Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం లో అమరులైన భారతీయుల గౌరవార్థం మానెక్‌శా కేంద్రంలో నిర్వహించిన ‘సమ్మానోన’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం లో అమరులైన భారతీయుల గౌరవార్థం మానెక్‌శా కేంద్రంలో నిర్వహించిన ‘సమ్మానోన’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం లో అమరులైన భారతీయుల గౌరవార్థం మానెక్‌శా కేంద్రంలో నిర్వహించిన ‘సమ్మానోన’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం


పరమ శ్రేష్ఠురాలైన బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు, అమరుల కుటుంబాలు, గౌరవనీయులైన బాంగ్లాదేశ్ విదేశ వ్యవహారాల శాఖ మంత్రి, గౌరవనీయులైన విముక్తి యుద్ధ మంత్రి, నా మంత్రివర్గ సభ్యులు – విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్, మరియు రక్షణ శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు, ప్రత్యేక అతిథులు, ఇంకా నా మిత్రులారా.

ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఇది భారతదేశం మరియు బాంగ్లాదేశ్ లకు చెందిన అమరుల త్యాగాలను స్మరించుకొనే రోజు. బాంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను సంస్మరించుకొనే రోజు. బాంగ్లాదేశ్ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాడిన భారత సైనిక వీరులను స్ఫురణకు తెచ్చుకొనే రోజు. అంతేకాదు, బాంగ్లాదేశ్ మీద జరిగిన క్రూరమైన దాడి ని, ఫలితంగా లక్షలాది ప్రజల ప్రాణాలు బలి కావడాన్ని మనకు గుర్తుకుతెచ్చేటటువంటి రోజు కూడా. అదే సమయంలో ఈ విషాదం వెనుక ఉన్న అనాగరక మనస్తత్వాన్ని ఖండించవలసిన రోజు. అలాగే 140 కోట్ల మంది భారత, బాంగ్లా ప్రజల చెక్కు చెదరని విశ్వాసాన్ని, మనోబలాలను గుర్తించగల అవకాశం ఇవాళ మనకు లభించింది. అంతేకాకుండా మన సమాజానికి సౌభాగ్యం నిండిన, బలమైన భవిష్యత్తునివ్వడంపై మన మనోభావాలను పంచుకొనేందుకు తగిన రోజు.

సర్వ శ్రేష్ఠులు మరియు స్నేహితులారా,

అనేక కారణాల వల్ల ఇది ఒక చరిత్రాత్మక దినం. బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం లో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు ఇది మరపురాని క్షణం. బాంగ్లాదేశ్ ను విముక్తం చేయడం కోసం 1971లో ప్రాణ త్యాగం చేసిన 1661 మంది భారతీయ జవాన్ లను బాంగ్లా ప్రభుత్వం ఈ రోజు సత్కరిస్తోంది. బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారికి, బాంగ్లా ప్రభుత్వానికి, బాంగ్లా ప్రజలకు 125 కోట్ల మంది భారతీయుల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాంగ్లాదేశ్ కు జరిగిన అన్యాయానికి, జన హననానికి వ్యతిరేకంగా మాత్రమే కాక భారతీయ సంస్కృతిలో అంతర్నిహితమైన మానవ విలువల రక్షణ కోసం కూడా అసమాన సాహసులైన భారతదేశ సైనికులు ఆనాడు పోరాడారు. నాటి భారత అమరులలో ఏడుగురి కుటుంబాలు ఇవాళ ఇక్కడ హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ బాధను, కష్టనష్టాలను భారతదేశం కూడా పంచుకుంటోంది. మీ యొక్క త్యాగం, వేదన లు వర్ణించ శక్యం కానివి.

మిత్రులారా,

ఆనాటి బాధాకర క్షణాలను గుర్తు చేసే 1971 నాటి చరిత్రలో బాంగ్లాదేశ్ ఆవిర్భావం ఒక ఆశాకిరణానికి సంకేతం. బాంగ్లాదేశ్ లో ఊచకోత తార స్థాయి లో ఉన్న రోజులను 1971 ఏప్రిల్ నెల నాకు గుర్తుచేస్తుంది. ఆనాడు దేశంలో ఒక తరం మొత్తాన్ని తుడిచిపెట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. బాంగ్లాదేశ్ ప్రతిష్ఠతో ముడిపడిన, భావి తరాలకు బాంగ్లాదేశ్ చరిత్రను అవగతం చేయగల ప్రతి వ్యక్తిని తొలగించేశారు. ఈ ఊచకోత ఉద్దేశం అమాయక జన హననం ఒక్కటే కాదు.. అసలు బాంగ్లాదేశ్ అన్న ఆలోచననే కూకటి వేళ్లతో పెళ్లగించే అమానుష ప్రయత్నం జరిగింది. అయితే, అంతిమంగా హింసకు పరాజయం తప్పలేదు. కోట్లాది బాంగ్లాదేశ్ ప్రజల మనోబలం, మానవ విలువలు మాత్రమే విజయం సాధించాయి.

మిత్రులారా,

బాంగ్లాదేశ్ ఆవిర్భావం అపార త్యాగాలతో నిండిన ఒక వీర గాథ. ఈ గాథలు అన్నింటిలోనూ మానవ విలువల పైన, దేశం పైన అంతు లేని అనురక్తితో కూడిన ఏకైక భావన అంతర్లీనంగా కనిపిస్తుంది. దేశంపై వీరులకు గల ప్రేమానురాగాలే వారిని ఈ త్యాగాలకు పురిగొల్పాయి. స్వాతంత్ర్య యోధుడు అంటే కేవలం మనశ్శరీరాలతో కూడిన మానవ దేహం కాదు.. మొక్కవోని సాహసం, వినాశ రహిత ఆత్మబల సమన్వితుడు. అటువంటి స్వాతంత్ర్య సమర యోధుల కోసం భారతదేశం కూడా తన వంతు కృతజ్ఞత సమర్పణ చేయగలగడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ మేరకు ‘ముక్తి యోధ’ ఉపకార వేతన పథకం లో భాగంగా సమర యోధుల కుటుంబాలకు చెందిన 10000 మందికి పైగా విద్యార్థుల చదువులకు ఉపకార వేతనం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా ఆ కుటుంబాల సంక్షేమం కోసం నేను మరో మూడు పథకాలను ప్రకటిస్తున్నాను. రాబోయే ఐదేళ్లలో ముక్తి యోధ ఉపకార వేతన పథకం లో భాగంగా మరో 10000 మంది పిల్లల విద్యాభ్యాసానికి సహకరిస్తాం. సమర యోధులకు బహుముఖ ప్రవేశ వీసాలను రాబోయే ఐదేళ్ల పాటు వర్తించేటట్టు జారీ చేస్తాం. ప్రత్యేక వైద్య పథకంలో భాగంగా ఏటా 100 మంది సమర యోధులకు భారతదేశంలో ఉచిత చికిత్స సదుపాయాన్ని కల్పిస్తాం. బాంగ్లా స్వాతంత్ర్య సమర యోధుల సంఘర్షణ, త్యాగాలతో పాటు భారత సైనికులు ఆ దేశ విముక్తి కోసం చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోలేరు. బాంగ్లా ప్రజలపై వారికి గల ప్రేమాభిమానాలతో పాటు స్వదేశం కోసం బాంగ్లా ప్రజలు కంటున్న కలలపై ఉన్న గౌరవమే భారత సైనికులకు స్ఫూర్తినిచ్చాయి. ఇక భీకర యుద్ధ సమయంలోనూ భారత సైన్యం యుద్ధ నియమాల నుండి ఏనాడూ దూరం కాలేదు. నియమబద్ధంగా విధులు నిర్వర్తిస్తూ యుద్ధ నీతి లో మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఆ మేరకు యుద్ధ ఖైదీలను సురక్షితంగా వెనుకకు పంపింది. భారతసైన్యం 1971 యుద్ధంలో చూపిన మానవత్వం గత శతాబ్దపు అత్యంత ఘనమైన ఘట్టాలలో ఒక ఘట్టంగా చరిత్రలో నిలచిపోయింది. మిత్రులారా, భారతదేశం, బాంగ్లాదేశ్ లు క్రూరత్వాన్ని జయించిన దేశాలు మాత్రమే కాదు, అటువంటి ఆలోచనలను కూడా సహించని దేశాలు అన్నది గమనార్హం.

మిత్రులారా,

బంగబంధు ప్రస్తావన లేకుండా బాంగ్లాదేశ్ గురించి జరిగే చర్చ ఏదైనా అసంపూర్ణమే అవుతుంది. ఎందుకంటే అవి రెండూ కూడాను పరస్పర ఆశ్రయాలు, పరస్పర సంధానితాలూను. బాంగ్లాదేశ్ స్వాతంత్ర్యం వెనుక ఉన్నది బంగబంధు ఆలోచనలే. ఆయన తన కన్నా ముందు కాలపు ఆలోచనలు కలిగినటువంటి వారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపూ ప్రజలకు ఒక సవాలు. ఆధునిక, స్వేచ్ఛాయుత, ప్రగతిశీల మాతృభూమి దిశగా ఆయన దార్శనికత బాంగ్లాదేశ్ ను నేటికీ ప్రగతి పథంలో నడుపుతోంది. స్వాతంత్ర్యం సిద్ధించాక 1971 తదనంతర అలజడి, అస్థిరతల యుగం నుండి బాంగ్లాదేశ్ ను విముక్తం చేసింది బంగబంధు షేక్ ముజీబుర్ రహమాన్ నాయకత్వమే. సమాజం లోని విద్వేషాన్ని, ఆగ్రహాన్ని నిర్మూలించడం ద్వారా దేశానికి శాంతి, ప్రగతి మార్గాన్ని బంగబంధు చూపెట్టారు. సోనార్ (బంగారు) బాంగ్లా స్వప్న సాకారానికి ఆయన సోపానాలు వేశారు. ఆనాడు భారతీయ యువత ఆయన నుండి స్ఫూర్తిని పొందింది. ఆయన ఆలోచనల ద్వారా లబ్ధిని పొందిన వారిలో నేనూ ఒకరిని కావడం నా అదృష్టం. ఒక్క దక్షిణాసియాలోనే కాక యావత్తు ప్రపంచంలో శాంతిని, సహజీవన సూత్రాన్ని వ్యాపింపజేసిన నాయకుడుగా బంగబంధును నేడు జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాం. ఆయన కుమార్తె, సర్వ శ్రేష్ఠురాలైన షేక్ హసీనా గారు బాంగ్లాదేశ్ ప్రధాని హోదాలో ఈ రోజు ఇక్కడ మన ముందు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ధైర్య సాహసాలను కూడా నేను ప్రశంసించదలచాను. సంక్లిష్ట పరిస్థితుల నుండి తనకు తాను బయటపడటమే కాక దేశాన్ని కూడా గట్టెక్కించడంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనుపమానం. నేటికీ అదే చెక్కు చెదరని స్థిరత్వంతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ఆమె రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారు.

మిత్రులారా,

ప్రపంచ ప్రాచీనమైన ఈ ప్రాంతం గురించి నిర్వచించే సిద్ధాంతాలు ఇవాళ మూడు ఉన్నాయి. ఈ మూడు సిద్ధాంతాలు మన సమాజానికి, పాలన వ్యవస్థకు సంబంధించిన ప్రాథమ్యాలను ప్రతిబింబిస్తాయి. వీటిలో ఒకటి ఆర్థికాభివృద్ధి కేంద్రకంగా ఉంటుంది. దేశాన్ని మరింత సౌభాగ్యవంతం, శక్తిమంతం చేయడంతో పాటు సార్వజనీన అభివృద్ధిపై ఇది దృష్టి సారిస్తుంది. బాంగ్లాదేశ్ ప్రగతి చరిత్రే ఈ సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. బాంగ్లాదేశ్ లో ఆయుఃప్రమాణం 1971లో భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉండేది. ఇవాళ భార‌తదేశాని క‌న్నా అధికంగా ఉంది. గడచిన 45 సంవత్సరాలలో బాంగ్లాదేశ్ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 13 రెట్లు పెరిగింది. శిశు మరణాలు 222 నుండి 38 కి తగ్గాయి. దేశంలో వైద్యుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి బాంగ్లాదేశ్ ఎగుమతులు 125 రెట్లు పెరిగాయి. ఆశావహమైన మార్పు ను సూచించే పరామితులలో ఇవి కొన్ని మాత్రమే. ప్రధాని షేక్ హసీనా గారి దార్శనికతను అనుసరిస్తున్న బాంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిలో కొత్త ఎత్తులను చేరుకుంటోంది.

మిత్రులారా,

ఇక రెండో సిద్ధాంతం సంగతి చూద్దాం.. ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ (అందరి తోడ్పాటుతో అందరి అభివృద్ధి). మా పొరుగు దేశాలు కూడా మాతో పాటు ముందడుగు వేయాలని నేను స్పష్టంగా ఆకాంక్షిస్తాను. భారత్ ఒక్కటే అభివృద్ధి చెందడమన్నది సంపూర్ణమూ కాదు.. ఒంటరిగా ప్రగతి సాధించడమన్నది సాధ్యమూ కాదు. అలాగే ‘‘అందరి తోడ్పాటుతో అందరి అభివృద్ధి’’ కూడా శాంతి అనే పునాది రాయి తో మాత్రమే సాధ్యం అన్నది మనకు అందరికీ తెలిసిన సత్యం. అందువల్ల మేం ప్రతి దేశానికి స్నేహ హస్తాన్ని అందిస్తున్నాం. మా ప్రగతి ప్రక్రియలో భాగస్వామ్యం కోసం ప్రతి దేశాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం సంక్షేమాన్ని మేం నిస్వార్థంగా ఆకాంక్షిస్తున్నాం. భారత-బాంగ్లా సంబంధాలు బలంగా పురోగమించడమే ఈ సిద్ధాంతానికి అత్యంత గొప్ప ఉదాహరణ. తద్వారా ఆర్థిక, రాజకీయ, మౌలిక సదుపాయ కల్పన, ద్రవ్య సంధానం, ఇంధన భద్రత లేదా దశాబ్దాలుగా తెగని భూ సరిహద్దు వివాద పరిష్కారం లేదా సముద్ర సరిహద్దుల పరిష్కారం.. వగైరాలన్నింటి విషయంలో మా సహకారం పరస్పర విశ్వాసం, అభివృద్ధి భాగస్వామ్యంతో ముడిపడ్డాయి. ఈ సహకారమే అందరి తోడ్పాటుతో అందరి అభివృద్ధి సిద్ధాంతానికి కంటికి కనపడేటటువంటి సాక్ష్యం.

మిత్రులారా,

అయితే, దురదృష్ట వశాత్తు దక్షిణ ఆసియా లో ఇందుకు పూర్తిగా భిన్నమైన వ్యతిరేక మనస్తత్వం కూడా ఉంది. అలాంటి ఆలోచన ధోరణి ఉగ్రవాదానికి ఊపిరి పోస్తుంది. దానికి మానవత్వంపై విశ్వాసం లేదు.. దాని ప్రాథమిక లక్ష్యం ఉగ్రవాదాన్ని విస్తరింపజేయడమే. దానికి హింస ద్వారా, బీభత్సం ద్వారా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడంపైనే తప్ప మానవత్వంపై విశ్వాసం లేదు.

విధాన నిర్ణేతలను ఈ దిశగా నడిపే సదరు సిద్ధాంతం కింది అంశాలనే విశ్వసిస్తుంది:

మానవత వాదం కన్నా ఉగ్రవాదమే మిన్న

పురోగమనం కన్నా విధ్వంసమే ముఖ్యం

సృష్టించడం కన్నా వినాశమే మరింత అవశ్యం

విశ్వాసంకన్నా నమ్మకద్రోహమే గొప్ప

ఇటువంటి ఆలోచనా ధోరణే మన సమాజంలో శాంతి, సుస్థిరతలతో పాటు మేధోపరమైన, ఆర్థిక పరమైన అభివృద్ధికి అతిపెద్ద సవాలు. ఈ ప్రాంతమంతటా, మొత్తం ప్రపంచంలోనే శాంతికి, ప్రగతికి ఈ ఆలోచనా ధోరణే అతి పెద్ద నిరోధకం. పర్యవసానంగా భారతదేశం, బాంగ్లాదేశ్ లు వాటి వాటి సమాజాల ఆర్థిక అభివృద్ధి లో మమేకమైనా ఇటువంటి ప్రగతి నిరోధక ఆలోచనా ధోరణికి బాధితురాళ్లు అవుతున్నాయి.

మిత్రులారా,

ఈ ప్రాంతమంతటి లోని పౌరులంతా విజయం దిశగా, సౌభాగ్యం దిశగా పయనించాలన్నది మా హృదయపూర్వక ఆకాంక్ష. ఇందుకోసం మా వంతు సహకారాన్ని అందించడానికి మేమెప్పుడూ సిద్ధమే. అయితే, ఉగ్రవాదం, ప్రతికూల ఆలోచనా ధోరణి నిర్మూలన ఇందుకు అత్యంత అవశ్యం.

మిత్రులారా,

భారత్-బాంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ప్రభుత్వాల మధ్య ఆపేక్ష లేదా అధికార కేంద్రాల నడుమ అభిమానంపై ఆధారపడి లేవు. రెండు దేశాలలో 140 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంతో ఉండడమే ఇందుకు కారణం. సుఖ దుఃఖాలలో మనం అందరం సమాన భాగస్వాములం. భారతదేశం పట్ల నా కలలు ఎటువంటివో బాంగ్లాదేశ్ పట్ల, ఇతర పొరుగుదేశాలపైన కూడా అటువంటి కలలే నాకు ఉన్నాయని నేను సదా చెబుతూనే వస్తున్నాను. ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్ ఉజ్జ్వల భవిత దిశగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఒక మిత్రునిగా భారతదేశం ఇందుకు సాధ్యమైనంత మేర సహాయం అందిస్తుంది. చివరగా బాంగ్లా స్వాతంత్ర్య సమర యోధులకు, సాహసులైన భారత సైనికులకు మరో సారి నేను వందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, దీనికి స్వయంగా హాజరైనందుకు ప్రధాని షేక్ హసీనా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బాంగ్లాదేశ్ కు విశ్వసనీయమైన, సన్నిహితమైన మిత్ర దేశంగా సరసన నిలవడానికి భారతదేశం సదా సన్నద్ధంగా ఉంటుందని హామీ ఇస్తున్నాను.

జై హింద్… జయ్ బాంగ్లా!

***