Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ ఓశాట్‌’ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ ఓశాట్‌’ కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


  ఎలా ఉన్నారు మీరందరూ? అంతా క్షేమమేనా? విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఉత్సాహవంతులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ‘సీజీ పవర్’ సంస్థ చైర్మన్ శ్రీ వేలయన్‌ సుబ్బయ్య, ‘రెనెసాస్ ఎలక్ట్రానిక్స్’ ప్రెసిడెంట్ కుమారి మాలిని, ‘సీజీ సెమీ’ సంస్థ చైర్మన్ శ్రీ గిరీష్ సహా ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర పారిశ్రామిక ప్రముఖులు, సోదరీసోదరులారా!

భారత్‌ ఏదైనా సంకల్పం పూనితే, దాన్ని సాధించి తీరుతుందనడానికి నేటి ఈ కార్యక్రమమే నిదర్శనం. దేశాన్ని సెమీకండక్టర్ కూడలిగా మారుస్తామని భారత్‌ ఐదేళ్ల కిందట ప్రతిజ్ఞ చేసింది. తదనుగుణంగా ‘డిజైన్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ తారక మంత్రంగా  మనం ముందుకు సాగాం. ఈ క్రమంలో ఇవాళ దేశంలోని మూడో సెమీకండక్టర్ ప్లాంటులో చిప్ ప్యాకేజింగ్ వాణిజ్య ఉత్పాదన ప్రారంభమైంది.

మిత్రులారా!

ఈ ప్లాంటు నిర్మాణానికి 2024లో శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. అటుపైన 2025 ఆగస్టుకల్లా ఇక్కడ చిప్ టెస్టింగ్ పనులు మొదలు కాగా, ఇవాళ ప్లాంటుకు ప్రారంభోత్సవం చేశాం. ఇంత స్వల్ప వ్యవధిలో శంకుస్థాపన నుంచి ఉత్పత్తి స్థాయికి చేరడం నిస్సందేహంగా సుబ్బయ్య గారి నాయకత్వం సహా అనేకమంది సహచరుల కృషి ఫలితమే. ఇప్పుడిక్కడ వేదికపైకి రాకముందు ఈ ప్రాజెక్టుతో ముడిపడిన చాలా మందితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఈ ప్రాంగణంలో నాకొక ‘సూక్ష్మ భారతం’ కనిపిస్తోంది. ఎందుకంటే- వివిధ భాషలు, ఆహార్యం, ఆహారపుటలవాట్లు గల ప్రజలు నా ముందున్నారు. ఇక ఎగ్జిబిషన్‌ సందర్శన సందర్భంగా చాలా మంది యువతీ యువకులతో కూడా నేను మాట్లాడాను. నేనిప్పుడు సగర్వంగా ప్రస్తావించాల్సిన అంశం వారి ఆత్మవిశ్వాసం. వారు మాటల్లోని దృఢత్వం, సాంకేతికతపై వారికిగల నమ్మకం నిజంగా నన్నెంతో ఆకట్టుకున్నాయి.

మిత్రులారా!

భారత్‌, జపాన్, థాయిలాండ్‌ పారిశ్రామిక భాగస్వాముల ఉమ్మడి కృషికి ఈ రోజున ప్రారంభమైన ‘సీజీ సెమీ’ ప్లాంట్ ఒక ప్రతీక. ఇది ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు.. భారత సెమీకండక్టర్ ప్రస్థానాన్ని వేగిరపరచే సాంకేతికత, విశ్వాసం, భాగస్వామ్యాలకు ఒక ఉదాహరణ. ఈ కేంద్రం కేవలం రెండేళ్లలో పునాది నుంచి ఉత్పత్తి స్థాయికి చేరడం మీరు చూశారు. ఈ రోజున మనమిక్కడ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ఏటా 200 మిలియన్ల… అంటే- లక్షలు కాదు.. 20 కోట్ల చిప్‌లు తయారవుతాయని తెలిసింది. అలాగే, ఇక్కడితో ఆగిపోరాదని.. ఏటా 5 బిలియన్‌ చిప్‌ల ఉత్పత్తికి లక్ష్యనిర్దేశం చేసుకున్నారని కూడా తెలియవచ్చింది. అంటే- నిత్యం 15 మిలియన్లకు పైగా అన్నమాట… ఈ గమ్యాన్ని మీరు త్వరలోనే చేరగలరని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ‘సెమీకాన్ ఇండియా’ కార్యక్రమం అంచెలంచెలుగా- అంటే ఒక్కో అడుగు వేస్తూ, ఒక్కో ఇటుక పేరుస్తూ, ఇవాళ ఒక్కో చిప్ తయారు చేస్తూ వేగం పుంజుకుంటున్నదని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఈ ప్రగతి వేగానికిగాను ‘సీజీ సెమీ’ బృందానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

ఈ రోజు నేనెంతో ఆనందంగా ఉన్నానని చెబితే, మీకు సందేహం కలగవచ్చు. కారణం- 20 ఏళ్ల కిందట.. బహుశా అంతకన్నా ముందే  గుజరాత్‌లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు నేను ప్రణాళిక సిద్ధం చేశాను. దీనికి అనుగుణంగా గాంధీనగర్‌లోని ప్రాంతిజ్ సమీపాన 350–400 ఎకరాల భూమిని కూడా కేటాయించాం. కొన్ని కంపెనీలతో చర్చించాం… ఆ సమయాన కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటనలతో ఆర్భాటం చేస్తూండేది. అప్పట్లో కొన్ని కంపెనీలు చర్చలకు ముందుకొచ్చినా, ఏదో కారణంతో చేతులు కట్టేసుకున్నట్లు ఉండిపోవడంతో ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో నేటి ప్రారంభోత్సవం నాకెంతో సంతోషాన్నిచ్చింది. రెండు దశాబ్దాల కిందటి నా కల సాకార కావడమే ఇందుకు కారణం. అప్పట్లో ఇలాంటి విషయాలపై దేశంలో ఎవరూ చర్చించేవారు కాదు. కాబట్టి, నేను వాటి గురించి మాట్లాడే సందర్భాల్లో మీడియా కూడా నన్ను హేళన చేసేది. ఆనాడు నేను అనుకున్నది నెరవేరకపోయినా, ఈ రోజు ఆ కల సాకారం కావడం నాకు ఎనలేని సంతృప్తినిస్తోంది. కొన్ని వారాల కిందట ఒక ఆసక్తికర వార్త నా దాకా వచ్చింది. దానికి మీడియా తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే- దేశీయంగా… గుజరాత్‌లోని వడోదరలో తయారైన ‘సి295’ రవాణా విమానం ఆ రోజున నింగికెగసింది. ఒకప్పుడు సైకిల్ ఫ్యాక్టరీని ప్రారంభించినా మిఠాయిలు పంచుకుని, సంబరం చేసుకునే వారు. అయితే, ఇవాళ మన దేశం ఏకంగా విమానాలనే తయారు చేస్తోంది.

మిత్రులారా!

ఇప్పుడు ఇక్కడున్న మీరంతా ఎంతో పరిజ్ఞానం గలవారే కాకుండా చాలా మంది యువ సహచరులు కూడా ఉన్నారు. ప్రపంచ పారిశ్రామిక చరిత్రను ఓసారి పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రపంచంలో ఎక్కడా ఒకే ఒక్క ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక శక్తి రూపొంద లేదు. పారిశ్రామిక శక్తికి పునాది (పరిశ్రమల) ‘సముదాయాల’తోనే పడుతుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, తైవాన్‌లోని ‘సిన్‌చు సైన్స్ పార్క్’, జపాన్‌లోని ‘సిలికాన్ ఐలాండ్’, ‘సుకుబా సైన్స్ సిటీ’- వగైరాలన్నీ సముదాయ ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తాయి. ఇప్పుడు గుజరాత్‌లోని సనంద్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది.

మిత్రులారా!

కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే “మైక్రాన్, కైన్స్, సీజీ జెమీ” సంస్థలు ఇక్కడ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. దేశంలో ఒక సెమీకండక్టర్ సముదాయం రూపుదిద్దుకుంటుండగా, నేడిక్కడ చిప్ ప్యాకేజింగ్ చేపట్టారు. రేపు ప్రత్యేక కంపెనీలు వస్తాయి.. రసాయనాల ఉత్పత్తి కూడా చేపడతారు. కొత్త టెస్టింగ్ లేబొరేటరీలు ఏర్పాటవుతాయి. యంత్రాలకు సేవలందించే పరిశ్రమలు వస్తాయి.. డిజైన్ కూడళ్లు ప్రారంభమవుతాయి.. అంకుర సంస్థలు పుట్టుకొస్తాయి… ఇదే పారిశ్రామిక సముదాయాల బలం! ఒక పరిశ్రమ వందలాది ఇతర పరిశ్రమలకు ఊపిరి పోస్తుంది. అవన్నీ కలగలసి సృష్టించే లక్షలాది ఉద్యోగాలతో ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థలో రూపాంతరీకరణ చోటు చేసుకుంటుంది. ఇది సనంద్‌ ప్రాంతానికి పరిమితం కాదు… దేశంలోని అనేక రాష్ట్రాల్లో సెమీకండక్టర్ సముదాయాలు ఏర్పాటవుతున్నాయి.

మిత్రులారా!

భారత సెమీకండక్టర్ రంగ పురోగమనం అందరిలోనూ నవ్యోత్సాహం నింపుతోంది. దీనిపై జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చ సాగుతోంది. చాలామంది దీన్నొక తాజా ప్రస్థానంగా పరిగణిస్తుంటారుగానీ, అది వాస్తవం కాదు… మన దేశంలో సెమీకండక్టర్ల విస్తరణ ఆకస్మిక పరిణామం కానే కాదు. గడచిన దశాబ్దం నుంచీ ఇక్కడ ఆవిష్కృతమైన ఎలక్ట్రానిక్స్ విప్లవంలో ఇది తదుపరి ముందడుగు.

మిత్రులారా!

మనం ముందుగా మొబైల్ ఫోన్ల తయారీతో దీనికి శ్రీకారం చుట్టాం. ఒకనాడు దేశీయ అవసరాల కన్నా అధికంగా స్మార్ట్‌ఫోన్లను భారత్‌ దిగుమతి చేసుకునేది. తద్భిన్నంగా ఈనాడు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి గతంతో పోలిస్తే 33 రెట్లు పెరిగింది. అంటే- 2014కు ముందు మనం ఫోన్ల దిగుమతిదారులం కాగా, మీరు నన్ను గుజరాత్ నుంచి ఢిల్లీకి పంపిన తర్వాత భారత్‌ ఎగుమతిదారుగా ఎదగడం ప్రారంభించింది. ఇక ఇవాళ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు, ఎగుమతిదారు హోదాలో మరింతగా ఎదుగుతోంది.

మిత్రులారా!

కొన్నేళ్ల కృషితో ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మొత్తాన్నీ మేం బలోపేతం చేశాం. కాబట్టే, 2014తో పోలిస్తే దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదన దాదాపు 7 రెట్లు, ఎగుమతులు ఏకంగా 11 రెట్లు పెరిగాయి.

మిత్రులారా!

అంతిమ ఉత్పత్తుల స్వావలంబనకు మాత్రమే మన కృషి పరిమితం కాదు. విడిభాగాల పరంగానూ మనం ఆ దిశగా పయనిస్తున్నాం. తదనుగుణంగా తదుపరి దశలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మాత్రమేగాక అంతర్జాతీయంగా ఆ రంగం మొత్తానికీ శక్తినివ్వగల చిప్‌ల తయారీ కూడా చేపట్టగలం. మొదట ఉత్పత్తులు, అటుపైన విడిభాగాలు, ఇవాళ సెమీకండక్టర్లు… ఇలా ఎలక్ట్రానిక్స్ విలువ వ్యవస్థ ఆసాంతం భారత్‌లోనే ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా తదుపరి దశ ఇదే. వికసిత భారత్‌ సాకారంలో వ్యూహాత్మక భవిష్యత్‌ ప్రణాళిక కూడా ఇదే!

మిత్రులారా!

కీలక ఖనిజాలు, హై-టెక్ పదార్థాలలో స్వావలంబన సాధనే సెమీకండక్టర్ వ్యవస్థలో మనం నిర్దేశించుకున్న తదుపరి దశ. సుబ్బయ్య గారు తన గుజరాతీ ప్రసంగంలో- “లక్ష్యం సాధించలేకపోవడం క్షమార్హమే గానీ, అల్ప లక్ష్యనిర్దేశం క్షంతవ్యం కాదు” అనే నానుడిని ఉటంకించారు. ఆ సామెత నా స్వభావానికి అతికినట్లు సరిపోతుంది- నేనెప్పుడూ అల్ప  లక్ష్యాలను నిర్దేశించుకోను.. నా ఆలోచనలు నేలబారుగా ఉండవు.. నేనొక విగ్రహాన్ని నిర్మిస్తే, అది ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉండాలి. సుబ్బయ్య గారు ఉటంకించినట్లు మాటల కన్నా చేతలే గొప్ప. ఇవాళ మనం చూస్తున్న పురోగతికి, మన విజయాలకు తగినట్లుగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి… అది మనందరి లక్ష్యం. భారత్‌ ఈ దిశగా విస్తృత కృషి చేస్తోంది. చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ దాకా మొత్తం దేశీయ వ్యవస్థను రూపొందించడమే మన లక్ష్యం. భారత్‌ కేవలం చిప్‌ల తయారీదారుగా మిగిలిపోకుండా ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్‌ సామర్థ్యంతో మన యువత ఇకపై ఏఐ, రోబోటిక్స్, భావితరం సాంకేతికతలలో సాంకేతిక విప్లవానికి సారథ్యం వహిస్తుంది. మన యువతరంపైనా, వారి ప్రతిబాపాటవాల మీద నాకు అపార విశ్వాసం ఉంది. నా దేశ యువత శక్తిసామర్థ్యాలపై నాకు ఎనలేని నమ్మకముంది.

మిత్రులారా!

ఈ సందర్భంగా మన యువతరానికి నేనొక అంశాన్ని నేరుగా విశదీకరించాలని భావిస్తున్నాను. ప్రపంచంలో ఏ కొత్త పారిశ్రామిక విప్లవం వచ్చినా, యువతకు అద్భుత అవకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు॥ ఐటీ విప్లవంతో లక్షలాది భారత యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ శకం కూడా వారికి లక్షలాది కొత్త అవకాశాలను కల్పించింది. ఇప్పుడీ సెమీకండక్టర్‌, ఏఐ విప్లవ శకాలు కూడా అపార అవకాశాలను చేరువ చేస్తాయి. పరిశోధన-రూపకల్పన నుంచి అంకుర ఆవిష్కరణ, సరఫరా వ్యవస్థ నిర్వహణ దాకా అవకాశాలు అంతటా… అపారంగా అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా!

వారికి కావాల్సిందల్లా కొత్త నైపుణ్యం, కొత్త ఆలోచనలు మాత్రమే. మీ దగ్గర ఓ కొత్త ఆలోచనతోపాటు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉందా అన్నదే ఇప్పుడు అత్యంత కీలకాంశం. ఈ రోజు జార్ఖండ్, బాలాఘాట్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ వాస్తవ్యులైన యువతులతో నేను మాట్లాడాను. మా సంభాషణ ‘జై జోహార్’తో మొదలైంది… నేను ఆ ప్రాంతంలో చాలాకాలం గడిపాను కాబట్టి, అది నాకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో నైపుణ్యార్జనలో ఆ యువతుల వేగం, పనుల నిర్వహణ తీరు ద్వారా నా దేశ యువశక్తి నన్నెంతో గర్వపడేలా చేసింది.

మిత్రులారా!

ఇప్పటికే ఎంతో విస్తరించిన కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో సరికొత్త నైపుణ్య-ప్రావీణ్యాల నవ లోకాన్ని మీ ముందు ఆవిష్కరిస్తుంది. కాబట్టి, భారత యువతరం ఈ అవకాశాన్ని చేజార్చుకోరాదు. ఆ దిశగా “ఆలోచన మీది.. చేయూత నాది” అని యువతరానికి నేను హామీ ఇస్తున్నాను.

మిత్రులారా!

భారత యువతరం కొత్త అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నదో ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసిన ఈ ప్లాంటు రుజువు చేస్తోంది. నేను చెప్పినట్లు- జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సహా మొత్తం గిరిజన ప్రాంతం నుంచి ఇక్కడ పనిచేస్తున్న అక్కచెల్లెళ్లు, కూతుళ్లు నాకు ఈ ఫ్యాక్టరీని చూపుతూ ఎంతో ఉత్సాహంతో విశేషాలన్నిటినీ వివరించారు. వారి కుటుంబాలు, చదివిన పాఠశాలలు, ఐటీఐ విద్య.. వగైరాలన్నీ సాధారణమైనవే. తమ బిడ్డలు ‘ఐటీఐ’లో చేరాల్సి వస్తే, ఇతరులకు ఆ మాట చెప్పడం కూడా తల్లిదండ్రులెవరికీ ఇష్టం ఉండదు. అలా చెప్పాల్సి వస్తే వారెంతో ఇబ్బంది పడతారు. అయితే, కాలం మారింది.. ఇది ఐటీఐ పట్టభద్రుల యుగం. వారి విద్య ‘ఐటీఐ’ స్థాయిలోనిదే కావచ్చుగానీ, వారి కలలు మాత్రం అసాధారణమైనవే. ఈ కుమార్తెల కుటుంబాల్లో చాలామంది పాస్‌పోర్టు తీసుకోవడం కాదు కదా… అసలు చూసిందే లేదు.

కొందరైతే విదేశాలకు వెళ్లే మాట అటుంచి, ఢిల్లీ లేదా ముంబయి నగరాన్ని కూడా సందర్శించిన వారు కాదు. అయితే, వారి కుటుంబాల నుంచి ఈ కుమార్తెలు శిక్షణ కోసం మలేషియా వెళ్లి, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సెమీకండక్టర్ సాంకేతికతను అభ్యసించారు. తద్వారా వారు ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్ తయారీలో భాగస్వాములు కాగలిగారు. ఈ కుమార్తెల జీవన విశేషాలపై సుబ్బయ్య గారు ఓసారి ఢిల్లీలో నాకు మూడు నిమిషాల వీడియో చూపించడం నాకింకా గుర్తుంది. వారు అడవుల్లో ఎలా జీవించారో…   మంచాల మీద కూర్చుని ఎలా చదువుకున్నారో.. అటుపైన మలేషియా వెళ్లడం కోసం విమానాశ్రయంలో తనిఖీ కోసం నిలబడి, ఇమ్మిగ్రేషన్ తంతును ఎలా పూర్తి చేసుకున్నారో అందులో చూశాను. గుజరాత్‌కు వచ్చినప్పుడల్లా వారిని లోక్‌భవన్‌కు ఆహ్వానించి,  ముచ్చటిస్తానని కూడా ఆయనకు ఆ రోజునే చెప్పాను. కానీ, చాలాకాలం పాటు అది కుదరలేదు… చివరకు ఇవాళ అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో సుబ్బయ్య గారికి ధన్యవాదాలు.. ఈ కుమార్తెలకు, వారి కుటుంబాలకు అభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

దేశాన్ని ‘వికసిత భారత్‌’గా రూపుదిద్దడం కోసం మనమంతా ఎంత తపన పడుతున్నామో చెప్పడానికి నేటి ఈ కార్యక్రమమే ఒక ఉదాహరణ. దేశంలో 2026 నాటికి 4 సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఈ ఏడాది ఆరంభంలోనే చెప్పాను. అయితే, అవి నాలుగు కాదు… 5 అని మా మంత్రిగారు గుర్తుచేశారు. అంటే- కేవలం 6 నెలల్లోనే 3 ప్రాజెక్టులలో ఉత్పాదన ప్రారంభం కావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. నేటి భారతం ఇలా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాకుండా, వాటిని నిర్ణీత వ్యవధిలో సాకారం చేయగలదని దీన్నిబట్టి రుజువవుతోంది. మన విధానాలు సుస్థిరం.. నిర్ణయాలు సుస్పష్టం.. మన అమలు ప్రక్రియ జోరు అపారం… ప్రపంచానికి, ప్రతి పెట్టుబడిదారుకూ భారత్‌ ఇస్తున్న భరోసా ఇదే! అదేవిధంగా ‘సీజీ సెమీ’ యాజమాన్యానికి, ఇతర పెట్టుబడిదారులకూ హామీ ఇస్తున్నాను.

భారత్‌ ఎంచుకున్న సంస్కరణల మార్గంలో మన ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ మరింత వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా వాణిజ్య సౌలభ్యం విషయంలో నేటి భారత్‌ పూర్తి నిబద్ధతతో ఉంది. కాబట్టి, 140 కోట్ల మంది భారతీయులు 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్‌గా రూపుదిద్దడం ఖాయం. అలాగే, ఇవాళ 18-20 ఏళ్ల వయస్కులైన యువతరానికి నాదొక మాట.. మీరు 40-45 ఏళ్లకు చేరేసరికి, మీ పిల్లలు వికసిత భారత్‌లో పెరిగేలా చూడటం కోసం నేను కఠోరంగా శ్రమిస్తున్నాను. అంటే- మీ పిల్లల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నానని మాట ఇస్తున్నాను.

మిత్రులారా!

మనమివాళ అభివృద్ధి పథంలో పయనిస్తూ, సరికొత్త ప్రగతి శిఖరాలను అధిరోహిస్తున్నాం. ఈ ప్రస్థానంలో సెమీకండక్టర్ రంగం ఒక గొప్ప శక్తిగా రూపొందుతూ, ఎంతో  ఆత్మవిశ్వాసం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు… సమున్నత లక్ష్యాలతో ముందడుగు వేయండి. లక్ష్య సాధనలో ఏవైనా సవాళ్లు ఎదురైతే అప్పుడు చూసుకుందాం… ఏదేమైనా, మనం కచ్చితంగా ముందుకే సాగాలి. ఈ సందర్భంగా మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు.. ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే

***