Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత జనాభా గణన-2027 నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి రూ.11,718.24 కోట్లతో 2027 భారత జనగణన కార్యక్రమ ప్రతిపాదనను ఆమోదించింది.

కార్యక్రమ వివరాలు:

·         భారత జనాభా గణన కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద పాలనపరమైన గణాంక కసరత్తు. దీన్ని రెండు దశలలో పూర్తి చేస్తారు. ఈ మేరకు 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు (i) గృహాల జాబితా, గృహ గణన చేపడతారు. అలాగే (ii) జనాభా గణన (పీఈ)ను 2027 ఫిబ్రవరి 2027 (హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతోపాటు లదాఖ్‌, జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాలు సహా మంచు సమస్యగల ప్రాంతాల్లో 2026 సెప్టెంబరు) నుంచి చేపడతారు.

·         జాతీయ ప్రాధాన్యంగల ఈ భారీ కసరత్తులో దాదాపు 30 లక్షల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు పాలుపంచుకుంటారు.

·         జనగణన సంబంధిత సమాచార సేకరణ కోసం మొబైల్ యాప్, పర్యవేక్షణ నిమిత్తం సెంట్రల్ పోర్టల్ వినియోగించడం వల్ల సమాచార నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

·         సమాచార భాగస్వామ్యం కూడా ఎంతో మెరుగ్గా, వినియోగదారు హితంగా ఉంటుంది. దీనివల్ల విధాన రూపకల్పనకు కావాల్సిన పారామితులపై అన్ని అంశాలూ ఒక క్లిక్‌తో అందుబాటులోకి వస్తాయి.

·         జనగణన ఒక సేవగా (సీఏఏఎస్‌) అన్ని మంత్రిత్వ శాఖలకు సమాచారం స్పష్టంగా, కంప్యూటర్‌ విశ్లేషణకు వీలుగా, కార్యాచరణకు అనువైన రూపంలో లభిస్తుంది.

ప్రయోజనాలు:  

భారత జనగణన-2027 కింద యావద్దేశ జనాభా వివరాలను సేకరిస్తారు.

అమలు వ్యూహం.. లక్ష్యాలు:

·         జనగణన ప్రక్రియలో భాగంగా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, గృహాల జాబితా-గృహ గణన సహా జనగణనకు సంబంధించిన ప్రత్యేక ప్రశ్నపత్రం తోడ్పాటుతో వివరాలు అభ్యర్థిస్తారు.

·         జనగణన కార్యకర్తలలో సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే వ్యక్తులు, ఉంటారు. వారు తమ సాధారణ విధులతోపాటు జనాభా వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తారు.

·         సబ్‌ డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయులలోనూ ఇతరత్రా జనాభా లెక్కల కార్యకర్తలను రాష్ట్ర/జిల్లా పరిపాలన యంత్రాంగం నియమిస్తుంది.

జనాభాగణన-2027 కింద కొత్త కార్యక్రమాలు:

     I.        దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు సేకరిస్తారు. ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వెర్షన్ల అనుకూల మొబైల్ అప్లికేషన్లతో సమాచారం సేకరిస్తారు.

   II.        జనగణన ప్రక్రియ మొత్తం ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహణ, పర్యవేక్షణ కోసం “సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్‌ మానిటరింగ్ సిస్టమ్” (సీఎంఎంఎస్‌) పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించారు.

  III.        హౌస్‌లిస్టింగ్ బ్లాక్ (హెచ్‌ఎల్‌బి) క్రియేటర్ వెబ్ మ్యాప్ అప్లికేషన్: జనగణన-2027 కోసం రూపొందించిన ఆవిష్కరణాత్మక “హెచ్‌ఎల్‌బి క్రియేటర్ వెబ్ మ్యాప్ అప్లికేషన్”ను చార్జ్ ఆఫీసర్లు వినియోగిస్తారు.

 IV.        ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేయించుకునే సదుపాయం ఉంటుంది.

   V.        ఈ భారీ డిజిటల్ కార్యక్రమం భద్రత కోసం తగిన విశిష్టతలను పొందుపరిచారు.

 VI.        జనాభా గణన-2027లో కింద దేశమంతటా ప్రజలకు అవగాహన, సమ్మిళిత భాగస్వామ్యం, చివరి అంచెదాకా చేరిక, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు మద్దతు లక్ష్యంగా కేంద్రీకృత, విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. సమన్వయ-ప్రభావశీల చేరిక కృషికి భరోసా ఇచ్చే కచ్చితమైన, ప్రామాణిక, సకాల సమాచార భాగస్వామ్యానికి ఇది ప్రాధాన్యమిస్తుంది.

VII.        జనాభా గణన-2027లో కులపరమైన జనాభా లెక్కింపును కూడా చేర్చాలని 2025 ఏప్రిల్ 30నాటి మంత్రిమండలి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయించింది. దేశంలో భారీ సామాజిక-జనాభా వైవిధ్యం తత్సంబంధిత సవాళ్ల కారణంగా జనాభాగణన-2027 రెండో దశలో కులపరమైన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేకరిస్తారు.

VIII.        జనాభా సమాచార సేకరణ, పర్యవేక్షణ, పరిశీలన, ఇతర కార్యకలాపాల కోసం లెక్కింపుదారులు, సూపర్‌వైజర్లు, మాస్టర్ ట్రైనర్లు, చార్జ్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్/జిల్లా జనాభా లెక్కింపు అధికారులు సహా దాదాపు 30 లక్షల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను నియమిస్తారు. వీరంతా తమ సాధారణ విధులతోపాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు కాబట్టి, ప్రభుత్వం సముచిత గౌరవ వేతనం చెల్లిస్తుంది.

ఉపాధి కల్పన సామర్థ్యం సహా ప్రధాన ప్రభావం:

·         దేశవ్యాప్త జనగణన సమాచారాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో సేకరించి, అందుబాటులో ఉంచాలన్నది ప్రస్తుత లక్ష్యం. ఈ లెక్కల ప్రక్రియ ఫలితాలను పంచుకోవడం కోసం మరింత అనుకూల సాదృశ్యీకరణ ఉపకరణాలను వినియోగిస్తారు. అత్యంత దిగువస్థాయి పాలన విభాగం… అంటే- గ్రామం/వార్డు స్థాయిదాకా సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది.

·         జనాభా గణన-2027 కసరత్తును విజయవంతం చేసే దిశగా వివిధ పనులు పూర్తి చేసేందుకు స్థానిక స్థాయిలో సుమారు 18,600 మంది సాంకేతిక సిబ్బందిని దాదాపు 550 రోజుల పాటు నియమిస్తారు. అంటే- రమారమి 1.02 కోట్ల రోజుల ఉపాధి లభిస్తుంది. ఈ కార్యక్రమ స్వభావం డిజిటల్ సమాచార నిర్వహణ, పర్యవేక్షణ, సమన్వయంతో ముడిపడి ఉంటుంది గనుక ఈ విధంగా చార్జ్/జిల్లా/రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సిబ్బంది లభ్యత వల్ల సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం అనుభం వారి భవిష్యత్ ఉపాధి అవకాశాలకూ దోహదం చేస్తుంది.

నేపథ్యం:

ప్రస్తుత జనాభా గణన-2027 దేశంలో 16వది కాగా, స్వాతంత్ర్యం తర్వాత 8వ సారి నిర్వహిస్తున్న కసరత్తు. వార్డు, గ్రామం, పట్టణం స్థాయిలో జనసంఖ్య సహా కుటుంబాల స్థితిగతుల ప్రాథమిక సమాచారానికి జనాభా లెక్కలు ఒక వనరుగా ఉపయోగపడతాయి. దీంతోపాటు జనావాసాలలో సౌకర్యాలు-ఆస్తులు, మతం, షెడ్యూల్డు కులాలు-తెగలు, భాష, అక్షరాస్యత-విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు సంతానోత్పత్తి వంటి అనేకానేక పారామితులపై సూక్ష్మ స్థాయి సమాచారం లభిస్తుంది. ఈ భారీ కసరత్తుకు జనాభా గణన చట్టం-1948, జనాభా లెక్కల నిబంధనలు-1990 చట్టపరమైన చట్రాన్ని సమకూరుస్తాయి.

 

***