Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జైగోపాల్‌ గరోడియా హిందూ విద్యాలయ్ స్వర్ణోత్సవ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

జైగోపాల్‌ గరోడియా హిందూ విద్యాలయ్ స్వర్ణోత్సవ సభలో ప్రధానమంత్రి ప్రసంగం


తమిళనాడు గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్, డాక్టర్ శ్రీ ఎల్.మురుగన్, శ్రీ రాజమోహన్, శ్రీ నైనార్ నాగేంద్రన్, డాక్టర్ శ్రీ గిరిజా శేషాద్రి అమ్మ, శ్రీ ఆర్.ఆర్.గోపాల్, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, నా తమిళ సోదరీసోదరులారా!

వణక్కం (నమస్కారం)

మిత్రులారా!

నవరాత్రి వేడుకలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఈ నేపథ్యంలో శివశక్తుల పావన భూమి తమిళనాడుకు రావడం, సరస్వతీ దేవి భక్తులను కలిసే అవకాశం లభించడం అద్భుత నవరాత్రి ఆరంభానికి సాక్షిని కావడం నిజంగా నా అదృష్టం. ఈ సమయంలో ఇక్కడి నా యువ మిత్రులలో ఉప్పొంగే ఉత్సాహాన్ని కూడా నేను గమనిస్తున్నాను. ఆ సానుకూల శక్తిని, ఉత్తేజాన్ని అనుభూతి చెందున్నాను. మీ కళ్లలో ప్రతిఫలించే భారతావని ఉజ్వల భవిష్యత్తు ఇప్పుడిక్కడే మీ కళ్లలో నాకు దర్శనమిస్తోంది.

ముందుగా నా ఆలస్యానికి క్షంతవ్యుణ్ని… వాస్తవానికి నిర్దేశిత సమయానికన్నా ఓ పది నిమిషాలు ముందుగానే తమిళనాడుకు చేరుకున్నాను. అయితే, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందు వల్ల ఈ వేడుకలు రావడం కాస్త ఆలస్యమైంది. ఇది కచ్చితంగా మీకందరికీ ఇబ్బంది కలిగించిందని నాకు తెలుసు. అందుకే, మన్నించాలని కోరుతున్నాను.

మిత్రులారా!

వికసిత భారత్‌ స్వప్న సాకారానికి సారథ్యం వహించాలని నేటి యువత అభిలషిస్తోంది. ఈ దిశగా అవసరమైన సరికొత్త దృక్పథం, పరిష్కారాలు మన దేశ భవిష్యత్తునే గాక యావత్‌ ప్రపంచ భవితనూ నిర్దేశించగలవు.

ప్రపంచం నేడు ఆ పరిష్కారాల కోసమే ఎదురుచూస్తోంది… ఆ సామర్థ్యం కూడా మీకుంది.

మిత్రులారా!

నేటి భారత్‌లో అవకాశాలు అపారం… కాబట్టి, యువతరంలో ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును విశాల దృక్పథంతో రూపుదిద్దుకోవాలన్నది నా ఆకాంక్ష. ఎందుకంటే- ఇది మీ కాలం.. ఆ మాటకొస్తే ఈ శకం మీదే… ఇది మీకు లభించిన సువర్ణావకాశం. ఈ కలలను సాకారం చేసుకోగలమనే నమ్మకం నాలో మెండుగా ఉంది.

మనం సమష్టిగా లక్ష్యాన్ని సాధించగలం!

మనం సమష్టిగా లక్ష్యాన్ని సాధించగలం!

మనం సమష్టిగా లక్ష్యాన్ని సాధించగలం!

మిత్రులారా!

నేటి నా పర్యటనకు ఒక ఆసక్తికర స్ఫూర్తి నేపథ్యం ఉంది. కొన్ని నెలల కిందట  నాగర్‌కోయిల్‌లో గిరిజ అమ్మగారు కొందరు పిల్లలతో పాటు నన్ను కలిశారు. ఆ సమయంలో వారిలోని అంకితభావం, ఆత్మవిశ్వాసం, దేశ భవితపై వారి నిబద్ధత నా మనోఫలకంపై చెరగని ముద్ర వేశాయి. ఆ సందర్భంగానే నేటి ఈ స్వర్ణోత్సవాలకు ఆమె  ఆహ్వానించారు. ఆ సమయంలో ఆమె నాపై చూపిన మాతృ వాత్సల్యం, ఈ చారిత్రక సంస్థపై నాకున్న గౌరవం ఫలితంగా కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆ క్షణంలోనే దృఢంగా నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలో ఇవాళ యాభై ఏళ్ల అద్భుత ప్రస్థానం పూర్తి చేసుకున్న ‘విశ్వ హిందూ విద్యా కేంద్రం’తో పాటు యావత్‌ ‘హిందూ విద్యాలయ’ కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా!

విశ్వ హిందూ విద్యా కేంద్రం స్వర్ణోత్సవం నిర్వహించుకోవడం ఓ కీలక ఘట్టం. ఈ సంస్థ ప్రస్థానం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. చెన్నై నగరంలోని వెస్ట్‌ మాంబళంలో ఈ సంస్థ  ఓ చిన్న పాఠశాలగా 1975లో ప్రారంభమైంది. ఆనాడు కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఇక్కడ చేరారు. ఇవాళ ఇక్కడున్న సదుపాయాలు, సౌకర్యాలు అప్పట్లో లేవు. శాశ్వత భవనం లేదు… వనరులు పరిమితం.. కానీ, ఒకటిరెండు మాత్రం పుష్కలం… అవే- దృఢ సంకల్పం, అచంచల సేవానిరతి. అందుకే, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ సంస్థ ముందడుగు వేస్తూనే వచ్చింది. ఈ చిన్న ప్రయత్నం కాలక్రమంలో ఓ గొప్ప విద్యా విప్లవంగా పరిఢవిల్లింది. తదనుగుణంగా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో నేడు మీకు 15 విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా!

ఈ సందర్భంగా- శ్రీ జైగోపాల్ గరోడియా కృషిని కూడా నేను గౌరవపూర్వకంగా స్మరించుకుంటున్నాను. పాఠశాల భవన నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో విద్యాలయ ప్రస్థానాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు సహా పూర్వ విద్యార్థులందరికీ ఈ రోజు అభినందనలు తెలుపుతున్నాను. యాభయ్యేళ్ల అంకితభావం… నిబద్ధతతో… యువతరం జీవితాలను తీర్చిదిద్దుతూ వచ్చిన ప్రస్థానమిది.

మిత్రులారా!

ఒక విద్యా సంస్థ విద్యాప్రదానంతో పాటు దేశభక్తి గల పౌరులను ఎలా తీర్చిదిద్దగలదో చెప్పడానికి ఈ సంస్థే తిరుగులేని నిదర్శనం. నేను ప్రతి నెలలో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ దీనిగురించి నేను ప్రస్తావించాను. గిరిజమ్మ పిల్లలకు ఒక సరళ ఆలోచన విధానం నేర్పారు. ప్రతి బిడ్డ రోజుకు రూపాయి చొప్పున పొదుపు చేస్తూ, ఆ మొత్తాన్ని దేశ సైనికులకు సంక్షేమం కోసం వెచ్చించాలన్నదే ఆ సంకల్పం. వేలాది బాలలు ఇందులో భాగస్వాములు కావడంతో దాదాపు రూ.40 లక్షలు సమకూరాయి. నిజంగా, ఇదెంతో స్ఫూర్తిదాయక ఉదాహరణ!

మిత్రులారా!

మన వంతుగా చేసే ఓ చిన్ని ప్రయత్నం కూడా గొప్ప మార్పును తీసుకురాగలదు… పెను ప్రభావం చూపగలదు. ఆ మేరకు విపత్తుల వేళ ఆపన్నులకు అండగా నిలవడం కావచ్చు లేదా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు… ఇటువంటి విలువలే ‘హిందూ విద్యాలయ’ కుటుంబ సుసంపన్న వారసత్వంగా నిలిచాయి.

మిత్రులారా!

ఈ సందర్భంగా, మహనీయుడైన తిరువళ్లువర్‌ను కూడా స్మరించుకుంటున్నాను. విద్యార్థులందరికీ ఆయన ప్రబోధాలు అత్యంత ముఖ్యమైనవి. ఇటీవల, భారత్‌ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు గౌరవనీయ పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించే అవకాశం నాకు లభించడం ఎంతో అదృష్టం. నిత్య విద్యార్థిగా జీవించాలని భావించే ప్రతి ఒక్కరికీ ఈ కావ్యం అద్భుత మార్గదర్శి. “ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోదు… దైనందిన జీవనంలో దాన్ని ఆచరించడమూ అంతే ముఖ్యం” అని ఆయన ప్రసిద్ధ పద్యాలలో ఒకటి మనకు ప్రబోధిస్తుంది. తిరువళ్లువర్ బోధించిన ఈ సూత్రం.. ముఖ్యంగా విద్యార్థులందరికీ ప్రాతఃస్మరణీయం.

మిత్రులారా!

లోక్‌సభలో నేను కాశీ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ నేపథ్యంలో వారణాసి ప్రజలు నేటికీ తమిళ మహాకవి భారతియార్‌ను గుర్తుచేసుకుంటుంటారు. ముఖ్యంగా.. “అచ్చమిల్లై, అచ్చమిల్లై” (భయం వద్దు.. భయం వద్దు) అని అభయమిచ్చే ఆయన పద్యం భయరహితంగా జీవించడం ఎలాగో మనకు నేర్పుతుంది. ఇక్కడి యువతకు నేను చెప్పదలచిందీ ఇదే. ఎలాంటి భయ సందేహాలు లేకుండా మీకు మీరే ఒక అవకాశం తీసుకోండి. గొప్ప కలలు కనండి.. భిన్నంగా ఆలోచించండి.. నిర్భయంగా ఉంటూ మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి.

మిత్రులారా!

దేశంలోని వివిధ ప్రాంతాలకు నా ప్రయాణం, ఆయా ప్రాంతాల ప్రజానీకంతో మెలగుతూ నేర్చుకున్న విషయాల ద్వారా భారత్‌పై నాకొక అవగాహన ఏర్పడింది. ఆ క్రమంలో  కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 1990ల ప్రారంభంలో సాగిన ‘ఏక్తా యాత్ర’లోనూ నేను భాగస్వామిగా ఉన్నాను. ఆ సమయంలోనే గిరిజా అమ్మతో మొదలైన నా తొలి పరిచయం కొనసాగుతూ నేడొక అనుబంధంగా మారింది. భారత్‌లోని వైవిధ్యాన్ని అత్యంత సన్నిహితంగా అర్థం చేసుకునే అవకాశం నా పర్యటనల ద్వారానే లభించింది. తమిళ భాష, సంస్కృతిపై నా  ప్రేమ కూడా ఆ అనుభవాల నుంచే ఉద్భవించింది.

మిత్రులారా!

అందుకే, భారతదేశాన్ని లోతుగా అన్వేషించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరెక్కడికి వెళ్లినా, మీ సంస్కృతిని ఒక భాగం చేసుకోండి.. తమిళ కవిత్వం, కథలు, సంప్రదాయాలపై మీ ఇతర భాషల స్నేహితులతో సంభాషించండి. మీ నేపథ్యాలకు భిన్నమైన నేపథ్యాలు గల వ్యక్తులతో స్నేహం చేయండి. ఈ స్నేహసంబంధాల ద్వారానే మన దేశ ఐక్యత మరింత పటిష్టమవుతుంది.

మిత్రులారా!

కలల సాకారం దిశగా యువతకు మునుపెన్నడూ లేనంతటి రీతిలో నేడు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దేశ విద్యా వ్యవస్థలో నేటి మార్పులను కూడా గమనించండి. దేశంలో 2014 నాటికి సుమారు 750 విశ్వవిద్యాలయాలు ఉండగా, నేడు 1,300 దాటాయి. కళాశాలల సంఖ్య కూడా సుమారు 38,000 నుంచి 52,000 దాటింది. ఇటీవల అనేక కొత్త ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు, ‘ఎయిమ్స్‌’ వంటి సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి.

మిత్రులారా!

కొత్త విద్యా విధానం నేడు దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. కాబట్టే, భారతీయ విద్యా సంస్థలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు నిరంతరం పెరుగుతోంది. ఆ మేరకు 2015 నాటి ‘క్యూఎస్‌’ ర్యాంకింగులో భారత్‌ నుంచి 14 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు తాజా ర్యాంకింగులో వాటి సంఖ్య 52కు పెరిగింది. దీన్నిబట్టి, దేశంలో మరిన్ని విద్యా సంస్థలు, అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని, ఎంపికలో స్వేచ్ఛ పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు.

మిత్రులారా!

యువతరంలో ప్రతి ఒక్కరికీ భిన్నమైన ప్రతిభ, ఆలోచనలు, కలలు ఉండటం సహజం. ఉదాహరణకు॥ మీలో చాలామంది క్రీడలను వృత్తిగా మలచుకోవాలని భావించవచ్చు. ఈ క్రమంలో క్రీడలు వినోదానికే పరిమితం కాకుండా మరింత విస్తరించేలా దేశం చర్యలు తీసుకుంటోంది. అందుకే, దేశవ్యాప్తంగా కొత్త క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. యువ క్రీడాకారులలకు మెరుగైన, చేయూత లభిస్తున్నాయి. తదనుగుణంగా అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్‌ స్థాయి ఇనుమడిస్తోంది.

మిత్రులారా!

కామన్వెల్త్ క్రీడలు-2030కి ఆతిథ్యమిచ్చే దిశగా భారత్‌ సన్నద్ధమవుతోంది. అలాగే, 2036లో ఒలింపిక్స్‌ నిర్వహణ లక్ష్యంతోనూ మనం ముందడుగు వేస్తున్నాం. దేశంలో ఇలాంటి భారీ అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నిర్వహణతో మన యువతకు తమ ప్రతిభ చాటుకునే వేదిక, అవకాశం రెండూ లభిస్తాయి. అంటే- మన యువతరానికి నేడు సముచిత వేదిక, సామర్థ్యం, మద్దతు అన్నీ చేరువయ్యాయి. అంటే అవకాశాలకు అంతే లేదు కాబట్టి, క్రీడా రంగంలోనూ మీ తరం భారతావనిని కొత్త శిఖరాలకు చేర్చగలదన్న నమ్మకం నాలో మెండుగా ఉంది.

మిత్రులారా!

ఈ రోజు మీ అందరి మధ్యకు వచ్చి, మీ కలలేమిటో తెలుసుకున్న తర్వాత మీ తరంపై నా నమ్మకం మరింత బలపడింది. భారత్‌ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఆ లక్ష్యం సాధనలో నిజమైన కథానాయకులు మీరే. మీ అపార ప్రతిభ విషయంలోనే కాదు… మీ ఆత్మవిశ్వాసం, సామర్థ్యంపైనా నాకెంతో నమ్మకం ఉంది. అందుకే, ఇవాళ మీ అందరితో సమష్టిగా కొన్ని కీలక సంకల్పాలను పునరుద్ఘాటించాలని భావిస్తున్నాను. ఇప్పుడు నాతో గళం కలిపి, “మేం సాధిస్తాం.. సాధిస్తాం!” అని దిక్కులు పిక్కటిల్లేలా చాటండి…

వికసిత భారత్‌-2047 సంకల్పాన్ని- సాధిస్తాం.. సాధిస్తాం!

“వికసిత భారత్‌-2047 సంకల్పాన్ని- సాధిస్తాం.. సాధిస్తాం!”

మరింత గట్టిగా చెప్పండి: మేం సాధిస్తాం!

వికసిత భారత్‌-2047 సంకల్పాన్ని- సాధిస్తాం.. సాధిస్తాం!”

అగ్రశ్రేణి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌- సాధిస్తాం.. సాధిస్తాం!

స్వయం సమృద్ధ భారత్‌ను- సాధిస్తాం.. సాధిస్తాం!

ప్రపంచ తయారీ కూడలిగా భారత్‌- సాధిస్తాం.. సాధిస్తాం!

ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యం- సాధిస్తాం.. సాధిస్తాం!

చంద్రునిపైకి భారతీయుడు- సాధిస్తాం.. సాధిస్తాం!

మరింత గట్టిగా- సాధిస్తాం.. సాధిస్తాం!

వికసిత తమిళనాడు సంకల్పాన్ని- సాధిస్తాం.. సాధిస్తాం!

వికసిత తమిళనాడు సంకల్పాన్ని- సాధిస్తాం.. సాధిస్తాం!

వికసిత భారత్‌-2047 సంకల్పాన్ని- సాధిస్తాం.. సాధిస్తాం!”

 

అనేకానేక ధన్యవాదాలు.

నండ్రి.. వణక్కం! (ధన్యవాదాలు, నమస్కారం!)

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే!

***