పిఎంఇండియా
మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ – వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాలకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ఈ సదస్సు ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.
వేవ్స్ సదస్సులో భారతీయ సినిమా చరిత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోనే మొట్టమొదటి ఫీచర్ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913, మే 3న విడుదలైందన్నారు. ఈ చలనచిత్రానికి దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జయంతిని నిన్నే జరుపుకొన్నామని ప్రధాని గుర్తు చేశారు. గడచిన శతాబ్దంలో భారతీయ సంస్కృతిని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా విస్తరింపచేశాయని తెలిపారు. రష్యాలో రాజ్ కపూర్‌కున్న ప్రజాదరణను, కేన్స్ ఉత్సవాల్లో సత్యజిత్ రేకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపును, ఆర్ఆర్ఆర్ సాధించిన ఆస్కార్ విజయాన్ని ఉదహరించారు. భారతీయ చిత్రదర్శకులు ప్రపంచస్థాయి కథనాలను ఎలా రూపొందిస్తున్నారో వివరించారు. గురుదత్ చిత్రకావ్యాలు, రిత్విక్ ఘటక్ తెరకెక్కించిన సాంఘిక చిత్రాలు, ఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రతిభ, ఎస్ఎస్ రాజమౌళి కథన విధానం గురించి వివరించారు. వీరంతా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మందికి తెలియజేశారని అన్నారు. సినిమా దిగ్గజాలను, సినీ పరిశ్రమకు వారు చేసిన సేవలను స్మారక తపాలా బిళ్లలతో గౌరవిస్తున్నామని తెలిపారు.
దేశ సృజనాత్మక రంగ సామర్ధ్యం, అంతర్జాతీయ స్థాయిలో సహకారానికున్న ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి వివరించారు. కొన్నేళ్లుగా గేమింగ్, సంగీతం, చిత్ర దర్శకత్వం, నటన తదితర రంగాలకు చెందిన నిపుణులతో తన ఆలోచనలు పంచుకుని, ఆయా రంగాలపై అవగాహనను మరింత పెంచుకున్నానని తెలిపారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 150 దేశాలకు చెందిన గాయనీగాయకులు ‘వైష్ణవ జనతో’ ఆలపించారని గుర్తు చేశారు. ఈ శ్లోకాన్ని 500-600 ఏళ్ల క్రితం నర్సింగ్ మెహతా రాశారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కళా ప్రయత్నం గణనీయమైన ప్రభావాన్ని చూపించడంతో పాటు ప్రపంచ సామరస్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైనవారిలో చాలా మంది గాంధీ మహాత్ముని 150వ జయంతికి సంక్షిప్త వీడియో సందేశాలు రూపొందించి, ఆయన బోధనలను విస్తరించే ప్రయత్నంలో పాలుపంచుకొన్నారని వెల్లడించారు. భారతీయ సృజనాత్మక శక్తి, అంతర్జాతీయ సహకారాలతో తన సామర్థ్యాన్ని ఇప్పటికే నిరూపించుకుందని తెలిపారు. ఇప్పుడు ఆ లక్ష్యం వేవ్స్ గా కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు.
వేవ్స్ సదస్సు మొదటి సంచిక సాధించిన ఘన విజయాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రారంభమైన నాటి నుంచే ‘స్పష్టమైన ఉద్దేశం’తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. ఈ అంశంలో సదస్సు అడ్వయిజరీ బోర్డు కనబరిచిన చిత్తశుద్ధిని, కృషిని కొనియాడారు. వారి ప్రయత్నాలతోనే సృజనాత్మక రంగంలో వేవ్స్ ఓ ముఖ్యమైన ఘట్టంగా నిలిచిందన్నారు. పెద్ద స్థాయిలో నిర్వహించిన క్రియేటర్స్ ఛాలెంజ్‌ను, క్రియేటోస్పియర్ కార్యక్రమాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వీటిలో 60కి పైగా దేశాల నుంచి సుమారుగా 1,00,000 మంది సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. 32 పోటీల్లో తుదిపోటీలకు చేరుకున్న 800 మందికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వారికి లభించిందన్నారు.
వేవ్స్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్లో ప్రదర్శించిన సృజనాత్మక అంశాలను చూసి ప్రధానమంత్రి అబ్బురపడ్డారు. గణనీయమైన ఆవిష్కరణలను సాధించామని పేర్కొంటూ ఇప్పుడు అవి కార్యరూపం దాల్చే సమయం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. కొత్త క్రియేటర్లను ప్రోత్సహించడంలో వారిని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు అనుసంధానిచండంలో వేవ్స్ బజార్ సామర్థ్యాన్ని ప్రముఖంగా వివరించారు. కళా రంగంలో కొనుగోలుదారులు, అమ్మకందారులను అనుసంధానించాలనే ఆలోచనను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేసి కళాకారులకు నూతన అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు.
సృజనాత్మకతకు, మానవజీవితానికి మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని వివరిస్తూ శిశువు జీవిత ప్రయాణం తల్లి జోలపాటతోనే మొదలవుతుందన్నారు. శబ్దంతోనూ, సంగీతంతోనూ వారికి మొదట పరిచయమయ్యేది అక్కడే అన్నారు. చిన్నారి కలలను తల్లి అల్లినట్టుగానే, ఓ యుగపు కలను సృజనాత్మక నిపుణులు రూపొందిస్తారని అన్నారు. తమ కళ ద్వారా కొన్ని తరాలను ప్రభావితం చేయగల దార్శనిక వ్యక్తులను ఒక్క చోటుకి తీసుకురావడంలోనే వేవ్స్ విజయం దాగి ఉందని తెలిపారు.
సమష్టి ప్రయత్నాలపై తనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తూ.. కళాకారులు, క్రియేటర్లు, ఈ రంగంలోని దిగ్గజాల అంకిత భావం రానున్న కాలంలో వేవ్స్ ను కొత్త శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి తమ సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని పరిశ్రమ సహచరులను కోరారు. ఈ కార్యక్రమానికి మరింత ఉత్తేజకరమైన అంశాలు జోడిస్తున్నామంటూ.. భవిష్యత్తులో వేవ్స్ పురస్కారాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇవి కళ, సృజనాత్మక ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా మారతాయని తెలిపారు. నిరంతరం అంకితభావంతో ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ.. సృజనాత్మకత ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనసులను గెలుచుకోవడం, తరాలకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమని అన్నారు.
భారత వేగవంతమైన ఆర్థిక పురోగతిని ప్రస్తావిస్తూ.. దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని, మొబైల్ తయారీలో రెండో అతిపెద్ద దేశంగా ఉందని, అంకుర సంస్థల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా అవతరించిందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రస్థానం ఇప్పుడిప్పుడే మొదలైందని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన స్పష్టం చేశారు. “వంద కోట్ల జనాభాకు మాత్రమే కాదు, వంద కోట్లకు పైగా విజయగాథలకూ భారత్ నిలయం’’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ గొప్ప కళాత్మక చరిత్రను ప్రస్తావిస్తూ.. రెండు వేల ఏళ్ల కిందటే భరత ముని నాట్యశాస్త్రం భావోద్వేగాలను, మానవానుభవాలను రూపుదిద్దడంలో కళ ఎంతటి శక్తిమంతమైనదో స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. శతాబ్దాల క్రితమే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం శాస్త్రీయ నాటకానికి కొత్త దిశను పరిచయం చేసిందని పేర్కొన్నారు. ఇక్కడ వీధి వీధికీ ఓ చరిత్ర ఉందని, ప్రతి పర్వతమూ పాటను పలికిస్తుందని, నదులన్నీ రాగాలను వినిపస్తాయని చెప్తూ.. భారత్‌కు దృఢమైన సాంస్కృతిక మూలాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఒక్కో ఊరికీ సొంత జానపద సంప్రదాయాలూ విశిష్టమైన కథన శైలీ ఉన్నాయన్నారు. జానపద కథల ద్వారా ఆ సమాజాలు తమ చరిత్రను పరిరక్షించుకుంటున్నాయని తెలిపారు. భజనలు, గజళ్లు, శాస్త్రీయమైన కూర్పులు లేదా సమకాలీన బాణీలు… ఏవైనా సరే, ప్రతి స్వర మాధుర్యానికీ ఓ గాథ ఉన్నదని, ప్రతి లయకూ ఆత్మ ఉన్నదని భారతీయ సంగీత ఆధ్యాత్మిక విశిష్టతను ఆయన ప్రస్తావించారు.
నాద బ్రహ్మ (దైవిక ధ్వని) భావనను వివరిస్తూ.. బలంగా వేళ్లూనుకుని ఉన్న భారత కళాత్మక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వేవ్స్ సదస్సులో శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. శివుడి ఢమరుకాన్ని తొలి విశ్వ శబ్దంగా, సరస్వతీ దేవి వీణను జ్ఞాన లయగా, కృష్ణుడి వేణువును శాశ్వత ప్రేమ సందేశంగా, మహా విష్ణువు శంఖాన్ని సానుకూల శక్తినిచ్చేదిగా అభివర్ణిస్తూ- భారతీయ పురాణాలు సంగీతం, నృత్యాల ద్వారా ఎల్లవేళలా దైవత్వాన్ని వ్యక్తం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. సదస్సులో మంత్రముగ్ధులను చేసేలా సాగిన సాంస్కృతిక ప్రదర్శన కూడా ఈ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు. ‘ఇదే సరైన సమయం’ అని ప్రకటిస్తూ.. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ అన్న భారత్ లక్ష్యాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. వేల ఏళ్ల నాటి అమూల్యమైన సంపద దేశ కథన సంప్రదాయానికి ఉందన్నారు. భారతదేశ గాథలు కాలాతీతమైనవని, ఆలోచనను రేకెత్తించేవని, అంతర్జాతీయమైనవని వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. ఇందులో సాంస్కృతిక ఇతివృత్తాలు మాత్రమే కాకుండా శాస్త్రీయత, క్రీడలు, ధైర్య సాహసాలు కూడా ఉన్నాయని వివరించారు. దేశంలోని కథన రంగం సైన్స్‌ను కాల్పనికత, వీరత్వం, సృజనాత్మకతతో మేళవించి.. విస్తృతమైన, వైవిధ్యమైన సృజనాత్మక వ్యవస్థను నెలకొల్పుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అసాధారణమైన భారతదేశ గాథలను ప్రపంచంతో పంచుకోవడంతోపాటు కొత్త, ఆకర్షణీయమైన విధానాల ద్వారా వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యతను వేవ్స్ వేదిక తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజా పద్మ పురస్కారాలకూ వేవ్స్ సదస్సు లక్ష్యానికీ పోలిక ఉందని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచీ ప్రతిభావంతులను గుర్తించి, వారి అభ్యున్నతికి దోహదపడడమే ఈ రెండు కార్యక్రమాల లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం కొన్నేళ్లకే పద్మ పురస్కారాలు ప్రారంభమైనప్పటికీ, మారుమూల ప్రాంతాల నుంచీ దేశానికి విశేష సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించడం ద్వారా ‘ప్రజా పద్మాల’ను భారత్ ఆదరించిన వేళ వాటిలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మార్పు వల్ల ఈ పురస్కారాలు ఓ లాంఛనమైన వేడుక స్థాయి నుంచి జాతీయ పండుగగా మారాయని పేర్కొన్నారు. అదేవిధంగా సినిమా, సంగీతం, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభకు అంతర్జాతీయ వేదికగా వేవ్స్ నిలుస్తుందని, దేశంలోని అన్ని ప్రాంతాల కళాకారులకూ ప్రపంచస్థాయి వేదికపై తగిన గుర్తింపు లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
విభిన్నమైన భావనలు, సంస్కృతులను ఆదరించగల భారతీయ సంప్రదాయాన్ని ఓ సంస్కృత వచనం ద్వారా ప్రస్తావిస్తూ.. భారతీయ నాగరికతా సౌహార్ద్రత పార్సీలు, యూదుల వంటి సమాజాలను స్వాగతించిందని, వారు ఈ దేశంలో విశేషంగా పురోగతి సాధించి సాంస్కృతిక నిర్మాణంలో అంతర్భాగమయ్యారని శ్రీ మోదీ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల మంత్రులు, ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ- ప్రతి దేశమూ ఎన్నో విజయాలు సాధించిందని, విశేషంగా కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. కళకు సంబంధించి ప్రపంచం సాధించిన విజయాలను గౌరవించడమే భారతదేశ బలమన్న ఆయన.. సృజనాత్మక సహకారంపట్ల దేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు. విభిన్న సంస్కృతులు, దేశాల విజయాలను ప్రతిబింబించే కంటెంట్ సృజన ద్వారా.. అంతర్జాతీయ అనుసంధానాన్నీ కళా వినిమయాన్నీ వేవ్స్ బలోపేతం చేయగలదని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశ కథన రంగంతో భాగస్వామ్యం వల్ల.. తమ సొంత సంస్కృతి బలీయంగా ప్రతిధ్వనించే కథనాలను సృష్టించవచ్చని దీమా వ్యక్తంచేస్తూ.. అంతర్జాతీయ సృజన సమాజానికి ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు. సుసంపన్నమైన భారత కథన సంప్రదాయంలో సరిహద్దులకు అతీతమైన ఇతివృత్తాలు, భావోద్వేగాలు ఉన్నాయనీ.. అవి సహజంగా, అర్థవంతంగా ఆకట్టుకోగలవని ఆయన స్పష్టం చేశారు. భారతీయ కథలను పరిశీలించే అంతర్జాతీయ కళాకారులు, సృజనకారులు ఈ దేశ వారసత్వంతో సహజమైన బంధాన్ని అనుభూతి చెందుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సాంస్కృతిక సమ్మేళనం ‘క్రియేట్ ఇన్ ఇండియా’ అన్న భారతదేశ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని, దానిని ప్రపంచానికి మరింత అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్నారు.
“భారత్‌లో సృజనరంగ ఆర్థిక వ్యవస్థకు ఇది తొలిపొద్దు. కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి – ఈ మూడూ దానికి మూలాధారమైన కీలక స్తంభాలు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతీయ సినిమాలు ఇప్పుడు వందకుపైగా దేశాల ప్రేక్షకులను చేరాయని, పైపై ప్రశంసలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు భారతీయ సినిమాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ప్రేక్షకులు భారతీయ కంటెంటును సబ్‌టైటిల్స్‌తో చూసే ధోరణి పెరుగుతోందని, భారతీయ కథల్లో వారు లోతుగా నిమగ్నమవడాన్ని ఇది సూచిస్తుందని అన్నారు. భారతీయ ఓటీటీ పరిశ్రమ ఇటీవలి సంవత్సరాల్లో పది రెట్ల వృద్ధిని సాధించిందన్న శ్రీ మోదీ.. స్క్రీన్ పరిమాణం తగ్గినా కంటెంట్ పరిధి అవధులను అధిగమించి విస్తరించిందని, చిన్న స్క్రీన్లే పెద్ద సందేశాలను అందిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, త్వరలోనే భారతీయ సంగీతం అదేవిధమైన గుర్తింపును సొంతం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.
భారత సృజన రంగ ఆర్థిక వ్యవస్థకు గల అపారమైన సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ… మున్ముందు సంవత్సరాల్లో దేశ జీడీపీలో దీని వాటా గణనీయంగా పెరగబోతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “సినీ నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీతాల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదుగుతోంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష సంగీత విభావరి రంగంలో వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారు. అంతర్జాతీయ యానిమేషన్ మార్కెట్‌లో వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. ఇది ప్రస్తుతం 430 బిలియన్ డాలర్లకు పైగా ఉందని, వచ్చే దశాబ్దంలో రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశ యానిమేషన్, గ్రాఫిక్స్ పరిశ్రమకు ఇదొక కీలక అవకాశమని ప్రధానమంత్రి వివరించారు. అంతర్జాతీయంగా పరిధిని మరింత విస్తృతం చేసుకునేలా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంబంధిత వర్గాలను కోరారు.
దేశ సృజన రంగ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడపాలని యువ సృజనకారులకు పిలుపునిచ్చారు. వారి అభిరుచి, కృషి సృజనాత్మకతలో కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వారు గౌహతీ సంగీతకారులైనా, కొచ్చి పాడ్‌కాస్టర్లయినా, బెంగళూరులోని గేమ్ డిజైనర్లయినా, పంజాబ్‌లోని సినీ దర్శకులయినా… వారి కృషి విశేషంగా పురోగమిస్తున్న భారత సృజన రంగానికి చోదకంగా నిలుస్తోంది. సృజన రంగంలో నిపుణులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ.. స్కిల్ ఇండియా, స్టార్టప్‌లకు చేయూత, ఏవీజీసీ పారిశ్రామిక విధానాలు, వేవ్స్ వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు. సృజనాత్మకతకూ భావుకతకూ ప్రాధాన్యమిచ్చే వాతావరణాన్ని నెలకొల్పడానికి, సరికొత్త స్వప్నాలను ప్రోత్సహించడానికి, ఆ కలలను సాకారం చేసుకునే సాధికారులుగా కళాకారులను తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. సృజనాత్మకతా కోడింగ్ ఒకేచోట కలిసేలా, కథన ప్రతిభతో సాఫ్ట్‌వేర్ మిళితమయ్యేలా, అగ్మెంటెడ్ రియాల్టీతో కళ తాదాత్మ్యం చెందేలా… అత్యంత ప్రధానమైన వేదికగా వేవ్స్ నిలుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అంకితభావంతో కృషిచేయాలని యువ సృజనకారులను ప్రధానమంత్రి కోరారు.
భారత్‌లోని కంటెంట్ క్రియేటర్లంటే తనకు అచంచలమైన విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు. ఎల్లల్లేని వారి సృజనాత్మకత ప్రపంచ సృజన ప్రధాన ముఖచిత్రాన్ని పునర్లిఖిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత సృజనాత్మక కళాకారుల ఉత్సాహానికి ఎలాంటి అడ్డంకులు, పరిధులు గాని, ఒక్కోసారి ముందుకు ఒక్కోసారి వెనుకకు పోయే ఊగిసలాట మనస్తత్వం గాని లేనే లేవు… దీంతో వారిలో కొత్త కొత్త ఆలోచనలు మొగ్గలు తొడుగుతూ పూలుగా వికసించేందుకు అనువైన స్థితి నెలకొందని ఆయన అన్నారు.
యువ సృజనకారులు, గేమర్లు, డిజిటల్ ఆర్టిస్టులతో తాను స్వయంగా భేటీ అయ్యి మాటామంతీ జరిపిన మీదట, భారత్‌లో సృజన ప్రధాన అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఎంతటి ఉత్సాహం, శక్తి, ప్రతిభలు ఉప్పొంగుతున్నాయో అతి దగ్గర నుంచి తాను గమనించగలిగినట్లు ఆయన చెప్పారు. ఇండియాలోని భారీ యువ జనాభా రీళ్లు, పాడ్‌క్యాస్టులు, గేములు మొదలు యానిమేషన్, స్టాండప్‌లతోపాటు ఏఆర్-వీఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ) రూపాలకు నూతన సృజనశీల పార్శ్వాలను జోడిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ తరం కోసమంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వేదికే ‘వేవ్స్’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ తరానికి చెందిన వారి కోసం… వారు తమ శక్తియుక్తులతో సృజనాత్మక రంగంలో ఓ విప్లవాన్ని ఊహించడమొక్కటే కాకుండా దానిని సాకారం చేయడానికి కూడా వేవ్స్ తోడ్పడుతుందని ఆయన అన్నారు.
టెక్నాలజీ చోదక శక్తిగా ఉంటున్న 21వ శతాబ్దంలో సృజనాత్మక జవాబుదారుతనానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదీ శ్రీ మోదీ ప్రత్యేకంగా చెబుతూ, టెక్నాలజీ మనిషి జీవనంపై చాలా వేగవంతమైన ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. ఈ కారణంగా భావోద్వేగభరిత సున్నితత్వాన్ని, సాంస్కృతిక సంపన్నతను పదిలపర్చుకోవడానికి అదనపు ప్రయత్నాలు అవసరమన్నారు. మానవీయ కరుణను వ్యాప్తి చేసే, సామాజిక చేతనను విస్తరించే శక్తి సృజనాత్మక జగతికి ఉందని ఆయన చెప్పారు. లక్ష్యం మరమనుషులను తయారు చేయడం ఏమీ కాదు, ఉన్నత స్థాయి సున్నితత్వం, భావనాత్మక గాఢత, మేధో సంపన్నత కలిగిన వ్యక్తులను మలచడం.. ఈ గుణాలను వట్టి సమాచారాన్ని అదేపనిగా వెల్లువెత్తించడం ద్వారానో, లేక సాంకేతిక వేగంతోనో అయ్యే పని కాదు అని ఆయన స్పష్టం చేశారు. కళ, సంగీతం, నృత్యం, కథ చెప్పడం… వీటికి ఉన్న ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ వివరిస్తూ, ఈ కళారూపాలు వేల సంవత్సరాల నాటి నుంచి మనిషిలో అవగాహన శక్తులను సజీవంగా నిలుపుతూ వచ్చాయన్నారు. ఈ సంప్రదాయాలను బలోపేతం చేయడంతోపాటు ఇప్పటి కంటే మరింత ఎక్కువ ప్రోద్బల భవిష్యత్తును నిర్మించేలా కృషి చేయాల్సిందిగా సృజనాత్మక కళాకారులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని విభజించే, సమాజానికి చేటు చేసే ఆలోచనావిధానాల బారిన పడకుండా యువతరాలను కాపాడాల్సిన అవసరం ఎంతయినా ఉందని కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. సాంస్కృతిక సమగ్రతను పరిరక్షించడంతోపాటు సకారాత్మక విలువలను ప్రతిష్ఠించడానికి ఒక కీలక వేదికగా ‘వేవ్స్’ మారగలదని ఆయన అన్నారు. ఈ బాధ్యతను పట్టించుకోకపోతే రాబోయే తరాలకు ఘోరమైన పరిణామాలు ఎదురుకావచ్చని ఆయన హెచ్చరించారు.
సృజనాత్మక జగతిలో గణనీయ మార్పులను టెక్నాలజీ తీసుకువస్తోందని ప్రధాని స్పష్టం చేస్తూ, దీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ప్రపంచ స్థాయి సమన్వయాన్ని ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నారు. భారత సృజనాత్మక కళాకారులకు ప్రపంచమంతటా ఉన్న కథ చెప్పే కళాకారులతోనూ, యానిమేటర్లతోనూ, దార్శనికులతోనూ అనుబంధాన్ని పెనవేసి గేమ్స్ రూపకర్తలను ప్రపంచ విజేతలుగా మలచడంలో వేవ్స్ ఒక సమన్వయకర్తగా ఉంటుందంటూ ఆయన అభివర్ణించారు. కంటెంటును సృష్టించడానికి ఇండియాను స్ఫూర్తిగా తీసుకొంటూ, దేశ సువిశాల క్రియేటివ్ ఇకోసిస్టమ్ ను ఆమూలాగ్రం అన్వేషించాలంటూ అంతర్జాతీయ సృజనాత్మక కళాకారులకు, పెట్టుబడిదారులకు ఆయన ఆహ్వానం పలికారు. ప్రపంచ సృజనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, వారు పెద్ద పెద్ద కలలను కనాలని, తమ కథలకు ప్రాణం పోయాలని కోరారు. పెట్టుబడిదారులు ఒక్క వేదికల పైనే పెట్టుబడి పెట్టడం కాకుండా, వ్యక్తుల పైన పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆయన ప్రోత్సహించారు. భారత యువత తమ వద్ద గుట్టలు గుట్టలుగా రాశి పోసి ఉన్న కథలను సాటి ప్రపంచంతో పంచుకోవాల్సిందిగా కూడా ఆయన పిలుపునిచ్చారు. వేవ్స్ తొలి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న వారందరికీ ఆయన తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, డాక్టర్ ఎల్. మురుగన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
‘వేవ్స్ 2025’ అనేది నాలుగు రోజులపాటు సాగే శిఖరాగ్ర సదస్సు. ‘‘సృజనకారులను కలపడం.. దేశాలను కలపడం’’ అనేది ఈ సదస్సు మూలసూత్రం. ప్రసార మాధ్యమాలు, వినోదం, డిజిటల్ నవకల్పనలకు ప్రపంచ కూడలిగా భారత్‌ను ఆవిష్కరించడానికి ఈ సదస్సు నడుం బిగించింది. దీనికోసం ప్రపంచ వ్యాప్త సృజనశీలురను, అంకుర సంస్థలను, పరిశ్రమ ప్రముఖులను, విధాన రూపకర్తలను ఈ సదస్సు ఒక చోటుకు తీసుకువస్తోంది.
ఒక ఆశాజనక భవిష్యత్తుకు రూపురేఖలను కల్పించడానికి టెక్నాలజీని, సృజనాత్మక కళాకారులతో పాటు ప్రతిభావంతుల సేవలను ఉపయోగించుకోవాలన్నది ప్రధాని దార్శనికత. దీనికి అనుగుణంగానే చలనచిత్రాలను, ఓటీటీని, గేమింగును, కామిక్స్‌ను, డిజిటల్ ప్రసార మాధ్యమాలను, కృత్రిమ మేధ (ఏఐ), యానిమేషన్,విజువల్ ఎఫెక్ట్‌స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్), ప్రసార రంగ సేవలను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కలబోసి భారత ప్రసార మాధ్యమాలకు, వినోద రంగానికి ఉన్న సత్తాను వేవ్స్ సమగ్రంగా చాటిచెబుతుంది. ప్రపంచ వినోద ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత వాటాను పెంచుకుంటూ, 2029వ సంవత్సరానికల్లా 50 బిలియన్ డాలర్ల విలువ గల మార్కెటును ఒడిసిపట్టాలనేదే వేవ్స్ లక్ష్యం.
భారత్ మొట్టమొదటి సారి గ్లోబల్ మీడియా డైలాగ్‌ను (జీఎండీ) కూడా వేవ్స్ 2025లో భాగంగా నిర్వహిస్తోంది. 25 దేశాల మంత్రిత్వ శాఖల ప్రముఖులు దీనిలో పాలుపంచుకుంటున్నారు. ప్రపంచ ప్రసార మాధ్యమాలు, వినోద ప్రధాన రంగంతో ఇండియాకున్న అనుబంధంలో ఇది ఒక ప్రధాన ఘట్టం కానుంది. ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహణలో ‘వేవ్స్ బజార్’ మరో ముఖ్య అంశం. ఇది 6,100 కొనుగోలుదారు సంస్థలు, 5,200 అమ్మకందారు సంస్థలు, 2,100 ప్రాజెక్టులకు పైగా పాలుపంచుకొనే ప్రపంచ స్థాయి ఇ-మార్కెట్ ప్లేస్. ఇది స్థానిక, ప్రపంచ స్థాయి కొనుగోలుదారులను, అమ్మకందారులను కలుపుతూ నెట్‌వర్కింగ్‌తోపాటు వ్యాపార అవకాశాలను అందిస్తుంది.
ప్రధానమంత్రి క్రియేటోస్ఫియర్‌ను చూశారు. దాదాపు ఒక సంవత్సరం కిందట మొదలుపెట్టిన 32 ‘క్రియేట్ ఇన్ ఇండియా’ ఛాలెంజులకు ఒక లక్షకు పైగా రిజిస్ట్రేషన్లతో భారీ ప్రతిస్పందన రాగా, ఎంపిక చేసిన సృజనశీలురతో ప్రధాని భేటీ అయ్యారు. ప్రధానమంత్రి భారత్ పెవిలియన్‌ను కూడా సందర్శించనున్నారు.
వేవ్స్ 2025లో 90కి పైగా దేశాలకు చెందిన 10,000 మందికి పైగా ప్రతినిధులు, 1,000 మంది సృజనాత్మక కళాకారులు, 300 కన్నా ఎక్కువ సంఖ్యలో కంపెనీలతోపాటు 350కి పైగా అంకుర సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో చలనచిత్రాలు, డిజిటల్ మాధ్యమాలు, ప్రసార సేవ, వినోదం- విజ్ఞానం.. ఈ రెండు సేవలనూ అందించే ప్రసారాలు, ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ సహా విభిన్న రంగాలకు సంబంధించిన 42 సర్వసభ్య కార్యక్రమాలు, 39 బ్రేకవుట్ సెషన్లు, 32 మాస్టర్‌క్లాసులను నిర్వహిస్తారు.
***
Addressing the @WAVESummitIndia in Mumbai. It highlights India's creative strengths on a global platform. https://t.co/U4WQ4Ujv8q
— Narendra Modi (@narendramodi) May 1, 2025
A wave of culture, creativity and universal connect. pic.twitter.com/FpfM4THC5y
— PMO India (@PMOIndia) May 1, 2025
India, with a billion-plus population, is also a land of a billion-plus stories. pic.twitter.com/qtijqtd5Ii
— PMO India (@PMOIndia) May 1, 2025
Create in India, create for the world. pic.twitter.com/cycxbiZZo7
— PMO India (@PMOIndia) May 1, 2025
The dawn of the Orange Economy in India. pic.twitter.com/g2hEX8fjHL
— PMO India (@PMOIndia) May 1, 2025
Even though the screen size is getting smaller, the scope is becoming infinite. pic.twitter.com/n0akwUrv3C
— PMO India (@PMOIndia) May 1, 2025
Today, India is emerging as a global hub for film production, digital content, gaming, fashion, music and live concerts. pic.twitter.com/ubo3q8tx7S
— PMO India (@PMOIndia) May 1, 2025
To the creators of the world — dream big and tell your story.
— PMO India (@PMOIndia) May 1, 2025
To investors — invest not just in platforms, but in people.
To Indian youth — tell your one billion untold stories to the world: PM @narendramodi pic.twitter.com/g7rwE4urf8