Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లోని శహ‌న్‌శాహ్ పుర్‌ లో ప‌శుధ‌న ఆరోగ్య మేళా సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

వారాణసీ లోని శహ‌న్‌శాహ్ పుర్‌ లో ప‌శుధ‌న ఆరోగ్య మేళా సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

వారాణసీ లోని శహ‌న్‌శాహ్ పుర్‌ లో ప‌శుధ‌న ఆరోగ్య మేళా సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

వారాణసీ లోని శహ‌న్‌శాహ్ పుర్‌ లో ప‌శుధ‌న ఆరోగ్య మేళా సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం


భారీ సంఖ్య‌లో ఇక్క‌డ హాజ‌రైన నా ప్రియ‌ సోదర సోదరీమణులారా,

ఉదయం ఇంత త్వరగా ఇంత‌ భారీ జ‌న‌సందోహ‌మా! దీనిని నేను ఊహించ‌నైనా లేదు..క‌నుచూపు మేరలో ఎటు చూసినా జ‌న‌ం! ముందుగా నన్ను మీరు మ‌న్నించాలని కోరుతున్నాను. ఇక్క‌డ మేం చేసిన ఏర్పాట్లు స‌రిపోనందువ‌ల్ల చాలా మంది ఎండ‌లో నిల‌బ‌డవవలసి వ‌చ్చింది. వారందరూ ఇబ్బంది ప‌డుతున్నారు, అయినప్ప‌టికీ న‌న్ను ఆశీర్వ‌దించేందుకు అంతా తరలి వచ్చారు. అందుకే వారికి నేను కృత‌జ్ఞ‌త‌ చెప్ప‌డంతో పాటు మ‌న్నించ‌వలసిందిగా కోరుతున్నాను. అయితే, ఎండ‌లో నిలబడ్డ మీ అంద‌రి క‌ష్టాన్ని ఎన్న‌టికీ వృథా కానివ్వ‌నని నేను మాట ఇస్తున్నాను.

సోదర సోదరీమణులారా, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి.. ప్ర‌త్యేకించి ప‌శుగ‌ణం కోసం ఆరోగ్య మేళా ను నిర్వహించిన‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి నా శుభాభినంద‌నలు. ఈ ప‌శుగ‌ణ ఆరోగ్య మేళాను నేను సంద‌ర్శించిన‌ప్పుడు వివిధ ప్రాంతాల‌ నుండి తీసుకువచ్చిన 1700 వరకు ప‌శువులు ఇక్క‌డ ఉన్నాయి. అనేక‌ మంది నిపుణులైన ప‌శువైద్యులు ఆ ప‌శువుల ఆరోగ్య సంర‌క్ష‌ణ బాధ్యత వహిస్తున్నారు. ఈ దిశ‌గా ఇంత‌టి కృషి సల్పిన ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి ప‌శువైద్య మేళాను నిర్వ‌హించ‌గ‌ల‌ద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను. కొన్ని సంద‌ర్భాల్లో పేద‌రికం కారణంగా ప‌శువుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు వెనుకాడే రైతుల‌కు ఇలాంటి కార్యక్ర‌మం ఎంతో ఊర‌ట‌నిస్తుంది.

వ్య‌వ‌సాయ రంగంలో రైతుల‌కు తోడ్ప‌డేది ఏదైనా ఉందంటే అది ప‌శుపోష‌ణేన‌ని.. అంటే పాల ఉత్ప‌త్తేన‌ని మ‌నంద‌రికీ తెలుసు. కాబ‌ట్టే పాల ఉత్ప‌త్తి, ప‌శు సంప‌ద‌, ప‌శు ఆరోగ్య మేళా త‌దిత‌రాలు వారికెంతో సౌక‌ర్యాన్నిస్తాయి. రానున్న రోజుల్లో మ‌న గ్రామాల‌కు, మ‌న పేద రైతుల‌కు, ప‌శుపోష‌కుల‌కు గొప్ప సేవ‌లందిస్తాయి. ఇందుకుగాను నేను ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

సోదర సోదరీమణులారా, సాధార‌ణంగా త‌మ‌కు వోట్లు తెచ్చి పెట్టే ప‌నులు చేయ‌డానికే ప్రాధాన్య‌ం ఇవ్వ‌డం రాజ‌కీయాలకు, రాజ‌కీయ నాయకులకు స‌హ‌జం. వారు త‌మ వోటు బ్యాంకును బ‌లోపేతం చేసుకోవ‌డానికి కృషి చేస్తారు. కానీ, సోద‌రీ సోద‌రులారా.. మేం భిన్న‌మైన విలువ‌ల వ్య‌వ‌స్థ‌ల ఎదిగిన‌ వాళ్ల‌ం. మా స్వ‌భావం పూర్తిగా భిన్న‌మైన‌ది. పార్టీ క‌న్నా దేశ‌మే మాకు చాలా ముఖ్యం. అందువ‌ల్ల మా ప్రాథమ్యాల‌ను నిర్ణ‌యించేది వోట్లు కానే కాదు.

ఇవాళ ఈ ప‌శు ఆరోగ్య‌ మేళా గానీ, సేవలందుకున్న ప‌శువులు గానీ వోట్లు వేసేదేమీ ఉండ‌దు. ఇవి ఎవ‌రి వోట‌ర్లూ కావు. గ‌డ‌చిన 70 సంవత్సరాలలో ప‌శుగ‌ణం కోసం ఈ తరహా కార్య‌క్ర‌మం ఎన్న‌డూ చేప‌ట్టింది లేదు. ఈ ప్రాంతంలో ప‌శుపోష‌ణ‌కు ఈ ఆరోగ్య‌ సేవ‌లు కొత్త స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. ఇదొక కొత్త వ్య‌వ‌స్థ‌ను రూపొందిస్తుంది. ఇవాళ పాల ఉత్ప‌త్తిలో మ‌న దేశం గ‌ణ‌నీయ స్థానంలో ఉంది. అయితే, ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే మ‌న త‌ల‌స‌రి పాల ఉత్ప‌త్తి చాలా త‌క్కువ‌. అందుకే మ‌న దేశంలో ప‌శుపోష‌ణ ఖ‌రీదైందిగా మారింది. త‌ల‌స‌రి పాల ఉత్ప‌త్తిని పెంచ‌డంలో మ‌నం కృత‌కృత్యుల‌మైతే ప‌శుపోష‌ణ‌పై మ‌న రైతులు ఆస‌క్తి చూప‌గ‌ల‌ర‌న్న‌ది నా విశ్వాసం. త‌ద్వారా పాల అధికోత్ప‌త్తి కొత్త ఆర్థిక విప్ల‌వానికి దారితీస్తుంది.

సోదర సోదరీమణులారా, నా జన్మస్థలం గుజ‌రాత్‌. నేను ప‌ని చేసే ప్ర‌దేశం గుజ‌రాత్‌. స‌హ‌కార మార్గంలో పాల ఉత్ప‌త్తి గుజ‌రాత్ రైతుల‌కు కొత్త బ‌లాన్ని ఇవ్వ‌డం నేను చూశాను. గుజరాత్‌కు చెందిన ‘బ‌నాస్ డెయిరీ’వారు ల‌ఖనవూ- కాన్ పుర్ ప్రాంతంలో పాల సేక‌ర‌ణను ప్రారంభించిన‌ట్లు నాకు చెప్పారు. ఇవాళ దీనివ‌ల్ల ఇంత‌కు ముందు పొందిన ధ‌ర‌ క‌న్నా అనేక‌ రెట్లు మెరుగైన ధ‌ర‌ను పాడి రైతులు పొందుతున్నారు. రానున్న రోజుల్లో కాశీ ప్రాంతం నుండి కూడా బ‌నాస్ డెయిరీ వారు పాల సేక‌ర‌ణ ను చేప‌ట్ట‌బోతున్నార‌ని నాకు తెలిసింది.

ఇలా డెయిరీ ద్వారా పాల లోని మీగ‌డ శాతం ఆధారంగా పాల సేక‌ర‌ణ ప్రారంభ‌మైందంటే కాశీ ప్రాంత పాడి రైతులకు ల‌భించే పాల‌ ధ‌ర చాలా రెట్లు పెరుగుతుంద‌న్న విశ్వాసం నాకుంది. దీంతో పాడి రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. అందుకే నేను ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని అభినందిస్తున్నాను. అలాగే గుజ‌రాత్ ప్ర‌భుత్వ తోడ్పాటుతో ఈ ఉద్య‌మాన్ని ప్రారంభించిన ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ రైతుల‌ను అభినందిస్తున్నాను. రైతుల‌కు, ప‌శుపోష‌కుల‌కు, పాల ఉత్ప‌త్తిదారుల‌కు బ‌న‌స్ డెయిరీ తోడ్పాటు ద్వారా పాల ఉత్ప‌త్తిలో, ప‌శు సంవ‌ర్ధ‌కంలో మ‌నం క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయ‌వ‌చ్చు.

సోదర సోదరీమణులారా, మ‌న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్త‌ి అయ్యే 2022 కల్లా నాటి స‌మ‌ర‌యోధులు క‌న్న క‌ల‌ల‌ను నిజం చేయ‌డానికి మ‌న‌మంతా స‌మ‌ష్టిగా దృఢ నిశ్చ‌యానికి రావాలి. ఏదిఏమైనా వారి స్వ‌ప్న సాకారానికి గ‌ట్టిగా కృషి చేయ‌డంలో భాగంగా మ‌న స‌మ‌యాన్ని, శ‌క్తియుక్తుల‌ను వెచ్చించాలి. ఆ మేర‌కు 125 కోట్ల మంది భార‌తీయులు త‌లా ఒక కార్య‌సాధ‌న‌కు ప్ర‌తిన‌బూనితే ఐదేళ్ల‌లో మ‌న దేశం 125 కోట్ల అడుగులు ముందుకుపోతుంది. కాబ‌ట్టి, సోదర సోదరీమణులారా, 2022 దిశ‌గా మ‌న స్వాతంత్ర్య స‌మ‌రాన్ని కొన‌సాగిద్దాం.

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాల‌న్న‌ది మా ప్రతిన. ఆ దిశ‌గా ప‌శుపోష‌ణ‌ను చేప‌ట్ట‌డం ఒక మార్గ‌మైతే, వ్య‌వ‌సాయ‌ రంగం ఆధునికీక‌ర‌ణ మ‌రో మార్గం. భూసార కార్డుల‌ ద్వారా భూసారాన్ని తెలుసుకోవాలి. ఈ మేర‌కు రైతులు పూర్తి మ‌ద్ద‌తును పొందాలి. వీట‌న్నిటినీ ప‌టిష్ఠం చేసే దిశ‌గా మేం కృషి చేస్తున్నాం. ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత‌ రైతుల‌కు భూసార కార్డుల జారీ కార్య‌క్ర‌మం వేగాన్ని అందుకొంది. రాబోయే రోజుల్లో మ‌న రైతుల సంక్షేమానికి ఇది ఎంత‌గానో తోడ్ప‌డుతుంది.

అదేవిధంగా అప‌రిశుభ్ర‌త‌తో జీవించాల‌ని మ‌న‌మెవ‌ర‌మూ అనుకోం. అప‌రిశుభ్ర‌త‌ను ఏవ‌గించుకోని మ‌నిషంటూ ఉండ‌రు. మురికిని అంతా అస‌హ్యించుకుంటారు. అందుకే ప‌రిశుభ్ర‌త అనేది మ‌నంద‌రి బాధ్య‌త‌. కానీ, ఈ సంస్కృతి దేశంలో వ్యాపించ‌లేదు. మ‌నం క‌లుషితం చేస్తాం.. మ‌రెవ‌రో శుభ్రం చేయాలనే మ‌న‌స్త‌త్వమే మ‌న దేశాన్ని, మ‌న న‌గ‌రాల‌ను, మ‌న గ్రామాల‌ను మ‌నం కోరుకున్న‌ట్లు ప‌రిశుభ్రంగా ఉంచ‌లేని మ‌న అస‌మ‌ర్థ‌త‌కు ప్ర‌ధాన కార‌ణం. ప‌రిశుభ్ర‌త అనేది ప్ర‌తి పౌరుడి బాధ్య‌త‌నే నిజాన్ని మీలో ఏ ఒక్క‌రూ కాద‌న‌లేరు. ఈ ప‌రిశుభ్ర‌త ప్ర‌తి కుటుంబం బాధ్య‌త‌.. అందుకే ఈ ప‌రిశుభ్ర‌త‌.. మ‌న గ్రామం శుభ్రంగా ఉంచుకుంటే చాల‌దు, మ‌న ప్రాంతమంతా ప‌రిశుభ్రంగా ఉండాలి. అదొక్క‌టే చాలదు.. ప‌రిశుభ్ర‌త అనేది మ‌న ఆరోగ్యానికీ చాలా ముఖ్య‌మే. అనేక వ్యాధుల విజృంభ‌ణ వెనుక ప్ర‌ధాన కార‌ణం ప‌రిశుభ్ర‌త లోప‌మే.

భార‌త‌దేశంలో 10,000 కుటుంబాల‌పై యూనిసెఫ్ ఇటీవ‌లే అధ్య‌య‌నం పూర్తి చేసింది. ఇది మ‌రుగుదొడ్ల నిర్మాణంపై చేసిన అధ్య‌య‌నం. నిన్న నేను ఒక వార్తాప‌త్రిక‌లో చ‌దివిన‌ దాని ప్ర‌కారం దీనిని గురించి యూనిసెఫ్ ఏం చెప్పిందంటే: ఇంట్లో మ‌రుగుదొడ్డి ఉన్న‌ట్ల‌యితే అనారోగ్యానికి ఏటా దాదాపు రూ.50,000 ఖ‌ర్చు చేసే ప‌రిస్థితి తప్పుతుంది. ఇవాళ ఇక్క‌డికి స‌మీపంలోని ఒక గ్రామంలో ఓ మ‌రుగుదొడ్డి నిర్మాణంలో పాల్గొనే మంచి అవ‌కాశం నాకు ల‌భించింది. అంతేకాకుండా త‌మ గ్రామాన్ని అక్టోబ‌రు 2క‌ల్లా బ‌హిరంగ విస‌ర్జ‌న‌ ర‌హితంగా చేస్తామ‌ని ఆ గ్రామ‌స్థులు ప్ర‌తిన‌బూనారు. త‌ద‌నుగుణంగా అక్టోబ‌రు 2వ తేదీ నుండి గ్రామ‌నివాసుల‌లో త‌మ‌లో ఒక్క‌రు కూడా బ‌హిరంగ విస‌ర్జ‌న చేయ‌బోమ‌ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. ఈ ప‌విత్ర న‌వ‌రాత్రి దినాల్లో అక్క‌డ పునాదిరాయి వేసే అవ‌కాశం ల‌భించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.. ఇది నాకు ఒక పూజ‌ లాంటిది. నా వ‌ర‌కు నాకు ప‌రిశుభ్ర‌త పూజ‌తో స‌మానం. నా దేశంలోని పేద‌ల‌ను ప‌రిశుభ్ర‌తే అనారోగ్యాల‌కు దూరంగా ఉంచుతుంది. ప‌రిశుభ్ర‌త లోపంవ‌ల్ల వ‌చ్చిప‌డే అనారోగ్య భారాన్ని మోయాల్సిన బాధ‌నుంచి నా దేశ పేద‌లను త‌ప్పించేది ప‌రిశుభ్ర‌తే. పేద‌ల సంక్షేమం దిశ‌గా ఇదే నా ఉద్య‌మం… ఈ కృషిలో నాకు మ‌ద్ద‌తిస్తున్న‌వారంద‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

దేశంలో మ‌రుగుదొడ్డి అనే సాధార‌ణ పద వినియోగం సంతోష‌మే గానీ, ఇవాళ నేను మ‌రుగుదొడ్డికి పునాది వేసిన‌ గ్రామంలో మ‌రుగుదొడ్ల గోడ‌ల‌పై ‘ఇజ్జ‌త్ ఘ‌ర్‌’ (ఆత్మ‌గౌర‌వ నిల‌యం) అని రాసి ఉంది. ఆ ప‌దం నాకెంతో న‌చ్చింది. నిజ‌మే.. ఇది మ‌న ఇంటి మ‌హిళ‌ల‌కు, మ‌న ఆడ‌బిడ్డ‌ల‌కు ఆత్మ‌గౌర‌వ నిల‌య‌మే. అటువంటి ఇజ్జ‌త్ ఘ‌ర్ ఉన్న ఇల్లు నిజంగా ఆత్మ‌గౌర‌వ నిల‌య‌మే. అలాంటి మ‌రుగుదొడ్లు కలిగివున్నటువంటి గ్రామం కూడా అమిత గౌర‌వాన్ని పొందుతుంది. ఇక మ‌రుగుదొడ్ల‌ను గుర్తించడానికి ఇజ్జ‌త్ ఘ‌ర్ అనే ప‌దాన్ని ఖాయం చేసిన ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. వారు మ‌రుగుదొడ్ల‌కు ఓ కొత్త గౌర‌వాన్నిచ్చారు. ఆత్మ‌గౌర‌వాన్ని న‌మ్మే వారు, ఆత్మ‌గౌరవం గురించి త‌ప‌న‌ ప‌డే వారు, ఆత్మ‌గౌరవం కోసం ఆందోళ‌న చెందే వారు.. అలాంటి ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా ఒక మరుగుదొడ్డి (ఇజ్జ‌త్ ఘ‌ర్) ను నిర్మించుకోవ‌డ‌మేగాక దాన్ని క‌చ్చితంగా వాడుతూ ఆత్మ‌గౌర‌వం గ‌ల వ్య‌క్తిగా మ‌న్న‌న పొందుతారు. సోదర సోదరీమణులారా, దేశంలో సొంత ఇల్లంటూ లేని, క‌నీసం త‌ల‌ దాచుకొనే నీడ‌ లేని కుటుంబాలు నేటికీ ల‌క్ష‌లాదిగా ఉన్నాయి. వారంతా అత్యంత అమానుష ప‌రిస్థితులలో మనుగడ సాగిస్తున్నారు.

కాబ‌ట్టి, సోద‌ర సోదరీమణులారా, అటువంటి నిరుపేద‌లు త‌ల‌దాచుకునేందుకు ఓ గూడు, ఒక ఇల్లంటూ క‌ల్పించ‌డం మ‌నంద‌రి విధి. అందుకే ఈ దిశ‌గా మేం ప్ర‌తిన‌బూనాం.. ఇది చాలా క‌ష్ట‌సాధ్య‌మ‌న్న వాస్త‌వం కూడా మాకు తెలుసు. కానీ, ఈ క‌ష్ట‌మైన‌ ప‌నిని మోదీ చేయ‌లేక‌పోతే మ‌రెవ‌రు చేయ‌గ‌ల‌రు ? అందుకే దేశం 75 సంవ‌త్స‌రాల స్వాతంత్ర్యం మైలురాయిని చేరుకునే 2022 నాటికి భార‌తదేశం లోని ప్ర‌తి పేద‌కూ ఇల్లు స‌మ‌కూర్చాల‌ని నిర్ణ‌యించాం. స‌ద‌రు ఇల్లు లేని నిరుపేద గ్రామస్తుడు లేదా ప‌ట్ట‌ణ‌ వాసి అన్న‌దానితో నిమిత్తం లేకుండా దేశంలోని ప్ర‌తి పేద‌కూ గృహ‌వ‌స‌తిని క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం. ఇలా ల‌క్ష‌లాది ఇళ్ల‌ను నిర్మించ‌డ‌మంటే ఐరోపా లోని ఓ చిన్న దేశాన్ని భార‌తదేశంలో నిర్మించ‌డం వంటిద‌న్న మాట‌. అలా ఎన్నో ఇళ్ల‌ను నిర్మించాల్సి ఉంటుంది. కొత్త ఇళ్లు క‌ట్టాలంటే ఇటుక‌లు కావాలి.. సిమెంటు కావాలి.. ఉక్కు, కొయ్య వంటివ‌న్నీ కావాలి. త‌ద్వారా ఎంతో మంది కొత్త‌ వారికి ఉపాధి దొరుకుతుంది. ల‌క్ష‌లాది గృహాలను నిర్మించే క్ర‌మంలో ఇది ఒక కొత్త ఉద్యోగావ‌కాశాలను సృష్టించే రంగం అవుతుంది.

ఈ రోజు, నాకు చాలా సంతోషంగా ఉంది; ఎందుకంటే, రాష్ట్రంలో ఇళ్లు లేని ప్ర‌జ‌ల జాబితాను త‌యారు చేయాల‌ని ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ లోని మునుప‌టి ప్ర‌భుత్వానికి మేం చాలా లేఖలు రాశాం. అలాంటి జాబితా ఇస్తే కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప‌థ‌కం సిద్ధం చేయ‌డానికి వీలు అవుతుంద‌ని చాలా సార్లు చెప్పాం. కానీ, పేద‌ల‌కు ఇళ్లు నిర్మించ‌డంపై మునుప‌టి ప్ర‌భుత్వానికి ఎంత‌మాత్రం ఆస‌క్తి లేద‌ని చెప్ప‌డానికి నేను ఎంతో చింతిస్తున్నాను. దీంతో మ‌రింత ఒత్తిడి తెస్తే ఎంతో నిర్లక్ష్యంగా కేవ‌లం ఓ 10,000 మంది పేర్ల‌తో ఒక జాబితాను ఇచ్చారు. అయితే, యోగి గారి ప్ర‌భుత్వం వ‌చ్చిన మ‌రుక్ష‌ణ‌మే ఈ దిశ‌గా ప‌ని ప్రారంభించింది. ఫ‌లితంగా ల‌క్ష‌లాది పేర్ల‌తో ఒక జాబితాను ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. అంతేకాదు.. ఇవాళ ఆ ప్ర‌జ‌ల ఇళ్ల నిర్మాణం కోసం నిధులను అంద‌జేసే భాగ్యం నాకు దక్కింది.

సోదర సోదరీమణులారా, ప‌రిశుభ్ర‌త కావ‌చ్చు.. గ్రామాల విద్యుదీక‌ర‌ణ కావ‌చ్చు.. మ‌రుగుదొడ్లు, పాఠ‌శాలల నిర్మాణం కావ‌చ్చు.. గ్రామాల‌ను బ‌హిరంగ విస‌ర్జ‌న‌ర‌హితం చేయ‌డం కావ‌చ్చు.. ప్ర‌తి ఇంటికీ విద్యుత్తు స‌ర‌ఫ‌రా కావ‌చ్చు.. ప్ర‌జ‌ల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా వంటిది ఏదైనా కావ‌చ్చు.. వీట‌న్నింటి విష‌యంలో మ‌న దేశం చాలా అల‌క్ష్యం చేసింది. మ‌న గ్రామాలు, పేద రైతుల జీవితాలు మారిన‌ప్పుడు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల జీవితాలు మారిన‌ప్పుడే మ‌నం మ‌న దేశాన్ని ఏం చేయాల‌నుకుంటున్నామో, అది సాధ్య‌మ‌వుతుంది. ఈ దిశ‌గా మొట్ట‌మొద‌ట చేయాల్సింది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు సాయం చేయ‌డం.. పేద‌లు వారి జీవితాల్లో మార్పును తెచ్చుకొనేందుకు సాయ‌ప‌డ‌డమే. కాబ‌ట్టే ఆ ప‌థ‌కాల‌న్నింటిలోనూ ప‌రివ‌ర్త‌న తెచ్చాం; దేశంలో మార్పు తెచ్చే అటువంటి ప‌థ‌కాల‌న్నిటినీ బ‌లోపేతం చేశాం.

సోదర సోదరీమణులారా, వారాణసీ లో నిన్న ప‌రిశుభ్ర‌త‌కు సంబంధించిన అనేక ప‌థ‌కాల‌ను జాతికి అంకితం చేసే అవ‌కాశం నాకు ల‌భించింది. అందులో రూ.600 కోట్ల‌తో నిర్మించిన మురుగుశుద్ధి ప్లాంటు కూడా ఒక‌టి. దీని సామ‌ర్థ్యాన్ని ఎలా రూపుదిద్దామంటే.. రాబోయే 20 సంవత్సరాలలో బనారస్ అభివృద్ధికి, విస్త‌ర‌ణ‌కు త‌యారు చేసిన భారీ ప్ర‌ణాళిక‌ల‌కు అనువుగా నిర్మించాం.

వ్య‌ర్థాల నుండి సంప‌ద‌.. దిశ‌గా వ్య‌ర్థ ప‌దార్థాల శుద్ధికి ప్రాధాన్య‌మిచ్చాం. ఈ వ్య‌ర్థ ప‌దార్థాల నుండి విద్యుదుత్ప‌త్తి చేయాల‌ని నిర్ణ‌యించాం. ఇలా ఈ వ్య‌ర్థాల‌ను సంప‌ద‌గా మార్చ‌డానికి ప్రాముఖ్య‌మిస్తూ ఉత్ప‌త్తి చేసే విద్యుత్తును 40,000 ఇళ్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌వ‌చ్చు. అలాగే ఎల్ఇడి బ‌ల్బులను అందించే ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టాం. ఒక్క కాశీ లోనే ఈ బ‌ల్బుల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌తి కుటుంబం విద్యుత్తు బిల్లులో డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చు. ఇది ఏ స్థాయిలో ఉంటుంద‌ని నేను లెక్క‌ వేస్తుండ‌గా ఒక్క కాశీ న‌గ‌రంలోనే ఈ బ‌ల్బుల వ‌ల్ల రూ.125 కోట్ల మేర బిల్లుల భారం త‌గ్గుతుంద‌ని అధికారులు నాకు వివ‌రించారు. ఈ మేర‌కు సామాన్యుల సొమ్ము ఎంత పొదుపు అవుతుందో ఊహించండి.. ఒక‌రికి రూ.500, మ‌రొక‌రికి రూ.1000, ఇంకొక‌రికి రూ.250.. ఇలా మొత్తం న‌గ‌రంలో రూ.125 కోట్లు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై భారం త‌గ్గించ‌డానికి ఇదొక మంచి ప్ర‌య‌త్నమే క‌దా! ఇక్క‌డితో అయిపోలేదు.

కాశీ న‌గ‌రంలో వీధిదీపాలకు కూడా ఎల్ఇడి బ‌ల్బులను వాడుతున్నాం. వీటి వినియోగం వ‌ల్ల ఒక్క ఈ న‌గ‌రంలోనే విద్యుత్తు బిల్లు రూ.13 కోట్ల‌ మేరకు త‌గ్గిపోయింది. కాశీ పుర‌పాలక సమితి రూ.13 కోట్లు ఆదా చేసుకొంది. ఈ రూ.13 కోట్ల నిధులను కాశీ న‌గ‌రాభివృద్ధికి ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఈ బ‌ల్బుల‌ను చాలా సుల‌భంగా మార్చుకోవ‌చ్చు; అంతేకాదు, ఇవి ప్ర‌జ‌ల డ‌బ్బును రూ.125 కోట్ల మేరకు, పుర‌పాలిక సొమ్మును రూ.13 కోట్ల‌ మేరకు ఆదా చేస్తాయి కూడాను. మేం ఏ విధంగా పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకు వస్తున్నామ‌నే దానికి ఇది ఒక నిద‌ర్శనం.

సోదర సోదరీమణులారా, న‌ల్ల‌ధ‌నం కావ‌చ్చు.. లేదా అవినీతి కావ‌చ్చు.. లేదా కపటం కావ‌చ్చు.. వీట‌న్నిటిపైనా నేను మ‌హా యుద్ధాన్ని ప్రకటించాను. నిజాయతీ లేని వారు నిజాయతీప‌రుల‌ను దోచుకోవ‌డం వ‌ల్ల దేశం లోని సామాన్యుడు, నిజాయతీప‌రుడు బాధ‌లు ప‌డవలసి వ‌స్తోంది. కాబ‌ట్టే, సోదర సోదరీమణులారా.. ఈ ఉద్య‌మం ఇవాళ దేశంలో పండుగ‌లాగా మారుతోంది. చిన్న‌ వ‌ర్త‌కులు, చిల్ల‌ర‌ వ్యాపారస్తులు కూడా వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) వ్యవస్థలో చేరుతున్నారు. ‘ఆధార్‌’తో ప్ర‌జ‌లు మ‌మేకం అవుతున్న తీరుతో దోపిడీకి గురి అవుతున్న ధ‌నం.. ఆ ప్ర‌జాధ‌నం అంతా కూడాను, ప్ర‌తి ఒక్క పైసా సైతం ప్ర‌జా సంక్షేమం కోస‌ం ఖ‌ర్చ‌ు పెట్టడం జరుగుతుంది. వీట‌న్నింటి పైనా మేం ముంద‌డుగు వేస్తున్నాం.. చాలా వేగంగా దూసుకెళ్తున్నాం. కాబ‌ట్టి, నా ప్రియ సోదర సోదరీమణులారా, గ్రామీణాభివృద్ధి, పేద‌ల- రైతుల అభివృద్ధి, న‌గ‌రాల అభివృద్ధి జ‌రుగుతోంది. అభివృద్ధి.. ఈ సూత్రంతోనే మేం ముంద‌డుగు వేస్తున్నాం. ఈ నేప‌థ్యంలో మీరంద‌రూ ఇంత‌పెద్ద సంఖ్య‌లో ఆశీస్సులివ్వ‌డం కోసం వ‌చ్చినందుకు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ తెలియజేస్తున్నాను.

ఇది మా మ‌హేంద్ర పాండే గారి పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం.. ఇక్క‌డ మీరంతా చూపిన శ‌క్తికి, ఉత్సాహానికి, ప‌ట్టుద‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ తెలుపుతున్నాను. విజ‌య‌వంత‌మైన వినూత్న చ‌ర్య‌లు తీసుకుంటున్న యోగి గారి ప్ర‌భుత్వాన్ని మ‌రొక‌సారి అభినందిస్తున్నాను. అలాగే ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌లో మార్పు దిశ‌గా ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే అనేక విజ‌య‌వంత‌మైన చ‌ర్య‌ల‌తో ముందుకు సాగుతున్నందుకు అభినంద‌న‌ల‌తో పాటు ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను.

ద‌య‌చేసి ‘భార‌త్ మాతా కీ జయ్’ అంటూ నినదించడంలో నాతో కూడా మీ గొంతు క‌లపండి.

ద‌య‌చేసి మీ పూర్తి శక్తితో ఇంకా బిగ్గ‌ర‌గా ‘భార‌త్ మాతాకీ జయ్’ అనండి.

భార‌త్ మాతా కీ జయ్

భార‌త్ మాతా కీ జయ్

భార‌త్ మాతా కీ జయ్

మీకంద‌రికీ వేవేల ధన్య‌వాదాలు.

***