Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లడఖ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లడఖ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శ్రీ వీకే సక్సేనా, బీఆర్ఓ, విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, కేంద్రపాలిత ప్రాంత అధికారులు, ఇతర ముఖ్య అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీలారా..

“లడఖ్ సి మి-మాంగ్స్ కున్లా, జుల్లే!” (లడఖ్‌ ప్రజలందరికీ నమస్కారం)

లడఖ్‌ అభివృద్ధి ప్రస్థానంలో నేడు మరో అధ్యాయం చేరుతోంది. సాంకేతికత ద్వారా ఈ కార్యక్రమంలో భాగమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు లడఖ్‌లో అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టుల ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రయాణం సులభతరమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సదుపాయాలు మెరుగుపడతాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత పెరుగుతుంది. మన ప్రాచీన వారసత్వ పరిరక్షణకు కూడా మరింత బలం చేకూరుతుంది. ఇప్పుడే జన్‌స్కార్‌లో మంచు కురుస్తున్న దృశ్యాలను చూశాను. మంచు కురుస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు ఎంతో ఉత్సాహంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనించాను.

మిత్రులారా,

ఇది నా లే… నా లడఖ్‌. ఈ ప్రాజెక్టుల కోసం లడఖ్‌ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లు, కార్మికులు, స్థానిక సహచరులందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ) సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా,

కొంతకాలం కిందట లేలోని కుషోక్‌ బకులా రింపోచీ విమానాశ్రయ టెర్మినల్‌ భవనానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఈ రోజు ఆ కీలక ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కూడా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సుమారు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్‌ ద్వారా విమానాశ్రయం వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 10 లక్షల నుంచి 35 లక్షలకు పెరుగుతుంది. ఇక్కడ విమానాల సంఖ్య కూడా మూడు రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ టెర్మినల్‌కు మరో ప్రత్యేకత ఉంది. లడఖ్‌లోని కఠినమైన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇందులో భూఉష్ణ సాంకేతికతను (జియోథర్మల్‌ టెక్నాలజీ) ఉపయోగించారు. సౌరశక్తి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. భూఉష్ణ తాపన సదుపాయం కలిగిన దేశంలోనే తొలి విమానాశ్రయ టెర్మినల్‌ ఇదే. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. లడఖ్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే, ఇక్కడి పర్యావరణ పరిరక్షణకు కూడా పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే మా ప్రయత్నం. ఈ విమానాశ్రయ టెర్మినల్‌ లడఖ్‌ పర్యాటక రంగానికి కూడా కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ ఆధునిక విమానాశ్రయ టెర్మినల్‌ ప్రారంభం సందర్భంగా లడఖ్‌లోని నా సోదరసోదరీలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు ప్రారంభించిన ఇతర ప్రాజెక్టులు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. నిమ్ము–పదుమ్‌–దర్చా రహదారిని నేడు లడఖ్‌ ప్రజలకు అంకితం చేశాను. ఈ రహదారి నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేశాం. గతంలో దాదాపు 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు సుమారు మూడు గంటల్లో పూర్తవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఈ రహదారి ఎంతో తోడ్పడుతుంది.

మిత్రులారా,

గతంలో శ్రీనగర్‌–లే మధ్య విద్యుత్‌ ప్రసార లైన్‌కు శంకుస్థాపన చేయడం, దాన్ని ప్రారంభించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. నేడు హను జలవిద్యుత్‌ ప్రాజెక్టుతో పాటు దానికి అనుబంధంగా నిర్మించిన విద్యుత్‌ ప్రసార లైన్‌ను కూడా ప్రారంభించారు.

నమ్మకమైన విద్యుత్‌ వ్యవస్థ కేవలం వెలుగును అందించడమే కాదు.. ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నింపుతుందని మనందరికీ తెలుసు. ఇది ప్రజల జీవన విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. గ్రామాల్లో అనేక కొత్త కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడతాయి. పిల్లల విద్య, వైద్య సేవలు, స్థానిక చిన్న వ్యాపారాలు సహా అన్ని రంగాలకూ ప్రయోజనం చేకూరుతుంది. పూగా లోయలో ఆధునిక విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.

మిత్రులారా,

అమృత్‌ హిమ్‌ సరోవర్‌ ప్రాజెక్టు కింద నిర్మించిన 40 జలాశయాలను కూడా నేడు లడఖ్‌ ప్రజలకు అంకితం చేశాం. వీటి ద్వారా రైతులకు అవసరమైనప్పుడు సాగునీరు అందుబాటులో ఉంటుంది.

మిత్రులారా,

ప్రకృతి కారణంగా లడఖ్‌లో జీవనం ఎంతో కష్టమని ఎప్పుడూ చెబుతుంటారు. ప్రకృతి పరిస్థితులు సవాళ్లను విసురుతాయన్నది నిజమే. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ గత ప్రభుత్వాలు లడఖ్‌ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వానికి లడఖ్‌ అభివృద్ధి అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడినప్పటి నుంచి ఇక్కడి అభివృద్ధి అవసరాలపై మరింత శ్రద్ధ పెట్టాం. 2019 వరకు లడఖ్‌లో సుమారు 1,800 కిలోమీటర్ల రహదారి వ్యవస్థ మాత్రమే ఉండేది. ప్రస్తుతం అది 4,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది. గతంలో ఇక్కడ 19 ప్రధాన వంతెనలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 75కు చేరింది. హెలిప్యాడ్ల సంఖ్య కూడా ఏడు నుంచి 40కి పైగా పెరిగింది. గతంలో లడఖ్‌లోని ఇళ్లలో కేవలం 3.5 శాతం ఇళ్లకు మాత్రమే కుళాయి నీటి సదుపాయం ఉండేది. ప్రస్తుతం దాదాపు 99 శాతం ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందుతోంది. లడఖ్‌ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. వీటితోపాటు జోజిలా సొరంగ మార్గం వంటి కీలక ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత లడఖ్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో ఏడాది పొడవునా మెరుగైన రవాణా అనుసంధానం అందుబాటులోకి వస్తుంది.

మిత్రులారా,

లడఖ్‌లో కొత్త అభివృద్ధి మార్గాలను సృష్టించడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పర్యాటక రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. శీతాకాల పర్యాటకం, సాహస పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాం. వైబ్రంట్‌ విలేజెస్‌ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం లడఖ్‌లోని 40కి పైగా సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. వీటిని భారత్‌లోని “తొలి గ్రామాలు”గా పిలుస్తున్నాం. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

మిత్రులారా,

గతంలో లడఖ్‌లో సుమారు 150 హోమ్‌స్టేలు (గృహ వసతి సదుపాయాలు) మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 3,000కు పెరిగింది. లడఖ్‌లో గ్రీన్‌హౌస్‌ వ్యవసాయాన్ని కూడా నిరంతరం ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 11,000 గ్రీన్‌హౌస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలు ఏ్పడుతున్నాయి.

మిత్రులారా,

లడఖ్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండు కూడా చాలా కాలంగా ఉంది. మన ప్రభుత్వం ఆ డిమాండ్‌ను కూడా నెరవేర్చింది. ఈ ఏడాది ఆగస్టులో లడఖ్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనివల్ల పాలనాపరమైన సేవలు, న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతాయి.

మిత్రులారా,

నేడు డిజిటల్‌ సాంకేతికత ప్రజలకు ఎన్నో కొత్త అవకాశాలను చేరువ చేస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు లేదా స్థానిక ఉత్పత్తులు ఏవైనా సరే, ఆన్‌లైన్‌ వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే లడఖ్‌తో పాటు ఇతర మారుమూల ప్రాంతాల్లోనూ భారత్‌నెట్‌, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయాలను విస్తరించాం. ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా చేయడం, యువత ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అవకాశం కల్పించడం, స్థానిక వ్యాపారవేత్తలను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడం వంటి చర్యలపై నిరంతర కృషి జరుగుతోంది.

మిత్రులారా,

లడఖ్‌లోని యువతరం అభివృద్ధిపై మేము ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఇక్కడి యువతకు నాణ్యమైన విద్య, నూతన సాంకేతికతలను నేర్చుకునే అవకాశాలు అందాలి. ఇందుకోసం వారు ఇతర నగరాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు. అందువల్ల లే లో ఒక ప్రధాన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (అత్యుత్తమ నైపుణ్యాల, పరిశోధనల కేంద్రం) ఏర్పాటు చేస్తున్నాం. ఐఐటీ జమ్మూ, ఐఐఎం జమ్మూల ఉపగ్రహ క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. వీటి ద్వారా లడఖ్ యువతకు తమ ప్రాంతంలోనే ఉన్నత విద్య, పరిశోధన, అధునాతన నైపుణ్యాలు పొందేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి.

మిత్రులారా,

క్రీడల రంగంలోనూ లడఖ్‌కు అపారమైన సామర్థ్యం ఉంది. ఐస్ హాకీ, శీతాకాల క్రీడలు, పర్వతారోహణ వంటి రంగాల్లో ఇక్కడి యువత తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. లడఖ్ నూతన క్రీడా విధానం ద్వారా క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక్కడి యువతకు మెరుగైన శిక్షణ, సౌకర్యాలు అందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వారు కొత్త విజయాలు సాధించేలా చూడటమే మా లక్ష్యం.

మిత్రులారా,

లడఖ్‌లో మీరు ఎంతో కష్టపడి తయారు చేస్తున్న ఉత్పత్తులు నిజంగా అద్భుతమైనవి. నేను విదేశీ ప్రముఖులను కలిసినప్పుడల్లా లడఖ్‌లో తయారైన ఉత్పత్తులను వారికి తరచూ బహుమతులుగా అందించడంతో పాటు, మీ గురించి కూడా వారికి వివరిస్తుంటాను. జర్మనీ ఛాన్సలర్‌కు, స్వీడన్ ప్రధానమంత్రికి, కిర్గిజ్‌స్తాన్ అధ్యక్షుడికి లడఖ్‌లో తయారైన ఉత్పత్తులను బహుమతులుగా అందించాను. ఈ ప్రాంతానికి చెందిన పష్మీనా ఉన్ని, సీ బక్‌థార్న్ పండ్లు, స్థానిక హస్తకళా ఉత్పత్తులు, ఆప్రికాట్ వంటి పండ్లకు అపారమైన వాణిజ్య అవకాశాలు ఉన్నాయి. అందుకే లడఖ్ ఆప్రికాట్ నకు భౌగోళిక గుర్తింపు (జీఐ)ను అందించాం. నేడు ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు లభించేలా చూడటం, మెరుగైన బ్రాండింగ్ కల్పించడం, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు నేరుగా ఉత్పత్తిదారులకు చేరేలా చేయడం మన ప్రయత్నం. చాంగ్పా సమాజానికి చెందిన పశుపోషకులపై కూడా మేం ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వారి కృషి, సంప్రదాయ నైపుణ్యాలతో ముడిపడిన పష్మీనా ఉన్నికి మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో వాణిజ్యపరంగా పూల సాగును ప్రోత్సహిస్తున్నాం.

మిత్రులారా,

లడఖ్ సాంస్కృతిక వారసత్వం మన దేశానికి వెలకట్టలేని సంపద. ఇక్కడి ప్రాచీన బౌద్ధ మఠాలు, బౌద్ధ సంప్రదాయాలు, స్థానిక పండుగలను భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించి, కాపాడుకోవాలి. ఈ దిశగా బౌద్ధ మత గురువు ఖుషోక్ బకులా రింపోచీ చేసిన సేవలు మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు లడఖ్ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేయడమే మన ప్రభుత్వ ప్రయత్నం. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోనే తొలి శిలాచిత్రాల పరిరక్షణ పార్కును నేడు లేహ్‌లో ప్రారంభించాం. దీనివల్ల లడఖ్ ప్రాచీన వారసత్వ పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలు మరింత బలోపేతమవుతాయి. భవిష్యత్తు తరాలు ఈ వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చే సందర్శకులకు కూడా లడఖ్ గొప్ప చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

మిత్రులారా,

మనమంతా కలిసి లడఖ్‌ను అభివృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామనే నమ్మకం నాకు ఉంది. ఈ సందర్భంగా చేపట్టిన అనేక అభివృద్ధి పనుల కోసం మీ అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మీకు ధన్యవాదాలు.

 

***