Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏప్రిల్ 21న రాజస్థాన్‌లో ప్రధాని పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 21న రాజస్థాన్లో పర్యటిస్తారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు బలోత్రాలోని పచ్‌పద్రా వద్ద దేశంలోనే మొదటిసారి ఏర్పాటు చేసిన సమీకృత చమురుశుద్ధి, పెట్రో రసాయన కర్మాగార సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

భారత దేశ ఇంధన భద్రత, పెట్రోరసాయనాల రంగంలో సాధించిన విజయాన్ని ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సూచిస్తుంది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఏడాదికి 9 మిలియన్ల మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం ఉన్న ఈ చమురు శుద్ధి, పెట్రో రసాయనాల సముదాయాన్ని రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించారు.

 

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ సముదాయం 2.4 ఎంఎంటీపీఏల సామర్థ్యంతో చమురు శుద్ధిని, పెట్రో రసాయనాల ఉత్పత్తిని ఏకీకృతం చేస్తుంది. సామర్థ్యం, సుస్థిరతలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చమురు శుద్ధి కర్మాగారం 17.0 అధిక నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్సును కలిగి ఉంది. 26 శాతం కంటే ఎక్కువ పెట్రో రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

 

దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో, పెట్రో రసాయనాల్లో స్వయం సమృద్ధిని విస్తరించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ ప్రాంతంలో పెట్రో రసాయన, ప్లాస్టిక్ పార్కు అభివృద్ధికి అవసరమైన ప్రధాన పరిశ్రమగా పనిచేయడంతో పాటు అనుబంధ పరిశ్రమలను, అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుంది. అదనంగా, గణనీయ స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పించి.. ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ చమురుశుద్ధి కర్మాగారం సహకారం అందిస్తుంది.

 

***