Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ల 47వ స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో  జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ల 47వ స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బుధ‌వారం న్యూఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ల 47వ స‌మావేశం ముగింపు స‌ద‌స్సు ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

గ‌వ‌ర్న‌ర్లు వారు ఏళ్ల కొద్దీ గ‌డించిన అపార అనుభ‌వం రీత్యా, వారి ప‌ద‌వికి ఉన్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన స్వ‌భావం రీత్యా ఒక విశిష్ట‌మైన ఉన్న‌త స్థానాన్ని అలంక‌రించిన వార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ కార‌ణంగా వారు రాష్ర్టాల‌లో వాటిలో ఒక భాగం కాకుండానే, ప్ర‌భుత్వ ప్ర‌క్రియ‌ల‌కు వేగాన్ని అందించ‌డమే కాక‌ పాల‌న‌ ప్ర‌క్రియ‌ను మెరుగుప‌ర‌చేందుకు ఉత్ప్రేర‌క సాధ‌కాల మాదిరి ప‌నిచేయ‌గ‌లుగుతార‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌పంచంలో ఆర్థిక సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలోనూ శ‌క్తిమంతంగా ముందంజ‌లు వేస్తున్న ఒకే ఒక ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ భార‌త‌దేశం ఒక్క‌టేన‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. భారత‌దేశాన్ని ప్ర‌పంచం గ‌మ‌నిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోవ‌డం లేద‌ని, సిఒపి-21, డ‌బ్ల్యుటిఒ ల వంటి ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌పంచ చ‌ర్చావేదిక‌ల‌పై కీల‌క‌మైన పాత్ర‌ను పోషించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స‌హ‌కారాత్మ‌క‌మైన స‌మాఖ్య విధానానికి ఉన్న ప్రాముఖ్య‌త‌ను ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, ఈ విధానాన్ని తు.చ‌. త‌ప్ప‌క ఆచ‌రించ‌వ‌ల‌సిందేన‌న్నారు. కేంద్రం, రాష్ట్రాలు క‌ల‌సిక‌ట్టుగా “టీమ్ ఇండియా” మాదిరిగా ప‌ని చేయాల‌ని ఆయ‌న అన్నారు. స‌హ‌కారాత్మ‌క‌మైన స‌మాఖ్య విధాన స్ఫూర్తి ఒక్క స‌హ‌కారానికే ప‌రిమితం కాకుండా, అభివృద్ధి సాధ‌న‌కు రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్యవంత‌మైన పోటీ వాతావ‌ర‌ణానికి తావిచ్చే స్ప‌ర్ధాత్మ‌క‌మైన స‌మాఖ్య విధానంగా కూడా రూపొంద‌వ‌ల‌సి ఉంద‌న్నారు.

గ‌వ‌ర్న‌ర్లు అంద‌రు వారి ప‌ద‌వీకాలాలు ముగిసిన అనంత‌రం రాష్ట్రాలకు త‌మ వంతుగా అంద‌జేసిన సేవ‌లు ఏదైనా ఒక రూపంలో వార‌స‌త్వంగా కొన‌సాగే అంశాన్ని గురించి ఆలోచించి, ఆ దిశ‌గా శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

***