Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంలో 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రీ.. అభినందించిన ప్రధానమంత్రి


శ్రీ అనుజ్ శ్రీవత్రీ ప్రతిష్ఠాత్మక చెస్ గ్రాండ్‌ మాస్టర్ టైటిల్‌ను సాధించడంతో భారత్ పక్షాన ఈ టైటిల్ గెలిచిన వందో గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీ అనుజ్ శ్రీవత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

అసాధారణ విజయమంటూ ప్రధానమంత్రి ప్రశంసించారు. శ్రీ అనుజ్ శ్రీవత్రీ భారతదేశానికి 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలవడం ఒక అద్భుత ఘట్టమని ప్రధాని వర్ణిస్తూ, అతడికి అభినందనలు తెలిపారు. భారత్‌లో 100 మంది గ్రాండ్‌మాస్టర్లు ఉండడం ప్రశంసనీయ విజయ ప్రస్థానమనీ, ఇది అపార ప్రతిభ, అంకితభావంతో పాటు దేశంలో క్రీడాకారుల కఠిన పరిశ్రమకు అద్దం పడుతోందనీ, అంతేకాకుండా చదరంగంపట్ల యువతలో ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని కూడా అర్థం అవుతోందని ప్రధానమంత్రి అన్నారు.

దేశంలో వివిధ ప్రాంతాల్లో చదరంగానికి సంబంధించి యువ ప్రతిభావంతులు రావడం, అంతర్జాతీయ స్థాయిలో తమ ముద్ర వేయడం చూస్తే సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. మరింత మంది యువజనులు చదరంగాన్ని ఎంచుకొని, ప్రావీణ్యాన్ని సంపాదించాలని ప్రయత్నించేందుకు ఈ కార్యసాధన స్ఫూర్తిని అందించగలుగుతుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘చదరంగంలో భారత్ సెంచరీని సాధించింది.

అసాధారణం కదూ! 

ప్రస్తుతం భారతదేశంలో వంద మంది చదరంగం గ్రాండ్‌మాస్టర్లున్నారు.

భారతదేశం పక్షాన 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన అనుజ్ శ్రీవత్రీకి అభినందనలు. ఎంతటి అద్భుత విజయమిది.

భారత్ 100 మంది గ్రాండ్‌మాస్టర్లను కలిగివుండటం అసాధారణ విజయ ప్రస్థానం. ఇది మన ఆటగాళ్లలోని అపార ప్రతిభ, అంకితభావం, కఠిన పరిశ్రమనే కాకుండా చదరంగం ఆట పట్ల మన యువతీయువకుల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతుండటాన్ని కూడా చాటి చెబుతోంది.

దేశం నలుమూలలా చదరంగమాడే యువ క్రీడాకారులు వృద్ధి లోకి రావడం, అంతర్జాతీయ వేదికల్లో తమ ఉనికిని చాటుకోవడం చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతోంది.

ఈ విజయం మరింత మంది చదరంగం ఆట వైపు మొగ్గు చూపడంతో పాటు, ఈ ఆటలో రాణించేందుకు స్ఫూర్తిని అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

***