Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్‌ లోని సాహిబ్‌ గంజ్‌ లో పలు ప్రభుత్వ పథకాల ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం

ఝార్ ఖండ్‌ లోని సాహిబ్‌ గంజ్‌ లో పలు ప్రభుత్వ పథకాల

ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


సోదరులు మరియు సోదరీమణులారా!

 

ఈ రోజు సంథాల్ భూమి కి వచ్చే ప్రత్యేక అధికారం నాకు లభించింది.  భగవాన్ బిర్సా ముండా, చాంద్ భైరవ్, నీలాంబర్- పీతాంబర్ ల వంటి సాహస పుత్రులను కన్న భూమి ఇది.  అలాంటి ఈ భూమి కి నేను శిరస్సును వంచి నమస్కరిస్తూ ఇక్కడి సాహస పౌరులకు మనస్ఫూర్తిగా అభివాదం చేస్తున్నాను.  ఇవాళ సాహిబ్‌ గంజ్‌లో ఏడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఒకే కార్యక్రమంలో ఇన్ని అభివృద్ధి పనులను చేపట్టడం ఇదే మొదటి సారి అని నేను భావిస్తున్నాను.  నిరుపేదలైన నా ఆదివాసీ సోదరీమణుల మరియు సోదరుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి జీవితాల్లో  పరివర్తన ను తెచ్చే దిశగా సంథాల్ ప్రాంత సంక్షేమానికి ఒక మార్గం ఉంది.  అదే.. అభివృద్ధి.  ఈ ప్రాంతం ఎంత వేగంగా ప్రగతిపథంలో పయనిస్తే ఇక్కడి సామాన్యుల జీవితాలను మార్చడంలో మనం విజయం సాధించిన వారం కాగలం.  నేడు ఝార్ ఖండ్- బిహార్ లను అనుసంధానించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టాం.  గంగా నది మీద రూ.2,200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సేతువు రెండు రాష్ట్రాలనూ కలపడం మాత్రమే గాక పురోగమనానికి కొత్త బాటను కూడా పరుస్తుంది.  ఈ వంతెనతో మీరు తూర్పు భారతంతో సంధానం కాగల అవకాశాన్ని పొందుతారు.

 

ఇంత ముఖ్యమైన వంతెనకు పునాదిరాయి పడడంపై బిహార్, ఝార్ ఖండ్ ల ప్రజలను నేను అభినందిస్తున్నాను.  నిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి చేయించడం లో ఎంతో ఘటికులని నితిన్ గడ్కరీ గారికి గుర్తింపు ఉంది.  అందువల్ల ఈ వంతెన ప్రారంభోత్సవం కోసం నిర్ణయించిన తేదీ నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని నేను విశ్వసిస్తున్నాను.  ఆ రోజుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో కాస్త పని కూడా బకాయి ఉండదు.  ఈ వంతెన యువతకు ఎంతటి విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టించగలదో మీరు ఊహించుకోవచ్చు.  వారు తమ సొంత జిల్లాల్లోని ఇళ్లకు తిరిగి వెళ్లాలనుకుంటే సులభంగా చేరుకోవచ్చు.  ఇది ఉపాధిని పొందడానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.  ఒక ప్రాజెక్టు లో రెండు.. రెండున్నరేళ్లు పనిచేసే వ్యక్తి ఒక ఇంజినీయర్ కన్నా సమర్థుడు, నిపుణుడు కాగలడు.  ఆ మేరకు ఈ ప్రాంతం లోని పలువురు యువకులు ఈ ప్రాజెక్టులో పని చేయడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచుకోగలరు.  భవిష్యత్తులో అటు బిహార్, ఇటు ఝార్ ఖండ్‌లలో లేదా సమీప ప్రాంతాల్లో ఇటువంటి కొత్త ప్రాజెక్టు ఏదైనా ప్రారంభమైతే అందులో పనిచేసే కార్మిక శక్తి నియామకంలో ఇక్కడి యువతకే ప్రాధాన్యం లభిస్తుంది.  అంతేకాకుండా వీరి వేతనం లోనూ పెరుగుదలకు అవకాశం ఉంటుంది.  ఇప్పడు చేపడుతున్న ప్రాజెక్టుకు అంతటి సామర్థ్యం ఉంది.  వీటికి గల గొప్ప బలం వీటిని నిర్మించే కార్మికశ క్తే.  అందుకే నైపుణ్యాభివృద్ధితో కూడిన కార్మి శక్తిని అభివృద్ధి చేయాల్సి ఉంది.

 

ఇక్కడి యువతకు నా శుభాభినందనలు. ఓ గొప్ప అవకాశం మీ ఇంటి తలుపు ను తడుతోంది. కా బట్టి మీరు కూడా కఠోర దీక్షతో శ్రమిస్తూ మీ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు కృత నిశ్చయంతో కదలాలి.  ఒకసారి మీ సమర్థత విస్తరిస్తే… మీ వంటి అనుభవజ్ఞులైన యువ శక్తి కావాలని ప్రపంచమే కోరడం ప్రారంభిస్తుంది.  ఇదే మున్ముందు రాబోయే మార్పు.  ఇవాళ నేను మరో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాను.  అదేమిటంటే సాహిబ్‌ గంజ్‌, గోవింద్‌ పుర్‌ లమధ్య రహదారి నిర్మాణం.  ఇక్కడి నుండి గోవింద్‌ పుర్‌ కు వెళ్లాలంటే 10 లేదా 12 లేదా 14 గంటలు కూడా ప్రయాణించాల్సి వచ్చేది.  ఇప్పుడిక కొత్త రహదారి నిర్మాణంతో మీరు కేవలం 5 నుండి 7 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు.  ఈ రహదారితో మీ జీవితాలు గొప్ప వేగం పుంజుకొంటాయన్న మాట.  ఇది కూడా మీ జీవితాల్లో గొప్ప మార్పు ను తీసుకువస్తుంది.  ఇది సంథాల్ ప్రాంతం గుండా వెళ్లే రహదారి మాత్రమే కాదు.. ఇది ఇక్కడి అత్యంత నిరుపేదల అభివృద్ధికి కొత్త అవకాశాల బాట పరుస్తుంది.  అభివృద్ధి లక్ష్యాన్ని మరింత చేరువచేసే కార్యక్రమం ఇది.  రవాణా కోసం అనేక రహదారులు ఉండవచ్చు.  కానీ, ఈ రోడ్డు కేవలం రవాణాకు ఉద్దేశించింది కాదు..  ఇది అభివృద్ధి వైపు నడిపించే వెలుగుబాట కూడాను.  అందువల్ల ఈ రహదారి సంథాల్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న నా ప్రగాఢ విశ్వాసం.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

నదులను మనం తల్లిగా సంబోధిస్తాం.  తల్లి మనకు అన్నీ ఇస్తుంది.  కానీ, కొన్ని సందర్భాల్లో అమ్మయినా అడగనిదే ఏదీ ఇవ్వదంటారు.  ఈ గంగామాత వందల ఏళ్లుగా ఈ యావత్తు ప్రాంతాన్నీ పోషిస్తోంది.  ఈ ప్రాంతంలో జీవ నాడి లాగా ప్రవహిస్తోంది.  కానీ, ప్రస్తుత మారుతున్న యుగంలో గంగామాత మనకు కొత్త బలాన్ని ఇవ్వగలదు.  ఈ 21వ శతాబ్దంలో గంగామాత ఝార్ ఖండ్‌ ను నేరుగా ప్రపంచంతో అనుసంధానించగలదు.  మేమిప్పుడు ఆ దిశగానే కృషి చేస్తున్నాం.  సముద్ర తీరానగల నగరాలన్నీ ప్రపంచంతో సంధానమై ఉంటాయని మీరెన్నడైనా ఊహించారా ?   అయితే, సముద్ర తీరమంటూ లేని అన్ని వైపులా నేలతో నిండిన ఝార్ ఖండ్ కూడా ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకోగలదా ?  ఈ దిశగా నితిన్ గడ్కరీ గారు తన హృదయాన్ని, మేధనూ జోడించి ఒక ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.  అది కచ్చితంగా గొప్ప ప్రాజెక్టు కానుంది.  ఇది పూర్తి అయితే ఝార్ ఖండ్ నేరుగా ప్రపంచంతో సంధానమవుతుంది.  అదే బహువిధ రవాణా కేంద్రక పథకం (MMTP).  దీనికి కూడా ఇవాళే పునాదిరాయి పడుతోంది.  తద్వారా ఇక్కడి నుండి ఓడలు సరుకులతో బంగాళాఖాతం లోకి ప్రవేశిస్తాయి.  అటు పైన సముద్ర మార్గంలో ఆ సరుకులు ప్రపంచానికి చేరుతాయి.  ప్రపంచ వాణిజ్యానికి అటువంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చినపుడు ఝార్ ఖండ్ కూడా ప్రపంచ వాణిజ్యంలో తనదైన ముద్ర వేయగలదు.  అది రాతి కంకర కావచ్చు.. బొగ్గు కావచ్చు;  రాష్ట్రంలో లభ్యమయ్యే మరేదైనా కావచ్చు.  ఆ విధంగా నేరుగా విశ్వ విపణి తో సంధానం కాగల సామర్థ్యాన్ని సంతరించుకోవచ్చు.  అంతేకాకుండా ఈ వ్యవస్థ సిద్ధమయ్యాక ఈ ప్రాంతం నుండి సరుకులను పశ్చిమ భారతానికి తరలించాలని భావిస్తే ఇకపై రైలు లేదా రోడ్డు రవాణా మార్గాలను వాడుకోవాల్సిన అవసరం ఉండదు.  బంగాళాఖాతం వెంబడి తీరమార్గం గుండా సరుకులు చౌకగా చేరవేయవచ్చు.  అలాగే ఈ రంగంలో పనిచేసే కార్మికులు ఆర్థికంగా మరింత పరిపుష్ఠం కావడానికి ఇది దోహదపడుతుంది.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

అట‌ల్‌ గారి హయాంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి కృషి జరిగింది.  ఆ సమయంలో దేశ మౌలిక సదుపాయాలకు ప్రధానంగా రెండు రకాల మద్దతు లభించింది.  ఇది పలురకాలుగా ఉండొచ్చు గానీ నేను రెండింటినే ప్రస్తావిస్తున్నాను.  ఒకటోది.. దేశాన్ని స్వర్ణ చతుర్భుజితో సంధానించడం వల్ల దానికి ఒక ఆధునిక రూపు ఏర్పడింది.  రెండోది.. ప్రధాన మంత్రి గ్రామీణ రహదారి పథకం.. ఒక రకంగా ఇది సంధాన రహదారుల సమూహంతో ప్రతి గ్రామానికీ దోవను ఏర్పరచింది.  ఆయన పాలనలో సాధించిన ఓ గొప్ప విజయం ఇది.  ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి.  ఇదే వాజ్‌పేయి గారి రెండో ఘనత.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే.. మనం రహదారుల, రైల్వేల గురించి మాత్రమే మాట్లాడుతుంటాం.  మనం ఎన్నో జాతీయ రహదారులతో పాటు విమాన రాకపోకల కోసం  విమానాశ్రయాలను నిర్మించాం.  రైల్వేల విస్తరణకు ఎంతో కృషి చేశాం.  కానీ, ఒక విషయంలో మాత్రం సవాలును ఎదుర్కొంటున్నాం.  అయితే, నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.  ఆ మేరకు సరుకులను దేశీయ జల మార్గాల ద్వారా రవాణా చేయాలని సంకల్పించింది.  దీనిలో భాగంగా వారణాసి, హాల్దియా ల మధ్య సరుకుల రవాణాకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేశారు.  ఇక ఝార్ ఖండ్ బంగాళాఖాతానికి అనుసంధానం కాబోతోంది.  ఇక్కడి నుండి ఓడలు బయల్దేరుతాయి.  ఇప్పటి దాకా నదుల్లో మనం చిన్న చిన్న పడవలను మాత్రమే చూశాం.  ఇకపై వేల టన్నుల సరుకులు మోసుకుపోగల ఓడలను చూడబోతున్నాం.  ఇప్పుడిక ఆవిర్భవిస్తున్న కొత్త రంగం అభివృద్ధిని ఊహించుకోవచ్చు.  మనకు జాతీయ రహదారులు ఉన్నాయి, రైలు మార్గాలు ఉన్నాయి, వాయు మార్గాలు ఉన్నాయి.. వీటికి తోడు ఇప్పుడు జల మార్గాలను కూడా అభివృద్ధి చేసుకొంటున్నాం.  వీటికి కూడా ఇవాళే ప్రారంభోత్సవం చేసుకొంటున్నాం.  ఇందులో వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నాం.  ఈ ఉద్యమం ఇప్పుడు దేశంలో నవీకరించబడింది… ఇది మరింత ప్రశంసలు అందుకొంటుంది.  ఆర్థిక వేత్తలు దీనిని గురించి రాస్తారు.  దీని భవిష్యత్తుపై చర్చలు సాగుతాయి.  భారతదేశంలో ఇది ఒక అభివృద్ధి చెందుతున్న పర్యావరణ హితకర మౌలిక సదుపాయం.  అభివృద్ధితో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటుంది.  నితిన్ గడ్కరీ గారి మంత్రిత్వ శాఖ ఈ పనులను చేపడుతుండగా గంగా మాత అన్నీ సమకూరుస్తోంది.  గంగా మాత బహూకరిస్తున్న ఈ కొత్త కానుక నవ్య ప్రగతి పథాన్ని ఏర్పరుస్తుంది.  కాబట్టి గంగా మాతకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

సంథాల్ ప్రాంత రైతులు, పశు పోషకుల కోసం ఈ అత్యంత ప్రాముఖ్యం గల చర్యలు తీసుకోవడంపై ఝార్ ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘువర్ దాస్‌ గారిని నేను ఈ వేళ అభినందిస్తున్నాను.  ఇది పాడి పరిశ్రమ రంగం వైపు వేస్తున్న అడుగు.  పశు పోషకులు పాలకు గిట్టుబాటు ధరను పొందగలిగితే వారు తప్పక పశు పోషణలో నిమగ్నం కాగలరు.  పశు పోషకులు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న పాలను తమ కోసం వాడుకోగా, మిగిలినవాటిని పరిసర ప్రాంతాల్లో విక్రయించుకోగలుగుతున్నారు.  కానీ, ఈ వృత్తి లోని వాణిజ్య నమూనా గురించి వారికి ఇంకా తెలియలేదు.  పశు పోషకులు పాడి ఉత్పత్తి చేస్తే దానికి అనుగుణంగా పాడికి విలువను జోడించి ఓ పెద్ద శృంఖలాన్నే సృష్టించవచ్చు.  నేను గుజరాత్ గడ్డ నుండి వచ్చాను.  అక్కడ ‘అమూల్’ ఎంతో ప్రసిద్ధి చెందిన బ్రాండ్.  దేశం లోని మూల మూలకూ అమూల్ ఇవాళ విస్తరించింది.  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి మార్గదర్శకత్వంతో ఏర్పాటైన ఓ చిన్న సహకార సంస్థ అది.  పాలను సేకరించడం ద్వారా కొందరు రైతులు దీనికి శ్రీకారం చుట్టారు.  కాలక్రమంలో అది వికసించడం మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా అమూల్ పేరిట వాసికెక్కింది.  సంథాల్ ప్రాంతంలోని పేద రైతులు, పశుపోషకుల కోసం రఘువర్ దాస్ గారుర ఇవాళ డెయిరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు.  ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలను వివిధ పదార్థాలుగా మార్చి, వాటికో ముద్ర ను రూపొందించి, విపణి సదుపాయాన్ని కూడా ఈ డెయిరీ చూపనుంది.  ఆ దిశగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి నా అభినందనలు.  డెయిరీ రంగంలో గుజరాత్ అపార అనుభవశాలి.  ఝార్ ఖండ్ కోరితే సహకారం అందించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను.  దీని వల్ల రైతులకు, పశు పోషకులకు లబ్ధి కలుగుతుంది.  రైతుల భూ కమతాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి గనుక పశు పోషణ వారికి అదనపు మద్దతిస్తుంది.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నేను ఒక సూచనను చేయదలచాను.  డెయిరీ రంగంతో పాటు తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిందిగా ఆయనను కోరుతున్నాను. పశు పోషకులు వారి వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకాన్ని కూడా చేపట్టవచ్చును.  తేనె పట్టుల నుండి లభించే తేనె కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది.  ఆ విధంగా రైతులు వ్యవసాయంతో పాటు పాడి, తేనె రూపాల్లో ఆదాయాన్ని పొందవచ్చు.  వారికి ఏడాది పొడవునా 12 నెలలూ కచ్చితంగా ఆదాయం ఉంటుంది.  నాకు తెలుసు.. రఘువర్ దాస్ గారు చాలా దూరదృష్టి గల వారు. ఇవాళ ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు.  సర్దార్ పటేల్ గారి స్ఫూర్తితో స్థాపించిన సహకార వ్యవస్థ కూడా ఆనాడు ఇలాగే కనిపించింది.  కానీ, నేడు అది ప్రపంచ ప్రసిద్ధమైంది. రఘువర్ దాస్ గారు ఈ చిన్న పనికి శ్రీకారం చుట్టారు.  దాని భావి బలం ఏమిటో నాకు బాగా తెలుసు.  సంథాల్ ప్రాంతంతో పాటు ఇక్కడి రైతులు, పశు పోషకుల భవిష్యత్ పరివర్తనలో ఇది ఎంతో ప్రధానమైన పాత్రను పోషించగలదని నేను నమ్ముతున్నాను.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

జస్టిస్ డి.ఎన్.పటేల్ ఆహ్వానంతో 2015 అక్టోబరు 1న ఖుంటీ ని సందర్శించే అవకాశం నాకు లభించింది.  ఖుంటీ జిల్లా కేంద్రం లోని న్యాయస్థానం దేశం లోనే తొలి సౌర శక్తి కోర్టు.  రెండో కోర్టుతో పాటు మరో ప్రభుత్వ భవన సముదాయం కూడా ఇక్కడ సాహిబ్‌ గంజ్‌లో పూర్తిగా సౌర శక్తితో నడవనుండడం ఇవాళ నాకెంతో సంతోషంగా ఉంది.  ఇందుకుగాను నేను జస్టిస్ డి.ఎన్.పటేల్ కు, ఆయన బృందంతో పాటు ఝార్ ఖండ్ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.  వారు సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించారు.  సుమారు 4500 కిలోవాట్ సౌర శక్తి ఉత్పాదన వ్యవస్థను విజయవంతంగా ఏర్పాటు చేయడం ద్వారా భవనాల పైకప్పులపై సౌర శక్తి ఉత్పాదనను ప్రోత్సహించే బాధ్యతను వారు చేపట్టారు.  మన అడవులను పరిరక్షించుకొంటూ భావి తరాల కోసం వాటిని మిగల్చాలంటే మన పర్యావరణాన్ని మొదట కాపాడుకోవాలి.  శక్తి ఉత్పత్తికి గల అద్భుతమైన వనరులలో సౌర శక్తి కూడా ఒకటి.  ఈ దిశగా భారతదేశం వేగంగా పురోగమిస్తోంది.  ఆ మేరకు 175 గీగా వాట్ల నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలని భారతదేశం స్వప్నిస్తోంది.  ఇందులో 100 గీగా వాట్ల సామర్థ్యాన్ని ఒక్క సౌర శక్తి తోనే సాధించవచ్చు.  దాని వల్ల ఇతర దేశాల నుండి ఇంధనం కొనుగోలుకు చేస్తున్న ఖర్చు తగ్గి, మనకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది.  ఆ ధనాన్ని మనం పేదల అభ్యున్నతి కోసం వినియోగించుకోవచ్చు.  పర్యావరణ విధ్వంసాన్ని కూడా నివారించవచ్చు.  ఒకప్పుడు ఒక యూనిట్ సౌర శక్తి ఉత్పాదన వ్యయం 19 రూపాయలుగా ఉండేది.  అయితే, మన దేశం ఎలాంటి ఉద్యమం చేపట్టిందంటే.. ఇవాళ బొగ్గుతో ఇంధన ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో పోలిస్తే సౌర శక్తి ఉత్పాదన చౌకగా మారింది.  ఇప్పుడే దాఖలైన టెండరులో రూ.3 లేదా రూ.2.96గా అందులో ప్రతిపాదించడం గమనార్హం.  అంటే మనం చెల్లించేది పెట్టుబడి వ్యయం మాత్రమే.  ఆ తరువాత లభించే విద్యుత్తుకు ఎలాంటి ధరను చెల్లించక్కర్లేదు.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

ఈ 21వ శతాబ్దంలో ఎవరూ చీకట్లో నివసించాల్సిన పని లేదు.  నేడు అనేక కుటుంబాలు విద్యుత్ కనెక్షన్ వద్దనుకుంటున్నాయి.  దానితో తమకు అవసరం లేదని భావిస్తున్నాయి.  ఎన్నో సార్లు వెంటబడితే గానీ వారు తీసుకోవడం లేదు.  ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ను ఇస్తామంటున్నా వారు ఆసక్తి చూపడం లేదు.  అటువంటి కుటుంబాల్లో పిల్లల భవిష్యత్తు కోసం సౌర శక్తి బ్యాటరీలతో వెలిగే, చిన్న బల్ల మీద గానీ, నేల మీద గానీ అమర్చుకొని చదువుకొనేందుకు వీలు కల్పించే చిన్న బల్బులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 

ఇక రైతులు భూగర్భ జలాన్ని వినియోగించుకోవాలంటే విద్యుత్తు వ్యయం ఎక్కువగా ఉంటోంది.  అయితే, ఇప్పుడు వాళ్లు సౌర పంపులు వాడుతున్నారు.  దీని బ్యాటరీలు సౌర శక్తి తో తిరిగి పూరించబడటమే కాక పొలానికి నీటిని కూడా అదే సమయంలో అందించవచ్చు.  పొలాలు పచ్చని పంటలతో కనువిందుగా కనిపిస్తాయి.  ఆ మేరకు రైతు ఏటా రెండు పంటలకు బదులు మూడు పంటలను పండించుకోవడం ప్రారంభిస్తాడు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకూ ఈ విధంగా సౌర పంపులు తోడ్పడతాయి.  కేంద్ర ప్రభుత్వం సౌర శక్తి రంగాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దుతోంది.  కేంద్రంతో చేయి కలిపి నడిచేందుకు ఝార్ ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది.  ఆ మేరకు సౌర శక్తి ప్రాజెక్టులతోపాటు ఇళ్ల పైకప్పులపై సౌర శక్తి ఉత్పాదనను ప్రోత్సహించడాన్ని నేను అభినందిస్తున్నాను.  శక్తి సమస్యపై అవగాహన ను పెంచుకోవాలని ఈ సందర్భంగా నేను దేశ పౌరులందరికీ చెప్పదలచుకున్నాను.  మన భవిష్యత్తు కోసం శక్తి ప్రాముఖ్యం, పరిరక్షణ లను గురించి మనం అర్థం చేసుకోవాలి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్ ఇడి బల్బుల వినియోగంపై ఉద్యమం నడుస్తోంది.  ప్రజలకు 10 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని ఏదైనా ప్రభుత్వం బడ్జెటులో ప్రకటిస్తే ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. జనం మోదీ గారికి జేజేలు కొడతారు.. పత్రికల్లో 10 వేల కోట్ల రూపాయల పంపిణీ వార్తే పతాక శీర్షిక అవుతుంది.  అయితే.. మిత్రులారా! మీ సహకారంతో 10 వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తం మీ జేబు లోకి నేరుగా చేరేవిధంగా మేం చర్యలు తీసుకొన్నాం.  మేమేం చేశామో తెలుసా ?!  విద్యుత్తు పొదుపు దిశగా ఎల్ఇడి బల్బులను ఏర్పాటు చేశాం.  దీంతో మీ విద్యుత్తు బిల్లు తగ్గింది.  దీనివల్ల మీలో కొందరు రూ.250, మరికొందరు రూ.1,000, ఇంకొందరు రూ.2 వేల దాకా ఏటా పొదుపు చేసుకోగలరు.  ఆ సొమ్ము పేద పిల్లలకు ఆహారం సమకూర్చడానికి సాయపడుతుంది.  మేము అధికారంలోకి వచ్చే నాటికి ఎల్ఇడి బల్బు ధర రూ.350- 400 గా ఉండేది.  నేడు అదే బల్బు ధర కేవలం రూ.60 స్థాయికి దిగివచ్చింది.  దేశవ్యాప్తంగా 22 కోట్ల బల్బులను ప్రభుత్వం పంపిణీ చేసింది. కొందరు ప్రజలు స్వయంగా వీటిని కొనుగోలు చేశారు.  దీంతో దేశంలోని వేలాది ఇళ్లలో నేడు 50 కోట్ల కొత్త ఎల్ఇడి బల్బులు ఏర్పాటయ్యాయి.  తద్వారా విద్యుత్తు బిల్లులలో ఆదా అయిన సొమ్ము రూ.11వేల కోట్లకు పైబడింది.  విద్యుత్తును పొదుపు చేసిన వారే ఈ సొమ్మును పొదుపు చేశారు.  అంటే.. ఒక చిన్న అడుగు విప్లవంగా రూపుదాల్చింది.  ఒక వైపు విద్యుత్తు పొదుపు ద్వారా, మరో వైపు సౌర శక్తి వినియోగం ద్వారా ఒక విధంగా మనం 360 డిగ్రీల కోణం ఉన్న నెట్‌వ‌ర్క్‌ ను రూపొందిస్తున్నామన్న మాట.  దీని నుండి లబ్ధి పొందే వారిలో మీరు కూడా ఉన్నారు.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

ఇక్కడ నా ముందు కూర్చున్న యువతరంలో కొందరు పచ్చని పూలు ఉన్న టోపీలను ధరించి ఉన్నారు.  వారెంతో చక్కగా కనిపిస్తున్నారు.  వారంతా పహాడియా సమాజ మూల తెగ వారి పిల్లలు.  వారికి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఇప్పటి దాకా దక్కలేదు.  అయితే, ఝార్ ఖండ్ లో పహాడియా సమాజ యువతకు రఘువర్ దాస్ గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అభినందిస్తున్నాను.  ఆయన తీసుకొన్న ఈ చొరవను మీరంతా కూడా చప్పట్లతో అభినందించండి.  ఇందుకోసం ఆయన ప్రభుత్వ నిబంధనలను సవరించారు.  వారి ఎత్తును, విద్యార్హతలను సడలించారు.  వారికి శిక్షణను అందించి భద్రత సిబ్బందిగా నియమించారు.  ఒక విధంగా వారు ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు.  సోద‌రులు మరియు సోదరీమణులారా! అత్యంత వెనుకబడిన భారతీయులలో పహాడియా వాసుల పిల్లలు మరీ వెనుకబడిన వారు.  ఈ తెగ లోని బాలికలను కూడా ప్రధాన అభివృద్ధి స్రవంతి లోకి తీసుకొచ్చే కృషి జరుగుతోంది.  వీరంతా వారి ధ్రువపత్రాలను స్వీకరించడానికి వచ్చినపుడు వారి నడకలో కనిపించిన దేహ భాష, వారు నమస్కరించిన విధానం, ప్రసార మాధ్యమాల వారితో వారి మాట తీరు, వారి ఆత్మవిశ్వాసం చూశాక వారంతా మనం గర్వపడేలా చేయబోతున్నారని నాకు విశ్వాసం కలిగింది.  మిత్రులారా! పహాడియా సమాజంలోని ఈ నా మిత్రులు ఝార్ ఖండ్ భద్రతకు కొత్త బలాన్ని ఇస్తారు.  అందుకే దయచేసి మరో సారి చప్పట్లతో మీ గర్వాన్ని చాటండి.  ఇంతటి ప్రాధన్యం గల పనిని చేసినందుకు మీరంతా రఘువర్ దాస్ గారిని అభినందించాలి. సమాజంలో పేదలు, గిరిజనుల కన్నా కూడా అత్యంత వెనుకబడిన వారు, తరాల తరబడి పాఠశాలకు వెళ్లే అవకాశం లభించని వారైన పహాడియా తెగల పిల్లలు నేడు మన ముందు ఉన్నారు.  ఈ పిల్లలను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. వీరిని ఇలాగ చూడడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.  నేను కలలు కంటున్న న్యూ ఇండియా కు వీరు పునాది కాగలరు.  ఇదే నా న్యూ ఇండియా.  దేశం లోని ప్రతి పేదవారు భారతదేశ ప్రగతి పయనంలో భాగస్వామి అవుతారనేందుకు ఇదో ఉదాహరణ.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

ఈ వేదికపై ఇవాళ కొందరు మహిళలు కనిపించారు.  మీరంతా చాలా దూరంలో ఉన్నారు గనుక వారు మీకు బాగా కనిపించి ఉండరని భావిస్తున్నాను.  అయితే, ఝార్ ఖండ్ ప్రభుత్వం తరఫున వారికి నేను మొబైల్ ఫోన్ లను బహూకరించాను.  వారంతా నా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం నేను గమనించాను.  యాప్ అంటే ఏమిటో, భీమ్ యాప్ అంటే ఏమిటో, దానిని ఎలాగ ఫోన్ లోకి రప్పించుకోవాలో, డబ్బు లావాదేవీల కోసం ఫోన్ ల సాయంతో ఏ విధంగా దానిని వాడుకోవాలో కూడా వారికి బాగా తెలుసు.  నాకు అంతులేని ఆనందంగా ఉంది.  పార్లమెంటులో కొందరు మిత్రులు నన్ను ప్రశ్నించారు.  మొబైల్ ఫోన్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడం, దానిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవడం దేశం లోని పేదలకు ఎలా సాధ్యం ? అన్నది వారి ప్రశ్న.  మొబైల్ ఫోన్ లను ఎలా వాడుకోవాలో దేశంలో సంథాల్ వంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో నా ఆదివాసీ సోదరీమణులు నాకు ఎరుకపరిచారని పార్లమెంటులో నన్ను ప్రశ్నించిన మిత్రులకు కచ్చితంగా వివరిస్తాను.  విప్లవమంటే ఇదే.. ఇదే డిజిటల్ విప్లవం. తక్కువ నగదుతో కూడిన సమాజ విప్లవం ఇది.  నోట్ల రద్దు అనంతరం ప్రతి ఒక్కరు వారి మొబైల్ ఫోన్ నే బ్యాంకుగా మార్చివేసుకొన్నారు.  మహిళా స్వయం సహాయ బృందాలకు నాయకత్వం వహించే మహిళలే ఫోన్ కలిగి ఉంటారు.  అది బ్యాంకుకు, ఖాతాదారుల ఫోన్ లకు అనుసంధానం అవుతుంది.  ఇదీ ఒక విప్లవం అవుతుంది.  సంథాల్ ప్రాంతం లోని ఈ స్వయం సహాయ సంఘాల సోదరీమణులందరికీ నా అభినందనలు.

 

నాకు నేటికీ స్ఫూర్తినిచ్చే నా పూర్వానుభవాన్ని గురించి చెప్తాను.. ఇది నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ముచ్చట.  దక్షిణ గుజరాత్ ప్రాంతంలో ‘కపర్దా’ అనే గిరిజన గ్రామం ఉండేది.  అయితే, ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం నాకెన్నడూ రాకపోవడంతో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడికి నేను వెళ్లలేకపోయాను.  ఆ ప్రాంతమంతా పూర్తిగా అడవులే కావడంతో చిన్నపాటి సమావేశం నిర్వహించడానికైనా కాసింత స్థలం ఉండేది కాదు.  గిరిజన నివాసాలు కూడా అక్కడొకటీ, ఇక్కడొకటీ ఉండేవి.  అయితే, అక్కడికి వెళ్లాలని నేను నిర్ణయించుకున్న తరువాత అక్కడో డెయిరీని, పాల శీతలీకరణ కేంద్రాన్ని కూడా ప్రారంభించాం. పాలను డెయిరీకి తరలించే ముందు 2 నుండి 4 గంటల పాటు పాలను ఈ కేంద్రంలో నిల్వ చేసే వాళ్లు. ఇది రూ.25- 50 లక్షల మధ్య వ్యయంతో ఏర్పాటైన చిన్న ప్రాజెక్టు.  దీనికోసం నేను అక్కడికి వస్తున్నానని తెలిసి అందరూ నిరుత్సాహపడ్డారు.  కేవలం రూ.50 లక్షల కార్యక్రమం కోసం మీరక్కడికి వెళ్లాలని నిజంగానే భావిస్తున్నారా ? అని కూడా ప్రశ్నించారు.  అయితే, నేనక్కడికి వెళ్లాలనే నిర్ణయించుకున్నాను.  అక్కడ జన సభ ను నిర్వహించడం దుర్లభం అయింది.  దీంతో అక్కడికి 3, 4 కిలోమీటర్ల దూరంలోని పాఠశాల ప్రాంగణంలో సభ ఏర్పాటైంది.  ఈ సందర్భంగా కొందరు మహిళలు శీతలీకరణ కేంద్రానికి పాల పాత్రలతో వచ్చారు.  ఆ కార్యక్రమం విజయవంతమైంది.  అటుపైన పాల పాత్రలు తెచ్చిన మహిళలు వాటిని పక్కన పెట్టి తమ ఫోన్ లతో నన్ను ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. అక్కడ సుమారు 30 మంది మహిళలుండగా ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఫోన్ ఉండటం గమనార్హం. వారు దూరం నుండి ఫొటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది గమనించి నేను వారి దగ్గరకు వెళ్లాను. ఆశ్చర్యం!… ఏంచేస్తున్నారంటూ వాళ్లను నేనడిగాను.. ‘మేం మీ ఫొటోలు తీస్తున్నాం’ అని వారు బదులిచ్చారు. ఈ ఫొటోలతో మీరేం చేస్తారు ? అని వారిని ప్రశ్నించాను. వాటిన్ని మేం డౌన్లోడ్ చేసుకుంటామని వారు చెప్పారు. వారి నోట ‘డౌన్ లోడ్’ అనే మాట విన్న నాకు నోట మాట రాలేదు. సామాన్యులు కూడా ఆధునిక శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోగల సమర్థులన్న వాస్తవాన్ని ఉన్నత సమాజ వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేరు.  అదే విధంగా ఇక్కడ నా ఆదివాసీ సోదరీమణుల నుండి తాము కూడా ‘డిజిటల్ విప్లవం’లో భాగస్వాములం కాగలమనే మాటను నేను ఇక్కడ మరో సారి విన్నాను.  దీనిని విజయవంతం చేయాలని మేం కృత నిశ్చయంతో ఉన్నాం.  మొబైల్ ఫోన్ అనుసంధానం ద్వారా స్వయం సహాయ సంఘాల మహిళలను ఈ విప్లవ సైనికులుగా తీర్చిదిద్దే ఉద్యమాన్ని ప్రారంభించిన ఝార్ ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను.  యుగం మారుతున్నది… ఆ యుగం దిశగా మన పయనమూ సాగాల్సిందే మరి!

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

దేశంలోని పేదలు గౌరవప్రదంగా జీవించాలని భావిస్తున్నారు.   భారతదేశ ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వారంతా సగౌరవ జీవనాన్ని కోరుకొంటున్నారు.  తమకు ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేదని వారు భావిస్తున్నారు.  తనకు అవకాశం కావాలని, తన భవిష్యత్తును తానే సృష్టించుకోగలనని నేటి యువత దృఢ సంకల్పాన్ని చాటుతోంది.  ఈ పేద, అణగారిన, దోపిడీకి గురైన ఆదివాసీ పిల్లల్లోని బలం ఇదే.  ఈ పిల్లలు, యువతరం కోసమే నేను నా శక్తియుక్తులను వినియోగిస్తున్నాను.  తద్వారా వారు వారి భవితనే కాకుండా దేశ భవిష్యత్తును కూడా మార్చేందుకు కృషి చేయగలుగుతారు.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

అవినీతి మన దేశాన్ని చెదపురుగులా నాశనం చేసింది.  దానిని ఒక చోట నిర్మూలిస్తే మరో చోట ఉద్భవిస్తోంది.  అక్కడా శుభ్రం చేసినా ఇంకొక చోట తలెత్తుతోంది.  కానీ, మీ ఆశీస్సులతో దానిపై నా పోరాటాన్ని కొనసాగిస్తాను.  పేదలను, వారి సంపదను దోచుకున్నవారు తిరిగి దాన్ని వారికి అందజేయాల్సిందే.  అలా జరిగేదాకా నాకు మనశ్శాంతి లేదు.  ఒకదాని తర్వాత మరొకటిగా నేను చర్యలు తీసుకుంటాను. అందువల్ల సోద‌రులు మరియు సోదరీమణులారా! నీతి, నిజాయితీల కోసం సాగే నా ఈ పోరాటానికి సదా మీ ఆశీస్సులుండాలి.  పెద్ద నోట్ల రద్దు తరువాత నేను యువతరంలోని కొందరితో మమేకమయ్యే అవకాశం లభించింది. వారంతా సంపన్న కుటుంబాలకు చెందిన ఉన్నత విద్యావంతులు.  పెద్ద నోట్ల రద్దు వల్ల వారంతా చికాకు పడి ఉంటారని, బాధకు గురై ఉంటారని నేను భావించాను.  కానీ, వారు చెప్పిన విషయాలు చాలా ఆసక్తిని కలిగించాయి.   తాము తమ తల్లిదండ్రులతో ఇలా చెప్పామని వారు తెలిపారు- ‘‘మీ కాలంలో చట్టాలు భిన్నంగా ఉండేవి.  పన్ను శాతం చాలా ఎక్కువగా ఉండేది.  అందువల్ల మీరు కూడా అవినీతి వలయంలోకి వెళ్లిపోయారు. కానీ, ఈ యుగంలో దేశంలోకి నిజాయతీ ప్రవేశించింది.  కాబట్టి మా తరంలో మేమంతా ఈ అవినీతి కార్యకలాపాల్లో భాగం కాదలచుకోలేదు.  మేమంతా శాంతియుతంగా, నిజాయతీతో జీవించాలని కోరుకుంటున్నాం.  ఆ మేరకు మా తరంలో నిజాయితీ శకం ప్రారంభమైంది. నిజాయతీగా బతకాలన్న ఆకాంక్ష ఆవిర్భవించింది.’’  దేశంలోని యువతరం ఇలాంటి ఆలోచనలతో ఉన్నపుడు మన పూర్వికులు, తల్లితండ్రులు చేసినట్లు వారు చేయవలసిన అవసరం రాదు.  ఇది నాకు, నా దేశానికి శుభ సంకేతం.

 

సోద‌రులు మరియు సోదరీమణులారా!

 

దొంగతనం, దోపిడీలతో నిమిత్తం లేకుండా కూడా మనం శాంతియుతంగా, సంతోషంగా జీవించగలం.  సంతృప్తితో చక్కగా నిద్రపోగలం.  అందువల్ల మనమంతా నిజాయితీ శకం వైపు నడవాలి.  రాబోయే 2022 కల్లా మన స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతాయి.  సోద‌రులు మరియు సోదరీమణులారా! ఇదేదో కేలండర్ లో కనిపించే చర్చనీయాంశ తేదీ ఎంత మాత్రం కాదు. ఈ ప్రాంతానికి చెందిన బిర్సా ముండా గారు, ఇతర ప్రాంతాల్లోని అలాంటి యోధులు దేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మత్యాగం చేశారు. ఎవరి కోసం వారిలా చేశారు?   స్వతంత్ర భారత దేశం కోసం వారంతా స్వప్నించారు.  అందుకే తమ జీవితాలను అర్పించడానికి కూడా వారు వెనుకాడలేదు.  స్వప్న సాకారం కోసం ఉరికొయ్యలను వరించడానికి కూడా నాటి యోధులు వెనుకాడలేదు.  మన కోసం చాలా మంది వారి జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని జైళ్లలో గడిపేయాల్సి వచ్చింది.  మరి.. మనం మన సమయంలో ఐదేళ్లు ఇవ్వలేమా ?  ఈ దేశ సేవ కోసం నేనడుగుతున్నది ఐదేళ్లు మాత్రమే… ఈ సమయంలో దేశం కోసం మనమంతా ఎంతో కొంత చేద్దాం.   దేశంలోని 125 కోట్ల మంది ప్రజల స్వప్నం ఇదే కావాలి.  అందరూ మూకుమ్మడిగా సంకల్పం పూనాలి.  మన 75 ఏళ్ల స్వతంత్రానికి ఇక ఐదేళ్లు మాత్రమే మన చేతిలో ఉన్నాయి.  సమాజం కోసం మనం ఏదైనా చేయాలి.  ప్రతి భారతీయుడూ ఒక అడుగును ముందుకు వేస్తే ఈ విప్లవంతో దేశం 2022 దిశగా 125 కోట్ల అడుగులు ముందుకు పోళ్తుంది.  ఇదే మన బలం.. మిత్రులారా!  అందువల్ల మనమంతా 2022 కల్లా మన గమ్యాన్ని చేరుకోవాలని సంకల్పం పూనుదాం.  మనం ప్రభుత్వ విభాగంలో ఉన్నామా, నగరపాలికలో ఉన్నామా, నగర పంచాయతీలో ఉన్నామా, పాఠశాలలో ఉన్నామా, గ్రామంలో ఉన్నామా, చిన్న పల్లెలో ఉన్నామా, కుటుంబంలో ఒకరుగా ఉన్నామా ? అన్నదానితో నిమిత్తం లేదు.  ప్రతి భారతీయుడూ న్యూ ఇండియా ను ఒక స్వప్నంగా మార్చుకుంటే… దేశం కోసం ప్రాణార్పణం చేసిన మహనీయుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా 2022 లక్ష్యం వైపు పయనించగలం.  ఆ మేరకు ‘నా దేశం ముందుకు వెళుతోంది’ అన్న కలతో మనమంతా ముందడుగు వేయాలి.  ఈ ఆశతో నేను మరోసారి ఝార్ ఖండ్ రాష్ట్రానికి నమస్కరిస్తున్నాను.  బిర్సా ముండా జన్మభూమికి నమస్కరిస్తున్నాను.  ఈ పహాడియా యువతను అభినందిస్తున్నాను.  ఝార్ ఖండ్ ప్రజలకు నా శుభాకాంక్షలు.  గంగా మాత ఆశీస్సులు కోరుకుంటూ మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం.  ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక విప్లవం తెస్తుంది.  ఈ నమ్మకం, విశ్వాసంతో మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.