పిఎంఇండియా
న్యూఢిల్లీలో సెక్టర్ 25లో ఉన్న 89.72 హెక్టార్ల భూమిని ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక రూపాయి ధర మాత్రమే తీసుకొని కేంద్రం ఈ బదిలీ చేస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆరు నెలల్లోపు ఈ బదిలీ జరుగుతుంది. ఈ ఆమోదంతో ఈ భూమికి సంబంధించిన న్యాయసంబంధమైన చిక్కులన్నీ తొలగిపోతాయి..ఈ బదిలీని కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేసుగా భావించింది. డిడి చట్టం, 1957 సెక్షన్ 21 (1) కింద, ఇదే చట్టంలోని సెక్షన్ 41(1)ను కలుపుకొని డిడిఏకు మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది.
ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్… పైన తెలిపిన భూమిపైన యాజమాన్య హక్కులను పొందుతుంది. తద్వారా ఆ సంస్థ ఆ భూమిలో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన, సమావేశ కేంద్రాన్ని( ఇసిసి) నిర్మిస్తుంది. ఈ కేంద్రంలో పలు ప్రదర్శనా మందిరాలను, సమావేశ మందిరాలను, విస్తారమైన భోజనశాలలను, ఆడిటోరియాలను, ఎరీనాలను, ఆర్థిక కేంద్రాన్ని, హోటళ్లు, ఫుడ్ అండ్ బేవరేజ్ అవుట్‌లెట్లు మొదలైనవాటిని నిర్మిస్తారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు రూపకల్పన, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యేతర విధానం కిందకు వచ్చే ప్రాథమిక సౌకర్యాల కల్పన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీని కలిగి ఉండడంద్వారా దీనిని ప్రోత్సహిస్తుంది.
ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి దానిని అభివృద్ధి చేయడానికిగల అన్ని అవకాశాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చూడడానికిగాను ఏర్పాటైన కమిటీ రాజ్యాంగానికి (విధివిధానాలకు) కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్ ఒ యు డి) కార్యదర్శి, వ్యయ విభాగ కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాల విభాగ కార్యదర్శి, నీతి ఆయోగ్ సిఇవో సభ్యులుగా ఉంటారు.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. అవసరమైతే ప్రభుత్వం దగ్గరనుంచి వయబిలిటీ గ్యాప్ కింద తీసుకునే నిధులను ఉపయోగిస్తారు. ఈ కేంద్రంలోని పలు సౌకర్యాలను అభివృద్ధి చేసి నిర్వహించడానికిగాను దీనికి సంబంధించిన స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకుగానీ, సబ్‌లీజుకుగాను ఇవ్వడానికి వీలుగా డిఐపిపికి అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు స్థలాన్ని అన్ని విధాలా ఉపయోగించుకోవడానికి వీలుగా అంటే నివాసాలకు, వ్యాపార అవసరాలకు, సాంస్కృతిక అవసరాలకు, సంస్థల నిర్వహణకు వీలుగా డిడిఏ/ఎమ్ ఒ యు డి నుంచి త్వరలోనే అనుమతి లభిస్తుంది.
ఇసిసిని అభివృద్ధి చేయడం వల్ల ఆసియాలో అంతర్జాతీయస్థాయి ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాల సంఖ్య పెరుగుతుంది. ఇసిసి కారణంగా 2021 నాటికి 15 శాతం దాకా ఆసియాలో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు, కార్యక్రమాల సంఖ్య పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఇసిసి పని చేయడం మొదలైన తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం వందకు పైగా అంతర్జాతీయ, స్థానిక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం జరగవచ్చని అంచనా వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పదిలక్షల దాకా అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కావడానికి అవకాశముండే సమావేశాలు, ప్రదర్శనలు మొదలైనవి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులోని రెండో దశ ముగిసేనాటికి ఇక్కడ ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల రూపాయల ( 40 బిలియన్ల అమెరికా డాలర్లు) వ్యాపార లావాదేవీలు జరగడానికి అవకాశముంది. ఇందులోని ప్రదర్శనకేంద్రం, సమావేశ కేంద్రం, పలు అవసరాలకు ఉపయోగపడే ఎరీనాల ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇసిసి సౌకర్యాలకు మాత్రమే ఉపాధి కల్పన పరిమితం కాలేదు. ఇసిసి స్థలాన్ని ఉపయోగించుకునే రిటైల్, ఆఫీసు, అతిథి గృహాల కారణంగా కూడా అనేక మందికి క్రమం తప్పకుండా ఉపాధి లభిస్తుంది.
పూర్వ రంగం :
విస్తారమైన స్థలం, ఇతర సౌకర్యాలు, రవాణా సౌకర్యాలతో కూడుకున్న అంతర్జాతీయి స్థాయి ప్రదర్శనలు, సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలంటే ఆ స్థాయి కేంద్రాలు భారతదేశంలో ఇంతవరకూ లేవు. కొన్ని మాత్రమే నియమిత స్థలంలో ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ప్రగతి మైదాన్‌లో ఉన్న ప్రదర్శనా మైదానాన్ని ఉపయోగించుకోవాలంటే పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాని సామర్థ్యం సరిపోవడం లేదు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. తద్వారా పౌరులకు, సందర్శకులకు అనేక అసౌకర్యాలు కలుగుతున్నాయి. అంతేకాదు ప్రదర్శనల ఏర్పాటుకుగాను, సంబంధిత కార్యక్రమాల ఏర్పాటుకుగాను ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటోంది. దాంతో ఇంతవరకూ లభ్యమవుతున్న సౌకర్యాలపైన అపరిమితమైన ఒత్తిడి పడుతోంది. దాంతో వాటి నిర్వహణ కష్టమవుతోంది. భారీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడానికి వీలు కావడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఎంఐసిఇ మార్కెట్ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కన్వెన్షన్స్, ఎగ్జిబిషన్స్‌ను కలిపి ఎంఐసిఇ మార్కెట్ అంటారు) చాలా భారీగా ఉంది. ప్రతి సంవత్సరం నాలుగు లక్షల సమావేశాలు, ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ మార్కెట్ విలువ 280 బిలియన్ డాలర్లు. దాంతో పలు దేశాలు ఈ మార్కెట్ ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఆసియాను తీసుకుంటే ఎంఐసిఇ మార్కెట్ విలువ 60 బిలియన్ డార్లు. 2006నుంచి ఆసియాలో ఈ మార్కెట్ పెరుగుతోంది. ఈ పెరుగుదల 2006నుంచి ఇప్పటివరకు 38 శాతంగా నమోదయింది. ఆసియాలో నమోదైన ఈ పెరుగుదలనుంచి భారతదేశం పెద్దగా లబ్ధి పొందకపోవడానికి కారణం మనదేశంలో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన, సమావేశ కేంద్రాలు లోపించడమే. ఎంతో విస్తారమైన ఈ మార్కెట్‌నుంచి లబ్ధి పొందడానికిగాను, దేశంలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ఊతంగా నిలవడానికి ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ విభాగం ఈ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన, సమావేశ కేంద్రాన్ని ఢిల్లీలో నిర్మించడానికి పూనుకొంది.