పిఎంఇండియా
మలేసియా ప్రధాని గౌరవనీయ శ్రీ మహమ్మద్ నజీబ్ తున్ అబ్దుల్ రజాక్ ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 23న మలేసియాను అధికారికంగా సందర్శించారు. అంతకు ముందు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆసియాన్- ఇండియా శిఖరాగ్ర సమావేశంలోనూ, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలోను 21, 22 తేదీలలో పాల్గొన్నారు. ఇద్దరు ప్రధానులు పుత్రజయలో అధికారిక చర్చలు చేశారు. ఇద్దరు కలసి కౌలాలంపూర్, బ్రిక్ఫీల్డ్స్లో నెలకొల్పిన తోరణ ద్వారాన్ని ప్రారంభించారు. ఇండియా, మలేసియా స్నేహానికి నిదర్శనంగా నిలిచేలా ఈ తోరణ ద్వారాన్ని మలేసియాకు భారత్ బహుమతిగా ఇచ్చింది.
ఇద్దరు ప్రధానుల మధ్య చర్చలు అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా, మలేసియాల మధ్య స్నేహసంబంధాలు కొత్త పుంతలు తొక్కాయని ఇద్దరు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిత్వ స్థాయిలోనూ, అధికారిక స్థాయిలోనూ ఇరు దేశాల మధ్య చర్చాపూర్వక యంత్రాంగాన్ని 2010 అక్టోబర్లో నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకు కుదిరిన అనేక ఒప్పందాలు ఈ యంత్రాంగానికి మద్దతుగా నిలిచాయి. ఈ ఒప్పందాల కారణంగా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలోని పూర్తిస్థాయి సమర్థతను సద్వినియోగం చేసుకునే విధివిధానాల వ్యవస్థ రూపొందింది.
మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇరు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎంహెచ్ 370 విమానం కనిపించకుండా పోయిన సమయంలో దానిని వెతికేందుకుగాను ఇండియా చేసిన సహాయాన్ని ఈ సందర్భంగా మలేసియా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఇండియా చూపిన చొరవ అభినందనీయమన్నారు. భారతదేశానికి చెందిన మూడు నౌకలు, ఏడు విమానాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ఇరు దేశాలను ఉభయ దేశాల ప్రజలు విశేషంగా సందర్శిస్తున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ప్రజల మధ్యనున్న సాంస్కృతిక, మతపరమైన అనుబంధాలను ప్రధానులు గుర్తు చేసుకున్నారు. మలేసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా ఉందని..ఇది మలేసియా, భారత్ ల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు మరింత చైతన్యం తెచ్చే అంశమని ఇరువురు ప్రధానులు అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల్లోనూ వర్ధిల్లుతున్న బహుళ సంస్కృతులను ప్రధానులు గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యానికి, సామరస్యానికి, అభివృద్ధికి దోహదం చేసే తమ నిబద్ధతను ఇరువురు ప్రధానులు మరోసారి స్పష్టంగా చాటారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధిని, ఆర్థికాభివృద్ధిని, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో మలేసియా, భారత్ లు చేసిన కృషిని ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారు. రాజకీయ, సామాజికార్థిక ప్రాధాన్యతలను, ఆకాంక్షలను ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, భద్రతలను ప్రోత్సహించాలనే ఇరు దేశాల బాధ్యతను ప్రధానులు గుర్తించారు.
ఇరుదేశాలు తమ ద్వైపాక్షిక సంబంధ బాంధవ్యాల విషయంలో ఇంతవరకూ సాధించిన ప్రగతిపట్ల ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తర్వాతి స్థాయికి తీసుకుపోవడానికి ఇరుదేశాలు కృషి చేయాలనే సంకల్పాన్ని చాటారు. ఇప్పటికే సహకారం కొనసాగుతున్న అంశాల్లో ఆ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని..అలాగే నూతన అంశాల్లో సహకారం కోసం మార్గాలను అన్వేషించాలని ఇరువురు ప్రధానులు నిర్ణయించారు.
2015-2020 సంవత్సరాలకుగాను సాంస్కృతికంగా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందంపైన సంతకాలు ఇరువురు ప్రధానుల సమక్షంలో జరిగాయి. ప్రాజెక్ట్ డెలివరీ అండ్ మానిటరింగ్, అంతర్జాల భద్రత (సైబర్ సెక్యూరిటీ) అనే ఈ రెండు అంశాలలో సహకారంకోసం అవగాహన ఒప్పంద పత్రాల మీద ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి.
ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను విస్తరించి, బలోపేతం చేయడానికి గాను వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని..అందుకుగాను చేపట్టిన చర్యలను ముందుకు తీసుకుపోవాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇలా ఉన్నాయి.
రాజకీయ సంప్రదింపులు
1. క్రమం తప్పకుండా శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. బహుళ ప్రయోజనాల కార్యక్రమాల నేపథ్యంలోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
2. ఇరుదేశాల విదేశీ మంత్రిత్వ శాఖల మంత్రులు నాయకత్వంవహించే జాయింట్ కమిషన్ తన తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం 2016 ప్రథమార్థంలో న్యూఢిల్లీలో జరగాల్సి ఉంది.
3. పరిశ్రమలు- వాణిజ్యం, రవాణా, ప్రజాపనులు-మౌలిక వసతుల కల్పన మంత్రిత్వ శాఖల మంత్రుల మధ్య క్రమం తప్పకుండా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి భారత్ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రకారం ఉండాలి. అంతే కాదు ఇరు దేశాల్లో పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలకు ఊతమిచ్చేలా ఈ కార్యక్రమాలుండాలి.
4. మలేసియా, భారత్ ల విదేశీ మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారుల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిగేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంప్రదింపుల ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారంలో ఎంత ప్రగతి సాధించామో పర్యవేక్షించాలి. ఇరుదేశాలకు ప్రాధాన్యతగల ప్రాంతీయ, వ్యూహాత్మక సమస్యలను ఈ సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవాలి.
5. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపట్ల ఇరుదేశాలు తమకున్న నిబద్ధతను మరోసారి చాటాయి . ఇరుదేశాల పార్లమెంటుల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని భావించాయి. ఇరుదేశాల పార్లమెంటు ప్రతినిధులతో క్రమం తప్పకుండా ఇరు దేశాల్లో పర్యటన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ప్రాధాన్యతను గుర్తించారు.
ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడుల రంగాలు
6. వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో తమకు గల నిబద్ధతను మరోసారి ప్రకటించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషించే ఆర్థిక పరమైన విషయాల్లో సంప్రదింపులను మరింత విస్తృతపరచాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
7. ఇరు దేశాల పరిశ్రమలు- వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన సమావేశాల ప్రాధాన్యతను గుర్తించారు.
8. మౌలిక వసతుల కల్పన, నిర్మాణ రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఇరు దేశాల్లో ప్రైవేటు రంగాల ఉమ్మడి ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి వాటికి ప్రభుత్వాలు సాయం చేయాలి. అంతే కాదు ఇరుదేశాల ప్రైవేటు రంగాల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. ఇండియా ఇప్పటికే చేపట్టిన భారత్ లోనే తయారీ, డిజిటల్ ఇండియా, ఆకర్షణీయ నగరాలు, నైపుణ్యాభివృద్ధి మొదలైన కార్యక్రమాలకు ఊతమిచ్చేలా ఈ భాగస్వామ్యం రూపుదిద్దుకోవాలి. తద్వారా మలేసియా వ్యాపార సంస్థలకు చెప్పుకోదగ్గ పెట్టుబడుల అవకాశాలు లభింస్తాయి. పెట్టుబడిదారులు భారతదేశంలో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాపారం చేయడానికి వీలుగా రూపొందిన వాతావరణాన్ని అందుకుగాను ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగిందో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఇరు దేశాలకు పరస్పరం లబ్థిని చేకూర్చే ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా మలేసియా పెట్టుబడిదారులను ప్రధాని ఆహ్వానించారు.
9. ఇరుదేశాల్లో ప్రాధాన్యతగల రంగాల్లో వ్యాపార విస్తరణకు చేపట్టాల్సిన చర్యలకోసం ఏం చేయాలో ఇరుదేశాల సిఇవోల వేదిక ప్రతిపాదనలు సూచించాలని ప్రధానులు కోరారు. ఇరుదేశాలకు చెందిన అత్యున్నతస్థాయి సిఇవోలతో కూడిన ఈ వేదికను పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. అంతే కాదు ఈ వేదిక సంవత్సరానికి రెండుసార్లు క్రమంతప్పకుండా సమావేశమై తాము చేసిన ప్రతిపాదన అమలవుతున్నాయో లేదో పరిశీలించాలి.
10. ఇరుదేశాల మధ్య వృద్ధి చెందుతున్న ఆర్థిక బంధాలను ప్రతిఫలించేలా మలేసియా, భారత్ లకు చెందిన ఆర్థిక సంస్థలు తమ తమ పరిధిలో చేస్తున్న కృషిని ప్రధానులు ఆహ్వానించారు.
11. మలేసియా రైల్వేరంగం అభివృద్ధికి గత రెండు దశాబ్దాలుగా ఇర్కాన్ (ఐఆర్ సి ఓ ఎన్) సంస్థ చేస్తున్న కృషిని, అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. భవిష్యత్లో రైల్వే ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి ఇర్కాన్ చూపుతున్న ఆసక్తిని ఆహ్వానించారు.
12. ఇరుదేశాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని ప్రధానులు భావించారు. భారత్ అందిస్తున్న వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మలేసియా కంపెనీలు చూపుతున్న ఆసక్తిని, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రధానులు స్వాగతించారు.
13. మలేసియాలో పెరుగుతున్న భారతదేశ పెట్టుబడులపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్ కు చెందిన ఐటీ సంస్థలు సైబర్ జయ స్థావరంగా చేస్తున్న కృషిని స్వాగతించారు. మలేషియాలో ఇండియా ఐటీ కంపెనీలు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలని నిర్ణయించారు.
రక్షణ, భద్రతా రంగాలు
14. వివిధ స్థాయిల్లో క్రమంతప్పకుండా చర్చలు ఏర్పాటు చేసుకొని రక్షణ పరమైన సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. రక్షణ శాఖ మంత్రులు, రక్షణ శాఖ సీనియర్ అధికారులు, త్రివిధ దళాల అధిపతుల మధ్య ఈ చర్చలు కొనసాగేలా ఇరుదేశాల్లో రక్షణశాఖ పర్యటనలుండాలని నిర్ణయించారు.
15. రక్షణశాఖ సెక్రటరీ లేదా సెక్రటరీ జనరల్ స్థాయిలో త్వరలో ఇండియా మలేసియా రక్షణ సహకార సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
16. హరిమావు శక్తి పేరిట చేసిన సంయుక్త విన్యాసాల ఫలితాలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విన్యాసాలను కంపెనీ స్థాయికి తీసుకుపోవాలని తదుపరి త్రివిధ దళాలతోనూ చేయించాలని నిర్ణయించారు.
17. ఎస్యు-30 ఫోరంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహకారం, భద్రతా పరమైన సమస్యలు మొదలైన అంశాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. మలేసియాలో భారత పైలెట్లు చేపట్టిన ఎస్ యు 30 ఎంకె ఎం శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడానికి వీలుగా ఇండియా ఇస్తున్న సహకారం ఆధారంగా ఈ వేదికను రూపొందించాలని భావించారు.
18. రక్షణ రంగంలో ఇరుదేశాలకు ప్రాధాన్యతగల ప్రాజెక్టుల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. రక్షణ సామగ్రి, దానికి సంబంధించిన పరిశ్రమ, పరిశోధన, శిక్షణ, సామర్థ్య నిర్మాణం తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఉంటుంది.
19. ఇండియా తీరప్రాంత గస్తీదళం, మలేసియా మారిటైమ్ ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీ లకు చెందిన అధిపతుల మధ్య ప్రతి ఏడాది చర్చలుండాలని నిర్ణయించారు. దీనితోపాటు ఆసియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీల సమావేశం సమయంలోనూ ఈ చర్చలుండాలని నిర్ణయించారు.
20. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. మానవతాపూర్వక సాయం, విపత్తు సహాయ చర్యల్లోనూ, నావికాదళ విషయాల్లో కూడా ఈ సమాచార వ్యవస్థను రూపొందించుకుంటారు.
21. భారత్ కు చెందిన ఐక్యరాజ్యసమితి శాంతిదళ కేంద్రానికి, మలేసియాకు చెందిన శాంతిదళ కేంద్రానికి మధ్య బంధాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
22. ఉగ్రవాదం ఎలాంటి రూపాల్లో ఉన్నా దాన్ని తీవ్రంగా ఖండించాలని ప్రధానులు భావించారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారికి కఠిన శిక్షపడేలా చూడాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరుదేశాలు కొనసాగిస్తున్న సహకారంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు.
23. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, ఇందుకుగాను అత్యున్నతస్థాయి విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. సంప్రదాయ, సంప్రదాయేతర భద్రతా సమస్యల సవాళ్ల విషయంలోనూ ఇలాగే చేయాలని భావించారు.
24. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం, భద్రతలకోసం ఇరుదేశాలు పరస్పర ప్రాధాన్యతతో ఇచ్చుకుంటున్న సహకారం కొనసాగించాలని నిర్ణయించారు.
25. శిక్షలు పడ్డ ఖైదీల బదలాయింపుపైన పరస్పర అంగీకారపత్రంపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇది త్వరగా పూర్తికావడానికి వీలుగా చర్చలు చేయాలని నిర్ణయించారు. శిక్షపడ్డ ఖైదీలపట్ల మానవతాపూరిత దృక్పథంతో వ్యవహరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
పర్యాటక, విద్యారంగాలు
26. మలేసియాలోని ప్రధాన నగరాల్లో, రాష్ట్రాల్లో మొదటిసారి జరిగిన ఇండియా ఫెస్టివల్ విజయవంతమైందని ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫెస్టివల్ విజయవంతానికి మలేసియా సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ, భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ హై కమిషన్ లు కృషి చేశాయి.
27. ఇరుదేశాలకు చెందిన విద్యార్థులు ఇరు దేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించడానికి వీలుగా అవకాశాలను మరింతగా ప్రోత్సహించాలనే తమ కోరికను ప్రధానులు వ్యక్తపరిచారు. ఇందుకు వీలుగా ఒక పరస్పర అంగీకార పత్రంపైన ఎంత వీలైతే అంత తొందరగా సంతకాలు చేయాలని అంగీకరించారు. తద్వారా ఇరు దేశాల్లో విద్యార్థులు చేరాల్సిన విశ్వవిద్యాలయాలను, చదవాల్సిన డిగ్రీలను గుర్తించడానికి వీలు ఉంటుంది.
28. ఇండియన్ స్కాలర్ షిప్ ట్రస్ట్ ఫండ్ కోసం యాభై మిలియన్ భారతీయ రూపాయలను ఇండియా అదనంగా అందివ్వడాన్ని స్వాగతించారు. ఈ ఫండ్ ను కౌలాలంపూర్ లో ఉన్న ఇండియా హై కమిషన్ నిర్వహిస్తోంది. ఇది 1954నుంచి మలేసియాలోని అర్హులైన భారతదేశ విద్యార్థులకు ఉపయోగపడుతోంది.
29. కౌలాలంపూర్ లోని భారతీయ సాంస్కృతిక కేంద్రానికి నేతాజి సుభాష్ చంద్రబోస్ భారతీయ సాంస్కృతిక కేంద్రం అనే పేరు పెట్టడాన్ని స్వాగతించారు.
మానవ వనరుల రంగం
30. మలేసియా ఆర్థికరంగాన్ని పరిపుష్టం చేయడంలో భారతీయ కార్మికుల కృషిని స్వాగతించారు.
31. జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ద్వారా ఇరుదేశాల్లోని కార్మిక రంగాలమధ్య సహకారాన్ని ఇరుదేశాలకు లబ్ధి చేకూరేలా మరింతగా పెంచాలని నిర్ణయించారు. ఇరుదేశాల్లోనూ ఈ మేరకు పర్యటనలు చేపట్టాలని, తాజా విధానాలపైన, చట్టాలపైన, నియమాలపైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు.
ఆరోగ్యరంగం
32. ఆయుర్వేదతోపాటు ఇంకా ఇతర భాతీయ సంప్రదాయ వైద్య విధానాలను ఇరు దేశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఒక ఆయుర్వేద వైద్యుడిని, ఇద్దరు థెరపిస్టులను తమ దేశంలో నియమించడాన్ని మలేసియా స్వాగతించింది. భారతీయ సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం కింద వీరిని మలేసియాలో నియమించారు. శిరోధార యంత్రాన్ని మలేసియాకు ఇండియా బహూకరించడంపట్ల ఇరుదేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
33. భారతీయ సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం కింద సిద్ద వైద్య విధాన వైద్యుడిని మలేసియాలో నియమించాలని భారత్ నిర్ణయించడాన్ని మలేసియా స్వాగతించింది.
శాస్త్ర సాంకేతిక రంగాలు
34. సుస్థిరమైన శక్తి వనరుల అభివృద్ధి ద్వారానే ఇంధన భద్రతను సాధించగలం. ఇందుకోసం ఇరుదేశాలు పునర్వినియోగ శక్తి వనరులపైన ఎక్కువగా ఆధారపడడానికి కార్యక్రమాలు చేపట్టాయి. తద్వారా అందరి అవసరాలు తీరుతాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇరుదేశాలు ఉమ్మడి కార్యాచరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. ఇది నూతన, పునర్వినియోగ శక్తి వనరులకోసం కృషి చేస్తుంది. ఈ వ్యవస్థను ఎంత వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేసుకోవాలని..దీని ద్వారా ఇరు దేశాలు తమ తమ ఆలోచనల్ని పంచుకోవాలని పరస్పరం లబ్ధి పొందేలా భాగస్వామ్యాన్ని రూపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
పాలనా రంగం
35. పరిపాలన రంగానికి సంబంధించి పరస్పర అంగీకార పత్రం కుదిరిన తర్వాత ఈ రంగంలో కొనసాగుతున్న అద్భుతమైన సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. ఈ ఎంఓయు భారతదేశ సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, ఫించన్ల మంత్రిత్వశాఖకు, మలేసియా ప్రజా సేవా విభాగానికి మధ్య జరిగింది. దీని తర్వాత ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 28-30 తేదీలలో కౌలాలంపూర్లో మూడవ ఉమ్మడి కార్యాచరణ సంస్థ సమావేశం జరిగింది. ఇందులో ఇరు పక్షాలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. వీటి ప్రకారం ఇంగ్లీషు భాషలో శిక్షణ, వృత్తి విద్యల్లో శిక్షణ, ఎలక్ట్రానిక్ పరిపాలన, శిక్షణా సంస్థల భాగస్వామ్యం, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ నిర్వహణ, పన్ను సమాచారం, వ్యాపార విజ్ఞానం, ప్రాజెక్టుల అమలులో సహకరించుకోవాలని నిర్ణయించారు.
36. సామర్థ్య నిర్వహణ, ప్రాజెక్టు డెలివరీ, పర్యవేక్షణ రంగాల్లో ఇరు దేశల్లో సహకారం కోసం రూపొందించిన ప్రతిపాదనను ఇరు దేశాలు స్వాగతించాయి.
37. ద్వైపాక్షిక ఉపాధి ఒప్పందం కుదరడంపట్ల ఇరు దేశాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. దీని ప్రకారం మలేసియా, భారత్ లలో పని చేసే ఇరు దేశాల దౌత్య ఉద్యోగులు, సంబంధిత వ్యక్తుల జీవిత భాగస్వాములకు వారి వారి అంగీకారం ప్రకారం ఉద్యోగ కల్పన చేయాలి.
ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారం
38. ప్రాంతీయ కార్యక్రమాల్లో వ్యూహాత్మకంగా భారతదేశం పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యతను మరోసారి చాటారు. తద్వారా బహిరంగ, పారదర్శక, పటిష్ట వాతావరణం ఏర్పడుతుందని భావించారు. అలాగే ఈ ప్రాంతంలో సమతుల్యతకోసం ఆసియాన్ దేశాల ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఆసియాన్ దేశాలకు, భారత్ కు మధ్య పటిష్టమవుతున్న సంబంధ బాంధవ్యాలను స్వాగతించారు. న్యూఢిల్లీలో 2012లో జరిగిన ఆసియాన్-భారత్ స్మారక శిఖరాగ్ర సమావేశంలో భారతదేశ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యంగా గుర్తించారు. దీని తర్వాత ఈ సంబంధ బాంధవ్యాలు పటిష్టమైన విషయం తెలిసిందే.
39. ఆసియాన్ దేశాలకు భారతదేశానికి మధ్య కుదిరిన నూతన కార్యాచరణ (2016-2020)ను స్వాగతించారు. ఈ సంవత్సరం ఆగస్టు 5న కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్-ఇండియా మంత్రిత్వస్థాయి సమావేశంలో శాంతి, ప్రగతి, సౌభాగ్యాల కార్యక్రమాల అమలుపైన ఆసియాన్-ఇండియా భాగస్వామ్యాన్ని రూపొందించారు. నూతన కార్యాచరణ ద్వారా ఈ భాగస్వామ్యాన్ని అమలు చేస్తారు.
40. 27వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాన్ని, దానికి సంబంధించిన ఇతర శిఖరాగ్ర సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నవంబర్ లోనే పదవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం కౌలాలంపూర్ లో జరిగింది. 2015 కౌలాలంపూర్ ప్రకటనను స్వాగతించారు. ఈ ప్రకటన ఆసియాన్ కమ్యూనిటీ ఏర్పాటుకు సంబంధించినది. అంతే కాదు ఇది ఆసియాన్ 2025కు కూడా సంబంధించినది.
41. సేవలు, పెట్టుబడులకు సంబంధించిన పలు ఒప్పందాలపైన ఆసియాన్-భారత్ ల మధ్య సంతకాలు జరిగాయి. వీటిని స్వాగతించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించిన తుది చర్యలపై ప్రగతి ఎంతదాక వచ్చిందో తెలుసుకున్నారు.
42. ఐక్యరాజ్యసమితి 70వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తేవడానికి ఇదే సరైన సందర్భమని ఇరు దేశాలు అంగీకరించాయి. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను ఇరు దేశాలు ప్రస్తావించాయి. సంస్కరణల తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకోసం భారతదేశం చూపుతున్న ఆకాంక్షను మలేసియా స్వాగతించింది.
43. 2030 నాటికి ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలనే అభివృద్ధి ప్రణాళికను ఐక్యరాజ్యసమితి ప్రకటించడాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి. ఇది 2015నుంచి అమలులోకి వస్తోంది.
తనకు, తన బృందానికి చక్కటి స్వాగత సత్కారాలు పలికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మలేసియా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. వీలు చూసుకొని భారతదేశాన్ని సందర్శించాలని మలేసియా ప్రధానికి ఆహ్వానం పలికారు. భారత ప్రధాని ఆహ్వానాన్ని మలేసియా ప్రధాని అంగీకరించారు.