Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్టార్ట‌ప్‌ల స‌మావేశంలో ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం (27, సెప్టెంబ‌ర్ 2015, శాన్‌ జోస్ కాలిఫోర్నియా)

స్టార్ట‌ప్‌ల స‌మావేశంలో ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం
(27, సెప్టెంబ‌ర్ 2015, శాన్‌ జోస్ కాలిఫోర్నియా)

స్టార్ట‌ప్‌ల స‌మావేశంలో ప్ర‌ధాని శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం
(27, సెప్టెంబ‌ర్ 2015, శాన్‌ జోస్ కాలిఫోర్నియా)


ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు

ఇక్క‌డ త‌మ ఉత్ప‌త్తులు ప్ర‌ద‌ర్శించిన యువ ఎగ్జిబిట‌ర్లంద‌రికీ చ‌ప్ప‌ట్ల‌తో అభినంద‌న‌లు తెలియ‌చేద్దాం.

ఆదివారం రోజున ఇంత భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

రీడ్ హాఫ్‌మ‌న్‌, మీ లింక్‌డ్ ఇన్ చాలా గొప్ప ఉత్పత్తి. అమెరికాలోను, భార‌త్‌లోను చాలా మందికి మీరు ఒక స్ఫూర్తి.

ధ‌న్య‌వాదాలు మోహ‌న్‌, వెంకీ, అంబాసిడ‌ర్‌.

ఇక్క‌డ మీ మ‌ధ్య ఉండ‌డం నాకు చాలా ఆనంద‌క‌రం. ప్ర‌త్యేకించి స్టార్ట‌ప్‌ల‌నేది నాకు చాలా ప్రీతిక‌ర‌మైన అంశం గ‌నుక ఈ సంద‌ర్భంలో మీ అంద‌రి మ‌ధ్య నిల‌వ‌డం నాకు చాలా ప్ర‌త్యేకం.

ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేకించి జాతీయ రాజ‌ధానులు ప‌నులు నిలిపివేయ‌డం లేదా చాలా మంద‌కొడిగా ఉండ‌డం జ‌రుగుతుంద‌ని మీ అంద‌రిలో ప్ర‌గాఢంగా గూడు క‌ట్టుకున్న విశ్వాసం.

ఈ అభిప్రాయం వాషింగ్ట‌న్‌లోను, సిలికాన్ వేలీలోను ఎంతో లోతుగా ఉంద‌ని నాకు తెలుసు. అలాగే బెంగ‌ళురులోని టెక్నాల‌జీ స్పెష‌లిస్టుల‌కు కూడా న్యూఢిల్లీ విష‌యంలో ఇదే అభిప్రాయం ఉంది.

మీరు యాప్‌లు త‌యారు చేయ‌ని వ్య‌వ‌హారాల్లో మాత్ర‌మే ఇలాంటి జాప్య ధోర‌ణి నెల‌కొన్న‌ద‌ని మీలో ఎక్కువ మంది భావిస్తూ ఉంటార‌ని నాకు తెలుసు.

నేను గ‌త ఏడాది ఢిల్లీలో అధికారం చేప‌ట్టిన‌ప్పుడు నా ప్ర‌భుత్వాన్ని ఒక స్టార్ట‌ప్‌గా భావించాను. ఆ మార్గంలో కొన్ని అవ‌రోధాలున్నాయ‌న్న విష‌యం కూడా గ్ర‌హించాను.

మీ ప‌నుల్లో మీకు ఎదుర‌య్యే స‌వాళ్ళు నేను అర్ధం చేసుకోగ‌ల‌ను. అయినా ఏదో ఒక కొత్త అన్వేష‌ణ ఆవిష్క‌రించ‌గ‌లిగినందుకు అబ్బుర‌ప‌డుతూ ఉంటాను.

మాన‌వ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే కొత్త ఊహ‌లు, స్ఫూర్తి, స‌రికొత్త అన్వేష‌ణ‌లు, న‌వ్య‌త ధోర‌ణులే పురోగ‌తికి దోహ‌ద‌పడ్డాయి.

నేను త‌ర‌చు చెబుతూ ఉంటాను…బ‌ల‌మైన గాలులు వీస్తున్న‌ప్పుడు కొంద‌రు కిటికీలు మూసేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. మ‌రి కొంద‌రు గాలిమ‌ర ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం గాని, గాలి వీస్తున్న దిశ‌గా స‌ముద్రంలో ప్ర‌యాణించే ప్ర‌య‌త్నం గాని చేస్తారు.

ఏదైనా ఒక అంశాన్ని ఎవ‌రైనా ఏ విధంగా చూస్తార‌న్న దాని మీద‌నే ఇదంతా ఆధార‌ప‌డి ఉంటుంది. ముందుకు వ‌చ్చిన ప‌రిస్థితిని వారు ఒక స‌వాలుగా తీసుకున్నారా లేక ఒక అవ‌కాశంగా మ‌లుచుకున్నారా అన్న‌దే ప్ర‌ధానం. జ‌డ‌త్వానికి, చొర‌వ‌కు, య‌థాపూర్వ స్థితికి, పురోగ‌తికి మధ్య అంత‌రం అది.

స్టార్ట‌ప్‌ల‌నే ఆలోచ‌న ప్ర‌పంచం ఎంత ప్రాచీన‌మైన‌దో అంత ప్రాచీన‌మైన‌ది. పాత ధోర‌ణుల‌కు స్వ‌స్తి చెప్పి కొత్త ధోర‌ణుల బాట పట్ట‌డం, పాత ఆలోచ‌న‌ల‌ను తొల‌గించి కొత్త ఆలోచ‌న‌ల‌తో ఆ లోటును పూరించ‌డం ద్వారానే ఆర్థిక ధోర‌ణుల్లో కొత్త శ‌కాల‌కు బీజం ప‌డింది.

స్టార్ట‌ప్‌లు ఎప్పుడూ పురోగ‌తికి చోద‌క‌శ‌క్తులుగా నిలుస్తాయి. నిన్న మొన్న‌టి స్టార్ట‌ప్‌లే ఈ రోజు మ‌హా సంస్థ‌లుగా మారాయి.

కొత్త త‌రం సంస్థ‌ల‌కు డిజిట‌ల్ యుగం ఒక కొత్త శ‌క్తిని అందించింది.

కేవ‌లం వ‌న‌రులు ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ఎవ‌రూ పెర‌గ‌లేని ప్ర‌పంచం ఇది. ఒక ఆలోచ‌నా ధోర‌ణిని వ్యాపింప‌చేయ‌డ‌మే ఎదుగుద‌ల‌కు మూలం అన్న‌ది నేటి త‌రం వాస్త‌వం. సృష్టిక‌ర్త కాదు…వినియోగ‌దారుడే కొత్త అప్లికేష‌న్ల అన్వేష‌కుడు.

స‌హ‌జ‌సిద్ధ‌మైన వృద్ధి సూత్రంతో స్టార్ట‌ప్‌లు ఈ రోజు విభేదించ‌వ‌చ్చు. ఒక ఏడాదిలోనే ఒక ఆవిష్క‌ర‌ణ ప్ర‌పంచంలో మార్మోగ‌వచ్చు. కోట్ల‌లో క‌స్ట‌మ‌ర్లు ఉద్భ‌వించ‌వ‌చ్చు. ఉద్యోగులు వేలాది మంది కావ‌చ్చు. విలువ‌లో కోట్ల‌లో పెర‌గ‌వ‌చ్చు.

భిన్న విభాగాల మ‌ధ్య టెక్నాల‌జీ, స‌మ‌గ్ర‌త‌, స‌రికొత్త నిర్మాణాలు, ఒక ఆలోచ‌నా ధోర‌ణిని బ‌ల‌ప‌రిచేందుకు ప్ర‌జ‌ల సంసిద్ధ‌త వివిధ సంస్థ‌ల‌కు కొత్త అవ‌కాశాల శ‌కాన్ని ముందుకు తెచ్చే అంశాలు.

ఈ వాతావ‌ర‌ణ‌మే సిలికాన్ వేలీలో అంకురం పోసుకుంది. కాలిఫోర్నియా తీరం త‌ప్పించి మ‌రే ప్రాంతం ఇంత‌గా ప్ర‌పంచంలోని మార్పును తీసుకురాలేదు.

భారీ సంస్థ‌లు కాదు…చిన్న చిన్న సంస్థ‌లే త‌మ వ‌ద్ద ఉన్న క‌ళాకారులు, సృష్టిక‌ర్త‌ల క‌ల‌ల పంట‌గా మాన‌వ జీవితానికి కొత్త కొత్త మార్గాల‌ను చూపించాయి.

అదే అమెరికా విజ‌యం…యావ‌త్ ప్ర‌పంచానికి స్ఫూర్తి.

నేను స్టార్ట‌ప్‌లే సాంకేతిక ప‌రిజ్ఞానం, న‌వ్య‌త‌ల‌కు ప్ర‌తీక‌లుగా భావిస్తాను. అవే భార‌త్‌ను ప‌రివ‌ర్తిత యుగంలో న‌డిపిస్తాయి. యువ‌త‌కు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తాయి.

మాది 35 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్కులైన యువ‌త‌రం 80 కోట్ల మంది ఉన్న జాతి. వారంద‌రూ మార్పును ఆశిస్తూ ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తున్నారు. ఆ మార్పును అందుకోగ‌ల, దాన్ని ముందుకు న‌డ‌ప‌గ‌ల శ‌క్తి, దాన్ని సాధించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం వారికి ఉంది.

దేశంలోని ఐదు వంద‌ల ప‌ట్ట‌ణాల్లో ప్ర‌తీ ఒక్కటి క‌నీసం ప‌ది స్టార్ట‌ప్‌లు, ఆరు ల‌క్ష‌ల గ్రామాల్లో ప్ర‌తి ఒక్క‌టి క‌నీసం ఆరు చిన్న వ్యాపారాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అభివృద్ధి చేయ‌గ‌లిగితే మేం అద్భుత‌మైన పురోగ‌తి సాధించ‌గ‌లుగుతాం. భారీ సంఖ్య‌లో ఉద్యోగావ‌కాశాలు కూడా అందుబాటులోకి తేగ‌లుగుతాం.

భార‌త్‌లో స్టార్ట‌ప్‌ల‌వ్య‌వ‌స్థ త్వ‌రిత‌గ‌తిన పురోగ‌మిస్తోంది. దానికి యువ‌త‌లోని శ‌క్తి, పారిశ్రామిక ధోర‌ణులు, అన్వేష‌ణాత్మ‌క ఆలోచ‌న‌లే మూలం.

త్వ‌రిత‌గ‌తిన అభివృద్ధి చెంద‌గ‌ల అతి పెద్ద మార్క‌ట్ మాది. ప్ర‌తీ రంగంలోను ఇప్ప‌టికీ వినియోగంలోకి రాని అవ‌కాశాలెన్నో ఉన్నాయి. కొత్త వ్య‌వ‌స్థ‌ల‌ను ప్రోత్స‌హించ‌గ‌ల వ్య‌వ‌స్థాప‌ర‌మైన ఏర్పాట్లు, ప్రోత్సాహ‌కాలు, ఆస‌క్తి కూడా మెండుగా ఉన్నాయి. కొత్త ఆలోచ‌న‌ల‌కు ఇంధ‌నం పోసి వెలిగించ‌గ‌ల ఇంక్యుబేట‌ర్లు, యాక్సిల‌రేట‌ర్లు, ఇన్వెస్టర్ల‌కు కూడా కొద‌వ లేదు.

స‌రికొత్త ఉత్సాహం, శ‌క్తితో స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించ‌గ‌ల శ‌క్తిని భార‌త్ కూడ‌గ‌ట్టుకుంది. గ‌త కొన్నేళ్ళుగా భార‌త స్టార్ట‌ప్‌ల సంఖ్య విశేషంగా పెరిగింది.

ఇక్క‌డ కూడా భార‌త్ నుంచి వ‌చ్చిన అసాధార‌ణ‌మైన స్టార్ట‌ప్ బృందాలున్నాయి. ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, విద్య‌, వ్య‌వ‌సాయం, స్వ‌చ్ఛ ఇంధ‌నాలు, భ‌ద్ర‌త‌, పేద‌లంద‌రికీ ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్‌, స్వ‌చ్ఛ‌మైన మంచినీరు అందించ‌గ‌ల సాంకేతిక ప‌రిజ్ఞానాలు వారు రూపొందిస్తున్నారు.

మా స్టార్ట‌ప్‌లు వాణిజ్య‌ప‌రంగా విజ‌య‌గాథ‌లే కాదు…స‌మాజాన్ని న‌వ్య‌త దిశ‌గా న‌డిపించిన బ‌లీయ‌మైన శ‌క్తులు.

డిజిట‌ల్ టెక్నాల‌జీని మా ప్ర‌జ‌లు అందుకుంటున్న తీరు పాత త‌రం నాటి విద్య‌, సాహిత్యం, ఆదాయాల‌కు భిన్న కోణాన్ని ఆవిష్క‌రించింది.

భార‌త్‌లో సెల్‌ఫోన్లున్న జ‌నాభా వంద కోట్లుంది. స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ వినియోగించే వారు ల‌క్ష‌ల్లో ఉన్నారు. వారి సంఖ్య రెండంకెల స్థాయిలో పెరుగుతోంది.

భార‌త్ అభివృద్ధి చెంద‌గ‌ల అవ‌కాశాలు మిక్కుటంగా ఉన్నాయి. త్వ‌రిత‌గ‌తిన ఆ వృద్ధిని వాస్త‌వంలోకి తీసుకురావ‌ల‌సి ఉంది.

కేవ‌లం సాంప్ర‌దాయిక వృద్ధి బాట‌లోనే మేం న‌డ‌క కొన‌సాగించ‌లేం.

ఇదే డిజిట‌ల్ ఇండియా వెనుక శ‌క్తి, దృక్కోణం. గ‌త రాత్రి క ఊడా నేను ఆ విష‌య‌మే స‌వివ‌రంగా మాట్లాడ‌ను. ప‌రిపాల‌న‌లో మార్పు తేవ‌డం, ప్ర‌జ‌ల‌కు సాధికార‌త క‌ల్ప‌న‌, అవ‌కాశాల‌కు అవ‌రోధాలు తొల‌గించ‌డం, సేవ‌లందించే వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం, పేద‌ల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో ఉత్ప‌త్తులు తీసుకురావ‌డం, నిర్దిష్ట బృందాల‌కు కావ‌ల‌సిన ప్ర‌త్యేక ఉత్ప‌త్తులు రూపొందించ‌డం, మ‌న భూమండ‌లానికి మ‌రింత సుస్థిర‌మైన భ‌విష్య‌త్తును ఆవిష్క‌రించ‌డం కోసం సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఒక సాధ‌నంగా చేసేకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని ప్ర‌స్తావించాను.

మా ఈ క‌ల‌ను సాకారం చేయ‌డంలో స్టార్ట‌ప్‌లు కీల‌క పాత్ర‌ధారులుగా నిలుస్తాయి.

అంద‌రికీ సేవ‌లు అందుబాటులోకి తీసుకురావ‌డానికి అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల త‌యారుచేయ‌డం, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధికి కావ‌ల‌సిన ఉత్ప‌త్తులు త‌యారుచేయ‌డం, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త‌ను వ్యాపింప‌చేయ‌డం ద్వారా పౌరుల్లో సాధికార‌త తెచ్చేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం, డిజిట‌ల్ ఇండియాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో సహా విస్తృత‌మైన అవ‌కాశాలు మీ ముందున్నాయి.

స్టార్ట‌ప్ స్వ‌ల్ప‌కాలిక పెట్టుబ‌డి కాదు…దీర్ఘ‌కాలిక క‌ట్టుబాటుగా నేను భావిస్తాను.

మ‌న ద‌గ్గ‌ర ఉన్న అప్లికేష‌న్లు, సంస్థ‌లు మ‌న ఊహ‌ల క‌న్నా చాలా అతీత‌మైన‌వి.

త‌న పోర్ట‌ల్‌పై ఉచిత డేటాను అందిస్తున్న మా అంత‌రిక్ష శాఖ ఇప్పుడు మ‌న ముందుంది. గ‌త కొద్ది నెల‌లుగా మేం అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞానం రూపొందించిన 170 అప్లికేష‌న్ల‌ను ప‌రిపాల‌నా యంత్రాంగంలోను, అభివృద్ధికి మేం నిర్దేశించుకున్న ప‌థంలోనూ ప్ర‌వేశ‌పెట్టాం.

ఇవ‌న్నీ భార‌త్‌లో కొత్త వెంచ‌ర్ల అభివృద్ధికి వార‌ధులు కావ‌చ్చు.

కాని అది డిజిట‌ల్ ప్లాట్‌ఫారం సృష్టించిన అవ‌కాశాల‌కే ప‌రిమితం కాదు…ప‌ట్ట‌ణాల్లోని సంస్థ‌లు ఆధునిక శాస్ర్తీయ విధానాల ద్వారా అందించిన బ‌లం కూడా..

స్టార్ట‌ప్‌ల ఆలోచ‌న‌లు, స్ఫూర్తి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ఉద్దీపింప‌చేయాల‌ని, గ్రామీణ ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాల‌ని నేను ఆశిస్తున్నాను. హ‌స్త‌క‌ళ‌ల నుంచి ప‌ర్యాట‌క రంగం వ‌ర‌కు అవ‌కాశాలు ఎన్నో ఉన్నాయి.

ప్ర‌త్యేకించి మా గ్రామీణ మ‌హిళ‌లంద‌రికీ ఇవ‌న్నీ కావాల‌ని నేను ఆశిస్తున్నాను. మ‌హిళ‌ల‌కు విస్తృతావ‌కాశాలున్న విజ‌య‌వంత‌మైన సంస్థ‌ల‌ను మేం ప్రపంచం ముందు ఆవిష్క‌రించాం. అవి గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌నే కాదు, స‌మాజంలో కూడా ప‌రివ‌ర్త‌న‌కు బాట‌లు వేస్తాయి.

మా అభివృద్ధి న‌మూనాలు ప్ర‌భుత్వ‌, ప్రయివేటు రంగాల గురించి ప్ర‌స్తావిస్తాయి. వ్య‌క్తిగ‌త సంస్థ‌లు, సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌లు, సూక్ష్మ ఆర్థిక స‌హాయ సంస్థ‌లు భాగ‌స్వాములుగా గ‌ల ప‌ర్స‌న‌ల్ సెక్టార్ గురించి నేను మాట్లాడుతున్నాను.

ఆ ల‌క్ష్యంతోనే నేను ఈ ఏడాది స్వాతంత్ర్యోత్స‌వ సందేశంలో స్టార్ట‌ప్‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇచ్చాను.

ఈ ల‌క్ష్య‌సాధ‌న‌కు స‌హాయ‌కారిగా నిలిచే ప‌థ‌కాలు మేం ప్ర‌వేశ‌పెడుతున్నాం. సుదీర్ఘ ప్ర‌భుత్వ విధివిధానాల సంకెళ్ళ‌లో మీ సృజ‌నాత్మ‌క‌తను బందీగా నిల‌ప‌బోమ‌ని నేను హామీ ఇస్తున్నాను.

ఇందులో ఒక‌టి న‌వ్య ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద ప్ర‌క‌టించిన అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్‌.

మ‌రో కీల‌క ప‌థ‌కం సేతు. ఇది స్వ‌యం ఉపాధికి, ప్ర‌తిభా సామ‌ర్థ్యాల వినియోగానికి హిందీని వార‌ధిగా నిలిపే సాధ‌నం. ఇది ఇంక్యుబేష‌న్‌, ఫెసిలిటేష‌న్ కార్య‌క్ర‌మం.

స‌రికొత్త ఉత్ప‌త్తుల డిజైనింగ్‌, అభివృద్ధి, ఆవిష్క‌ర‌ణ కోసం మేం ప్ర‌త్యేకంగా ఎల‌క్ర్టానిక్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశాం.

భార‌త్‌లో వ్యాపార నిర్వ‌హ‌ణ తేలిక చేయ‌డం కోసం నియంత్ర‌ణ‌లు, విధివిధానాలు స‌ర‌ళీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

డిజిట‌ల్ మౌలిక వ‌స‌తులు, సేవ‌లు అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో ఉంచేందుకు మేం కృషి చేస్తున్నాం. దాని వ‌ల్ల ఆరు ల‌క్ష‌ల గ్రామాల‌కు బ్రాడ్‌బ్యాండ్ వ‌స‌తి అందుబాటులోకి రావాలి. పాఠ‌శాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల‌తో పాటు ప్ర‌జ‌ల ర‌ద్దీ అధికంగా ఉండే ప్రాంతాల‌న్నింటికీ ఉచిత వైఐ స‌దుపాయం అందుబాటులోకి రావాలి.

ఇదే స‌మ‌యంలో డేటా గోప్య‌త‌, భ‌ద్ర‌త‌, మేథోసంప‌త్తి హ‌క్కులు, సైబ‌ర్ సెక్యూరిటీకి మేం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాం.

మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజైన్ ఇండియా ఎన్నో అవ‌కాశాలు అందుబాటులోకి తెస్తున్నాయ‌నేందుకు ఇదే తార్కాణం.

అందుకే స్టార్ట‌ప్‌ల గురించి ఆలోచించ‌గాఏ మా మొద‌టి విదేశీ ప్ర‌ద‌ర్శ‌న‌కు సిలికాన్ వేలీని కేంద్రంగా స‌హ‌జ‌సిద్ధంగానే ఎంచుకున్నాం.

మేథో సంప‌త్తి ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌లో భార‌త్‌, అమెరికా స‌హ‌జ‌సిద్ధ‌మైన భాగస్వాముల‌న్న‌ది మా అభిప్రాయం.

సిలికాన్ వేలీలోని స్టార్ట‌ప్‌ల‌లో 15 శాతం భార‌త సంస్థ‌లే అని నేను విన్నాను. అమెరికాకు చెందిన సంస్థ‌లు అంత‌ర్జాతీయంగా విజ‌య‌ప‌తాక ఎగుర‌వేయ‌డానికి అమెరికాలోను, భార‌త్‌లోను వేలాది మంది భార‌తీయ వృత్తి నిపుణులు కీల‌కంగా నిలుస్తున్నారు. అలాంటి సంస్థ‌ల‌కు కొంద‌రు భార‌తీయులు ఇప్పుడు సార‌థ్యం కూడా వ‌హిస్తున్నారు.

కొత్త త‌రానికి చెందిన బ‌యో ఇంధ‌నాలు, సోలార్ ఇంధ‌నం, ఇంధ‌న సామ‌ర్థ్యం సాధించేందుకు మా విశ్వ‌విద్యాల‌యాలు, ప్ర‌యోగ‌శాల‌లు కృషి చేస్తున్నాయి.

గ్రామీన భార‌త్‌కు కావ‌ల‌సిన బ‌యోమెడిక‌ల్ సాధ‌నాలు అందించేందుకు స్టాన్‌ఫోర్డ్ స్కాల‌ర్లు ఢిల్లీలోని భార‌త భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. సౌర‌శ‌క్తి ఆధారిత నీటిపారుద‌ల వ్య‌వ‌స్థ‌ల ద్వారా చిన్న‌త‌ర‌హా రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ఎంఐటి టాటా సెంట‌ర్‌కు చెందిన ఖేత్ వ‌ర్క్స్ కృషి చేస్తోంది.

స్టాన్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో త‌న పేరిట ఒక లాబ్ కూడా ఉన్న భార‌త యువ‌శాస్త్రవేత్త మ‌ను ప్ర‌కాష్ మ‌న మ‌ధ్య ఉన్నారు.

మా స‌హ‌కారం, కొలాబ‌రేష‌న్ శ‌క్తి అది. ఇక్క‌డే కూచుని మీరు మా దేశంలోని మారుమూల ప్రాంతాల పిల్ల‌ల జీవితాల‌ను త‌ర‌చి చూడ‌గ‌ల‌రు.

భార‌త్‌లోని ఒక చిన్న ప‌ట్ట‌ణంలో నివ‌శిస్తున్న ఒక యువ‌తి ఇక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌ను వీక్షిస్తూ త‌న సొంత ప్రాజెక్టు గురించి ఆలోచిస్తోంద‌ని నేను ఆశిస్తున్నాను. ముంబైలోను, బే ప్రాంతంలోను ఉన్న ఎవ‌రో ఒక‌రు వారి క‌ల‌ల‌కు ఏంజెల్‌గా నిల‌వ‌వ‌చ్చు.

దూరాల‌ను తొల‌గించి అదృష్టాల‌ను, భ‌విష్య‌త్తును మార్చ‌గ‌లది డిజిట‌ల్ వార‌ధి ఒక్క‌టే.

యువ‌త‌, న‌వ్య‌త‌కు గ‌ల శ‌క్తి అది.

భార‌త్‌, అమెరికాల మ‌ధ్య భాగ‌స్వామ్యాన్ని ఉద్దీపింప‌చేసే శ‌క్తి అది. మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంలో కొత్త దిశ‌ను ఇది సృష్టిస్తుంది. రెండు దేశాలకు సుసంప‌న్న‌త‌ను తీసుకువ‌స్తుంది.

అది మ‌నంద‌రినీ డిజిట‌ల్ శ‌తాబ్దిలోకి న‌డిపిస్తుంది. మాన‌వాళిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌కు, అంత‌ర్జాతీయంగా ఎదుర‌వుతున్న స‌వాళ్ళ‌కు ప‌రిష్కారాలు అందిస్తుంది.

ఇవాళ ఇక్క‌డ ఏర్ప‌డిన స‌రికొత్త భాగ‌స్వామ్యాల ప‌ట్ల నేను అబ్బుర‌ప‌డుతున్నాను.

ఒక దేశంగా భార‌త్‌కే కాదు…చ‌క్క‌ని ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, పున‌ర్ వినియోగం, సాంకేతిక ప‌రిజ్ఞానాల‌కు అండ‌గా నిలిచే “భార‌త్ నిధి”ని ప్రారంభించ‌డం నాకు ప్ర‌త్యేక గౌర‌వంగా భావిస్తున్నాను.

భార‌త్‌లో స్టార్ట‌ప్‌ల కోసం 150 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల నిధిని క్వాల్‌కామ్ ఏర్పాటు చేయ‌డం నాకు ఆనందంగా ఉంది. ఇది టైని మించి భార‌త్‌లోని స్టార్ట‌ప్‌ల‌కు చ‌క్క‌ని మ‌ద్ద‌తు అందిస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను.

మీ అంద‌రి మేథస్సు, పారిశ్రామిక ధోర‌ణుల బ‌ల‌మే మీకు విజ‌యం తీసుకువ‌స్తుంద‌ని నాకు తెలుసు. మీకు ఏదైనా స‌హాయ హ‌స్తం కావ‌ల‌సివ‌చ్చినా…మీ బాట‌లో అవ‌రోధాలు ఎదురైనా మేం మీ కోసం సిద్ధంగా ఉంటాం.

ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించినందుకు నాస్కామ్‌కు, ఐఐఎం అహ్మ‌దాబాద్‌కు, టై సిలికాన్ వేల‌కి నేను ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను.
మీరు భార‌త్‌లోని ఎంద‌రో యువ‌ ప్ర‌తిభావంతుల్లో స్ఫూర్తిని నింపార‌ని, వేలాది కొత్త క‌ల‌ల‌ను ఉద్దీపించేశార‌ని, భార‌త్‌-అమెరికా దేశాల మ‌ధ్య మ‌రిన్ని భాగ‌స్వామ్యాల‌కు బీజాలు వేశార‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.