Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్‌ సత్కారం

ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్‌ సత్కారం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సీషెల్స్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ పాట్రిక్ హర్మినీ  ఇవాళ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ విశిష్ట పురస్కారంతో సత్కరించారు. కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా నాయకత్వం వహిస్తున్నందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాల కోసం గళమెత్తిన ఆయనను ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బిరుదుతో గౌరవించారు. అలాగే, నీలి ఆర్థిక వ్యవస్థ వికాసం, వాతావరణ ప్రభావ ఉపశమన చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, వర్ధమాన చిన్న ద్వీపదేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయన దీర్ఘకాలిక నిబద్ధతకు గుర్తింపుగా ప్రధానమంత్రికి ఈ గౌరవం లభించింది. ఈ విశిష్ట పురస్కారం ప్రత్యేకంగా ఏర్పరచి, ఒక అంతర్జాతీయ నాయకుడికి ప్రదానం చేయడం ఇదే తొలిసారి.

ఈ పురస్కార ప్రదానంపై ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పందిస్తూ- పైపర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు దుష్ప్రభావాలపై పోరుకు నిబద్ధతతో కృషి చేస్తున్న దేశాలకు దీన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్వర్ణోత్సవ సందర్భంలో లభించిన ఈ గుర్తింపు ఉభయ పక్షాల ప్రత్యేక స్నేహబంధం మరింత పెనవేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ), పర్యావరణం కోసం జీవనశైలి (మిషన్ లైఫ్), తల్లి పేరిట ఓ మొక్క (ఏక్ పెడ్ మా కే నామ్) అంతర్జాతీయ పులిజాతి సంరక్షణ కూటమి (ఐబీసీఏ) సహా కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా చిరకాలం నుంచీ ప్రధానమంత్రి చేస్తున్న కృషికి ఈ పురస్కారంతో సీషెల్స్‌ అత్యున్నత గుర్తింపునిచ్చింది. సుస్థిర ప్రగతికి  దీర్ఘకాలిక ప్రోత్సాహం నేపథ్యంలో ప్రధానమంత్రికి లభించిన సత్కార పరంపరలో ఇది తాజా పురస్కారం. ఇప్పటికే ఆయన ‘ఎఫ్‌ఏఓ’ వారి అగ్రికోలా పతకం, సియోల్ శాంతి బహుమతి, ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ వంటి పురస్కారాలు అందుకున్నారు.

సామర్థ్య వికాసం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమష్టి ప్రాథమ్యాలకు పెద్దపీట వేయడం వంటి అంశాల్లో వర్ధమాన దేశాల విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ పోషిస్తున్న పాత్రకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పురస్కారం ద్వారా సీషెల్స్ చాటుకుంది.

 

***