పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వస్త్రాలు, దుస్తులు మరియు ఫ్యాషన్ రంగాలలో పరస్పర సహకారానికి సంబంధించి జౌళి మంత్రిత్వ శాఖకు ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వ్యాపార విభాగానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు) ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు జౌళి, ఫ్యాషన్ రంగాలలో భారతదేశం, ఆస్ట్రేలియా ల ప్రయోజనాలకు అనుగుణంగా పరస్పర సహకారానికి సంబంధించి అనుసరించవలసిన చర్యలకు వీలు కల్పించి తద్వారా భాగస్వాములకు లాభం చేకూర్చనుంది. ఇందులో ఆస్ట్రేలియా, భారత టెక్స్‌టైల్, ఫ్యాషన్ రంగాలను అనుసంధానం చేసే విధంగా తీసుకునే చర్యలను భాగస్వాములు సంయుక్తంగా గుర్తించనున్నారు. ఈ రంగాలలో సహకారాన్ని పెంపొందించడంతో పాటు ఆయా రంగాలలో అంతర్జాతీయ కార్యకలాపాలను పెంపొందించడం, నైపుణ్యాల వృద్ధి, ఆర్ధిక అవకాశాల ప్రోత్సాహం, అవసరమైన శిక్షణ , నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. రెండు దేశాలలో ఈ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే, ఇరు వైపులా మేధోపరమైన హక్కులను రక్షించడం జరుగుతుంది
.
చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు ఈ ఎమ్ఒయు లో భాగంగా ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
చేనేత పరిశ్రమను మొత్తంగా అభివృద్ధి చేసేందుకు మార్కెట్ అనుసంధానాన్ని కల్పించి చేనేత ఉత్పత్తిని పెంచనున్నారు. ఇందుకు సంబంధించి డిజైన్ సామర్ధ్యాన్ని పెంచేందుకు, మరిన్ని రకాల ఉత్పత్తులు తయారు చేయించేందుకు దేశీయ విపణికి, ఎగుమతి విపణులకు అనుగుణంగా చేనేత కార్మికులు నిరంతరాయంగా పని పొందేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఇది దోహదపడనుంది.
నేపథ్యం
చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. యువతరంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ఆస్ట్రేలియా ఫ్యాషన్ డిజైనర్లు, భారతదేశంలో నేసిన , భారతదేశానికి చెందిన వస్త్రాలతో భారతదేశం కోసం దుస్తులను తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియా విపణి భారతదేశం లోని ఈ రంగానికి చెందిన వారితో కలసి పని చేసేందుకు ఆసక్తి చూపుతోంది. వస్త్రాలు, చేనేత ఉత్పత్తుల డిజైనింగ్‌కు సంబంధించి ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం, వాటిని భారతదేశంలో, అంతర్జాతీయ విపణిలో మార్కెట్ చేయడానికి సంబంధించి ఆస్ట్రేలియన్ మార్కెట్ ఆసక్తి చూపుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం ఇందుకు సంబంధించి టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖతో ఒక అవగాహనపూర్వక ఒప్పందం కుదుర్చుకొనేందుకు ప్రతిపాదించింది.