Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యానికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం


ఇక్క‌డకు పెద్ద సంఖ్య‌లో తరలివచ్చిన సురేంద్ర న‌గ‌ర్‌ జిల్లాకు చెందిన ప్రియమైన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఇక్క‌డ ఏదో ఒక రోజున విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తార‌ని చోటిలా ప్ర‌జ‌లు ఊహించి ఉంటారా ? సురేంద్ర న‌గ‌ర్ జిల్లా వాసులు ఏనాడైనా ఇటువంటి దానిని తలచుకొన్నారా ? ఇక్క‌డ విమానాశ్ర‌యాన్ని కడుతుండటాన్ని మీరు శుభమని భావించ‌డం లేదా ? ఇక‌్క‌డ
విమానాశ్ర‌యాన్ని నిర్మించాలా, నిర్మించవ‌ద్దా, చెప్పండి ? ఇక‌్క‌డ విమానాశ్ర‌యం నిర్మాణం జరిగితే, ఇక్కడ నుండి విమానాలు వినువీధిలోకి పయనిస్తూ ఉంటే అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ు అన్నీ ఇక్కడ అందుబాటు లోకి వ‌స్తే దానిని అభివృద్ధి అని అంటారా అనరా ? మీరు ఈ తరహా అభివృద్ధిని ఇష్ట‌ప‌డ‌తారా ? అభివృద్ధి జ‌ర‌గాలా ? అభివృద్ధి అవ‌స‌ర‌మా ? అభివృద్ధి గుజ‌రాత్ యొక్క భ‌విష్య‌త్తును మారుస్తుందా ? మీ పిల్ల‌ల భ‌విష్య‌త్తును ఇది మార్చగలదా ? మ‌ంచిది అదే చేద్దాం.

మీరు నిరుపేద‌ను అడ‌గండి, ఇల్లంటూ లేనటువంటి అతడిని ఇల్లు అతడికి కావాలా అని అడిగిచూడండి. అతడు బదులిస్తాడు.. అవును కావాలి అంటూ. అత‌డికి ఒక గృహాన్ని స‌మ‌కూర్చాలంటే, దానికి స‌దుపాయాలు క‌ల్పించాలంటే, అభివృద్ధి జ‌ర‌గ‌కుండా ఇది సాధ్యం కాదు. గ‌తంలో కూడా అభివృద్ధి జ‌రిగేది. అయితే అప్ప‌ట్లో రాజ‌కీయ నాయ‌కులు ఒక గ్రామంలో చేతి పంపు వేస్తే, రాగ‌ల మూడు ఎన్నిక‌ల వ‌ర‌కు నేను మీ ప్రాంతంలో చేతి పంపును వేయించినందుకుగాను ద‌య‌చేసి ఎన్నిక‌ల‌లో నాకు మ‌ద్ద‌తివ్వండి అంటూ కోరుకొనే వారు. మీ ప్రాంతంలో అభివృద్ధి ప‌నులు చేసినందుకుగాను ఎన్నిక‌ల‌లో గెలిపించాలని కోరే వారు. అదేమిటి ? ఒక చేతి పంపు ను ఏర్పాటు చేయడం, నీటి కోసం వేసిన చేతిపంపు. ఇదీ అభివృద్ధి నిర్వ‌చ‌నం.. అలా ఉండేది.

ఇవాళ‌, న‌ర్మ‌ద న‌ది జ‌లాల‌ను ఒక పెద్ద గొట్టపుమార్గాన్ని నిర్మించడం ద్వారా ప్ర‌తి గ్రామానికి , ప్ర‌తి ఇంటికి మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న ప్ర‌భుత్వం ఉంది. న‌ర్మ‌ద ప‌థ‌కం కింద గుజ‌రాత్ మొత్తం మీద గ‌రిష్ఠంగా ప్ర‌యోజ‌నం పొంద‌నున్న జిల్లా ఉందంటే అది.. ఆ జిల్లా
పేరు ఏమిటో చెప్పండి.. దాని పేరేమిటి ? ఆ జిల్లా మ‌రేదో కాదు సురేంద్ర న‌గ‌ర్‌. న‌ర్మ‌ద మాత జ‌లాలతో బంజరు నేలను స‌స్య‌ శ్యామ‌లం చేసి, మీకు సంతోషాన్ని పంచివ్వడానికి మీ ముంగిటకు వ‌చ్చి నిలచింది. న‌ర్మ‌ద జ‌లాల ప్ర‌భావం కేవ‌లం గ్రామీణ‌ వ్య‌వ‌సాయ రంగానికొక్కదానికే ప‌రిమితం కాదు. న‌ర్మ‌ద నీటికి గొప్ప‌ శ‌క్తి ఉంది. ఈ జ‌లాల కార‌ణంగానే సురేంద్ర‌ న‌గ‌ర్‌ జిల్లా రానున్న రోజుల‌లో పారిశ్రామిక అబివృద్ధికి పెద్ద కూడ‌లిగా మార‌నుంది. సురేంద్ర‌ న‌గ‌ర్ జిల్లాలో గ‌రిష్ఠ‌ స్థాయిలో ఉపాధి అవ‌కాశాలు రానున్నాయి. గొప్ప విద్యా కేంద్రంగా ఇది విల‌సిల్ల‌నుంది. నీరు పుష్క‌లంగా అందుబాటులో ఉంటే వ్య‌వ‌స్థ‌ల‌ను అభివృద్ధి చేసే ప్ర‌భుత్వ సామ‌ర్ద్యం కూడా పెరుగుతుంది. ఇక్క‌డ నిర్మించ‌బోయే విమానాశ్ర‌యం కూడా ఇలాగే అభివృద్ధికి దోహ‌ద‌ప‌డ‌నుంది. రాగ‌ల రోజుల‌లో సురేంద్ర‌ న‌గ‌ర్‌ జిల్లా, రాజ్‌ కోట్ జిల్లా లేదా మోర్బి జిల్లాల మ‌ధ్య అభివృద్ధిలో పోటీ పెరగనుంది. ఎవ‌రు, ఎవ‌రి కంటే అభివృద్ధిలో ముందుంటారో ? ఇది ఆరోగ్య‌క‌ర‌మైన స్పర్థ కానుంది. అందుకే రాజ్‌కోట్‌, సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లాల‌కు మ‌ధ్యలో అభివృద్ధికి అద్భుత అవ‌కాశాలు ఉన్న‌ ప్ర‌దేశంలో వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో విమానాశ్రయ నిర్మాణానికి ప్ర‌భుత్వం ఈరోజు శంకుస్థాప‌న చేస్తోంది. ఇది కూడా కొంత‌మందికి న‌చ్చ‌దు. వారిని మీరు విమానంలో ఎందుకు ప్ర‌యాణిస్తారు, బ‌స్సులో ప్ర‌యాణించండి అని ఎవ‌రైనా అడిగితే, త్వ‌ర‌గా గ‌మ్య‌స్థానానికి చేర‌డానికి విమానంలో వెళుతున్నామ‌ని బ‌దులిస్తారు. అంటే వాళ్లు మాత్ర‌మే త్వ‌ర‌గా వెళ్లాలి, ఇక మిగ‌తా ప్ర‌జ‌లంతా త్వ‌ర‌గా వెళ్లవలసిన అవ‌స‌రం
లేద‌న్న‌ మాట‌!

రాజులు మాత్ర‌మే విమానాల‌లో ప్ర‌యాణించే రోజులు కావివి. అందుకే నేను చెప్పాను.. ఈ దేశంలో హ‌వాయ్‌ చెప్పులు (స్లిప్ప‌ర్లు) వేసుకుని తిరిగే వారు కూడా విమానంలో ప్ర‌యాణించగల స్థితికి దేశ విమాన‌యాన రంగాన్ని అభివృద్ధి చేయాల‌ని నేను అనుకుంటున్నాను. ఇది చూసి మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విమాన‌యాన రంగం ఎంతో ప్రాధాన్య‌ాన్ని సంత‌రించుకొంటోంది. అయినా భారతదేశంలో స్వాతంత్ర్యం అనంతరం విమాన‌యాన రంగ విధానమేదీ రూపుదిద్దుకోలేదు. మీరు ఎప్పుడైనా దీనిని ఆలోచించారా ? భార‌త ప్ర‌భుత్వానికి ఏవియేష‌న్ పాలిసీ ఉండేది కాదు. మేం ప్ర‌భుత్వం ఏర్పాటు చేశాక‌ విమాన‌యాన విధానాన్ని రూపొందించాం. అది కేవ‌లం అహమదాబాద్‌, ముంబయి, చెన్నై ల వంటి పెద్ద న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు. చిన్న ప‌ట్ట‌ణాల‌కు కూడా విమాన స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకొన్నాం. ప్ర‌యాణ స‌దుపాయం లేని దూర‌ప్రాంతాల‌కు, ఆ ప్రాంతానికి విమాన ప్ర‌యాణం గంట‌కు పైగా ప‌ట్టే సందర్భంలో, అలాగే గంట‌కు లోపు ప‌ట్టే ప్రాంతాల విష‌యంలో టికెట్టు ధ‌రను 2,500 రూపాయ‌లుగా నిర్ణ‌యించి ఏవియేష‌న్ రంగాన్ని బ‌లోపేతం చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మార్గాలు కార్య‌రూపం దాల్చాయి. గుజ‌రాత్‌లోని కాండ్లా, మిఠాపుర్ లు దీనితో ల‌బ్ధిని పొంద‌నున్నాయి. ఈ విధానం వ‌ల్ల భ‌విష్య‌త్తులో విమాన ప్ర‌యాణ స‌దుపాయం చిన్న ప్రాంతాల‌కు కూడా అందుబాటులోకి వ‌స్తుంది. ఇవాళ‌, భార‌త‌దేశం లోని చాలా రాష్ట్రాల‌లో రెండు లేదా మూడు విమానాశ్ర‌యాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు ఉన్నాయి. కానీ ఇక ముందు 10 నుండి 15, లేదా 20 విమానాశ్ర‌యాలు అందుబాటులోకి రానున్నాయి. అందువ‌ల్ల విమాన ప్ర‌యాణికుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూ వ‌స్తోంది. విమాన ప్ర‌యాణికుల సంఖ్య 14 శాతం పెరిగిన‌ట్టు తాజా స‌మాచారం తెలియ‌జేస్తోంది. రాజ్‌కోట్‌లో నిర్మించ‌నున్న‌ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యం నిర్మాణం సంద‌ర్భంగా నేను గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌ను, ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌ను అభినందిస్తున్నాను. ఇంత‌పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి రైతుల నుంచి కేవ‌లం 4 శాతం భూమిని మాత్ర‌మే సేక‌రించారు. కేవ‌లం 4 శాతం మాత్ర‌మే. మిగిలిన 96 శాతం భూమి బీడు భూమి, ఆ భూమిలో విమానాశ్ర‌యం నిర్మించ‌నున్నాం. ఆ ర‌కంగా సురేంద్ర‌న‌గ‌ర్‌ లోని వ్య‌వ‌సాయ భూముల‌కు బ‌దులుగా, బీడు భూముల‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశాం. విమానాశ్ర‌యానికి దీనిని వినియోగిస్తున్నాం. విజ‌య్‌ భాయ్ మాట్లాడుతూ రాజ్‌కోట్ విమానాశ్ర‌య హ‌ద్దుల గురించి ప్ర‌స్తావించారు. బ‌స్టాండ్ నుండి కూడా రాజ్‌కోట్ విమానాశ్ర‌యం హ‌ద్దులు క‌నిపిస్తాయి. అందువ‌ల్ల మొత్తం రాజ్‌కోట్ అభివృద్ధి చెంద‌నుంది. భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకు చూసిన‌ట్ట‌యితే, ఈ ప్రాంతం నుండి అంత‌ర్జాతీయ‌విమాన సేవ‌ల‌కు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. ఎవ‌రైనా ప్ర‌పంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లాల‌న్నా చోటిలా, రాజ్‌కోట్‌ల మ‌ధ్య ఉన్న ఈ విమానాశ్ర‌యం నుండి వెళ్లేందుకు దీనిని ఉప‌యోగించుకోనున్నారు. అంత‌టి ముఖ్య‌మైన అంశానికి
సంబంధించిన కార్య‌క్ర‌మం ఈరోజు ఇక్క‌డ‌ జ‌రుగుతోంది.

మ‌నం ఈరోజు సురేంద్ర‌న‌గ‌ర్‌, వాధ్వాన్‌ ల‌లో మ‌రో రెండు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటున్నాం. సూర్‌- సాగ‌ర్‌, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు భ‌విష్య‌త్తులో ఇది ఒక ఆనంద సాగ‌రంగా మార‌నుంది. నీరు సమృద్ధిగా అందుబాటులోకి వ‌స్తుండ‌డంతో ప‌శుగ‌ణాభివృద్ధి జ‌ర‌గ‌నుంది. త‌ల‌స‌రి పాల ఉత్ప‌త్తిని కూడా పెంచ‌నున్నారు. మ‌న సూర్ – సాగ‌ర్ పాల కేంద్రం.. ఐదు- ఏడు సంవ‌త్స‌రాల క్రితం మాట‌.. ఇంత‌కుముందు ప్ర‌భుత్వం డెయిరీల ఏర్పాటును నిషేధించింది. ఇలా ఎందుకు చేశారో అని నాకు ఆశ్చ‌ర్యం వేస్తోంది. నేను ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు, డెయిరీలు ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌చ్చే వారికి ప్ర‌భుత్వం నుండి సాయం అందిస్తామ‌ని చెప్పాను. ఇవాళ సౌరాష్ట్ర‌లోని ప్ర‌తి జిల్లాలో పాల ఉత్ప‌త్తి కేంద్రాలు ఉత్సాహంతో ప‌నిచేస్తున్నాయి. ప‌శువుల‌ను పెంచేవారికి ఇంత‌కు మించిన మేలు మ‌రొక‌టి ఉండ‌దు. వారు పాల‌కు త‌గిన ధ‌ర పొందాలి. ఇవాళ ఒక ప్లాంటు ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. ఈ సూర్- సాగ‌ర్‌, న‌ర్మ‌ద వ‌చ్చిన త‌రువాత పాల ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెర‌గ‌నుంది. నిజానికి ఇది సురేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు ఆనంద సాగ‌రం. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ సుఖ సంతోషాలు క‌ల‌గాల‌ని శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.

ధొరిధాజ ఆనకట్ట, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, న‌ర్మ‌ద న‌ది జలాలను ధొరిధాజ డ్యామ్‌ లోకి స్వాగ‌తించేందుకు నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. అప్పుడు జిల్లా వాసులంతా ఎంతో ఆనందించారు. గొంతు ఎండిపోతున్న వ్య‌క్తికి మాత్ర‌మే నీటి విలువ తెలుస్తుంది. క‌చ్ఛ్,
సౌరాష్ట్ర‌ మరియు గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు నీటి విలువ ఏమిటో బాగా తెలుసు. గ‌తంలో వాధ్వాన్‌ లో నీటిని 15- 20 రోజులకు ఒక‌సారి స‌ర‌ఫ‌రా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎవ‌రైనా బంధువులు త‌మ ఇంటికి వ‌స్తామంటే మ‌ధ్యాహ్న‌ం పూట‌ ర‌మ్మ‌ని చెప్పవలసివచ్చేది. ముందు రోజు రాత్రే వారు ఇంటికి వ‌స్తే, మ‌రుస‌టి రోజు ఉద‌యం స్నానాల‌కు వారికి నీటిని అందుబాటులో ఉంచ‌లేని ప‌రిస్థితులు ఉండేవి. ఈ ప్రాంతం ఇటువంటి ప‌రిస్థితుల‌ను చూసింది. కానీ ఇవాళ‌, వాధ్వాన్‌ న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు నీటిని సుల‌భంగా చేర‌వేసేందుకు 300- 350 కిలోమీట‌ర్ల పొడ‌వైన గొట్టపు మార్గాలు వేయ‌డం జ‌రిగింది. కొత్త‌గా నిర్మించిన మంచినీటి ట్యాంకు, ర‌క్షిత మంచినీటి ప‌థ‌కం, వీటన్నింటి కార‌ణంగా ఈ ప్రాంత సోద‌రీమ‌ణులు ఎన్ని ఆశీస్సులను అందించినప్పటికీ చాలవని నేను నమ్ముతాను. ఈ సోద‌రీమ‌ణులు- ఎవరైతే క‌ష్టాల నుండి విముక్తిని పొందారో- అందుకుగాను వారు ఎన్ని దీవెనలను అంద‌జేసినా అవి సరిపోవు. ఇవాళ‌, మోర్బీ వెంట తాజాగా రోడ్డు పునర్నిర్మాణ ప‌నులు, అహమదాబాద్‌, రాజ్‌కోట్‌ ల మ‌ధ్య రోడ్డు విస్తరణ ప‌నులను గురించి చెప్పుకొంటే, ఈ త‌రం వారు దీనిని సుల‌భంగా గ్ర‌హించ‌లేక‌పోవ‌చ్చు గాని, మీకు స‌మ‌యం ఉంటే కాస్త వెనుక‌టి రోజుల‌లో- అంటే బిజెపి అధికారంలో లేని రోజుల‌లో- ప‌రిస్థితులు ఎలా ఉండేవో ప‌త్రిక‌లలో చ‌దివి గ్ర‌హించండి. రాజ్‌కోట్‌- అహమదాబాద్ జాతీయ‌ ర‌హ‌దారిపై వారంలో క‌నీసం నాలుగు సార్లు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగేవి. ఎంద‌రో త‌ల్లులు చిన్న‌ వ‌య‌స్సు లోని త‌మ బిడ్డ‌ల‌ను కోల్పోయారు. కుటుంబాలు ధ్వంసమైపోయాయి. ఒక సంవ‌త్స‌రంలో వంద కు పైగా పెద్ద ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉండేవి. రోడ్డు ఇరుకుగా ఉన్నందువ‌ల్లే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతూ వ‌చ్చాయి. నాకు ఇప్ప‌టికీ బాగా గుర్తు.. ఆ రోజుల‌లో నేను రాజ్‌క‌ర‌ణ్‌లో లేను. మాకు లింబాడి- బాగ్ డోగ్ రాల‌ నుండి ఫోన్ లు వ‌చ్చేవి. ఆ రోజుల‌లో మొబైల్ ఫోన్ లు లేవు; పాత ర‌కం ఫోన్ లు ఉండేవి. ఏదైనా పెద్ద ప్ర‌మాదం జ‌రిగితే, నేను అశోక్‌ భాయ్‌ ని అహమదాబాద్‌ నుండి పంపే వాడిని. వారంలో రెండు నుండి నాలుగు సార్లు మేం ఇలా పంపవలసి వ‌చ్చేది. మీరు రాజ్‌కోట్ ప్ర‌జ‌ల‌ను అడిగితే, లేదా సురేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌ను అడిగితే, ఎన్నో కుటుంబాల వారు త‌మ స‌న్నిహితుల‌ను రోడ్డు ప్ర‌మాదాల‌లో కోల్పోయామ‌ని చెబుతుంటారు.

1995 లో బిజెపి ప్ర‌భుత్వం ఏర్ప‌డి కేశూభాయ్ గారు ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే, తీసుకొన్న నిర్ణ‌యం ఏమిటంటే, రోడ్డు ప్ర‌మాదాల‌లో అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు పోకుండా ర‌క్షించేందుకు రోడ్ల నిర్మాణం చేప‌ట్ట‌ాలని. ఈ ప‌నిని బిజెపి ప్ర‌భుత్వం చేసింది. ఫ‌లితంగా రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గాయి. ఇవాళ వాహనాల రాకపోకలు కూడా పెరిగాయి. ఏ ప్రాంత‌మైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లు, జాతీయ ర‌హ‌దారులు అవ‌స‌రం క‌నుక ఆధునిక ఆరు దోవల ర‌హ‌దారిని నిర్మించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ప్ర‌గ‌తి జ‌ర‌గాలంటే వేగం అవ‌స‌రం. వేగం త‌ప్ప‌నిస‌రి. అయితే అది విమానాశ్ర‌యం నిర్మాణం కానివ్వండి, రోడ్లు వెడ‌ల్పు చేయ‌డం కానివ్వండి, మనం వీటిపై ఏక కాలంలో దృష్టి పెట్టాలి. మోర్బి వైపు రోడ్డు నిర్మాణం లేదా మోర్బికి వెళ్లే రోడ్డును వెడ‌ల్పు చేయ‌డం అంటే పారిశ్రామిక కార్య‌క‌లాపాల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే. క‌చ్ఛ్ వ‌ర‌కు పారిశ్రామిక ప్రాంతాన్నిఅభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. ఈ వ్య‌వ‌స్థ దీనికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

అలాగే ఇవాళ పంచాల్ పంథ‌క్‌ లో ఐదు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వం పంచాల్ పంథ‌క్ ను యాత్రా స్థ‌లంగా అభివృద్ధిపరచేందుకు ప్రాధాన్య‌మిస్తోంది. దీనివ‌ల్ల చొటిలా దేవ‌త చాముండా దేవి, త్రినేత్రేశ్వ‌ర్ తార్నేతర్‌ , సుంద‌రీ భ‌వాని, సూర‌జ్ దేవ‌ల్‌, బండియావేలి, జారియా మ‌హాదేవ్‌, గేబినాథ్‌, అవ‌లియాథాక‌ర్‌, ఇవ‌న్నీ పంచాల్ పాంథ‌క్ ప్రాంతంలోని మ‌న ఆధ్యాత్మిక స్థలాలు. ఈ ప్ర‌దేశాల అభివృద్ధికి గుజ‌రాత్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌డుతోంది. వీటిలో ప్ర‌తి దానిని యాత్రాధామ్‌గా క‌లుపుతోంది. విదేశీ ప‌ర్యాట‌కుల‌ను తార్నేతార్ ఉత్స‌వానికి ఎలా ర‌ప్పించాలా అని ఆలోచ‌న చేస్తున్నాం. చొటిలాలో విమానాశ్ర‌యం పూర్త‌యితే తార్నేత‌ర్ ఉత్స‌వాన్నిఅంత‌ర్జాతీయ ఉత్స‌వంగా తీర్చిదిద్దేందుకు ఏమంత స‌మ‌యం ప‌ట్ట‌దు. ఆ ర‌కంగా అభివృద్ధి ప‌నులు నేరుగా ఆర్ధిక‌ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన‌వి. ఇది ఆర్థిక ప్ర‌గ‌తికి దోహ‌ద‌ప‌డుతుంది. ఈ స్ప‌ష్ట‌మైన విధానంతో భార‌త ప్ర‌భుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ప్ర‌గ‌తి ప్ర‌స్థానంపై దృష్టి పెడుతోంది. ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి గుజ‌రాత్ ప్ర‌భుత్వం చోద‌క శ‌క్తిగా నిలుస్తుండ‌డాన్ని, ప్ర‌గ‌తి ప్ర‌యాణానికి కొత్త కోణాలు జోడిస్తుండ‌డాన్ని నేను స్వాగ‌తిస్తున్నాను. ఇవాళ మ‌నం అభివృద్ధి చెందిన గుజ‌రాత్, ఆధునిక‌, సుసంప‌న్న గుజ‌రాత్‌ సాధ‌న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నాం.

2022 వ సంవ‌త్స‌రం నాటికి మ‌నం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాం. 2022కు ఇక మ‌న‌కు ఐదు సంవ‌త్స‌రాల స‌మ‌య‌మే ఉంది. ఈ ఐదు సంవ‌త్స‌రాల‌లో ఈ దేశంలోని ప్ర‌తి పౌరుడూ దేశం కోసం తాను ఏం చేయ‌ద‌ల‌చుకుంటున్నాడో నిర్ణ‌యించుకోవాలి. ప్ర‌భుత్వ‌మో, నగరపాలక సంస్థో, లేక‌ ఎవ‌రో ఏదో చేయాల‌నే విధంగా కాకుండా నేను ఈ ప‌నిచేస్తాను అనే విధంగా ఉండాలి. నా దేశం కోసం రాగ‌ల ఐదు సంవ‌త్స‌రాల‌లో నేను ఈ ప‌ని చేస్తాను అనే సంక‌ల్పం ఉండాలి. దేశంలోని ప్ర‌తి పౌరుడూ ఇలాంటి సంక‌ల్పం చెప్పుకోవాలి. సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లాలో పంటలు పుష్క‌లంగా పండేందుకు అవ‌కాశం ఉంది, న‌ర్మ‌ద న‌ది మ‌న ముంగిట‌కు త‌ర‌లి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంలో సురేంద్ర‌న‌గ‌ర్‌జిల్లాలో ఏ పొలం కూడా బిందు సేద్యం సౌక‌ర్యం లేకుండా ఉండ‌రాద‌ని నేను కోరుకొంటున్నాను. బిందు సేద్య ప‌ద్ధ‌తుల‌ను,తుంప‌ర సేద్యం, సూక్ష్మ సేద్య ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించ‌డం ద్వారా మ‌న వ్య‌వ‌సాయంలో ఆధునిక‌ ప‌ద్ధ‌తుల‌ను వాడుదాం. సురేంద్ర‌న‌గ‌ర్‌జిల్లా వాసులు బిందుసేద్యాన్ని అల‌వ‌ర‌చుకొంటే వ‌చ్చే మ‌నం విప్ల‌వాత్మ‌క‌ మార్పును సాధించ‌వ‌చ్చు. దీనివ‌ల్ల న‌ర్మ‌దాన‌దీ జ‌లాల‌ను ఎంతో పొదుపుగా వాడుకోవ‌డానికి వీలు క‌లుగుతుంది. నీళ్లు అంటే గుజ‌రాత్‌కు జ‌న‌న మ‌ర‌ణ స‌మ‌స్య‌తో స‌మానం. నీరు అందుబాటులో ఉంటే వాటిని మ‌నం మ‌న జీవితం కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తాం. చుక్క‌ నీటిని కూడా మ‌నం వృథా చేయ‌రాదు. వీటిని స‌క్ర‌మంగా వినియోగించ‌కుండా ఉండ‌రాదు. ఇది గుజ‌రాత్‌ లోని ప్ర‌తి పౌరుడి బాధ్య‌త.

2022లో మ‌నం 75 సంవ‌త్స‌రాల స్వాతంత్ర్య‌ సంబ‌రాలను జ‌రుపుకొంటాం. ఆ సంద‌ర్భానికి సంబంధించి మ‌నం ప్ర‌తిజ్ఞ చేయాలి. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌డానికి సంబంధించిన ఈ ప్ర‌తిజ్ఞ విష‌యంలో సూక్ష్మ నీటిపారుద‌ల‌, బిందు సేద్యం, తుంప‌ర సేద్యం, ఆధునిక శాస్త్ర‌ సాంకేతిక ప‌ద్ధ‌తుల వినియోగం వంటివి కీల‌క పాత్ర పోషించ‌నున్నాయి.

ఇంత పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డ‌కు విచ్చేసి నాపై అప‌రిమిత ప్రేమను, వాత్స‌ల్యాన్ని కనబరచి, న‌న్ను ఆశీర్వ‌దించిన మీ అంద‌రికీ నేను మరొక్క మారు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ను వ్యక్తం చేస్తున్నాను. పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డ‌ గుమికూడిన‌ ప్ర‌జ‌ల‌ను, చొటిలా నుండి నేను చూస్తున్నంత వరకు క‌నుచూపు మేర‌లో ఎటు చూసినా జ‌న‌మే క‌న‌ప‌డుతున్నారు.

‘భార‌త్ మాతా కీ జయ్’

దయచేసి మీరంతా మీ పూర్తి శక్తితో పిడికిళ్లు బిగించి బిగ్గ‌ర‌గా నిన‌దించండి ఇలా..

‘భార‌త్ మాతా కీ జయ్’

‘భార‌త్ మాతా కీ జయ్’

‘భార‌త్ మాతా కీ జయ్’

***