పిఎంఇండియా
మొజాంబిక్ ప్రభుత్వం, భారతదేశ నూతన మరియు పునర్ వినియోగ ఇంధనశాఖకు మధ్యన కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి (ఎంఓయు) ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ సంవత్సర ఆగస్టు ఐదో తేదీన దేశరాజధాని న్యూఢిల్లీలో ఇరుదేశాలకు మధ్యన ఈ ఎంఓయు కుదిరిన విషయం తెలిసిందే. ఇది మన దేశ పునర్ వినియోగ ఇంధనశాఖకు, మొజాంబిక్ దేశ ఖనిజ వనరుల మంత్రిత్వశాఖకు మధ్యన కుదిరింది. మొజాంబిక్ దేశ అధ్యక్షుడు శ్రీ ఫిలిపె న్యూసి మన దేశం సందర్శన సందర్భంగా ఈ ఎంఓయు జరిగింది.
ఈ ఎంఓయూ కారణంగా ఇరుదేశాల మధ్యన దైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడతాయి.
నేపథ్యం
అన్ని విధాలా ఇరుదేశాలకు మేలు జరిగే విధంగా ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్యన పునర్ వినియోగ ఇంధన రంగంలో సహకార పూరిత సంస్థాగతమైన సంబంధబాంధవ్యాలు పెరుగుతాయి. సాంకేతికపరమైన ద్వైపాక్షి సహకారం పెంపొందుతుంది. పెట్టుబడులతోపాటు భాగస్వామ్యం పెరుగుతుంది. నూతన, పునర్‌వినియోగ ఇంధన రంగాల సమస్యల పరిష్కారంలో ఇరుదేశాల సహకారమనేది కీలకమైనది. దీని ద్వారా పలు సాంకేతికతలు అభివృద్ధవుతాయి. ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు, సాంకేతిక పరిశోధన, అభివృద్ధి, సాంకేతికత బదిలీ వంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. సౌర, పవన, బయో ఫ్యూయల్స్, జియో థెర్మల్ మొదలైన పునర్ వినియోగ ఇంధనాల్లో ఇరుదేశాలు తమ అనుభవాలను పంచుకోవచ్చు. తద్వారా ప్రైవేటు రంగంలో కూడా ద్వైపాక్షిక పునర్ వినియోగ ఇంధన వేదిక ఏర్పడుతుంది. శాస్త్రపరంగా ఇరుదేశాల్లో సందర్శన కార్యక్రమాలు కొనసాగుతాయి.