పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలలో దుర్భిక్షం, నీటి ఎద్దడి లను గురించి సమీక్షించడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, చత్తీస్ గఢ్ రాష్ర్ట ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.
జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) నుంచి ఛత్తీస్ గఢ్ కు రూ.835.695 కోట్లను (రాష్ర్ట ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వలను సర్దుబాటు చేసిన అనంతరం) విడుదల చేశారు. 2015-16లో రాష్ర్ట విపత్తు సహాయ నిధి (ఎస్ డి ఆర్ ఎఫ్) నుంచి రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.249.725 కోట్ల కు ఇది అదనం. ఇంకా 2016-17 సంవత్సరానికి ఎస్ డి ఆర్ ఎఫ్ తొలి కిస్తీ గా మరొక రూ.94.875 కోట్లు విడుదల చేశారు.
రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలను గురించి ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు. ఈ చర్యలలో.. రాష్ర్టంలోని 8,055 చెరువుల్లో పూడిక తీత పనులు, కొత్తగా 44,181 వ్యవసాయ జలాశయాల నిర్మాణం, భూగర్భ జలాల రీచార్జి కోసం 9,851 నిర్మాణాలు వంటివి ఉన్నాయి. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన దుర్భిక్ష సహాయక చర్యలలో ప్రతి ఒక్క గ్రామానికీ తాగు నీటి సరఫరా, ఆహార ధాన్యాల సరఫరా సైతం చేరి ఉన్నాయి. పల్లెలలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా ఉండేందుకు, ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఒక క్వింటాలు బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వాటర్ షెడ్ లను గుర్తించి, సేద్యపు నీటి పారుదల వ్యూహాలను రచించేందుకు రాష్ర్ట ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ని ఉపయోగించింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలుచేస్తున్నందుకు ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. నిధుల లేమి కారణంగా నిలచిపోయిన పైప్ డ్ వాటర్ స్కీమ్ లను పున: ప్రారంభించేందుకు వీలుగా స్థానిక సంస్థల వద్ద అదనపు నిధులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో గొట్టాల ద్వారా నీటి సరఫరాకు ఉద్దేశించిన అన్ని పథకాలు ప్రస్తుతం పని చేస్తున్నట్లు తెలిపారు.
ఆనకట్టల నిర్మాణానికి, అడవుల పెంపకానికి రాష్ర్టప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి ముఖ్యమంత్రి వివరించారు. 2022 కల్లా వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసే దిశగా రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన వ్యూహాన్ని ప్రధాన మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారు.
‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అమలుకు రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సన్నాహక చర్యలను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ చర్యలను ఒక నమూనాగా ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేయవచ్చని ఆయన అన్నారు.
కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు కలసి పని చేయాలన్న తీర్మానంతో ఈ సమావేశం ముగిసింది.
Met @drramansingh to discuss Chhattisgarh’s drought situation & how centre & state can work together to mitigate it. https://t.co/T7GedApEzN
— Narendra Modi (@narendramodi) May 17, 2016
CM @drramansingh told me that a quintal of rice has been kept with each Panchayat to ensure no one starves in the villages. A good step.
— Narendra Modi (@narendramodi) May 17, 2016
Was briefed on Chhattisgarh’s usage of technology to identify watersheds & plan irrigation strategies & the states’s afforestation efforts.
— Narendra Modi (@narendramodi) May 17, 2016