Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీ జయంతి… నివాళులు అర్పించిన ప్రధానమంత్రి


పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి ‘అంత్యోదయ’ దృష్టికోణంతో పాటు, సాటి సమాజం ఆదరించకుండా దూరంగా అట్టిపెట్టేసిన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడాలన్న ఆయన ఆదర్శాలు దేశ నిర్మాణానికి మూలాధారమని ప్రధానమంత్రి అన్నారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ సామాజిక, జాతీయ బాధ్యతలను నెరవేర్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో శ్రీ మోదీ పంచుకున్నారు. ఈ సుభాషితం.. అదృష్టం కన్న నిరంతర కృషితో, సాహసంతో విజయాన్నీ, నూతన ఆవిష్కరణలనీ సాధించవచ్చని మనకు బోధిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘దేశ సేవకు అంకితమైన అసలైన సాధకుడు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఇవే గౌరవపూర్వక నమస్సులు. సమాజంలో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోయిన ఆఖరి వ్యక్తిని కూడా ఉన్నత స్థానానికి తీసుకురావడం దేశ నిర్మాణానికి కీలకమని ఆయన భావించారు. అంత్యోదయ వంటి ఒక ఆలోచనా స్రవంతిని మనకు అందించారు. ఈ భావజాలంతో, నేటికీ ప్రజాసంక్షేమానికి అద్భుత స్ఫూర్తి లభిస్తున్నది. ఆయన ఆలోచనలను, ఆదర్శాలను మనలో ఇముడ్చుకొని సామాజిక, జాతీయ కర్తవ్యాలను నెరవేర్చాలన్న సంకల్పానికి ఈ విశిష్ట సందర్భంలో పునరంకితం అవుదాం.. ముందుకు రండి.

యథా యథా ప్రయత్నః స్యాద్భవేదాశు ఫలం తథా

ఇతి పౌరుషమేవాస్తి దైవమస్తు తదేవ చ

ఏ వ్యక్తిలో అయినా ప్రయత్నం, పట్టుదల ఎంత అధికంగా ఉంటే, అంత త్వరగా విజయాన్ని సాధించవచ్చు. నూతన ఆవిష్కరణలు కూడా నిరంతర ప్రయత్నం వల్ల సాధ్యపడతాయి. కాబట్టి భాగ్యం కన్న తదేక దీక్షతో పనిచేసినప్పుడూ, సాహసంతో ముందుకు పోయినప్పుడూ, కొత్త కొత్త ఆలోచనలను సాకారం చేయాలని గట్టిగా అనుకున్నప్పుడూ విజయం సిద్ధించడమే కాకుండా నూతన ఆవిష్కరణకు కూడా మార్గం సుగమం అవుతుందని పైన ప్రస్తావించిన సంస్కృత సుభాషితం మనకు సూచిస్తోంది’’ అని పేర్కొన్నారు.

 

***