స్టాండ్-అప్ ఇండియా పథకాన్ని 31.03.2031 వరకు అంటే మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) ప్రజలు నూతన పరిశ్రమలు స్థాపించేందుకు ఈ పథకం ప్రోత్సాహం అందిస్తుంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో అదనంగా 2.5 లక్షల మంది నూతన పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. 2016 ఏప్రిల్ నెలలో ప్రారంభమైనప్పటి నుంచి, ఈ పథకం ద్వారా 2.75 లక్షలకు పైగా మహిళా/ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించారు.
పథకం ముఖ్య లక్షణాలు:
అర్హులైన రుణగ్రహీతలు: కొత్త, గ్రీన్ ఫీల్డ్ సంస్థలను స్థాపించే మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
అందించే మొత్తం సహాయం: రూ. 10.00 లక్షల కంటే ఎక్కువ నుంచి రూ. 1.00 కోటి వరకు రుణాలను ‘కాంపోజిట్ లోన్’ (వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్ కలిపి) రూపంలో లేదా కేవలం ‘టర్మ్ లోన్’ రూపంలో పొందవచ్చు. (ఇది ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 85 శాతం వరకు ఉంటుంది).
అర్హత కలిగిన రంగాలు: తయారీ, సేవలు, వాణిజ్యం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు.
క్రెడిట్ గ్యారెంటీ కవరేజీ: రుణ మొత్తంలో 85 శాతం
గ్యారెంటీ ఫీజు: 0.50 శాతం ప్రామాణిక గ్యారెంటీ ఫీజు
ప్రభావం:
మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కల్పించడం… తద్వారా వెనకబడిన వర్గాల ప్రజలు పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయడానికి, వారి వ్యవస్థాపన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వీలు కల్పించడం… సమ్మిళిత ఆర్థిక వృద్ధికి తోడ్పడటం.
***