Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మౌలిక వసతుల రంగాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ప్రధాని

మౌలిక  వసతుల  రంగాల  అభివృద్ధిపై  సమీక్ష  నిర్వహించిన  ప్రధాని

మౌలిక  వసతుల  రంగాల  అభివృద్ధిపై  సమీక్ష  నిర్వహించిన  ప్రధాని


ప్రధాని శ్రీ నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం డిజిటల్ , గ్రామీణ , అనుసంధాన రంగాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నట్లు, రాబోయే వెయ్యి రోజులలో దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలకు విద్యుత్ ను అందించే దిశగా అవసరమైన ప్రణాళికల గురించి అధికారులను వివరాలు అడిగారు. అనుకున్న సమయంలోపు ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విభాగాలు ఈ కార్య‌క్ర‌మాన్ని పర్యవేక్షించాలని ప్రధాని ఆదేశించారు.

ఈ సందర్భంగా అధికారులు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల అనుసంధాన వివరాలను ప్రధానికి తెలిపారు. అందుబాటులో ఉన్న రైల్వే, కమ్యూనికేషన్ల మౌలిక వసతులను ఉపయోగించి మారుమూల, అనుసంధానం లేని ప్రాంతాలకు కూడా మొబైల్ ఫోన్ల సదుపాయాన్ని కల్పించేందుకు అధికారులు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. డిజిటల్ ఇండియా కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక వసతులను పెంచాలని ప్రధాని తెలిపారు.

సాధారణ ప్రజానీకానికి ఇబ్బందికరంగా మారిన కాల్ డ్రాప్ అంశాన్ని ప్రధాని తీవ్రంగా పరిగణిస్తూ – ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. త్వరితగతిన ఈ అంశాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వాయిస్ కనిక్టివిటీ లో ఎదురయ్యే సమస్యలు, డేటా కనిక్టివిటీలో కూడా పునరావృతం కాకూడదని ప్రధాని తెలిపారు.

రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో సౌర శక్తి సంబంధిత ప్రాజెక్టుల ప్రగతి గురించి కూడా ప్రధాని సమీక్షించారు. రైల్వే విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ప్రధాని ఆదేశించారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లతో రోడ్డు అనుసంధాన కార్యక్రమాన్ని ముఖ్యాంశంగా చేపట్టాలని కోరారు. మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కోసం సరిపడ నిధులను సమకూరుస్తున్నామని, వీటిని ఉపయోగించి ఫలితాలను సాధించడం ఆయా మంత్రిత్వ శాఖల పై ఆధారపడి ఉందని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు శ్రీ అరవింద్ పనగారియా , ప్రధానమంత్రి కార్యాలయం, నీతి ఆయోగ్, సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

****