Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్రిక్స్ 8వ శిఖ‌రాగ్ర స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌


శ్రేష్ఠులు, మర్యాదస్తులైన మహిళలు మరియు పురుషులు,

ప్రసార మాధ్యమాలకు చెందిన మిత్రులారా,

బ్రిక్స్ ఎనిమిదో శిఖ‌రాగ్ర స‌మావేశాన్ని మేము కొద్ది సేపటి క్రితమే ముగించాము.

అధ్య‌క్షుడు శ్రీ శీ జిన్‌పింగ్‌, అధ్య‌క్షుడు శ్రీ జూమా, అధ్య‌క్షుడు శ్రీ టెమెర్‌, అధ్య‌క్షుడు శ్రీ పుతిన్‌ ల‌ను ఈ స‌ద‌స్సు లో పాల్గొనవలసిందిగా సుంద‌రమైన గోవా రాష్ట్రానికి ఆహ్వానించడం నా ప్రత్యేకాధికారమే కాదు, అది నాకు లభించిన గౌరవం కూడా. ఈ రోజు మూడు ద‌శ‌ల‌లో మా మ‌ధ్య చ‌ర్చాగోష్ఠులు స‌మ‌గ్రంగాను, దృఢంగాను, ఫ‌లవంతంగాను సాగాయి.

ఉద‌యం ప్ర‌పంచ‌వ్యాప్త ప్రాధాన్యాంశాల‌పై అభిప్రాయ ఆదాన‌ ప్రదానం సాగింది. ఉగ్ర‌వాదం, ప్ర‌పంచ ఆర్థిక నేప‌థ్యం, భౌగోళిక ప‌రిపాల‌న నిర్మాణంలో సంస్క‌ర‌ణ‌లు వంటి అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి.

బ్రిక్స్ సభ్యత్వ దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని సమీక్షించడం కోసం కూడా ఈ అవ‌కాశాన్ని మేము స‌ద్వినియోగపరచుకొన్నాము.

స‌ర్వ‌స‌భ్య స‌దస్సు సంద‌ర్భంగా బ్రిక్స్ కూట‌మిని రాబోయే సంవ‌త్స‌రాలలో విస్త‌రించేందుకు అనుసరించవలసిన కార్య ప్ర‌ణాళిక‌లు, సాధ్యాసాధ్యాల‌ పైన మేము దృష్టి సారించాము.

మా సంభాష‌ణలు ప్ర‌యోజ‌న‌కరంగా ముంద‌ంజ వేయడానికి సానుకూలంగా సాగాయి; అందునా బ్రిక్స్ ఏర్ప‌డి ద‌శాబ్దం గ‌డచిన ప్ర‌స్తుత స‌మ‌యంలో, ఈ చ‌ర్చ స‌మ‌యానుగుణ‌మైందే. అలాగే బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తోనూ చ‌ర్చాగోష్ఠిని కొంచెం సేప‌టి క్రిత‌మే ముగించాము.

ఇక తొలి సంవత్సరంలో బ్రిక్స్ ఆధ్వ‌ర్యంలోని న‌వ్యాభివృద్ధి బ్యాంకు (ఎన్ డి బి) సాగించిన అర్థ‌వంత‌మైన కృషిని బ్యాంకు అధ్య‌క్షుడు మాకు అంద‌రికీ వివ‌రించారు.

బ్రిక్స్‌లో అంత‌ర్గ‌తంగా ఉన్న‌వేగాక అంత‌ర్జాతీయంగానూ ప‌లు అంశాల‌పై స‌మ‌గ్ర దృష్టి, స‌హ‌కారం, స‌మ‌న్వ‌య దృక్ప‌థంతో కూడిన గోవా తీర్మానాన్ని ఆమోదించామ‌ని చెప్ప‌డానికి ఎంతో సంతోషిస్తున్నాను.

లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌,

శిఖ‌రాగ్ర స‌మావేశం సంద‌ర్భంగా బ్రిక్స్ నాయ‌కుల సునిశిత దృష్టిని ఆక‌ర్షించిన అంశాల‌ను ఇప్పుడు వివ‌రిస్తాను.

ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం, త‌ప్పుదోవ ప‌ట్టించే దుర్బోధ‌ల‌ వ‌ల్ల ప్రాంతీయ శాంతి, ప్ర‌పంచ శాంతిలతో పాటు సుస్థిరత‌కు, ఆర్థిక సమృద్ధికి పొంచి ఉన్న ముప్పును గుర్తించడంలో మామధ్య ఏకాభిప్రాయం నెలకొన్నది.

అంతే కాదు, మ‌న స‌మాజాల‌కు, మొత్తంగా మాన‌వాళికే ప్ర‌మాదం ముంచుకువస్తున్నద‌న్న‌ వాస్త‌వాన్ని గమనించడంలోనూ మేమందరం ఒకే విధమైన అభిప్రాయానికి వ‌చ్చాము. ఈ ముప్పును ఎదుర్కోవడంలో బ్రిక్స్ నిర్ణ‌యాత్మ‌కంగాను, స‌మ‌ష్టిగాను కృషి చేయాల‌ని కూడా ముక్త‌ కంఠంతో అంగీక‌రించాము. ఉగ్ర‌వాద ఆర్థిక వ‌న‌రుల మూలాల‌ను క‌నుగొన‌డంలో స‌న్నిహిత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయవలసిన అవ‌స‌రాన్ని గుర్తించాము. వారి ఆయుధాలు, ఆయుధ సామ‌గ్రి, ప‌రిక‌రాల‌ స‌ర‌ఫ‌రా స‌హా శిక్ష‌ణ మూలాల‌ను ల‌క్ష్యంగా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాము.

ఉగ్ర‌వాదుల‌ క‌న్నా అధికంగా ఆ హింసాత్మ‌క, విధ్వంస‌క‌ర‌ దుష్ట శ‌క్తుల‌కు ఆశ్ర‌యాన్ని, అండ‌దండ‌లను అందిస్తూ, పెంచి పోషిస్తూ ఇత‌ర దేశాల‌ మీదకు ఎగ‌దోసే దేశాల‌ వ‌ల్ల మ‌రింత ప్ర‌మాదం ఉంద‌ని కూడా ఏకాభిప్రాయానికి వ‌చ్చాము. ప్ర‌పంచానికే స‌వాలుగా మారిన ఈ తీవ్ర స‌మ‌స్య‌ విషయంలో ఆలోచ‌న‌లు, ఉద్దేశాలు ఏకీకృతం కావ‌డంపై భార‌త్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.
ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌ళ్లీ గాడిలో పెట్ట‌డం కూడా మా చ‌ర్చ‌లలో చోటుచేసుకున్న మ‌రో ప్ర‌ధానాంశం. 2008లో ఆర్థిక సంక్షోభం అనంతరం ప్ర‌పంచ ఆర్థిక వృద్ధికి బ్రిక్స్ దేశాలు అందించిన తోడ్పాటును మేము గుర్తించాము. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ దీర్ఘ‌కాలిక మౌలిక స‌దుపాయాల రంగంలో ప్ర‌భుత్వ పెట్టుబ‌డులు పెట్టడం అవ‌స‌ర‌మ‌ని మేము భావిస్తున్నాము. అంతేకాకుండా స్థూల ఆర్థిక విధాన స‌మ‌న్వ‌యం, వృద్ధి చోద‌క‌త్వం, ప్ర‌పంచ వాణిజ్య‌ం- త‌యారీ రంగాల‌కు పున‌రుత్తేజానికి ప్రోత్సాహం అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నాము.

బ‌హుళ‌ప‌క్ష వాణిజ్య నిర్మాణానికి మూలస్తంభ‌మైన ప్ర‌పంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు టి ఒ) ప్ర‌ధాన పాత్రను పోషించవలసిన అవ‌స‌రాన్ని మేము నొక్కిచెబుతున్నాము. ఆర్థికాభివృద్ధికి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ధ్య స‌మ‌తూకాన్ని సాధించవలసిన అవ‌స‌రాన్ని కూడా మేము ప్ర‌స్ఫుటం చేస్తున్నాము. ఈ దిశ‌గా పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం వైపు అడుగులు వేస్తుండ‌డాన్ని స్వాగ‌తిస్తున్నాము. ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌గా చ‌రిత్ర‌లోనే అత్యంత అగ్ర‌గ‌ణ్యుడైన మ‌హాత్మ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ ఏడాది అక్టోబ‌రు 2న ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపినందుకు భార‌తదేశం గ‌ర్వ‌ప‌డుతోంది.

మా అభివృద్ధి కార్యాచ‌ర‌ణ‌ను ప‌టిష్ఠంగా, స‌మ‌ర్థంగా అమ‌లు చేసేందుకు కూట‌మిలో అంత‌ర్గ‌త వ్య‌వ‌స్థీకృత సామ‌ర్థ్య నిర్మాణంపై బ్రిక్స్ దేశాధినేత‌లుగా దృష్టి సారించ‌డంపై ఏకాభిప్రాయానికి వ‌చ్చాము. ఎన్ డి బి ఒకటో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దాని కృషిని అభినందించాము. మౌలిక స‌దుపాయాలు, సాంకేతిక ప‌రిజ్ఞానం, పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగాల ప్ర‌గ‌తిపై ఎన్ డి బి దృష్టిని కొన‌సాగించేందుకు అంగీక‌రించాము.

బ్రిక్స్ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న వేదిక‌, బ్రిక్స్ రైల్వే ప‌రిశోధ‌న నెట్‌వ‌ర్క్‌, బ్రిక్స్ క్రీడామండ‌లి లతో పాటు యువ‌త కేంద్రంగా ప‌లు వేదిక‌ల ఏర్పాటుపై మేమందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము. ప్ర‌పంచ ద్ర‌వ్య‌, ఆర్థిక నిర్మాణంలో సంస్క‌ర‌ణ‌ల‌పై ముక్త‌ కంఠంతో మా సంక‌ల్పాన్ని వ్య‌క్తీక‌రించాము. దీంతో పాటు అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐ ఎమ్ ఎఫ్) లో వికాస‌, వ‌ర్ధ‌మాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల పాత్ర విస్త‌ర‌ణ‌పైనా ఏకాభిప్రాయంతో ఉన్నాం. ప్ర‌పంచ ద్ర‌వ్య సంబంధ నిర్మాణంలో అంత‌రాన్ని పూడ్చే దిశ‌గా బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీ ఏర్పాటుపై అంగీకారానికి వ‌చ్చాము.

జి-20 దేశాల కూట‌మితో మా స‌మ‌న్వ‌యం మెరుగుద‌ల‌పైనా ఏకాభిప్రాయానికి వ‌చ్చాము. అలాగే, బ్రిక్స్ దేశాల కూట‌మిలో ప్ర‌జల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అన్యోన్య బంధం జీవ‌క‌ళ‌తో సాగడం కూడా మా దృష్టిప‌థంలోని మ‌రో ముఖ్యాంశం.

ఈ దిశ‌గా సంవత్సరం పాటు 100కు పైగా కార్య‌క్ర‌మాల‌ను మేము నిర్వ‌హిస్తున్నాము. త‌ద్వారా బ్రిక్స్ దేశాల భౌగోళిక‌, జన‌సంబంధ వైవిధ్య వ్యాప్తికి కృషి చేస్తున్నాము.

ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాలే స‌హ‌కారానికి మూల‌స్తంభంగా మ‌లచే కృషి నిరంత‌రం కొన‌సాగాల‌ని నిర్ణ‌యించాము. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించిన అంశాల‌పై స‌హ‌కారాన్ని, సంప్ర‌దింపుల‌ను బ‌లోపేతం చేసుకోవ‌డానికి బ్రిక్స్ క‌ట్టుబ‌డి ఉంది.

లేడీస్ అండ్ జంటిల్ మెన్‌,

బిమ్స్ టెక్ దేశాల‌తో స్నేహ స‌మ‌న్వ‌యం గోవా శిఖ‌రాగ్ర సద‌స్సు ప్ర‌త్యేక‌తగా పేర్కొన‌వ‌చ్చు.

భార‌తదేశం స‌హా బిమ్స్ టెక్ లో భాగ‌స్వాములైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, మయ‌న్మార్‌, నేపాల్‌, శ్రీ ‌లంక‌, థాయ్‌లాండ్ దేశాల‌, ప్రభుత్వాల అధినేత‌లు, నాయ‌కులు గోవాలో బ్రిక్స్ 8వ శిఖ‌రాగ్ర స‌మావేశానికి ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌య్యారు.

దీని త‌రువాత ప్రథమ బ్రిక్స్‌- బిమ్స్ టెక్ అవుట్ రీచ్ సమిట్ జ‌రుగనున్నది.

ఇది మ‌రింత స‌న్నిహిత స‌హ‌కారం మరియు స‌మ‌న్వ‌యంపై రెండు కూట‌ముల దేశాధినేత‌లు, నాయ‌కులు సంభాషించుకోగ‌ల విశిష్ట అవ‌కాశం కానున్నది.

ప్ర‌పంచ మాన‌వాళిలో మూడింట రెండు వంతుల జ‌నాభా గ‌ల ఈ రెండు కూట‌ముల మ‌ధ్య స‌మ‌న్విత శ‌క్తియుక్తులు పురులు విప్పుకొని బ‌హుళ ప్ర‌జా ప్ర‌యోజనానికి దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌వు.

చివ‌ర‌గా.. ఈ 8వ బ్రిక్స్ శిఖ‌రాగ్ర స‌మావేశాన్ని విజ‌యవంతం చేయ‌డంలో ఎల్ల‌లు ఎరుగ‌ని స‌హ‌కారాన్ని అందించిన బ్రిక్స్ దేశాల నా స‌హ నాయ‌కులంద‌రికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మీకు అంద‌రికీ నా ధన్యవాదాలు.

మళ్లీ మళ్లీ కృత‌జ్ఞ‌త‌లు.