Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రసెల్స్ లో భారతీయుల సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

బ్రసెల్స్ లో భారతీయుల సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్రసెల్స్ లో భారతీయుల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత సంతతి ప్రజలను భారత దేశ “లోక దూతలు”గా ఆయన అభివర్ణించారు.

గత వారం బ్రసెల్స్ లో జరిగిన భీకర దాడి ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ తీవ్రవాద చర్య మానవత్వానికి ఒక సవాల్ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై పోరాటానికి మానవతా శక్తులన్నీ ఈ సమయంలో ఏకమై చేతులు కలపవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఇంత పెద్ద ఎత్తున బెదిరింపులు ఎదురవుతున్నా ప్రపంచ దేశాలన్నీ కలసి తీవ్రవాదానికి తగిన గుణపాఠం చెప్పలేక పోతున్నాయని అన్నారు. దీనిని సరి చేయడానికి “మంచి తీవ్రవాదం”, “చెడ్డ తీవ్రవాదం” అనే వర్గీకరణను పక్కన పెట్టాలని సూచించారు. ఇటువంటి కష్టాన్ని భారతదేశం దాదాపు 40 ఏళ్ల నుంచి ఎదుర్కొంటోందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. అయితే సెప్టెంబర్ 11 ఘటన వరకు దీనిని చాలా మంది కేవలం ఒక శాంతి భద్రతల సమస్యగానే పరిగణించారని ఆయన అన్నారు. భారత దేశం ఎప్పటికీ తీవ్రవాదానికి తల వంచదని ప్రకటించారు. తీవ్రవాదాన్ని మతం నుంచి వేరు చేయవలసిన అవసరం ఉందని తాను చాలా మంది ప్రపంచ నాయకులకు స్పష్టం చేసినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీ లో జరిగిన అంతర్జాతీయ సూఫీ సదస్సును ఆయన గుర్తు చేస్తూ, అందులో పాల్గొన్న ఉదార ఇస్లాం మేధావులు తీవ్రవాదాన్ని ఖండించారని తెలిపారు. తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ఇటువంటి విధానం ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పారు. తీవ్రవాదంపై ఐక్య రాజ్య సమితి ఒక నిర్మాణాత్మక ధోరణి లో ముందుకు రాలేదని ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం లో ఐక్య రాజ్య సమితి తన బాధ్యతను నెరవేర్చలేక పోతోందని, కనీసం ఒక సరైన తీర్మానం తోనైనా ముందుకు రావడం లేదని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు దీటుగా స్పందించని దేశాలూ, సంస్థలు ఎదురుచూడని తీవ్ర ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు.

ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న యావత్తు ప్రపంచం భారతదేశాన్ని ఒక ఆశా కిరణం గా గుర్తించినట్లు కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం నిలచిందని, అయితే ఇది కేవలం అదృష్టం వల్ల కాదని ఆయన అన్నారు. వరుసగా రెండేళ్ళు కరవు పరిస్థితులు నెలకొన్నా కూడా ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. ఇది మంచి సంకల్పం, అనుకూల విధానాల ఫలితమని ఆయన వ్యాఖ్యానించారు. 2015 సంవత్సరం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పని తీరు గురించి వివరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎథనాల్ కలిపిన పెట్రోల్ గురించి, ఇంకా ఉత్పత్తి పెంపొందించడం ద్వారా, వూప పూత ద్వారా యూరియా కొరతను అరికట్టడాన్ని గురించి ఆయన పేర్కొన్నారు.

పేద వారికి పెద్ద సంఖ్యలో ఎల్ పి జి కనెక్షన్లు ఇచ్చామని ఆయన చెప్పారు. సంపన్నులు వారి ఎల్ పి జి రాయితీని వదులుకోవాలని సూచిస్తూ నిర్వహించిన “గివ్ ఇట్ అప్” ప్రచారం ద్వారా ఇది సాధ్యమైంది. దాదాపు 90 లక్షల మంది ప్రజలు దీనికి స్పందించి గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ విషయంలో కేంద్ర బడ్జెటు నిబద్ధతను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

2015లో పెద్ద మొత్తం లో విద్యుత్తు, బొగ్గు ఉత్పత్తి కూడా జరిగినట్లు ఆయన తెలిపారు. రైల్వేలలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని, రైల్వేలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివని ఆయన అన్నారు. 2015 లో కార్ల ఉత్పత్తి, సాఫ్ట్ వేర్ ఎగుమతులు కూడా అధికంగా జరిగాయని తెలిపారు.

ఆర్థిక వ్యవహారాలలో భాగస్వాములు కావాలన్న ప్రచారం లో భాగంగా దాదాపు 21 కోట్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. గ్యాస్ సబ్సిడీలో అవినీతి, లీకేజీ లను తగ్గించడంలో ” జన్ ధన్ ఆధార్ మొబైల్ (జె ఎ ఎమ్‌) భావన ఏవిధంగా ఉపయోగపడిందీ ప్రధాన మంత్రి వివరించారు. దగ్గర దగ్గర ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం అనంతరం ఇప్పటికీ ఇంకా 18 ,000కు పైగా గ్రామాలు విద్యుదీకరణ కు నోచుకోలేదు. అయితే వెయ్యి రోజుల్లో ఈ గ్రామాలను విద్యుదీకరిస్తామని ఆయన ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. ఇంతవరకు దాదాపు 7,000కు పైగా ఇటువంటి గ్రామాలను విద్యుదీకరించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రహదారుల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుందని కూడా ఆయన చెప్పారు. 175 గిగా వాట్ల పునర్వినియోగ విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తాను ప్రకటించినపుడు మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయిందని ఆయన చెప్పారు. అయితే దీనిని సాధించే దిశగా దేశం ముందుకు నడుస్తోందని ఆయన తెలిపారు. సైనిక దళాలకు “ఒకే హోదా – ఒకే పించను” వాగ్దానాన్ని కూడా నేరవేర్చినట్లు ఆయన చెప్పారు.

దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలను శాంతియుతంగా ఎలా పరిష్కరించుకోవచ్చు అనే దానికి బంగ్లాదేశ్ తో కుదిరిన భూ సరిహద్దు ఒప్పందం ఒక ఉదాహరణ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. “నరేంద్ర మోదీ యాప్ ” గురించి ఆయన ప్రస్తావిస్తూ భారత, బెల్జియం సంబంధాలపై తనకు సలహాలు, సూచనలు అందాయని చెప్పారు.

ప్రవాస భారతీయుల ప్రయోజనం కోసం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

*******