ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘రైతు సన్నిహిత (కిసాన్ తక్) భారత్’ వ్యవసాయ సదస్సు-2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గల వ్యవసాయ శాస్త్రవేత్తలు-పారిశ్రామికవేత్తలు, రైతులు హాజరైన సభనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాలలో ‘మీడియా గ్రూప్’ ఉత్సాహంగా పాలు పంచుకున్నదని గుర్తుచేస్తూ- ఇప్పుడీ వినూత్న రైతు సదస్సు కోసం రెండు రోజులు కేటాయించడాన్ని ఆయన ప్రశంసించారు.
దీపావళి వేడుకలు నిర్వహించుకున్న కొద్ది రోజులకే రైతు జీవితంతో గాఢంగా ముడిపడిన ఛత్ మహా పర్వదినం నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ సదస్సు ఏర్పాటు కావడంపై ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. మరోవైపు “బిహు, పొంగల్, ఓనం, బైశాఖీ, సర్హుల్, పోలా” వంటి ప్రధాన భారతీయ పండుగలకు వ్యవసాయంతో అవినాభావ సంబంధం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. “మన సంస్కృతి, సంప్రదాయం, సామాజిక జీవన సామరస్యానికి వ్యవసాయం, పంటల సాగు పునాదులని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు” అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఎర్రకోట పైనుంచి తన ప్రసంగంలో వికసిత భారత్ సాకారం దిశగా జాతీయ సామర్థ్యానికి సప్తధార (ఏడు మూలస్తంభాల) చేయూత గురించి ప్రస్తావించడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. వీటిలో వ్యవసాయం ఒక ప్రాథమిక స్తంభమని పేర్కొంటూ, జాతీయ ప్రగతి వ్యవసాయ రంగం ఆధునికీకరణతో ప్రత్యక్షంగా ముడిపడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రైతు సదస్సు వంటి కార్యక్రమాల ప్రాధాన్యం ఎన్నో రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి ప్రకటించారు. “వ్యవసాయ రంగ అభివృద్ధి, సాగు పద్ధతుల ఆధునికీకరణ, రైతు సాధికారత సాధించకపోతే వికసిత భారత్ సాకారం అసాధ్యం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
వ్యవసాయ వృద్ధి, జాతీయ ప్రగతి మధ్యగల బలమైన బంధాన్ని వివరిస్తూ- కేవలం 12 నుంచి 13 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు పేదరిక విముక్తులయ్యారని ఆయన చెప్పారు. చిన్న రైతులు, వ్యవసాయ కూలీల పరంగా గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు అధ్యయనం స్పష్టం చేసిందని ఉటంకించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారత వ్యవసాయ రంగం సగటున 4 శాతానికి పైగా వృద్ధి సాధించిన తొలి దశాబ్దం ఇదేనని ప్రధానమంత్రి వివరించారు.
విధానాలు, పద్ధతుల పరంగా నిరంతర పరిణామం ఆవశ్యకతను రైతులు, వ్యవసాయ నిపుణులు బాగా అర్థం చేసుకుంటున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాలక్రమేణా ప్రపంచ మార్కెట్లు, ఆహారపుటలవాట్లు, వాతావరణ సరళి, సాంకేతికతలు పురోగమిస్తున్న నేపథ్యంలో రైతుకు సరికొత్త సాధికారత అవశ్యమని ఆయన సూచించారు. “పంట దిగుబడులతో ధాన్యాగారాలను నింపినింత మాత్రాన సరిపోదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ మార్పుల వేగానికి అనుగుణంగా గడచిన దశాబ్ద కాలంలో అనేక చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.4 లక్షల కోట్లకుపైగా విలువైన వార్షిక వ్యవసాయ ఎగుమతుల ద్వారా రైతు ఆదాయం పెంచిన తీరును ప్రధానమంత్రి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. పాలు, పప్పుధాన్యాలు, జనపనార, బియ్యం, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు. మరోవైపు గోధుమలు, పత్తి, పండ్లు-కూరగాయలు, చేపల ఉత్పత్తిలో రెండో స్థానానికి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. “ఈ ప్రగతి కేవలం కొన్ని గణాంకాలకు పరిమితం కాదు.. మన దేశంలోని అన్నదాతల సామర్థ్యం ఇనుమడించడాన్ని ఇది రుజువు చేస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
రైతు శ్రేయస్సు కోసం గోధుమ, వరి, చెరకు వంటి సంప్రదాయ పంటలపై ఆధారపడే పరిస్థితిని అధిగమించాల్సి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా పంటల వైవిధ్యీకరణ, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి నుంచి శ్వేత విప్లవంతో ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా అవతరించడం దాకా భారత వ్యవసాయ ప్రస్థానాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ మేరకు గడచిన దశాబ్దంలో అనేక రంగాలు వేగంగా విస్తరించడాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో పాడి దిగుబడి దాదాపు 70 శాతం, గుడ్ల ఉత్పత్తి 90 శాతం పెరిగాయన్నారు. నీలి విప్లవం కింద చేపల ఉత్పత్తి రెట్టింపు స్థాయికి చేరగా, మధుర విప్లవం కింద తేనె ఉత్పత్తి 80,000 టన్నుల నుంచి 1.5 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. అలాగే, ఉద్యాన ఉత్పత్తులు 28 కోట్ల టన్నుల నుంచి 35 కోట్ల టన్నులు దాటినట్లు తెలిపారు. “ఈ విజయ ప్రస్థానం అనూహ్య వేగం పుంజుకున్నదని రుజువు చేసే ఈ గణాంకాలను ఇవాళ మీ ముందుంచాను” అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు.
ఈ విభిన్న వ్యవసాయ విప్లవాలను ఓ సమగ్ర దృక్కోణంతో ఏకీకరించడం ద్వారా భవిష్యత్ వ్యవసాయ రంగానికి తగిన బహుళ ఆదాయ మార్గాల సృష్టి సాధ్యం కాగలదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ దిశగా ‘పీఎం కుసుమ్ యోజన’ కింద ఇప్పటికే అమలులో గల సౌర విద్యుత్ విప్లవాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికింద విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు సహా పొలాల్లో సౌర విద్యుదుత్పాదన ద్వారా రైతుల ఆదాయార్జన కోసం దాదాపు 12 లక్షల సోలార్ పంపులను అందించినట్లు గుర్తుచేశారు. “ఈ విప్లవం దేశంలోని అన్నదాతలను ‘విద్యుత్ ప్రదాతలు’ మార్చింది. వ్యవసాయోత్పత్తి పెంపుతో పాటు ఉత్పాదకత, రైతు ఆదాయంపైనా మేం దృష్టి సారించాం” అని శ్రీ మోదీ చెప్పారు.
ప్రభుత్వాధినేతగా తాను ఇటీవల పాతికేళ్లు పూర్తి చేసుకోవడాన్ని, గుజరాత్ ముఖ్యమంత్రిగా కృషి మహోత్సవాల ద్వారా వ్యవసాయ ఆధునికీకరణలో తన నిరంతర కృషిని ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఆనాడు దాదాపు 40-45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతల మధ్య వందలాది వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడాన్ని ఆయన ప్రస్తావించారు. వ్యవసాయ కమతాల పరిశీలన, నీటి లభ్యతపై అంచనా, రైతులకు అనువైన పంటలు-పద్ధతులపై సలహాలివ్వడం వంటి చర్యలు చేపట్టడాన్ని ఉటంకించారు. “ప్రయోగశాలల్లోని శాస్త్రవేత్తలు సముపార్జించిన జ్ఞానం నేరుగా రైతు కమతాలకు చేరేలా ‘ల్యాబ్ టు ల్యాండ్’ భావన మేం ముందడుగు వేశాం. తద్వారా గుజరాత్ రైతులు భారీగా లబ్ధి పొందారు” అని శ్రీ మోదీ వివరించారు.
గుజరాత్‌లో తన పాలనానుభవం జాతీయ స్థాయిలో ఎంతో విలువైనదిగా ఉపయోగపడిందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను 2014లో పాలన పగ్గాలు చేపట్టేనాటికి భూసార పరీక్ష కేంద్రాలు వందల సంఖ్యలో మాత్రమే ఉండేవని ఆయన గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా 8,400కు పైగా ఉన్నాయని, వీటితోపాటు 725కు పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా పశువులకు సోకే ‘గాలికుంటు వ్యాధి’ నివారణ కోసం భారీ టీకా కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పశుగణం ఆరోగ్యానికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. “గాలికుంటు వ్యాధి నుంచి పశుగణం రక్షణ దిశగా రైతుల వద్ద గల 8 కోట్లకు పైగా పశువులకు ఉచితంగా టీకాలు వేశాం” అని శ్రీ మోదీ చెప్పారు.
గ్రామీణ భారతం ఆధునిక సాంకేతికతను అనుసరించజాలదనే కాలం చెల్లిన ఆలోచనా విధానానికి ‘నమో డ్రోన్ దీదీలు’ నేడు సవాలు విసురుతున్నారని ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ మేరకు ఎరువులు, పురుగుమందులు చల్లడానికి ఎంతో నైపుణ్యంతో వారు డ్రోన్లను వినియోగిస్తూ కువిమర్శలను తుత్తునియలు చేశారని ఆయన పేర్కొన్నారు. “ఇప్పుడు డ్రోన్ల వినియోగం పరిధి కూడా వేగంగా విస్తరిస్తోంది” అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు.
దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, యువత సమష్టి కృషి ద్వారా వ్యవసాయ పరికరాలు చౌకగా లభించేలా చూడాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ మేరకు తక్కువ ఖర్చుతో నాటు, కోత యంత్రాలు లభించాలని, చిన్న రైతులకు సైతం కచ్చితమైన సమాచారాన్నిచ్చే చౌక-సెన్సార్ ఆధారిత ఏఐ సదుపాయాలు గల పరికరాలను అందుబాటులోకి తేవాలని కోరారు. ఇవన్నీ ఇప్పుడు పురోగమన పథంలో ఉన్నందు వల్ల భారత వ్యవసాయ రంగంలో ఇంజనీరింగ్ పాత్ర విస్తరిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఇంజనీరింగ్, అంకుర సంస్థల వ్యవస్థ వర్ధిల్లుతున్న నేటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి విలువ జోడింపును ప్రోత్సహించడం సహా రైతును వ్యవసాయ పారిశ్రామికవేత్తగా మార్చడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. “ప్రభుత్వం ఇటీవలి కాలంలో చిన్న రైతులను ఏకం చేసి, 10,000 రైతు ఉత్పత్తిదారు సంస్థల (ఎఫ్‌పీఓ) భారీ నెట్‌వర్క్‌ను రూపొందించింది. చిన్న రైతు సమూహాలను ఇది విలువ సృష్టికర్తలుగా మారుస్తూ ఆహార తయారీ-ఎగుమతి మార్కెట్లతో వారిని అనుసంధానిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రైతులపై భారం మోపకుండా చూడటమే ప్రభుత్వ విస్పష్ట విధానం, లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఫలితంగా అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, రైతుకు చౌకగా ఎరువులు సమకూర్చడం కోసం గత 12 ఏళ్లలో ప్రభుత్వం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. “అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.5,000 ఖరీదు చేసే డీఏపీ బస్తాను మన రైతులకు రూ.1,300కే అందిస్తున్నాం. అలాగే రూ.3,000 విలువైన యూరియా బస్తాను రూ.300 కన్నా తక్కువకే ఇస్తున్నాం” అని శ్రీ మోదీ గుర్తుచేశారు.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం కావడంతో కొన్ని వారాల వ్యవధిలోనే ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు పెరిగింది. పొరుగు దేశాలు ఇంధన ధరలను 40 నుంచి 50 శాతం పెంచిన నేపథ్యంలో డీజిల్ ధరను లీటరుకు కనీసం రూ.50 మేర పెంచాల్సిన ఒత్తిడి ఏర్పడింది. కానీ, ఇలాంటి గడ్డు పరిస్థితిలోనూ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరును ప్రధానమంత్రి ప్రత్యేకంగా వివరించారు. అంతర్జాతీయంగా మార్కెట్ ఒత్తిడి పెరిగినా దాన్ని పౌరులు, రైతులపై మోపడానికి ప్రభుత్వం ఇచ్చగించలేదని ఆయన పేర్కొన్నారు. అందువల్లనే డీజిల్‌పై లీటరు ధరను ప్రభుత్వం రూ.7 మాత్రమే పెంచి, ఇప్పటిదాకా నెలకు రూ.14,000 కోట్ల వ్యయంతో మిగిలిన రూ.43 భారాన్ని తానే భరించిందని ఆయన తెలిపారు. “దేశ రైతుల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రధానం… ‘పౌర దేవో భవ’ స్ఫూర్తి ఉంటేనే ఇలాంటి సునిశిత నిర్ణయాలు తీసుకోగలం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
చివరగా- దేశంలోని అన్నదాతలు ఇటీవల సాధించిన అద్భుత విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. సంపన్న రైతులు, సుసంపన్న గ్రామాలు, ఆధునిక-లాభదాయక వ్యవసాయ సహిత ‘వికసిత భారత్’ సాకారానికి మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో చర్చలు దేశానికెంతో ప్రయోజనం చేకూర్చగలవని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ఈ వేదిక నుంచి లభించే మెరుగైన సూచనలు-పరిష్కారాలపై ప్రభుత్వం కూడా తప్పక దృష్టి సారిస్తుంది. అంతేకాదు.. వాటి సమర్థ అమలుకు తనవంతు కృషి చేస్తుంది” అని దృఢంగా ప్రకటిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
***
Speaking at the Bharat Agriculture Conference. @IndiaToday @aajtak https://t.co/zSM5kaRsvi
— Narendra Modi (@narendramodi) November 12, 2026
Agricultural development, smarter farming and farmer empowerment are key to building a Viksit Bharat. https://t.co/NWTi6lnlww
— PMO India (@PMOIndia) November 12, 2026
Annadatas are becoming Urjadatas. https://t.co/LviAj1ttmG
— PMO India (@PMOIndia) November 12, 2026
From Lab to Land. https://t.co/7eR74emO2n
— PMO India (@PMOIndia) November 12, 2026
Namo Drone Didis are demonstrating how advanced technology can be effectively used in villages. https://t.co/ASbNPzrbvu
— PMO India (@PMOIndia) November 12, 2026
India offers growing opportunities in everything from agri-engineering to agri-startups. The focus is on empowering farmers to become agricultural entrepreneurs. https://t.co/Cr5OuKvPuu
— PMO India (@PMOIndia) November 12, 2026