పిఎంఇండియా
భారత్ మాతా కీ జై!!!
ఇంతటి అపారమైన ఆదరాభిమానాలు.. ఇంతటి అద్భుతమైన ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నేను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయాను. భారత్‌లోనే ఎక్కడో ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా హేగ్ నగరానికి ‘‘శాంతి, న్యాయాల నగరం’’గా గుర్తింపు ఉంది. కానీ నేడు ఇక్కడి వాతావరణం చూస్తుంటే.. ఈ హేగ్ నగరం భారతీయ స్నేహబంధానికి ఒక సజీవ చిహ్నంగా మారినట్లు అనిపిస్తోంది.
ఒకరి పాస్‌పోర్ట్ రంగు మారవచ్చు, ఒకరి చిరునామా మారవచ్చు, చివరికి ఒకరి టైమ్ జోన్ కూడా మారవచ్చు. కానీ భరతమాత బిడ్డలు ఎక్కడ నివసించినా.. ఈ ఆప్యాయత, ఈ చైతన్యం, జీవితాన్ని పండుగలా జరుపుకునే ఈ స్ఫూర్తి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి.
ఈ ఆత్మీయ స్వాగతానికి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఇరువైపులా యావత్ మహారాష్ట్రను, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను, మేరో ప్యారో రాజస్థాన్‌ను, అస్సాం సంస్కృతిని ప్రతిబింబించే దృశ్యాలను చూశాను.
మిత్రులారా,
ఈరోజు మీ అందరినీ కలిసిన తర్వాత నెదర్లాండ్స్ రాజు, రాణిగారిని కలుసుకునే అవకాశం నాకు లభించనుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో కూడా నేను పలు విషయాలపై కూలంకషంగా చర్చలు జరుపుతాను.
గత కొన్నేళ్లుగా నేను నెదర్లాండ్స్ నాయకులతో మాట్లాడినప్పుడల్లా వారు ప్రవాస భారతీయుల గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవారు. మీ అందరినీ వారు ఎంతో ప్రశంసించారు. డచ్ సమాజానికి, ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు మీరు చేస్తున్న సేవకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు.
ఈ శుభ సందర్భంలో నెదర్లాండ్స్ ప్రజలకు, ఇక్కడి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 140 కోట్ల మంది భారతీయ ప్రజల తరఫున ఈ దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేను ఇంతకుముందు కూడా నెదర్లాండ్స్‌లో పర్యటించాను. నా పాత మిత్రులు కొందరు ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో నాకు గతంలోనూ మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్న చాలా కుటుంబాల కథ కేవలం వలసకు సంబంధించిన కథ మాత్రమే కాదు… అది సంస్కృతి, నమ్మకం, లెక్కలేనన్ని పోరాటాల మధ్య సాధించిన ప్రగతికి నిదర్శనం.
ఆ రోజుల్లో రెండు మహా సముద్రాలు దాటిన తర్వాత కూడా భారతీయుల గుర్తింపు ఇంత శక్తిమంతంగా, సజీవంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మీ పూర్వీకులు ఎన్నో విషయాలను వెనుక వదిలి వెళ్ళి ఉండవచ్చు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయాయి. వారి మాతృభూమి మట్టి సువాసన, వారి పండుగల జ్ఞాపకాలు, భక్తి కీర్తనల మధురామృతం, వారి పూర్వీకులు అందించిన విలువలు ఎప్పటికీ చెక్కు చెదరలేదు.
మిత్రులారా,
కాలక్రమేణా అనేక సంస్కృతులు కనుమరుగైపోయాయని మానవ చరిత్ర సాక్ష్యంగా చెబుతోంది. కానీ భారతీయ విభిన్న సంస్కృతి నేటికీ తన ప్రజల హృదయాలలో బలంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. తరాలు మారాయి, దేశాలు మారాయి, చుట్టూ ఉన్న వాతావరణం మారింది. కానీ కుటుంబ విలువలు మాత్రం మారలేదు. మనం ఒకే కుటుంబమనే ఆత్మీయ భావన అస్సలు మారలేదు. మీరు డచ్ భాషను అక్కున చేర్చుకునప్పటికీ మీ పూర్వీకుల భాషను మాత్రం వదిలిపెట్టలేదు.
ఇక్కడ మన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ కేంద్రాల ద్వారా దేశీయ సంగీతం, సంస్కృతి డచ్ కుటుంబాలకు కూడా చేరువవుతున్నాయి. గాంధీ కేంద్రం కావచ్చు లేదా వివిధ నగరాల్లోని పాఠశాలలు కావచ్చు, మీరు మీ సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారు. ఇది నిజంగా ప్రశంసనీయం. మీరందరూ అభినందనలకు, శుభాకాంక్షలకు అర్హులు.
మిత్రులారా,
ఈరోజు మే 16వ తేదీ. ఈ రోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. పన్నెండేళ్ల క్రితం సరిగ్గా 2014 మే 16న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సరిగ్గా ఇదే రోజున లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దాల తర్వాత దేశంలో పూర్తి మెజారిటీతో కూడిన ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం ఆ రోజుతోనే ఖాయమైంది. ఆ రోజు నుంచి నేటి వరకు కోట్ల మంది భారతీయులు నాపై ఉంచిన నమ్మకం నన్ను ఎక్కడా ఆగనివ్వడం లేదు. అలసిపోనివ్వడం లేదు. ఈ ప్రయాణం నిరంతరాయంగా, అవిశ్రాంతంగా కొనసాగుతోంది.
మిత్రులారా,
చిన్న వయస్సు నుంచే నాలో దేశభక్తి భావం బలంగా నాటుకుపోయింది. మీరందరూ నా కుటుంబంగా సభ్యులుగా మారిపోయారు. నేను ‘స్వార్థం నుంచి సమష్టి’ వైపు అడుగులు వేశాను. ‘నేను నా నుంచి మనం’ అనే మార్గాన్ని ఎంచుకున్నాను.
ఆ తర్వాత మీ సంతోషమే నా సంతోషంగా మారింది. మీ సంక్షేమమే నా బాధ్యత అయింది. అంకితభావంతో మీ అందరి ఆశీస్సులతో నా శక్తినంతటినీ ధారపోస్తూనే ఉన్నాను. కానీ ప్రజల నుంచి ఇంతటి అపారమైన ప్రేమ లభిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు.
నేను వెనుతిరిగి చూసుకుంటే ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల సేవ, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు.. ఇలా ప్రజాస్వామ్య ప్రపంచంలో 25 ఏళ్ల పాటు కోట్ల మంది ఓటర్ల నిరంతర మద్దతును పొందడం నా దృష్టిలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.
నాకు ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు. ఇవి మీ ఆశీస్సులు, నా అతిపెద్ద బలం. దేశ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు.. భారత ప్రజల కలలను సాకారం చేసేందుకు నా జీవితంలోని ప్రతి క్షణం నాకు స్పూర్తినిస్తూనే ఉన్నాయి.
మిత్రులారా,
ప్రపంచంలో ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలని అనుకుంటే పెద్ద కలలు కనాలి. ఈరోజు మన భారత్ కూడా చాలా పెద్ద కలలు కంటోంది. ఈరోజు దేశం చేబుతోంది… మాకు కేవలం మార్పు మాత్రమే వద్దు, అత్యుత్తమమైనది కావాలి. కేవలం అత్యుత్తమమైనదే కాదు, అత్యంత వేగవంతమైనది కూడా కావాలి. అందుకే దేశంలో ఆకాంక్షలు అపరిమితంగా ఉన్నప్పుడు మా ప్రయత్నాలు కూడా హద్దులు లేకుండా సాగుతున్నాయి.
భారతదేశ యువతనే ఉదాహరణగా తీసుకోండి. నేడు భారత్‌లోని యువత ఆకాశాన్ని తాకాలని ఆరాటపడుతున్నారు. వారు అంకుర సంస్థలను స్థాపించాలని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని, డ్రోనులను రూపొందించాలని, అలాగే కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ప్రపంచంలో భారత్‌ను ముందంజలో ఉంచాలని కోరుకుంటున్నారు. అందుకే దేశీయ స్టార్టప్ వ్యవస్థ నిరంతరం బలోపేతమవుతోంది. నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థ కలిగిన దేశంగా మనం నిలిచాం.
మిత్రులారా,
నేడు దేశ ఆకాంక్షలు కేవలం మన సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ రంగానికి కేంద్రంగా మారాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా ఎదగాలని, ప్రపంచ వృద్ధికి కీలక శక్తిగా నిలవాలని ఆశిస్తోంది. మన ఆకాంక్షలు అపరిమితమైనవి. వాటి కోసం మనం పెట్టే ప్రయత్నాలు కూడా అంతే విస్తృతమైనవి. రికార్డు స్థాయిలో రహదారుల నిర్మాణం, రికార్డు స్థాయిలో రైల్వే విద్యుదీకరణ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి సెమీ హై స్పీడ్ రైళ్లు, ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన విస్తరణలలో ఒకటి. లక్ష్యం ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా సరే.. మేం దానిని సాధించి తీరుతామని నేటి భారత్ చెబుతోంది. ఆ విషయాన్ని తన పనుల ద్వారా నిరూపిస్తోంది.
మిత్రులారా,
నేటి భారత్ అపూర్వమైన మార్పు దశ గుండా వెళుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం మీరు ఇటీవల చూసే ఉంటారు. అంతకు ముందు జీ20 న్యూఢిల్లీ సదస్సును కూడా భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. ఇది ఇప్పుడు నేటి దేశపు నైజంగా, ఆత్మవిశ్వాసంగా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక విశిష్ట కార్యక్రమాన్ని భారతదేశం అమలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలలో ఒకదానిని కూడా విజయవంతంగా చేపట్టింది. భారత్ డిజిటలైజేషన్‌ను అభివృద్ధి చేస్తున్న స్థాయి నిజంగా అపూర్వమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా పథకాన్ని కూడా భారత్ నిర్వహిస్తోంది. అంతేకాదు ఇంతకుముందు ఎవరూ చేరుకోని చంద్రుని ఉపరితల భాగానికి సైతం భారత్ విజయవంతంగా చేరుకుంది. అణుశక్తి రంగంలో కూడా ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ఒకదానిపై కూడా భారత్ విజయవంతంగా పనిచేస్తోంది.
మిత్రులారా,
దేశం సాధిస్తున్న అపూర్వమైన ప్రగతి మన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు దేశంలో నిర్మితమవుతున్న సోలార్ పార్కులు ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా నిలుస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన సొరంగ మార్గాలు కావచ్చు. అత్యంత ఎత్తైన, పొడవైన వంతెనలు కావచ్చు. అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేలు, భారీ మెట్రో నెట్‌వర్క్‌లు, అతిపెద్ద విమానయాన నెట్‌వర్క్‌లు లేదా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుదీకరించిన రైల్వే వ్యవస్థలు కావచ్చు.. వీటన్నింటిలోనూ అత్యధిక భాగం ఇప్పుడు మన దేశంలోనే రూపుదిద్దుకుంటున్నాయి.
ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఎంత విస్తృతంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లను పరిచిందంటే ఆ మొత్తం పొడవు భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి 11 రెట్లు కంటే ఎక్కువ ఉంటుంది. ఒక దశాబ్దం క్రితం మనం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ ఈరోజు ేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పాదక దేశంగా అవతరించింది.
మిత్రులారా,
ఈ వేగంతో పాటు నేటి భారత్‌కు మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. అదేనూతన ఆవిష్కరణల శక్తి. నేడు మన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది భారతీయుల అద్భుతమైన ఆవిష్కరణ సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం.
ఈరోజు డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి డిజిటల్ వాలెట్లు ఉన్నాయి. పత్రాలను భద్రపరుచుకోవడానికి డిజిలాకర్ ఉంది. ప్రయాణాలను సులభతరం చేయడానికి డీజీ యాత్ర ఉంది. అలాగే ఆరోగ్య సేవలను పొందడానికి డిజిటల్ హెల్త్ ఐడీ అందుబాటులో ఉంది.
మిత్రులారా,
ప్రస్తుతం దేశంలో ప్రతి నెలా 2,000 కోట్ల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. దీనర్థం ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ లావాదేవీలలో సగానికి పైగా కేవలం మన మన దేశంలోనే జరుగుతున్నాయి.
ఇక అంకుర సంస్థలు నేటి భారత యువత ఆలోచనా విధానంలో ఒక భాగమైపోయాయి. పన్నెండేళ్ల క్రితం దేశంలో 500 కంటే తక్కువ అంకుర సంస్థలు ఉండగా, ఈరోజు ఆ సంఖ్య 2,00,000 దాటిపోయింది. అదేవిధంగా 2014లో భారత్‌లో కేవలం 4 యూనికార్న్‌లు మాత్రమే ఉండేవి..కానీ ఈరోజు దేశంలో దాదాపు 125 క్రీయాశీల యూనికార్న్‌లు ఉన్నాయి. ఒక్క 2025 సంవత్సరంలోనే దాదాపు 44,000 కొత్త అంకుర సంస్థలు నమోదయ్యాయి. నేడు మన అంకుర సంస్థలు కృత్రిమ మేధ, రక్షణ, అంతరిక్షం వంటి రంగాలలో అద్భుతమైన కృషి చేస్తున్నాయి.
కాలంతో పాటు ఈ పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతి మరింత విస్తృతమవుతోంది. గడిచిన ఒక్క ఏడాదిలోనే దేశంలో 1,25,000 కంటే ఎక్కువ పేటెంట్లు దాఖలయ్యాయి.
మిత్రులారా,
చిప్ తయారీ, సెమీకండక్టర్ రంగంలో కూడా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో 12 సెమీకండక్టర్ ప్లాంట్ల పనులు సాగుతుండగా వాటిలో రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దీని అర్థం ఇకపై చిప్‌లు కూడా ‘‘డిజైన్డ్ ఇన్ ఇండియా’’, ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ కాబోతున్నాయి.
మిత్రులారా,
ఆకాంక్షలతో కూడిన భారతీయ ప్రయాణం మన ప్రజాస్వామ్యాన్ని కూడా మరింత బలోపేతం చేస్తోంది. ప్రజల కలలు సాకారమైనప్పుడు ప్రజాస్వామ్యంపై వారి నమ్మకం కూడా మరింత పటిష్టమవుతుంది.
మిత్రులారా,
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలనే ఉదాహరణగా తీసుకోండి. ఈసారి అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఓటింగ్ శాతం 80 నుంచి 90 శాతం వరకు నమోదైంది. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. ఈ ధోరణి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తోంది.
నేడు దేశంలో ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారితో పాటు మీరందరూ కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. మిత్రులారా ఏటా కొత్త ఓటింగ్ రికార్డులు నమోదవుతుండటంపై మేం ఎంతగానో గర్విస్తున్నాం.
మిత్రులారా,
దేశంలో 90 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో 64 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే యూరోపియన్ యూనియన్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది భారతీయులు ఓటు వేశారు. దేశం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని గౌరవిస్తుంది. ప్రజాస్వామ్యానికి తల్లిగా ఉన్న మనందరికీ ఇది ఎంతో గర్వకారణమైన విషయం.
మిత్రులారా,
భారత్ విజయం సాధించినప్పుడల్లా దాని వల్ల మానవాళి అంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. కానీ నేడు మానవాళి ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచం ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త సవాళ్లతో ఎలా పోరాడుతుందో మనం చూస్తున్నాం.
మొదట కరోనా మహమ్మారి వచ్చింది. ఆ తర్వాత యుద్ధాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దశాబ్దం ప్రపంచానికి విపత్తుల దశాబ్దంగా మారుతోంది.
ఈ పరిస్థితులను గనుక మనం త్వరగా మార్చకపోతే గత కొన్ని దశాబ్దాలుగా సాధించిన పురోగతి వృథా అయిపోయే ప్రమాదం ఉందని మనందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో చాలా పెద్ద భాగం మళ్లీ పేదరికపు ఊబిలోకి నెట్టేసే అవకాశం ఉంది.
మిత్రులారా,
ఇలాంటి ప్రపంచ పరిస్థితుల్లో నేడు ప్రపంచమంతా స్థితిస్థాపక సరఫరా వ్యవస్థల గురించి మాట్లాడుతోంది. ఈ సందర్భంలో నమ్మకమైన, పారదర్శకమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే సరఫరా వ్యవస్థను నిర్మించడానికి భారత్, నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయి.
ఇంధన భద్రత నుంచి నీటి భద్రత వరకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో మన పరస్పర సహకారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
దీని వల్ల మీ అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించాలనుకునే భారతీయ వ్యాపారాలకు నెదర్లాండ్స్ ఒక సహజమైన ముఖ ద్వారంగా మారబోతోంది. ఈ ప్రయాణంలో ఇక్కడి ప్రవాస భారతీయులు ఒక నమ్మకమైన వారధిగా పనిచేయగలరు. ఎందుకంటే ప్రవాస సమాజానికి అటు భారత్ ఆకాంక్షలు, ఇటు ఐరోపా ప్రమాణాలను రెండింటినీ పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇది ఇక్కడ స్థిరపడిన భారతీయులకు భారత్ నుంచి వచ్చే అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తులతో అనుసంధానం కావడానికి మరిన్ని గొప్ప అవకాశాలను సృష్టిస్తుంది.
నెదర్లాండ్స్ అనగానే మనకు ట్యులిప్ పూలు గుర్తొస్తాయి. ఇక్కడి అందమైన ట్యులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. భారత్‌లో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ట్యులిప్ తోటల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంది. నెదర్లాండ్స్ ట్యులిప్ పూలకు ఎలా ప్రసిద్ధి చెందిందో.. భారత్ తామరపువ్వులకు అలానే ప్రసిద్ధి చెందింది.
మిత్రులారా,
ట్యులిప్, తామరపువ్వు.. ఈ రెండూ మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతాయి. మన వేళ్లు నీటిలో ఉన్నా లేదా మట్టిలో ఉన్నా, సరైన పోషణ లభిస్తే అందం, బలం రెండూ వికసిస్తాయి. భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే బలమైన పునాది.
మిత్రులారా,
మన మధ్య తరచుగా ప్రస్తావించని మరో ముఖ్యమైన స్నేహ బంధం ఉంది.. అదే క్రీడలు. మన రెండు దేశాలు క్రీడారంగంలో అనేక విధాలుగా కలిసి పనిచేస్తున్నాయి.
ఉదాహరణకు క్రికెట్‌నే తీసుకోండి. నెదర్లాండ్స్‌లో క్రికెట్ వృద్ధికి భారతీయ సమాజం ఎంతో కృషి చేసింది. ఇటీవల దేశంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. భారత్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచి ఉండవచ్చు.. కానీ నెదర్లాండ్స్ జట్టు నుంచి కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఎదురైంది.
నెదర్లాండ్స్ జెర్సీ ధరించి తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్ సింగ్ వంటి ఆటగాళ్లు ఆడుతుండటం చూసినప్పుడు లేదా ఆర్యన్ దత్ వంటి యువ ఆటగాళ్లు డచ్ క్రికెట్ భవిష్యత్తుకు తమ వంతు సహాకారం అందిస్తుండటం చూసినప్పుడు మనందరికీ అపారమైన ఆనందం కలుగుతుంది.
మిత్రులారా,
భారతీయులు క్రికెట్‌కు ఎంత గణనీయమైన కృషి చేశారో.. భారత హాకీ క్రీడ అభివృద్ధికి నెదర్లాండ్స్ కూడా ఒక ముఖ్యమైన సహకారాన్ని అందించింది. భారత హాకీని మరింత బలోపేతం చేయడంలో డచ్ కోచ్‌లు కీలక పాత్ర పోషించారు. ఇటీవల కాలంలో మన మహిళల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ ప్రయాణంలో కోచ్ శోర్డ్ మరినే ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు.
అంతేకాదు ఈ ఏడాది నెదర్లాండ్స్ హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. మీరందరూ తప్పకుండా వెళ్లి భారత్ ఆడే మ్యాచ్‌లను చూడాలి. ప్రపంచకప్‌లో ఎవరు గెలిచినా ఒక విషయం మాత్రం ఖాయం. భారత్-నెదర్లాండ్స్ మధ్య ఉన్న స్నేహబంధం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.
మిత్రులారా,
భారత్-నెదర్లాండ్స్ సంబంధాల అసలు బలం మీలోనే ఉంది. ఈ భాగస్వామ్యానికి మీరే ఒక సజీవ వారధి. అందుకే సూరినామీ-హిందుస్తానీ సమాజానికి సంబంధించిన ఓసీఐ కార్డు అర్హతను భారత ప్రభుత్వం నాలుగో తరం నుంచి ఆరో తరానికి విస్తరించింది.
మిత్రులారా,
21వ శతాబ్దం భారత్ అవకాశాలకు నిలయం. భారత్ అటు సాంకేతికతతో పాటు ఇటు మానవత్వంతోనూ నడుస్తోంది. దేశం ఎంత పురాతనమైనదో, అంతే ఆధునికంగానూ మారుతోంది.
మిత్రులారా,
కాబట్టి దేశంలోని మీ పూర్వీకుల గ్రామాలను మళ్లీ సందర్శించడానికి, ఒక అభివృద్ధి చెందిన భారత్ వైపు సాగుతున్న ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ఇది సరైన సమయం. నెదర్లాండ్స్‌లోని భారతీయ సమాజమంతా దేశంతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది దేశ సామర్థ్యాలను పెంచడమే కాకుండా మీ పెట్టుబడులపై మరింత మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఇదే మోదీ హామీ.
నేడు మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరినీ చూడటం, మీతో మాట్లాడే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భావనలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
నాకు ఇంతటి అప్యాయమైన, ఉత్సాహవంతమైన స్వాగతం పలికినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!
భారత మాతా కీ జై!
***
Delighted to interact with the Indian community in The Hague. Their warmth, achievements and strong bond with India continue to make us proud. https://t.co/DVKQo1pKXw
— Narendra Modi (@narendramodi) May 16, 2026
मानवता का इतिहास साक्षी है कि समय के साथ अनेक संस्कृतियां मिट गईं।
— PMO India (@PMOIndia) May 16, 2026
लेकिन भारत का diverse culture, आज भी अपने लोगों के दिलों में धड़कता है: PM @narendramodi
13 वर्ष मुख्यमंत्री के रूप में... 12 वर्ष प्रधानमंत्री का सेवाकाल... Democratic World में 25 वर्षों तक... करोड़ों-करोड़ वोटर्स का लगातार समर्थन... ये मेरे लिए बहुत ही बड़े सौभाग्य की बात है।
— PMO India (@PMOIndia) May 16, 2026
मेरे लिए ये सिर्फ एक आंकड़ा नहीं है... ये मेरी बहुत बड़ी पूंजी है: PM @narendramodi
जब भारत में Aspirations Unlimited हैं, तो Efforts भी Limitless हो रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 16, 2026
भारत chip making में, semiconductor sector में भी बड़े कदम उठा रहा है।
— PMO India (@PMOIndia) May 16, 2026
अभी भारत में 12 semiconductor plants पर काम चल रहा है। इनमें से दो plants में production भी शुरु हो चुका है।
यानि अब chip भी, designed in India, made in India होगी: PM @narendramodi
भारत की aspiration driven journey, हमारी democracy को सशक्त कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 16, 2026
भारत... अपने हर citizen की democratic participation को value करता है।
— PMO India (@PMOIndia) May 16, 2026
और mother of democracy के रूप में, ये हम सभी के लिए बहुत गर्व की बात है: PM @narendramodi
The Indian community in the Netherlands serves as a vibrant bridge between our two nations. It is truly heartening to see how India’s diverse culture continues to thrive in its hearts. pic.twitter.com/Q3tOsjhvWY
— Narendra Modi (@narendramodi) May 16, 2026
The affection and blessings I have received from people across the country inspire me to work harder to fulfil their dreams. pic.twitter.com/czczzBhUA4
— Narendra Modi (@narendramodi) May 16, 2026
Today, India’s aspirations are unlimited and the scale of our efforts is equally immense! pic.twitter.com/mfgQZhPho8
— Narendra Modi (@narendramodi) May 16, 2026
Today’s India is powered by innovation and is witnessing an unprecedented transformation across every sector. pic.twitter.com/Zt3oIZmPWn
— Narendra Modi (@narendramodi) May 16, 2026
Amidst the many global challenges of today, India and the Netherlands are working together to build future-ready supply chains. From energy security to water security, both countries are cooperating closely. pic.twitter.com/ftlseESm5b
— Narendra Modi (@narendramodi) May 16, 2026
The tulip and the lotus remind us that whether roots lie in water or in the soil, with the right nourishment, they blossom. This is also the foundation of the partnership between India and the Netherlands. pic.twitter.com/o8Ghs6kT9S
— Narendra Modi (@narendramodi) May 16, 2026
Deeply touched by the immense enthusiasm and affection of the Indian community at the community programme in The Hague. Their energy and connection with India are deeply special. pic.twitter.com/qGyHuUDtSc
— Narendra Modi (@narendramodi) May 16, 2026