Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘కర్మయోగి సాధనా సప్తాహ్’ సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

‘కర్మయోగి సాధనా సప్తాహ్’ సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం


ప్రధాన కార్యదర్శి శ్రీ పీకే మిశ్రా, కర్మయోగి భారత్ ఛైర్మన్ శ్రీ ఎస్. రామదొరై, సామర్థ్య నిర్మాణ కమిషన్ ఛైర్మన్ ఎస్ రాధా చౌహాన్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

కర్మయోగి సాధనా వారం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 21వ శతాబ్దంలో వేగంగా మారుతున్న వ్యవస్థలు, రూపాంతరం చెందుతున్న ప్రపంచంలో అదే వేగంతో భారత్ కూడా ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో కాలానికి అనుగుణంగా ప్రజాసేవను నవీకరించడం అవసరం. ఈ దిశగా చేపడుతున్న ప్రయత్నంలో ముఖ్యమైన భాగమే కర్మయోగి సాధనా వారం. నాగరిక్ దేవో భవ అనే సూత్రం ఆధారంగా ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్నామని మీ అందరికీ తెలుసు. ఈ స్ఫూర్తితోనే పౌరసేవలను మరింత సమర్థంగా మార్చేలా, ప్రజల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా దృష్టి సారించాం. పౌర కేంద్రకంగా మార్చడం ద్వారా పరిపాలనకు ఇప్పుడు కొత్త గుర్తింపు లభిస్తోంది.

మిత్రులారా,

విజయ సాధనలో ప్రధానాంశం ఇతరుల మార్గాన్ని కుదించడం కాదు. మన మార్గాన్ని విస్తరించుకోవడం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశంలో అనేక సంస్థలు వివిధ లక్ష్యాలతో పనిచేస్తున్నాయి. కానీ ప్రభుత్వంలో పని చేసే ప్రతి ఉద్యోగి, ప్రతి కర్మయోగి సామర్థ్యాలను పెంపొందించేందుకు ఒక సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ) ఆవిర్భావానికి దారి తీసింది. ఈ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఐగాట్ మిషన్ కర్మయోగితో పాటుగా ఈ కొత్త ఆరంభం మా ప్రయత్నాలకు అనేక రెట్లు శక్తినిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా ఆధునికమైన, సమర్థమైన, అంకితభావంతో కూడిన, బాధ్యతాయుతమైన కర్మయోగిల బృందాన్ని సిద్ధం చేయడంలో విజయం సాధిస్తామని విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

కొన్ని వారాల క్రితమే, సేవా తీర్థ్ ప్రారంభోత్సవం సందర్బంగా అభివృద్ధి చెందిన భారత్ సంకల్పం గురించి వివరంగా మీ అందరితో మాట్లాడాను. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మనకు వేగవంతమైన ఆర్థిక వృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన అతిపెద్ద శ్రామిక శక్తి అవసరం. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. నేటి భారతం ఎంత ఆకాంక్షాత్మకంగా ఉందో మనం చూస్తున్నాం. అనుభూతి చెందుతున్నాం. ప్రతి పౌరుడికీ తనవైన కలలు, లక్ష్యాలున్నాయి. వాటిని నెరవేర్చుకోవడంలో వారికి వీలైనంత తోడ్పాటును అందించడం మన బాధ్యత. రోజురోజుకీ ప్రజలకు జీవన సౌలభ్యాన్ని, జీవన నాణ్యతను మెరుగుపరిచేలా మన పాలన ఉండాలి. ఇదే మనకు ప్రామాణికం. దీనికోసం, ప్రతిరోజూ మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలి. కర్మయోగి స్ఫూర్తిని మీలో నింపుకోవాలి.

మిత్రులారా,

పరిపాలనపరమైన సేవల్లో సంస్కరణలు, మార్పుల గురించి మనం మాట్లాడుతున్నామంటే.. అది ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనలో మార్పు గురించి కూడా అని అర్థం. పాత వ్యవస్థల్లో అధికారిగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చేవారని మీకు తెలుసు. ఇప్పుడు, దేశం విధి నిర్వహణకే ప్రాధాన్యమిస్తోంది. ప్రాధాన్యం పనికి ఉంటుంది. పదవికి కాదు. మన బాధ్యతల ద్వారా రాజ్యాంగం మనకు హక్కులను ప్రసాదించింది. ప్రతి నిర్ణయం తీసుకొనే ముందు మీరు చేయాల్సిన పని ఏమి ఆశిస్తుందో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం దానంతట అదే అనేక రెట్లు పెరుగుతుంది. నేను మరోసారి చెబుతున్నాను. మన ప్రస్తుత ప్రయత్నాలను భవిష్యత్తు అనే కాన్వాస్‌పై మనం కచ్చితంగా చూడాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్.. ఇదే మన కాన్వాస్. అదే మన లక్ష్యం. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ రోజు మనం చేస్తున్న పని దేశాభివృద్ధి ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ ఒక్క నిర్ణయం వల్ల ఎంత మంది ప్రజల జీవితాలు మారతాయి? వ్యక్తిగత మార్పు సంస్థాగత మార్పుగా ఎలా మారుతుంది? ప్రతి ప్రయత్నంలోనూ ఈ పశ్నలు భాగం కావాలి. దీనికి చాలా శక్తి అవసరం. అలాంటి శక్తి సేవా స్ఫూర్తి నుంచే వస్తుందని నా అనుభవం ఆధారంగా నేను చెప్పగలను.

మిత్రులారా,

నేర్చుకోవడం గురించి మనం మాట్లాడుకుంటే.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాముఖ్యం బాగా పెరుగుతోంది. గడచిన 11 ఏళ్లలో ప్రభుత్వ, పరిపాలన వ్యవస్థల్లో సాంకేతికత ఎలా ఏకీకృతం అయిందో మీరంతా చూశారు. పరిపాలన, సేవల పంపిణీ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు సాంకేతిక విప్లవ శక్తిని మనం చూశాం. ఏఐ రాకతో ఈ మార్పు మరింత వేగవంతం కానుంది. కాబట్టి, సాంకేతికతను అర్థం చేసుకోవడం, దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ప్రభుత్వ సేవల్లో సమగ్ర భాగం కావాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని అర్థం చేసుకున్నవారే ఇప్పుడు ఉత్తమ అధికారులుగా, ప్రజాసేవకులుగా మారతారు. ఇది నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా మారుతుంది. కాబట్టి, ఏఐ రంగంలో సామర్థ్య నిర్మాణాన్ని సులభతరం చేయడానికి, నిరంతర అభ్యాసాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనిలో మీ భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది. ఇదే అంశానికి కర్మయోగి సాధనా వారంలో సమ ప్రాధాన్యం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

మన సమాఖ్య విధానంలో, దేశ విజయం అంటే రాష్ట్రాల సమష్టి విజయం అని అర్థం. అనేక దశాబ్దాల పాటు అభివృద్ధి  చెందిన, వెనుకబడిన, బలహీన రాష్ట్రాలు అనే వర్గీకరణను చూశాం. ఇలాంటి నిర్వచనాలకు ఇప్పుడు ముగింపు దొరికింది. రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను మనం పూడ్చాలి. ప్రతి రాష్ట్రం ఒకే స్థాయిలో పనిచేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం ఈ అంతరాలను తొలగించి మెరుగైన సమన్వయంతో, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలి. దీనికోసం, ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం మనకు అవసరం. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ విధానాన్ని స్వీకరించింనప్పుడు, ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. దీనికి హామీనిచ్చే ప్రయత్నమే కర్మయోగి సాధనా వారం.

మిత్రులారా,

సాధారణ పౌరుని దృష్టిలో ప్రభుత్వమంటే స్థానిక కార్యాలయమే అని మీరు ఎల్లప్పడూ గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని మీ పనితీరు, మీ వ్యవహార శైలే నిర్దేశిస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మనమేం చేసినా, ఏ స్థాయిలో చేసినా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మరోసారి, సామర్థ్య నిర్మాణ కమిషన్ మొత్తం బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి చెందిన భారత్ దిశగా మన ప్రయాణంలో కర్మయోగి  సాధనా వారం ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.

ధన్యవాదాలు.

నమస్కారం.

***