పిఎంఇండియా
భారత్‌లోని పాఠశాలల్లో జర్మనీ భాషను, అదే విధంగా జర్మనీలో ఆధునిక భారతీయ భాషలను ప్రోత్సహించటానికి ఉద్దేశించిన సంయుక్త ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన కేబినెట్ ఈమేరకు పచ్చజెండా ఊపింది. భారత మానవ వనరుల మంత్రిత్వశాఖ, జర్మనీ ఫెడరల్ విదేశాంగ శాఖ మధ్య ఈ మేరకు త్వరలో సంయుక్త ఒప్పందం కుదరబోతోంది. దీని ప్రకారం- భారత జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కేంద్రీయ విద్యాలయ (కేవీ) పాఠశాలల్లో జర్మన్‌ను ఒక అదనపు భాషగా ప్రోత్సహిస్తారు. అదే విధంగా జర్మనీలో ఆధునిక భారతీయ భాషలను ప్రోత్సహిస్తారు. ఈ ప్రతిపాదిత సంయుక్త ఒప్పందం ద్వారా భారత్, జర్మనీల మధ్య ఆయా దేశాల్లోని చట్టాలు, ప్రణాళికలు, నిబంధనలకు లోబడే విద్యారంగంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత పెంపొందుతుందన్నది భావన.
పూర్వరంగం:
కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో జర్మనీ భాష బోధించటం కోసం 2011 సెప్టెంబరులో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), గోతె ఇన్ స్టిట్యూట్, మాక్స్ ముల్లర్ భవన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం గడువు 2014 సెప్టెంబరులో ముగిసింది. త్రిభాషా సూత్రానికి సంబంధించిన జాతీయ విద్యవిషయిక కార్యప్రణాళిక, జాతీయ విద్యావిధానాలకు, ఒప్పందంలోని కొన్ని అంశాలకు పొసగకపోవటంతో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. కేవీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల తదుపరి సంప్రదింపులు, మానవ వనరుల మంత్రిత్వ శాఖలో పునఃసమీక్షానంతరం కేవీఎస్- గోతె ఇన్ స్టిట్యూట్/మాక్స్‌ముల్లర్ భవన్ల మధ్య కొత్త ఒప్పందానికి నిర్ణయించారు. దీన్ని విదేశాంగ శాఖకు సమర్పించారు. జర్మనీలో ఆధునిక భారత భాషల ప్రోత్సాహానికి జర్మన్ ప్రభుత్వం తరఫున గోతె ఇనిస్టిట్యూట్ బాధ్యత వహించదు కాబట్టి ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాల స్థాయిలో చేసుకోవాలని 2015 ఏప్రిల్ 5న ప్రతిపాదించారు. 2015 ఏప్రిల్ 14న బెర్లిన్‌లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, జర్మన్ ఛాన్స్‌లర్లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల జాతీయ విద్యవిధానాల పరిధిలోనే రెండు దేశాల భాషల పరిజ్ఞానాన్ని యువతరంలో విస్తృతం చేయాలని, ఆ ప్రయత్నాలను, కార్యక్రమాలకు మద్దతివ్వాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
భారత జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కేంద్రీయ విద్యాలయ (కేవీ) స్కూళ్లలో జర్మన్‌ను ఒక అదనపు భాషగా ప్రోత్సహించేలా, అదే విధంగా జర్మనీలో ఆధునిక భారతీయ భాషలను ప్రోత్సహించేలా సంయుక్త ఒప్పందం ప్రతిపాదనను విదేశాంగ మంత్రిత్వశాఖ రూపొందించింది. దీనిపై భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఫెడరల్ విదేశాంగ శాఖ కార్యాలయం సంతకాలు చేస్తాయి. కార్యాచరణ ప్రణాళిక అంశాల ఆధారంగా తర్వాత కేంద్రీయ విద్యాలయ సంఘటన్, గోతె ఇనిస్టిట్యూట్/ మాక్స్ ముల్లర్‌భవన్ల మధ్య అంతర్‌సంస్థ ఒప్పందం జరుగుతుంది.
జర్మనీలోని విద్యాసంస్థల్లో ఆధునిక భారతీయ భాషల్ని ప్రోత్సహించేందుకుగాను కార్యాచరణపై రెండుదేశాల్లోనూ ఎంపిక చేసిన సంస్థల మధ్య ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతాయి. పాఠశాల, ఉన్నత విద్యకు సంబంధించి భారత రాయబార కార్యాలయం జర్మనీలోని ఆయా రాష్ర్టాల విద్య, సాంస్కృతిక మంత్రిత్వశాఖలతో సంబంధాలు పెట్టుకోవటానికి సంయుక్త ఒప్పందం వీలుకల్పిస్తోంది. ఇరువైపుల అమలును పర్యవేక్షించే నోడల్ ఏజన్సీలు త్వరలోనే ఒప్పందం కుదుర్చుకుంటాయి.