Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మేజ‌ర్ పోర్ట్ ట్ర‌స్ట్స్ చ‌ట్టం, 1963’ స్థానంలో ‘మేజ‌ర్ పోర్ట్ ట్ర‌స్ట్ అథారిటీస్ బిల్లు, 2016’ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


మేజ‌ర్ పోర్ట్ ట్ర‌స్ట్ ల చ‌ట్టం, 1963 స్థానంలో కొత్త‌గా మేజ‌ర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు, 2016ను ప్ర‌వేశ‌పెట్టాల‌న్ననౌకాయాన మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాద‌న‌ను మంత్రిమండలి ఆమోదించింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. దీని వ‌ల్ల దేశంలోని ప్ర‌ధాన నౌకాశ్రయాలు నిర్ణ‌యాలలో మ‌రింత స్వ‌తంత్రప్ర‌తిప‌త్తిని పొంద‌డం ద్వారా మ‌రింత స‌మ‌ర్థ‌ంగా ప‌ని చేసేందుకు, ప్ర‌ధాన నౌకాశ్రయాల సంస్థాగ‌త నిర్మాణాన్ని ఆధునికీక‌రించేందుకు వీలు క‌లుగుతుంది.

దేశంలో ఓడరేవుల మౌలిక వ‌స‌తుల‌ను విస్త‌రించి వ‌ర్త‌క‌, వాణిజ్యాల‌ను ప్రోత్స‌హించేందుకు పోర్టుల నిర్వ‌హ‌ణ‌లో వృత్తి నైపుణ్యాలను ప్ర‌వేశ‌పెట్టాల‌ని, నిర్ణ‌యాలు తీసుకొనే వ్య‌వ‌స్థ‌ను వికేంద్రీక‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. కొత్తగా ప్ర‌వేశ‌పెట్ట‌నున్న మేజ‌ర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్లు, 2016 నిర్ణ‌యాలు తీసుకొనే విధానం మ‌రింత త్వ‌రితంగాను, పార‌ద‌ర్శ‌కంగాను ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌డం ద్వారా పోర్టు కార్య‌క‌లాపాల‌తో సంబంధం ఉన్న వారంద‌రికీ ల‌బ్ధి క‌లిగేందుకు దోహ‌ద‌కారిగా ఉంటుంది. ప్రాజెక్టుల అమ‌లు సామ‌ర్థ్యాలు కూడా మెరుగుప‌డ‌తాయి. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు దీటుగా సెంట్ర‌ల్ పోర్టుల న‌మూనా నుండి లాండ్ లార్డ్ పోర్టుల విధానంలోకి పోర్టుల పాల‌నా వ్య‌వ‌స్థ ప‌రివ‌ర్త‌న చెందేలా చూడ‌డం ఈ బిల్లు ల‌క్ష్యం. ప్ర‌ధాన పోర్టులలో దీని వ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంది.

మేజ‌ర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు ప్ర‌ధానాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

ఎ. మేజ‌ర్ పోర్ట్ ట్ర‌స్టుల చ‌ట్టం, 1963తో పోల్చితే ఇది మ‌రింత స‌మ‌గ్రంగా ఉంటుంది. అవ‌స‌రం లేని సెక్ష‌న్ లను తొల‌గించ‌డం ద్వారా పున‌రుక్తి లేకుండా చేసి సెక్ష‌న్ ల సంఖ్య‌ను కూడా 134 నుంచి 65కు కుదించారు.

బి. పోర్ట్ అథారిటీ బోర్డు ఏర్పాటును కూడా స‌ర‌ళ‌త‌రం చేశారు. భిన్న ప్ర‌యోజ‌నాలు క‌లిగిన 17 నుండి 19 మంది బోర్డు స‌భ్యుల స్థానంలో కేవ‌లం 11 మంది స‌భ్యులతో బోర్డు ఏర్పాటు కావాల‌ని నిర్దేశించారు. వృత్తి నిపుణులైన స్వ‌తంత్ర స‌భ్యులు ఉండే ఈ బోర్డు నిర్ణ‌యాలు, వ్యూహాత్మ‌క ప్ర‌ణాళికా విధానాల‌ను ప‌టిష్ఠం చేస్తుంది. ఏ రాష్ర్టంలో అయితే పోర్టు ఉంటే ఆ రాష్ర్ట‌ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఒక‌రిని బోర్డు స‌భ్యునిగా నియ‌మించే వీలు క‌ల్పించింది. రైల్వే, ర‌క్ష‌ణ‌, క‌స్టమ్స్, రెవెన్యూ మంత్రిత్వ శాఖ‌ల ప్ర‌తినిధుల‌తో పాటు ప్ర‌భుత్వ నామినేటెడ్ స‌భ్యుడొక‌రు మరియు మేజ‌ర్ పోర్ట్ అథారిటీ ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధి బోర్డు స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తారు.

సి. మేజ‌ర్ పోర్టుల టారిఫ్ అథారిటీ (టిఎఎమ్ పి) పాత్ర‌ను కూడా పున‌ర్నిర్వ‌చించారు. టారిఫ్ లు నిర్ణ‌యించే అధికారం ఇప్పుడు పోర్టు అథారిటీకి అప్ప‌గించారు. ఈ టారిఫ్ లు పిపిపి ప్రాజెక్టుల బిడ్డింగ్ కు కూడా రెఫ‌రన్స్ గా ఉంటాయి. మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా టారిఫ్ లను నిర్ణ‌యించే స్వేచ్ఛ పిపిపి ఆప‌రేట‌ర్ల‌కు ఉంటుంది. భూమితో స‌హా నౌకాశ్రయ ఆస్తులు, సేవ‌ల‌కు రేట్ల ప‌రిధిని నిర్ణ‌యించే అధికారం పోర్టు అథారిటీ బోర్డుకు ఉంటుంది.

డి. గ‌తంలో ప‌ని చేసిన టిఎఎమ్ పి స్థానంలో పోర్టుకు సంబంధించిన ఇత‌ర విధుల నిర్వ‌హ‌ణ‌కు స్వ‌తంత్ర రివ్యూ బోర్డు ఏర్పాటును ప్ర‌తిపాదించారు. పోర్టులు, పిపిపి క‌న్సెష‌న‌రీ ల మ‌ధ్య ఏర్ప‌డే వివాదాలను ప‌రిశీలించ‌డం, ఒత్తిడిలో ఉన్న పిపిపి ప్రాజెక్టులను స‌మీక్షించ‌డం, ఒత్తిడిలో ఉన్న పిపిపి ప్రాజెక్టుల స‌మీక్ష‌కు మార్గాలు, వాటి పున‌రుజ్జీవనానికి చ‌ర్య‌లు సూచించ‌డం, పోర్టులు/ప్రైవేటు ఆప‌రేట‌ర్లు సేవ‌ల‌కు సంబంధించి చేసే ఫిర్యాదుల ప‌రిశీల‌న వంటి కార్య‌క‌లాపాలను ఇది నిర్వ‌హిస్తుంది.

ఇ. పోర్టు అథారిటీ బోర్డుకు కాంట్రాక్టులు కుదుర్చుకోవ‌డం, ప్ర‌ణాళిక‌, అభివృద్ధి, టారిఫ్ ల నిర్ణ‌యం, భ‌ద్ర‌త‌, ఎమ‌ర్జెన్సీ నిర్వ‌హ‌ణ ల వంటి అంశాల‌న్నింటిలోనూ పూర్తి అధికారాలు క‌ట్ట‌బెట్టారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఎమ్ పిటి చ‌ట్టం, 1963 కింద 22 వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌పై కేంద్ర‌ప్ర‌భుత్వం అనుమ‌తి పొందాల్సి ఉంది.

ఎఫ్. పోర్టు ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాల‌కు సంబంధించిన మాస్ట‌ర్ ప్లాన్ రూప‌క‌ల్ప‌న‌, పైప్ లైన్ ల నిర్మాణం, టెలిఫోన్, క‌మ్యూనికేష‌న్ టవ‌ర్ ల ఏర్పాటు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, ట్రాన్స్ మిష‌న్ ప‌రిక‌రాల ఏర్పాటుకు బోర్డుకు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. పోర్టు సంబంధిత కార్య‌క‌లాపాల‌కు 40 సంవ‌త్స‌రాల వ‌ర‌కు, సెక్ష‌న్ 22లో పొందుప‌రిచిన కార్య‌క‌లాపాలు కాకుండా ఇత‌ర‌త్రా కార్య‌క‌లాపాల‌కు 20 సంవ‌త్స‌రాల వ‌ర‌కు భూమిని లీజుకు ఇచ్చే అధికారాన్ని కూడా బోర్డుకు క‌ట్ట‌బెట్టారు. ఆ కాల‌ వ్య‌వ‌ధి దాటితే కేంద్ర‌ ప్ర‌భుత్వం అనుమ‌తి పొందాల్సి వ‌స్తుంది.

జి. పోర్టు అథారిటీకి సిఎస్ ఆర్ కార్య‌క‌లాపాలు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి బాధ్య‌త‌లు కూడా నిర్దేశించారు.