పిఎంఇండియా
ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 17,18 తేదీల్లో ఒమన్ లో అధికారికంగా పర్యటించారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఒమన్ ఉప ప్రధానమంత్రి (రక్షణ వ్యవహారాలు) సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. డిసెంబర్ 18, 2025న అల్ బరాకా ప్యాలెస్‌లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రధానికి స్వాగతం పలికారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంలో ప్రధానమంత్రి ఒమన్ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతకుముందు 2023 డిసెంబర్‌లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారతదేశంలో పర్యటించారు.
ఈ సందర్భంగా, సుల్తాన్ హైతం బిన్ తారిక్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, విద్య, ఇంధనం, అంతరిక్షం, వ్యవసాయం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా అన్ని రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు అత్యుత్తమంగా ఉండటం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్‌లో ఒమన్ సుల్తాన్ భారత పర్యటన సందర్భంగా ఆమోదించిన ఉమ్మడి దార్శనిక పత్రంలో పేర్కొన్న రంగాలలో కొనసాగుతున్న కార్యక్రమాలు, సహకారాన్ని ఇరువురు నాయకులు సమీక్షించారు. సముద్ర పొరుగు దేశాలు అయిన భారత్, ఒమన్ మధ్య సంబంధం కాల పరీక్షకు నిలబడిందని, ఇది బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారిందని ఇద్దరు నాయకులు గుర్తించారు.
‘విజన్ 2040’ కింద ఒమన్ సాధించిన ఆర్థిక వైవిధ్యీకరణ, సుస్థిర అభివృద్ధిని భారత్ ప్రశంసించింది. భారత్ సాధిస్తున్న సుస్థిర ఆర్థిక వృద్ధిని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే వికసిత భారత్ లక్ష్యాన్ని ఒమన్ కొనియాడింది. ఇరు దేశాల దార్శనికతలలో ఉన్న సారూప్యాన్ని నాయకులు గుర్తించారు. పరస్పర ప్రయోజనదాయక రంగాలలో కలిసి పని చేయాలని అంగీకరించారు.
వాణిజ్యం, వ్యాపారం ద్వైపాక్షిక సహకారంలో బలమైన స్తంభాలుగా ఉన్నాయని ఇరు దేశాలు గుర్తించాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో మరింత వృద్ధికి, కొత్త రంగాల కు విస్తరించడానికి ఉన్న అవకాశాలను చర్చించారు. వస్త్రాలు, ఆటోమొబైల్స్, రసాయనాలు, పరికరాలు, ఎరువులు వంటి రంగాలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అపారమైన సామర్థ్యం ఉందని ఇరు దేశాలు అంగీకరించాయి.
భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకాలను ఇరుపక్షాలు స్వాగతించాయి. ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయి. సీఈపీఏ ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరం అవుతుందని నాయకులు అంగీకరించారు. ఈ ఒప్పందం ద్వారా ప్రయోజనం పొందాలని ఇరు దేశాల ప్రైవేట్ రంగాలకు సూచించారు.
సీఈపీఏ వాణిజ్యపరమైన అడ్డంకులను తగ్గించడం ద్వారా, సుస్థిరమైన యంత్రాంగాన్ని సృష్టించడం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుతుందని ఇద్దరు నాయకులు అంగీకరించారు. సీఈపీఏ ఆర్థిక వ్యవస్థలోని అన్ని ప్రధాన రంగాలలో విస్తృతమైన అవకాశాలను సృష్టిస్తుందని, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఉద్యోగాలను సృష్టిస్తుందని, ఇరు దేశాల మధ్య పెట్టుబడులను పెంచుతుందని కూడా వారు పేర్కొన్నారు.
భారత్ ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ఆర్థిక వైవిధ్యీకరణలో ఒమన్ సాధిస్తున్న పురోగతిని గుర్తించిన నాయకులు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, తయారీ, ఆహార భద్రత, రవాణా, ఆతిథ్యం వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాధాన్యత రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. ఒమన్-ఇండియా జాయింట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఓఐజేఐఎఫ్) గతంలో సాధించిన విజయవంతమైన రికార్డును దృష్టిలో ఉంచుకుని, ఇది పెట్టుబడులను ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇరు దేశాలు గుర్తించాయి.
స్థానిక కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి యంత్రాంగాలను అన్వేషించడంపై ఇరువురు నాయకులు చర్చించారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంలో కొనసాగుతున్న పురోగతిని వారు స్వాగతించారు. ఆర్థిక సహకారానికి, పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ ఒప్పందం సామర్థ్యాన్ని కలిగి ఉందని వారు గుర్తించారు.
ఇంధన రంగంలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి. ద్వైపాక్షిక ఇంధన వాణిజ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, దీన్ని మరింత పెంచే విస్తృత అవకాశాలు ఉన్నాయని అంగీకరించారు. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో కొత్త పునరుత్పాదక ఇంధన సహకారంతో సహా, భారతదేశంలో అలాగే ప్రపంచ స్థాయిలో అన్వేషణ, ఉత్పత్తి (ఎక్స్ ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్) రంగాలలో సహకారం పెంచేందుకు తమ కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి ఇరుపక్షాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. సుస్థిర ఇంధన లక్ష్యాలతో ఉన్న సమన్వయాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఉమ్మడి పెట్టుబడులు, సాంకేతికత బదిలీ, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను వారు ప్రతిపాదించారు.
రక్షణ రంగంలో పెరుగుతున్న సహకారాన్ని ఇరుపక్షాలు ప్రశంసించాయి. ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి, ప్రాంతీయ భద్రత, సుస్థిరత కోసం ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, ఉన్నత-స్థాయి సందర్శనలు సహా ఈ విషయంలో కలిసి పనిచేయడం కొనసాగించాలని వారు అంగీకరించారు. సముద్ర రంగం పై అవగాహనను పెంపొందించడం ద్వారా, నిరంతర సమాచార మార్పిడిని సులభతరం చేయడం ద్వారా సముద్ర సంబంధ నేరాలను, చౌర్యాన్ని నిరోధించడానికి ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని కూడా వారు అంగీకరించారు.
ఈ పర్యటన సందర్భంగా, సముద్ర సహకారంపై ఉమ్మడి దార్శనిక పత్రాన్ని ఇరు దేశాలు ఆమోదించాయి. ఇది ప్రాంతీయ సముద్ర భద్రత, మత్స్య సంబంధ ఆర్థిక వ్యవస్థ, సముద్ర వనరుల సుస్థిర వినియోగం పట్ల రెండు దేశాల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఆరోగ్య రంగంలో సహకారాన్ని తమ భాగస్వామ్యంలోని ముఖ్యమైన స్తంభాలలో ఒకటిగా ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి.
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేయడం, సాంప్రదాయ వైద్య రంగంలో సహకారాన్ని సులభతరం చేయడానికి ఒమన్‌లో సమాచార విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో సహా కొనసాగుతున్న చర్చలు, కార్యక్రమాలను ఇరుపక్షాలు గుర్తించాయి.
వ్యవసాయ రంగంలో సహకారానికి ఇరు దేశాలు నిబద్ధతను పునరుద్ఘాటించాయి. వ్యవసాయ శాస్త్రం, పశు సంపద, ఆక్వాకల్చర్ (మత్స్య సంపద) రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని నాయకులు స్వాగతించారు. శిక్షణ, విజ్ఞాన మార్పిడి ద్వారా చిరుధాన్యాల సాగులో సహకారాన్ని పెంచడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఐటీ సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అంతరిక్ష అనువర్తనాలు వంటి సాంకేతికత రంగాలలో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని కూడా వారు గుర్తించారు.
సాంస్కృతిక సహకారం బలోపేతం కావడం పట్ల, ప్రజల మధ్య ప్రగాఢమైన సంబంధాల పట్ల ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. “లెగసీ ఆఫ్ ఇండో-ఒమన్ రిలేషన్స్” ఉమ్మడి ప్రదర్శనను వారు స్వాగతించారు. సాంస్కృతిక డిజిటలైజేషన్ కార్యక్రమాలపై కొనసాగుతున్న చర్చలను కూడా గుర్తించారు. సోహార్ విశ్వవిద్యాలయంలో ఐసీసీఆర్ ఛైర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఏర్పాటుకు సహకరించాలనే కార్యక్రమాన్ని కూడా ఇరుపక్షాలు గుర్తించాయి. ఇది ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, విద్యా సంబంధాల మార్పిడిని ప్రోత్సహిస్తుంది.
సముద్ర వారసత్వం, మ్యూజియాలపై కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. ఇది ఉమ్మడి ప్రదర్శనలు, పరిశోధనల ద్వారా మ్యూజియాల మధ్య సహకారానికి వీలు కల్పిస్తుంది. అలాగే, తమ ఉమ్మడి సముద్ర సంప్రదాయాలను చాటుతూ ఐఎన్ఎస్‌వి కౌండిన్య ఒమన్‌కు జరపనున్న మొట్టమొదటి ప్రయాణాన్ని కూడా వారు గుర్తించారు.
త్వరలో జరిగే ఇండియా-ఒమన్ వైజ్ఞానిక చర్చలతో సహా విద్య, విజ్ఞాన మార్పిడిలో ప్రస్తుత సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. ఉన్నత విద్యపై కుదిరిన అవగాహన ఒప్పందం అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి సంస్థాగత సహకారం, ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారత సాంకేతిక, ఆర్థిక సహకారం (ఐటెక్) కార్యక్రమం కింద కొనసాగుతున్న సామర్థ్య పెంపు కార్యక్రమాలను కూడా ఇరుపక్షాలు గుర్తించాయి.
గమ్యస్థానాల సంఖ్య, కోడ్-షేరింగ్ నిబంధనలతో సహా విమాన సేవల ట్రాఫిక్ హక్కులపై చర్చించడానికి ఒమన్ చేసిన ప్రతిపాదనకు భారత్ సానుకూలత వ్యక్తం చేసింది.
ప్రజల మధ్య శతాబ్దాల నాటి సంబంధాలు ఒమన్-భారత్ సంబంధాలకు మూలస్తంభాలుగా ఉన్నాయని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఒమన్‌లో నివసిస్తున్న సుమారు 6,75,000 మంది క్రియాశీల భారతీయ సమాజం సంక్షేమం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నందుకు ఒమన్ నాయకత్వానికి భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఒమన్ అభివృద్ధిలో భారతీయ సంతతి పాత్రను గుర్తించినట్టు ఒమన్ తెలిపింది.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలలో, వ్యక్తీకరణలలో ఇరువురు నాయకులు ఖండించారు. అటువంటి చర్యలకు ఎటువంటి మద్దతును అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ రంగంలో నిరంతర సహకారం అవసరాన్ని వారు అంగీకరించారు.
గాజాలోని పరిస్థితిపై ఇరుపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పౌరులకు మానవతా సహాయాన్ని సురక్షితంగా, సకాలంలో అందించాలని పిలుపునిచ్చాయి. గాజా శాంతి ప్రణాళిక మొదటి దశపై సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. ఈ ప్రణాళికకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించే ప్రయత్నాలకు తమ మద్దతును పునరుద్ఘాటించడంతో పాటు, సార్వభౌమాధికారం గల, స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటుతో సహా చర్చలు, దౌత్యం ద్వారా న్యాయమైన, శాశ్వత పరిష్కారం అవసరాన్ని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఈ క్రింద ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు కుదిరాయి:
1) సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం
2) సముద్ర వారసత్వం, మ్యూజియాలపై అవగాహన ఒప్పందం
3) వ్యవసాయ, అనుబంధ రంగాలలో అవగాహన ఒప్పందం
4) ఉన్నత విద్యా రంగంలో అవగాహన ఒప్పందం
5) ఒమన్ వాణిజ్య, పారిశ్రామిక మండలి, భారత పరిశ్రమల సమాఖ్య మధ్య అవగాహన ఒప్పందం
6) సముద్ర సహకారంపై ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ఆమోదం
7) మిల్లెట్ (చిరుధాన్యాల) సాగు, అగ్రి-ఫుడ్ ఇన్నోవేషన్‌లో సహకారం కోసం కార్యనిర్వాహక కార్యక్రమం
తమకు అందించిన ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యానికి గాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురికి సౌకర్యవంతంగా ఉండే సమయంలో భారత్‌ను సందర్శించాలని ఒమన్ సుల్తాన్‌ను ఆయన ఆహ్వానించారు.
***
Today, we are taking a historic step forward in India-Oman relations, whose positive impact will be felt for decades to come. The Comprehensive Economic Partnership Agreement (CEPA) will energise our ties in the 21st century.
— Narendra Modi (@narendramodi) December 18, 2025
It will give new momentum to trade, investment and… https://t.co/kqbgEbVogr pic.twitter.com/dFFNQ764ac