Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌తదేశం, బంగ్లాదేశ్ లు సంయుక్తంగా ప్రారంభించిన పెట్రాపోల్ ఏకీకృత‌ చెక్‌ పోస్ట్ (ఐసిపి)

భార‌తదేశం, బంగ్లాదేశ్ లు సంయుక్తంగా ప్రారంభించిన పెట్రాపోల్ ఏకీకృత‌ చెక్‌ పోస్ట్  (ఐసిపి)


భార‌తదేశ ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేఖ్ హ‌సీనా లు ఇరువురు ఈ రోజు పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌ పోస్ట్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కోల్‌క‌తా నుండి ప‌శ్చిమ‌ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ కూడా పాలు పంచుకున్నారు.

భార‌తదేశం, బంగ్లాదేశ్‌ ల మ‌ధ్య వాణిజ్యానికి సంబంధించి పెట్రాపోల్ – బెనాపోల్ అత్యంత ముఖ్య‌మైన భూ స‌రిహద్దు. ఇరు దేశాల మ‌ధ్య వాణిజ్యంలో 50 శాతానికి పైగా పెట్రాపోల్ ద్వారానే జ‌రుగుతున్న‌ది. భార‌తదేశం, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య రూ.15,000 కోట్ల‌కు పైగా విలువైన వాణిజ్యం ఈ పెట్రాపోల్ ఐసిపి గుండా జ‌రుగుతున్న‌ది. భార‌తదేశంలోని ఇత‌ర అన్ని లాండ్‌ పోర్టులు, లాండ్ క‌స్ట‌మ్స్ స్టేష‌న్ ల ద్వారా జ‌రిగే మొత్తం వాణిజ్యం క‌న్నా ఇది ఎక్కువ‌. ప్రతి ఏటా దాదాపు 15 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు 1,50,000 ట్ర‌క్కులు పెట్రాపోల్- బెనాపోల్ ను దాటుతూ ఉంటాయి.

పెట్రాపోల్ ఐసిపి భ్ర‌ద‌త‌, ఇమిగ్రేష‌న్, క‌స్ట‌మ్స్‌, క్వారంటైన్ త‌దిత‌ర కార్య‌క‌లాపాల‌కు సంబంధించి మెరుగైన‌, స‌మ‌ర్ధ‌వంత‌మైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంది. స‌రిహ‌ద్దుల గుండా వ్యక్తులు, వ‌స్తువుల ర‌వాణా సాఫీగా, స‌జావుగా జ‌రిగేందుకు అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని కూడా ఈ పెట్రాపోల్ ఐసిపి అందిస్తున్నది.

అగ‌ర్త‌లా (భారతదేశం)- అఖౌర (బంగ్లాదేశ్‌) భూ స‌రిహద్దుల్లోని అగ‌ర్త‌లా ఐసిపి మొద‌టిది కాగా ఈ రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో పెట్రాపోల్ ఐసిపి రెండ‌వ‌ది. ఈ పెట్రాపోల్ ద‌క్ష‌ణ ఆసియాలోనే అతి పెద్ద లాండ్‌ పోర్ట్‌.

తాజాగా ప్రారంభ‌మైన పెట్రాపోల్ ఐసిపి ద్వారా వ్యాపార‌, వాణిజ్య సామ‌ర్ధ్యం రెట్టింపు అవుతుంద‌ని భావిస్తున్నారు. రాక‌పోక‌ల‌కు ప‌ట్టే స‌మ‌యం, వ్య‌యం బాగా త‌గ్గిపోవ‌డం వ‌ల్ల స్థానిక వాణిజ్య వ‌ర్గాలు పెద్ద ఎత్తున లాభపడనున్నాయి. ఈ పెట్రాపోల్ ఐసిపి భార‌తదేశం, బంగ్లాదేశ్‌ ల మ‌ధ్య సంబంధాలను, ఆర్ధిక బంధాల‌ను మ‌రింత బలపరచేందుకు ఉప‌క‌రిస్తుంది.