Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త్వరలో మలేసియా, సింగపూర్ పర్యటనలకు ప్రధాని మోదీ


నవంబరు 21వ తేదీ 2015 నుంచి నవంబరు 24వ తేదీ 2015 వరకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలేసియా, సింగపూర్ లలో పర్యటించనున్నారు.

ఫేస్ బుక్ లో వెల్లువెత్తిన పలు పోస్టులకు ప్రధాన మంత్రి ఈ విధంగా జవాబు ఇచ్చారు:

‘‘నాలుగు రోజుల పర్యటనలో భాగంగా, ఇంకా మలేసియా, సింగపూర్ లకు వెళ్లనున్నాను. మలేసియాలో నేను ఏషియన్-ఇండియా సదస్సు మరియు పదో తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నాను. ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ తోపాటు సదస్సుకు రానున్న పలువురు ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరపనున్నాను. సింగపూర్ లో… భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ తో చర్చలు జరుపుతాను. మలేసియా, సింగపూర్ లకు నా పర్యటనల లక్ష్యం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం మరియు మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని మరింత పటిష్ఠం చేయడం. నా ఈ పర్యటనకు సంబంధించిన తాజా వార్తలు, అప్ డేట్స్ ను మీరు మొబైల్ యాప్ http://nm4.in/dnldapp నుంచి పొందవచ్చు.

మన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో మలేసియా ప్రధాన భూమిక పోషిస్తుంది. 2010 నుంచి భారతదేశం మలేసియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. మలేసియా పెట్టుబడులు మరీ ముఖ్యంగా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి భారత్ లో చాలా బలంగా ఉన్నాయి. మలేసియాతో భారతదేశ వాణిజ్యం కూడా దేదీప్య‌మానంగా ఉంటుంది… ప్ర‌త్యేకించి కమోడిటీస్ రంగంలో.

నా మలేసియా పర్యటనలో, ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ను కలుస్తాను. ద్వైపాక్షిక సంబంధాలపై ఆయనతో చర్చిస్తాను. టోరానా గేట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటాను. మలేసియా కార్పొరేట్ రంగ ప్ర‌ముఖ‌ల‌తోను చర్చలు జరుపుతాను. నా పర్యటనలో భాగంగా రామకృష్ణ మిషన్ ను సందర్శిస్తాను. అక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను. అలాగే బాతు కేవ్స్ దేవాలయాన్ని సందర్శిస్తాను.

భారత సంతతికి చెందిన దాదాపు 20 లక్షల మందికిపైగా మలేసియాలో నివసిస్తున్నారు. సామాజిక కార్యక్రమంలో భాగంగా వారితో కూడా సంప్రదింపులు జరపనున్నాను. రెండు దేశాలనూ సన్నిహితంగా తీసుకు రావడంతోపాటు వారు సాధించిన ఘనతలకు సంబంధించి మన జాతి జనులకు శాల్యూట్ చేయాల్సిందే.

మలేసియా తర్వాత, నేను సింగపూర్ లో పర్యటిస్తాను. భారత్-సింగపూర్ మధ్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుత నా పర్యటన కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.

సింగపూర్ తో సంబంధాలకు భారతదేశం అత్యధిక ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. భారతదేశంలో సింగపూర్ ప్రఖ్యాత పెట్టుబడిదారు. అలాగే, పలు భారతీయ కంపెనీలు కూడా తమ తమ వ్యాపార కార్యకలాపాలను సింగపూర్ కు విస్తరిస్తున్నాయి. సింగపూర్ విజయం నిజంగా గుర్తుంచుకోదగ్గది. పట్టణాభివృద్ధి, పట్టణ రవాణా, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ఓడ‌రేవుల‌ అభివృద్ధి మరియు స్కిల్ డెవలప్ మెంట్ లో సింగపూర్ సాధించిన ఘనతలు అందరికీ సుపరిచితమే. ఆయా రంగాల్లో భారత్-సింగపూర్ సహకారానికి సంబంధించి నా సింగపూర్ పర్యటనలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాను.
నా మొట్టమొదటి కార్యక్రమం సింగపూర్ లెక్చర్ ఇవ్వడం. అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్, ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ మరియు గౌరవ సీనియర్ మంత్రి మిస్టర్ గో ఛోక్ టాంగ్ తో చర్చలు కూడా ఉంటాయి. గతంలో వివిధ సందర్భాల్లో కూడా వారిని కలిసిన గౌరవం నాకు దక్కింది. అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించారు కూడా.