పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం భారత్ మానవసహిత రోదసీయాత్ర ‘గగన్ యాన్’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం భూమి దిగువ కక్ష్యలో ఒక కక్షీయ గమనం నుంచి గరిష్టంగా ఏడు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. మానవ వినియోగ యోగ్యమైన జి ఎస్ ఎల్ వి ఎంకే-3 రకం ఉపగ్రహ వాహక నౌకను ఉపయోగించి ముగ్గురు సభ్యుల బృందాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. ఆ నౌకలో వారు అంతరిక్షంలో ఉండేందుకు కావలసిన అన్ని సదుపాయాలు ఉంటాయి. గగన్ యాన్ కార్యక్రమానికి తోడ్పడేందుకు , సిబ్బంది శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రోదసీ నౌకలో అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గగన్ యాన్ కార్యక్రమం ఉద్దేశాల సాధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రజ్ఞులు వివిధ జాతీయ సంస్థలు, ప్రయోగశాలలు, విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాల సహాయం తీసుకుంటారు.
ఖర్చు:
గగన్ యాన్ కార్యక్రమానికి మొత్తం రూ. 10,000 కోట్ల నిధులు అవసరమవుతాయి. దానిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, రోదసీ నౌకలో ఉపయోగించే యంత్ర సామాగ్రి ఏర్పాటు, అత్యవసర మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి వాటికి నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది. గగన్ యాన్ కార్యక్రమంలో భాగంగా మనుష్యులెవరూ లేకుండా రెండు రోదసీ యానాలు, మరొకటి మానవ సహిత రోదసీ యానం జరపాలని ఉద్దేశం.
ప్రయోజనాలు:
• గగన్ యాన్ కార్యక్రమం వల్ల ఇస్రో, విద్యావేత్తలు, పరిశ్రమవర్గాలు, జాతీయ సంస్థలు మరియు ఇతర శాస్త్రీయ సంస్థల మధ్య సహకారానికి విస్తృతమైన చట్రం ఏర్పడుతుంది.
• దీనివల్ల వైవిధ్యభరితమైన సాంకేతిక, పారిశ్రామిక సామర్ధ్యం ఒకేచోట చేర్చడానికి మరియు పరిశోధనావకాశాలు విస్తృతం కావడానికి మరియు సాంకేతిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. దానివల్ల చాలా మంది విద్యార్ధులకు మరియు పరిశోధకులకు ప్రయోజనం చేకూరుతుంది.
• రోదసీ నౌకకు అవసరమైన యాంత్రిక వ్యవస్థ ఏర్పాటు పరిశ్రమ ద్వారా నెరవేరుతుంది.
• ఈ కార్యక్రమం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో మానవ వనరులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
• ఇది చాలామంది యువత తమ జీవనోపాధికి శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంపిక చేసుకోవడం ద్వారా జాతీయ అభివృద్దికి తోడ్పడేందుకు స్పూర్తిదాయకం అవుతుంది.
• గగన్ యాన్ కార్యక్రమం జాతీయ ప్రయత్నం. దేశం నలుమూలలకు చెందిన పరిశ్రమలు, విద్యావేత్తలు, జాతీయ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మారి కృషిచేస్తారు.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:
గగన్ యాన్ కార్యక్రమం ఇస్రోతో పాటు పరిశ్రమలు, విద్యావేత్తలు, జాతీయ సంస్థలు, ఇతర శాస్త్రీయ సంస్థలు, ప్రయోగశాలల సహకారంతో జరిగే జాతీయ ప్రయత్నం. పరిశ్రమల సహకారంతో ఇస్రో శాస్త్రజ్ఞులు రోదసియానానికి అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చుకుంటారు. జాతీయ సంస్థలు, ప్రయోగశాలలు, విద్యావేత్తలు కలసి సిబ్బంది శిక్షణ, సాంకేతిక అభివృద్ధి, రూపకల్పన సమీక్షలలో పాల్గొంటారు. మొదటి మానవసహిత రోదసియానం 40 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతకు ముందు సాంకేతిక పరిజ్ఞానం, యాత్ర నిర్వహణ వ్యవహారాలపై పట్టు సాధించి ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడానికి మనుష్యులు ఎవరూ లేకుండా రెండు రోదసీ యానాలు జరుపుతారు.
ప్రభావం:
• ఈ కార్యక్రమం వల్ల దేశంలో ఈ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.
• వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక భద్రత, కాలుష్యం, వ్యర్ధ పదార్థాల నిర్వహణ, జల మరియు ఆహార వనరుల నిర్వహణ మొదలగు రంగాలకు సాంకేతిక ప్రయోజనాలు కలుగుతాయి.
• మానవసహిత రోదసీ యానం వల్ల సూక్ష్మ గురుత్వాకర్షణకు సంబంధించిన ప్రయోగాలు చేసేందుకు ప్రత్యేకమైన వేదిక ఏర్పడుతుంది. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలపై పరీక్షలు చేసేందుకు తోడ్పడుతుంది.
• ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధి మరియు పారిశ్రామిక సామర్ధ్యం పెంపు ద్వారా దేశంలో అధిక కార్యకలాపాలు పెరిగేందుకు గగన్ యాన్ ఊతమిస్తుంది.
• మానవసహిత అంతరిక్ష యానం వల్ల భవిష్యత్తులో భారత్ ప్రపంచ దేశాలు జరిపే రోదసీ అన్వేషణలో పాలుపంచుకోవడం ద్వారా ఇండియా దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలు పొందగలుగుతుంది.
నేపధ్యం:
ఉపగ్రహ వాహక నౌక జి ఎస్ ఎల్ వి ఎంకె – 3 అభివృద్ధి, దానికి సంబంధించిన పరీక్షలు ఇస్రో పూర్తిచేసింది. అవసరమైన ప్రయోగ సామగ్రిని, ముగ్గురు సభ్యుల బృందాన్ని మోయగలిగే శక్తి దానికి ఉంటుంది. సిబ్బందికి ప్రాణవాయువు అందించే వ్యవస్థ, రోదసిలో ధరించే దుస్తులను పరీక్షించి చూసారు. మానవసహిత యాత్రకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో పాటు వాటిని ప్రయోగాత్మకంగా ఇస్రో పరీక్షించి చూసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అంతరిక్ష అన్వేషణకు ఆసక్తి చూపుతున్నాయి.