Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“వ్యవసాయ రంగం-గ్రామీణ రూపాంతరీకరణ” ఇతివృత్తంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

“వ్యవసాయ రంగం-గ్రామీణ రూపాంతరీకరణ” ఇతివృత్తంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం


నమస్కారం!

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న మూడో వెబినార్‌కు మీ అందర్నీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. తొలి రెండు వెబినార్లలో సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక వృద్ధి వంటి కీలకాంశాలపై మనం సమీక్షించాం. ఇక నేటి వెబినార్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ-వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై చర్చ కేంద్రీకృతమైంది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో మీరంతా విలువైన సూచనలతో ఎంతగానో తోడ్పడ్డారు. మీరిచ్చిన సూచనలు, సలహాలు బడ్జెట్‌లో ప్రతిబింబించడంతో అవెంతో ఉపయుక్తమయ్యాని కూడా మీరు గమనించి ఉంటారు. అయితే, బడ్జెట్ సమర్పణ అనంతరం దేశం దాని పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఇప్పుడు మీ అనుభవం, సూచనలతో ప్రజలకు అత్యధికంగా బడ్జెట్ ప్రయోజనాలు అందేవిధంగా సరళ మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. తదనుగుణంగా బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసాను పూర్తి స్థాయిలో సకాలంలో వినియోగించడంపై ఈ వెబినార్‌ సందర్భంగా మీరిచ్చే సలహాలకు ప్రాధాన్యం ఉంటుంది.

మిత్రులారా!

వ్యవసాయం, పంటల సాగు, చేతివృత్తులు మన ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలనే వాస్తవం మీకందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారత్‌ దీర్ఘకాలిక ప్రగతి ప్రస్థానంలో వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునాది. ఈ దృక్కోణంతోనే మా ప్రభుత్వం వ్యవసాయ రంగ బలోపేతానికి నిరంతరం శ్రమించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 10 కోట్లమంది మంది రైతులకు  రూ.4 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సంస్కరణలు వారికి సాగు వ్యయంపై ఒకటిన్నర రెట్లు రాబడి లభించేలా చేశాయి. సంస్థాగత రుణ లభ్యత 75 శాతం దాటింది. ఇక ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన అభ్యర్థనలు పరిష్కృతమయ్యాయి. ఈ విధంగా ప్రభుత్వ నిరంతర కృషితో అన్నదాతకు నష్టాలు గణనీయంగా తగ్గి, వారికి ప్రాథమిక ఆర్థిక భద్రత లభించింది. పర్యవసానంగా మన వ్యవసాయ రంగంలో విశ్వాసం ఇనుమడించింది. ఆహార, పప్పుధాన్యాల నుంచి నూనెగింజల దాకా నేడు దేశం రికార్డు స్థాయి దిగుబడులు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయి, రెండో నాలుగో భాగం మొదలైనందున వ్యవసాయ రంగంలో కొత్త శక్తి నింపడం కూడా అంతే అవసరం. తదనుగుణంగా ఈ ఏడాది బడ్జెట్ ఈ దిశలో కొత్త అడుగులు వేసింది. ఈ వెబినార్‌లో చర్చల సందర్భంగా లభించే సూచనలు బడ్జెట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో త్వరగా అమలు చేయడంలో తోడ్పడతాయని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

ప్రపంచ మార్కెట్లకు నేడు ద్వారాలు తెరచుకుంటుండగా, ప్రపంచ డిమాండ్ కూడా మారిపోతోంది. అందువల్ల ఈ వెబినార్‌లో మన వ్యవసాయ రంగాన్ని ఎగుమతి ఆధారితంగా రూపొందించడం ఎలాగనే అంశంపై మనమిప్పుడు చర్చించాలి. మన దేశంలో విభిన్న వాతావరణాలు ఉన్నందున వాటిని మనం పూర్తిస్థాయిలో వాడుకోవాలి. భారత్‌ వ్యవసాయ-వాతావరణ మండలాల సమృద్ధం కాబట్టి, ఈ ఏడాది బడ్జెట్ ఈ విషయంలో మనకు అపారంగా కొత్త అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా ఉత్పాదకత  పెంపు, ఎగుమతి సామర్థ్యం పెంచడంపై దిశను నిర్దేశిస్తుంది. ఈ బడ్జెట్ అధిక విలువగల పంటల సాగుపై దృష్టి సారిస్తుంది. ఈ మేరకు కొబ్బరి, జీడిపప్పు, కోకో, శ్రీ గంధం వంటి ఉత్పత్తులకు ప్రాంతీయ-నిర్దిష్ట ప్రోత్సాహం లభిస్తుంది. మన దక్షిణాది రాష్ట్రాలు- ముఖ్యంగా కేరళ, తమిళనాడులలో కొబ్బరి ఉత్పత్తి అధికమని మీకు తెలుసు. కానీ ఇప్పుడా తోటలు వృద్ధాప్య దశకు చేరి, ఉత్పాదకత క్షీణిస్తోంది. అందువల్ల ఆ రెండు రాష్ట్రాల కొబ్బరి రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పించేలా ఈసారి బడ్జెట్‌ కొబ్బరి పంటకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది కాబట్టి, భవిష్యత్తులో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా!

ఈశాన్య ప్రాంతాల వైపు చూస్తే, “అగర్‌బత్తి” అనే పదం ‘అగర్‌ వుడ్‌’ నుంచి వచ్చిందని తెలిసిన వారు కొందరు మాత్రమే. హిమాలయ రాష్ట్రాల్లో సమశీతోష్ణ గింజ పంటలను ఈసారి బడ్జెట్‌ ప్రోత్సహిస్తుంది. ఎగుమతి ఆధారిత ఉత్పాదన పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా ఉపాధి లభిస్తుంది. ఈ దిశగా సమన్వయ సహిత చర్యలు చేపట్టడం చాలా అవసరం కాబట్టి, భాగస్వామ్య సంస్థలన్నీ సంయుక్తంగా దీనిపై ఆలోచన చేయాలి. మనం అధిక విలువగల పంటల సాగును సమష్టిగా చేపడితే అది వ్యవసాయాన్ని అంతర్జాతీయ పోటీతత్వ రంగంగా రూపొందించగలదు. ఇందుకోసం వ్యవసాయ నిపుణులు, పరిశ్రమలు, రైతులు ఏకం కావడం ఎలా? రైతులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడం ఎలా? నాణ్యత, బ్రాండింగ్, ప్రమాణాల సంబంధిత లక్ష్యనిర్దేశం ఎలా? ఇటువంటి అంశాలపై సమాలోచనను ప్రోత్సహించడం ద్వారా ఈ వెబినార్ ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ సందర్భంగా నేను మరో అంశాన్ని స్పష్టం చేయదలిచాను. ప్రపంచంలో ఇవాళ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ, సేంద్రియ ఉత్పత్తులు, ఆహారంపై ఆసక్తి ఇనుమడిస్తోంది. కాబట్టి, దేశవ్యాప్తంగా రసాయన రహిత, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించేలా అన్నదాతలను ప్రోత్సహించాలి. ఈ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు చేర్చే రహదారిగా ఈ పద్ధతులను మనం అమలు చేయాలి. దీనికోసం ధ్రువీకరణ, ప్రయోగశాల సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపైనా మీ అభిప్రాయాలను పంచుకోవాలి.

మిత్రులారా!

ఎగుమతుల పెంపులో ఒక ప్రధాన సానుకూలాంశం మన మత్స్య రంగ సామర్థ్యం. భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారు. మన జలాశయాలు, చెరువులు, ఇతర జల వనరులన్నిటా దాదాపు 4 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం మన వనరులకు ఉంది. ప్రస్తుత 4 లక్షల టన్నులకు ఈ అదనపు ఉత్పత్తిని జోడిస్తే పేద మత్స్యకారుల జీవితాలు ఎంత ఉజ్వలం కాగలవో ఒక్కసారి ఊహించండి! దీంతో  గ్రామీణ ఆదాయ వైవిధ్యీకరణకు మనకు అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్త డిమాండ్ ఉన్నందున, మన మత్స్య సంపద ఎగుమతి వృద్ధికి అదొక ప్రధాన మార్గం కాగలదు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేయడం, క్లస్టర్ ప్లానింగ్, మత్స్య శాఖలు-స్థానిక సమాజాల మధ్య బలమైన సమన్వయం వంటి అంశాలపై ఆచరణాత్మక సూచనలు ఈ వెబ్‌నార్ ద్వారా లభిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. హేచరీలు, ఫీడ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, ఎగుమతి, అవసరమైన సదుపాయాలు- వగైరాలన్నింటికీ కొత్త వ్యాపార నమూనాలు అవశ్యం. గ్రామీణ శ్రేయస్సు కోసం మత్స్య సంపదను అధిక-విలువ, అధిక-ప్రభావ రంగంగా మార్చడానికి ఇదే మంచి తరుణం గనుక మనమంతా ఈ దిశగా సమష్టిగా కార్యోన్ముఖలం కావాలి.

మిత్రులారా!

మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అధిక వృద్ధికి ఓ మూలస్తంభం పశుపోషణ రంగం. భారత్‌ నేడు ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు కాగా, గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. ఈ దిశగా మరింత పురోగమనం సాధించేందుకు పశు సంతానోత్పత్తి నాణ్యత, వ్యాధి నివారణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఇందులో పశువుల ఆరోగ్యం అత్యంత ప్రధానాంశం. నేను ఒకే భూగోళం-ఒకే ఆరోగ్యం గురించి ప్రస్తావించినపుడు అందులో వృక్ష, జంతువుల ఆరోగ్యాలు అంతర్భాగంగా ఉంటాయి. భారత్‌ ఇప్పుడు పశువ్యాధి నిరోధక టీకాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించింది. జంతువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు 125 కోట్లకు పైగా టీకా మోతాదులను అందించారు. ఇక ‘నేషనల్ గోకుల్ మిషన్’ కింద సాంకేతికతను విస్తరిస్తున్నాం. మరోవైపు పశుపోషణలోగల రైతులు ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా ప్రయోజనం పొందుతున్నారు. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని ప్రారంభించాం. ‘గోబర్‌ధన్‌’ పథకాన్ని కూడా అమలు చేస్తుండటం మీకందరికీ తెలిసిందే. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ఈ పథకం కింద జంతు వ్యర్థాలు, గ్రామీణ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవచ్చు. పాల దిగుబడితో ఆదాయ సృష్టి తరహాలోనే గోబర్ (గోమయం) కూడా ఆదాయార్జన వనరు కాగలదు. గ్యాస్ సరఫరా ద్వారా ఈ గోబర్‌ ధన్‌ మన ఇంధన భధ్రతకు గణనీయంగా తోడ్పడుతుంది. ఇది బహుళ ప్రయోజనకరం మాత్రమేగాక గ్రామాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకానికి ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ కోరుతున్నాను.

మిత్రులారా!

ఎల్లప్పుడూ ఒకే పంట సాగుమీద ఆధారపడటం రైతు శ్రేయస్సుకు మంచిది కాదని గతానుభవాలు మనకు నేర్పుతున్నాయి. దీనివల్ల ఆదాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉండదు. కాబట్టే, పంటల వైవిధ్యీకరణపై మేం దృష్టి సారిస్తున్నాం. దీనికితోడు వంట నూనెలు-పప్పుధాన్యాల, ప్రకృతి వ్యవసాయ జాతీయ కార్యక్రమాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం.

మిత్రులారా!

వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమన్నది అందరికీ తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రాలకూ గణనీయ స్థాయిలో వ్యవసాయ బడ్జెట్లున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు తమ బాధ్యతలను నెరవేర్చేలా మనం సదా ప్రోత్సహించాలి. కాబట్టి, మనం వారికెలా సాయపడటగలం? మన సూచనలు వారికి ఏ విధంగా ఉపయోగపడతాయి? వీటన్నిటికీ సమాధానం- గ్రామాలకు, రైతులకు కేటాయించిన ప్రతి రూపాయినీ సవ్యంగా వెచ్చించడమే. జిల్లా స్థాయి దాకా బడ్జెట్ కేటాయింపులను బలోపేతం చేస్తేనే గరిష్ట సంఖ్యలో కొత్త విధానాలు ప్రజలకు ఫలితాలను అందిస్తాయి.

మిత్రులారా!

ఇది సాంకేతిక పరిజ్ఞానాధిక్య శతాబ్దం… కాబట్టి, వ్యవసాయ రంగంలో సాంకేతిక సంస్కృతి విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా ‘ఇ-నామ్‌’ ద్వారా మార్కెట్ సౌలభ్య ప్రజాస్వామ్యీకరణ పూర్తయింది. అగ్రిస్టాక్ ద్వారా వ్యవసాయం కోసం సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీని కింద డిజిటల్ గుర్తింపు… అంటే- రైతులకు గుర్తింపు లభిస్తోంది. ఈ మేరకు ఇప్పటిదాకా దాదాపు 9 కోట్ల రైతు గుర్తింపు కార్డులు రూపొందాయి. అలాగే, దాదాపు 30 కోట్ల భూకమతాలపై డిజిటల్‌ సర్వే పూర్తిచేశారు. ఏఐ-ఆధారిత వేదికలు, పరిశోధన సంస్థలు, రైతుల మధ్య అంతరాన్ని భారత్-విస్తార్ వంటి పరిజ్ఞానాలు తగ్గిస్తున్నాయి.

అయితే, మిత్రులారా!

సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవస్థలు అనుసరించినపుడు, సంస్థలు దాన్ని వినియోగించడం ప్రారంభించినపుడు, వ్యవస్థాపకులు దానిపై ఆవిష్కరణలను తెచ్చినపుడు మాత్రమే సాంకేతికత ఫలితాలనిస్తుంది. ఈ వెబినార్‌లో మీరు దీనికి సంబంధించి ఆచరణాత్మక సూచనలివ్వాలి. మనం సాంకేతికతను ఎలా సమర్థంగా వినియోగంలోకి తేగలమనే అంశంపై ఈ వెబ్‌నార్‌ ద్వారా అందే సూచనలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తాయి.

మిత్రులారా!

మా ప్రభుత్వం గ్రామీణ సౌభాగ్యానికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా మేం అమలు చేస్తున్న  ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వామిత్వ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం, స్వయం సహాయ సంఘాలకు ఆర్థిక సహాయం వంటి పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సదా బలోపేతం చేస్తున్నాయి. వీటన్నిటితోపాటు ‘లక్షాధికారి సోదరి’ పథకం విజయాన్ని కూడా మనం మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ కార్యక్రమం కింద ఇప్పటిదాకా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలను  లక్షాధికారులుగా మార్చడంలో మనం విజయం సాధించాం. ఇక 2029 నాటికి మరో 3 కోట్ల మందిని ఈ జాబితాలో చేర్చి వారి సంఖ్యను 6 కోట్లకు పెంచాలని మేం లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. ఈ గమ్యాన్ని  వేగంగా సాధించడం ఎలాగనే అంశంపై మీ సూచనలు చాలా కీలకం.

మిత్రులారా!

దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సమస్యకు పరిష్కారం దిశగా భారీ కార్యక్రమం చేపట్టాం. ఈ మేరకు లక్షలాది గిడ్డంగులు నిర్మాణంలో ఉన్నాయి. దీనికితోడు వ్యవసాయ వ్యవస్థాపకులు ప్రాసెసింగ్, సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ-సాంకేతికత, వ్యవసాయ-ఆర్థిక సాంకేతికత, ఎగుమతులలో ఆవిష్కరణలు-పెట్టుబడులను పెంచాలి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి చర్చలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నవ్యోత్తేజం ఇవ్వగలవని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా వెబ్‌నార్‌లో పాల్గొంటున్న మీకందరికీ నా శుభాకాంక్షలు.. ఈ బడ్జెట్‌ను విజయవంతం చేయడంలో, ప్రతి గ్రామానికి చేరువ కావడంలో క్షేత్రస్థాయి వర్గాల ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

అనేకానేక ధన్యవాదాలు…

నమస్కారం!

***