎస్ ఎస్ పి పరిశ్రమ ఎదుగుదల దేశంలో ఫాస్ఫేటిక్ ఎరువుల ఉత్పత్తిని పెంపొందింపచేయడంతో పాటు వాటి వినియోగాన్నిసైతం పెంచగలుగుతుంది. ఎక్కువ ఖరీదైన డి ఎ పి కి కొంత వరకు ఒక ప్రత్యామ్నాయంగా ఇది వ్యవహరించగలదు.

ఇది వైవిధ్యభరితమైన సూక్ష్మ పోషక పదార్థాలకు నెలవై ఉండే మిశ్రిత ఎరువులకు ఒక పటిష్టమైన మార్కెట్ తయారు కావడాన్ని కూడా ప్రోత్సహించగలదు. తద్వారా నేలలకు సమతులమైన పాళ్లలో ఎరువులను అందించడానికీ వీలవుతుంది.

ఈ కొత్త విధానం అన్ని రకాల ఎరువులకు ఒకే విధంగా వర్తించేది అవుతుంది; సమాన అవకాశాలకో వేదికను నిర్మిస్తుంది.

***