పిఎంఇండియా
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టి ఒ)కు చెందిన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ (టి ఎఫ్ ఎ) కింద చేసిన వాగ్ధానాలను నోటిఫై చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రోటోకాల్ ఆఫ్ టి ఎఫ్ ఎ కు సంబంధించిన సమ్మతిని, స్వీకారాన్ని తెలియజేస్తూ డబ్ల్యు టి ఒ సచివాలయానికి సమాచారం ఇవ్వడం, అలాగే నేషనల్ కమిటీ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ (ఎన్ సీ టీ ఎఫ్) ఏర్పాటుకు కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
ప్రయాణంలో ఉన్న వస్తువులు సహా సరుకుల కదలికలను, విడుదలను వేగవంతం చేయడానికి అవసరమైన నిబంధనలను ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ లో పొందుపరిచారు. అంతే కాకుండా ట్రేడ్ ఫెసిలిటేషన్ ను, కస్టమ్స్ నిబంధనావళిని పాటించడానికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు పరస్పరం తీసుకోవలసిన విస్తృత చర్యలను కూడా ఈ అగ్రిమెంట్ నిర్దేశిస్తుంది. ఈ లక్ష్యాలు భారతదేశ “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” కార్యక్రమానికి అనుగుణంగానే ఉన్నాయి. డబ్ల్యు టి ఒ సభ్య దేశాలలో మూడింట రెండు వంతుల దేశాలు అంగీకరించిన తరువాత ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ నోటిఫైడ్ సభ్య దేశాలలో అమలులోకి వస్తుంది.
అగ్రిమెంట్ దేశంలో చక్కని సమన్వయంతో అమలయ్యేలా చూడటానికి నేషనల్ కమిటీ ఆన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ ను ఏర్పాటు చేస్తారు. దీనికి రెవిన్యూ విభాగ కార్యదర్శి , వాణిజ్య విభాగ కార్యదర్శి.. ఇరువురూ సంయుక్త అధ్యక్షత వహిస్తారు.