పిఎంఇండియా
వాతావరణ మార్పులు, సముద్ర, ఆర్కిటిక్ అంశాల్లో ఆచరణాత్మక సహకారం ద్వారా ప్రపంచ సుస్థిరాభివృద్ధి సవాళ్ల పరిష్కారానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్– రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా ప్రకటించారు.
పర్యావరణం పట్ల బాధ్యత గల దేశాలుగా.. పర్యావరణానికి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 సమగ్ర పద్ధతిలో నెరవేర్చేందుకు ఇరుపక్షాలు నిబద్ధతను తెలియజేశాయి. ఇందుకోసం భూమి, గాలి, నీరు, జీవవైవిధ్యం, వ్యర్థాలు, సహజ వనరుల సుస్థిర నిర్వహణతో పాటు పర్యావరణ అంశాలు, వాతావరణ మార్పులపై పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి.
వాతావరణ మార్పులపై సహకారం
నియమ నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థకు మద్దతిస్తూ, పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తూ.. మానవాళి, ప్రకృతి ఉనికికే ముప్పుగా పరిణమించిన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత చర్యలను బలోపేతం చేయాల్సిన కీలక అవసరాన్ని ఇరుదేశాలు గుర్తించాయి.
ఈ సందర్భంగా పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 ప్రకారం కుదిరిన ఎంఓసీని ఇరుపక్షాలు స్వాగతించాయి. పెట్టుబడి ఆధారిత కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రాజెక్టుల కోసం సహకార విధానాన్ని ఇది నిర్దేశిస్తుంది. జాతీయంగా నిర్ణయించిన సహకార లక్ష్యాల సాధనను వేగవంతం చేస్తుంది. వాతావరణ చర్యల విషయంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కార్బన్ మార్కెట్, ఆర్టికల్ 6.2, సహకార విధానం, పునరుత్పాదక ఇంధనం, తక్కువ కర్బన సాంకేతికతలతో సహా వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకుంటాయి.
పర్యావరణ సంబంధిత సహకారం, సుస్థిరాభివృద్ధి
పర్యావరణ బాధ్యత గల దేశాలుగా వాతావరణం, పర్యావరణ రంగంలో సహకారానికి ఎంఓయూ ద్వారా సంస్థాగత సహకారాన్ని కొనసాగించాలని భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిర్ణయించుకున్నాయి. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో సభ్య దేశంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేరటాన్ని భారత్ స్వాగతించింది. గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇనిస్టిట్యూట్ (జీజీజీఐ)లో సభ్య దేశంగా భారత్ చేరికను రిపబ్లిక్ ఆఫ్ కొరియా స్వాగతించింది.
సముద్రాలు, సముద్రయాన సుస్థిరత
ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సమతుల్యత, ఆహార భద్రతలో సముద్రాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. సముద్ర విజ్ఞానం, సుస్థిర మత్స్య సంపద, తీరప్రాంత వ్యవస్థల రక్షణ, సముద్ర కాలుష్య నివారణ వంటి రంగాల్లో సహకార విస్తరణకు ఇరుపక్షాలు అంగీకరించాయి.
నీలి ఆర్థిక వ్యవస్థలో ఇరుదేశాలు సహకరించుకుంటాయి. శాస్త్రీయ, సముద్రయాన సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించుకుంటాయి.
ఆర్కిటిక్ పరిశోధన, ధృవాల సహకారం
ఆర్కిటిక్ పరిశోధన, శాస్త్రీయ సహకారంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని భారత్, దక్షిణ కొరియా దేశాలు గుర్తించాయి. వాతావరణ మార్పులపై అవగాహన పెంచుకోవటంలో ఆర్కిటిక్ కీలకమైన ప్రాంతమని, ఆర్కిటిక్ సైన్స్, ఆర్కిటిక్ షిప్పింగ్ సహా పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి.
ఇరు దేశాల్లోని ఆర్కిటిక్ పరిశోధనా సంస్థల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించటానికి, ఉమ్మడి పరిశోధనలు, శాస్త్రీయ విజ్ఞాన మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ ధృవ పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం తగిన అవకాశాలను ఇరుపక్షాలు అన్వేషిస్తాయి.
భవిష్యత్ కార్యాచరణ
సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పుల నియంత్రణకు దోహదపడే ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించుకోవటంలో నిబద్ధతను ఇరుపక్షాలు స్పష్టం చేశాయి.
ఈ సంయుక్త ప్రకటనలో పేర్కొన్న విస్తృత సహకారం.. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోనూ, బయట కూడా సుస్థిరాభివృద్ధికి తోడ్పడే వినూత్న, విస్తరించదగిన పరిష్కారాల రూపకల్పనకు దోహదపడుతుందని భారత్, దక్షిణ కొరియా విశ్వాసం వ్యక్తం చేశాయి.
***