పిఎంఇండియా
గత ఏడాది జూన్ లో రూ. 1,000 కోట్ల కార్పస్ తో ఏర్పాటు చేసిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్ట్- అప్స్ (ఎఫ్ ఎఫ్ ఎస్) కు సంబంధించి ఈ కింది ప్రతిపాదనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
i. 2016 ఫిబ్రవరి 17వ తేదీ నాటి గజెట్ నోటిఫికేషన్ G.S.R.180 (E) ప్రకారం అర్హత సాధించిన స్టార్ట్- అప్ లకు ఎఫ్ ఎఫ్ ఎస్ అందించిన నిధులతో పోలిస్తే అంతకు కనీసం రెండు రెట్ల నిధులను ఎఫ్ఎఫ్ఎస్ మద్దతిస్తున్న ఆల్టర్నేట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్స్ (ఎఐఎఫ్ లు) ఇన్వెస్ట్ చేయాలి. అంతే కాక, అంతకు ముందు కట్టుబాటు ప్రకటించిన మేరకు నిధులను .. స్టార్ట్- అప్ హోదా కోల్పోయిన సమయానికి కూడా పూర్తిగా అందించని పక్షంలో, మిగతా నిధులను ప్రకటించిన మేరకు తరువాతయినా అందించవచ్చు.
ii. చట్టపరమైన బాధ్యతల కింద అన్ని రకాల కార్యకలాపాలు పూర్తి కావడానికి, న్యాయ సంబంధమైన మదింపునకు, సాంకేతిక సంబంధమైన మదింపునకు, వెంచర్ కాపిటలిస్ట్ ఇన్ వెస్ట్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహణకు అయిన నిర్వహణ సంబంధ వ్యయాలన్నింటిలోనూ ఎఐఎఫ్ లకు ప్రకటించిన కట్టుబాటుకు అనుగుణంగా 0.50 శాతం మేరకు వాటాను ఎఫ్ఎఫ్ఎస్ భరిస్తుంది. దీనిని ప్రతి అర్ధ సంవత్సరం ఆరంభంలో, అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి అక్టోబరు 1వ తేదీ లప్పుడు ఫండ్ నుండి డెబిట్ చేస్తారు.
పూర్వ రంగం:
స్టార్ట్- అప్ ల కోసం రూ.10,000 కోట్ల కార్పస్ తో ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ ఎఫ్ ఎస్) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను 2016 జూన్ 22వ తేదీన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. నిధుల లభ్యత, అమలులో పురోగతి ఆధారంగా 14వ,15వ ఆర్థిక సంఘాల కేటాయింపుల నుండి ఈ నిధిని అందుబాటులో ఉంచుతారు. ప్రారంభ దశ, మొలక దశ, వృద్ధి దశలో ఉన్న స్టార్ట్- అప్ లలో ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత పెట్టుబడి ఉపకరణాల్లో ఎఐఎఫ్ లు ఇన్ వెస్ట్ చేయడానికి అవసరమైన కార్పస్ ను ఎఫ్ఎఫ్ఎస్ అందించాలని నిర్ణయించారు.
చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్ఐడిబిఐ..‘సిడ్బి’) ఎఫ్ఎఫ్ఎస్ ను నిర్వహిస్తుంది. ఎస్ఇబిఐ (‘సెబి’) వద్ద రిజిస్టర్ అయిన ఎఐఎఫ్ లలో ఎఫ్ఎఫ్ఎస్ తన వాటా అందిస్తుంది. ఈ వాటా సంబంధిత ఎఐఎఫ్ మూలధనంలో గరిష్ఠంగా 35 శాతం వరకు ఉండవచ్చు.
ఫండ్ ఆఫ్ ఫండ్స్ కార్పస్ ను, సహాయక విభాగం ఎఐఎఫ్ సమీకరించిన నిధిని కలిపి ఆ మొత్తాన్ని స్టార్ట్- అప్ లో ఈక్విటీగా ఎఫ్ఎఫ్ఎస్ ఇన్ వెస్ట్ చేస్తుందని 2016 జూన్ 22వ తేదీ నాటి సమావేశంలో మంత్రివర్గం నిర్ణయించింది. అయితే ఎఐఎఫ్ రిస్క్ తగ్గించుకునేందుకు వీలుగా తగినంత వైరుధ్యం గల విభాగాల్లో మాత్రమే నిధులను ఇన్ వెస్ట్ చేయాలని ఆర్థిక శాఖతో చర్చల సందర్భంగా నిర్ణయించారు. మొత్తం నిధులన్నింటినీ ఎఐఎఫ్ స్టార్ట్- అప్ లలోనే ఇన్ వెస్ట్ చేయడం వల్ల అనామోదయోగ్యమైన స్థాయిలో రిస్కులు ఉంటాయని భావించారు.
స్టార్ట్- అప్ లకు ఎఐఎఫ్ నిధులు అందించడం అనే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండాలని ఆ చర్చల సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే కట్టుబాటు ప్రకటించిన నిధులను ఎఐఎఫ్ స్టార్ట్- అప్ ప్రారంభ దశ నుండి భిన్న దశలకు విభజించి అందచేస్తారు. చివరి వాయిదా అందే నాటికి ఆ స్టార్ట్- అప్ టర్నోవర్ రూ. 25 కోట్లు మించాలని, అయినప్పటికీ వృద్ధి కోసం నిధుల అవసరం కలదై ఉండాలని నిర్ణయించారు. పైగా స్టార్ట్- అప్ కు జీవితకాలం పర్యంతం -ప్రారంభ దశ, మొలక దశ, అభివృద్ధి దశ- నిధుల అవసరం ఉంటుందని భావించి ఈ ఏర్పాటు చేశారు.
ఎఐఎఫ్ కు మంజూరు తరువాత పరిహారం పొందే అవకాశం ప్రస్తుత నిబంధనల ప్రకారం ‘సిడ్బి’కి లేదని చర్చల సందర్భంగా ‘సిడ్బి’ తెలియచేసింది.
పైన ప్రస్తావించబడిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయాలు తీసుకున్నారు.