పిఎంఇండియా
ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి ఎమ్ ఎస్ ఎస్ వై)లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కొత్తగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
గోరఖ్ పూర్ లో నూతన ఎయిమ్స్ ను ఏర్పాటు చేయడానికి రూ.1,011 కోట్లు ఖర్చవుతుంది. ఈ వ్యయ అంచనా లో పునరావృత్తమయ్యే ఖర్చు (వేతనాలు మరియు జీతాలు, ఇంకా కార్యకలాపాలు, నిర్వహణ సంబంధ ఖర్చులు) కలపలేదు. వీటిని అదనంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బడ్జెట్ కింద చెల్లిస్తారు. పదే పదే వచ్చే ఈ వ్యయాలను సంబంధిత కొత్త ఎయిమ్స్ వాటి వార్షిక బడ్జెటులలో నుండి భరించగలవు. ఇందుకోసం వైద్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ యొక్క పిఎమ్ ఎస్ ఎస్ వై ప్లాన్ బడ్జెట్ హెడ్ నుండి ఆర్థిక సహాయం రూపంలో అందజేస్తారు.
ఎయిమ్స్ లో 750 పడకల సామర్థ్యం కలిగివుండే ఒక ఆసుపత్రిని నెలకొల్పుతారు. . అందులో ఎమర్జన్సీ/ ట్రామ పడకలు, ఆయుష్ పడకలు, ప్రైవేటు పడకలు, మరియు ఐసియు స్పెషాలిటీ, ఇంకా సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తారు. వీటికి తోడు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి పూట ఆశ్రయం, వసతి గృహాలు, ఇంకా నివాస సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారు.
నూతన ఎయిమ్స్ ను ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సంరక్షణను అందజేయడమే కాకుండా, వైద్యులు, ఇతర ఆరోగ్య శ్రామికులతో కూడిన ఒక పెద్ద బృందాన్ని కూడా అందుబాటులో ఉంచడం అనే మరొక ప్రయోజనం కూడా సిద్ధించగలదు. ఈ బృందం జాతీయ ఆరోగ్య అభియాన్ (ఎన్ హెచ్ ఎమ్) లో భాగంగా ఆ ప్రాంతంలోని ప్రాథమిక, సెకండరీ స్థాయి సంస్థలకు కూడా ఉపయోగపడుతుంది. ఆ ప్రాంతంలో వ్యాప్తి లో ఉన్న వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై ఈ సంస్థ పరిశోధనలు జరపగలదు. అటువంటి వ్యాధులను నయం చేయగలదు; ఆయా వ్యాధులను మెరుగ్గా నియంత్రించేందుకు కూడా తోడ్పడగలదు.
ఈ ఎయిమ్స్ ను ఏర్పాటు చేస్తే యావత్తు తూర్పు ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు మేలు చేకూరుతుంది. తూర్పు యు పి పరిధిలో 14 జిల్లాలతో కూడిన 4 కమిషనరేట్ (గోరఖ్‌పూర్, అజంగఢ్, బస్తీ, దేవి పటాన్)లకు తోడు, పశ్చిమ బిహార్ లోని 5 జిల్లాలు (పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్, సీవాన్, గోపాల్‌గంజ్) ప్రజలకు కూడా నూతన ఎయిమ్స్ ప్రయోజనకరం కాగలదు.
పూర్వ రంగం
దేశంలో ఖర్చులను భరించగలిగే స్థాయిలో/ విశ్వసనీయమైన మూడో స్థాయికి చెందిన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రాంతీయంగా నెలకొన్న అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతో ఎయిమ్స్‌ను పి ఎమ్ ఎస్ ఎస్ వై లో భాగంగా నెలకొల్పుతూ వస్తున్నారు. సేవలు తగినంత స్థాయిలో లేని రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాలలో నాణ్యమైన వైద్య విద్యను బోధించే సదుపాయాలను పెంచేటందుకు సైతం ఎయిమ్స్ ను స్థాపించాలని లక్షించారు.
ఈ పథకంలో భాగంగా ఎయిమ్స్ ను భువనేశ్వర్, భోపాల్, రాయ్‌పూర్, జోధ్‌పూర్, రుషికేశ్, పట్నా లలో ఏర్పాటు చేశారు. మరో పక్క రాయ్‌బరేలీలో ఎయిమ్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అంతే కాకుండా, నాగ్ పూర్ (మహారాష్ట్ర), కల్యాణి (పశ్చిమ బెంగాల్), మంగళగిరి (ఎ.పి.)లలో 3 ఎయిమ్స్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు 2015లోనే ఆమోదం తెలిపారు.