Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వ‌ర్ణ ద్ర‌వ్యీక‌ర‌ణ ప‌థ‌కం ఆవిష్కారం


ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండ‌లి 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌క‌టించిన స్వ‌ర్ణ ద్ర‌వ్యీక‌ర‌ణ ప‌థ‌కానికి ఆమోద‌ముద్ర వేసింది.

ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న బంగారం ప‌థ‌కాలను మ‌రింత స‌మ‌ర్థ‌వంతం చేయ‌డంతో పాటు ప‌రిధిని మ‌రింత విస్త‌రించ‌డం, ప్ర‌జ‌ల ఇళ్ళు, వివిధ సంస్థ‌ల బీరువాల్లో మూలుగుతున్న బంగారాన్ని ఉత్పాద‌కంగా మ‌ల‌చ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. దేశీయ అవ‌స‌రాల కోసం బంగారం దిగుమ‌తుల‌పై ఆధార‌నీయ‌త‌ను త‌గ్గించ‌డం దీని దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం. భార‌త ఎగుమ‌త‌ల‌కు గ‌ణ‌నీయ‌మైన వాటా అందిస్తున్న ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాల వ్యాపారుల‌కు జిఎంఎస్ వ‌ల్ల ల‌బ్ధి చేకూరుతుంది. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త ఎగుమ‌తుల్లో ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాల విభాగం వాటా 12 శాతంగా ఉంది. ఒక్క బంగారు ఆభ‌ర‌ణాల విలువే 13 బిలియ‌న్ డాల‌ర్లుంది (అంచ‌నా). ఇలా స‌మీక‌రించే బంగారం ఆర్‌.బి.ఐ. వ‌ద్ద ఉండే బంగారం నిల్వ‌ల‌ను కూడా ప‌టిష్ఠం చేస్తుంది. ప్ర‌భుత్వ రుణ స‌మీక‌ర‌ణ వ్య‌యాల‌ను త‌గ్గిస్తుంది. ఈ స‌రికొత్త బంగారం డిపాజిట్ స్కీమ్ (జిడిఎస్‌), బంగారం రుణ ప‌థ‌కం (జిఎంఎల్‌) రెండూ కేవ‌లం ఇప్ప‌టి స్కీమ్‌ల‌లోని మార్గ‌ద‌ర్శ‌కాల్లో మార్పుల‌తో అమ‌లులోకి వ‌స్తాయి. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న గోల్డ్ రిజ‌ర్వ్ ఫండ్ ద్వారా ప్ర‌భుత్వ‌మే బంగారం ధ‌ర‌ల్లో వ్య‌త్యాసాల‌ను భ‌రిస్తుంది. ప్ర‌భుత్వం స‌మీక‌రించే రుణాల‌కు అనుసంధానం చేయ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ రుణ‌స‌మీక‌ర‌ణ వ్య‌యాలు త‌గ్గుతాయి.

దేశంలోని గృహ‌స్థులు, ట్ర‌స్ట్ లు, వివిధ సంస్థ‌ల వ‌ద్ద భారీ మొత్తంలో బంగారం భౌతికంగా నిల్వ ఉన్న‌ద‌ని అంచ‌నా. ఇలా వృథాగా బీరువాల్లో మూలుగుతున్న బంగారాన్ని వినియోగంలోకి తేవ‌డం వ‌ల్ల ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాల రంగం అవ‌స‌రాలు తీరుతాయి. కాలం గ‌డుస్తున్న కొద్ది బంగారం దిగుమ‌తుల‌ను కూడా త‌గ్గించుకునే వీలు క‌లుగుతుంది. న‌వీక‌రించిన జిడిఎస్‌, న‌వీక‌రించిన జిఎంఎల్ స్కీమ్‌లు ఈ కొత్త స్కీమ్‌లో అంత‌ర్భాగం.

న‌వీక‌రించిన బంగారం డిపాజిట్ స్కీమ్ (జిడిఎస్‌)

జిడిఎస్ కింద బంగారం స్వ‌చ్ఛ‌త ప‌రిశీల‌న‌, సేక‌ర‌ణ‌, బంగారం డిపాజిట్‌

దేశ‌వ్యాప్తంగా ప‌ని చేస్తున్న 331 అసేయింగ్‌, హాల్‌మార్కింగ్ సెంట‌ర్ల‌తో పాటు భార‌త ప్ర‌మాణాల బ్యూరో (బిఐఎస్‌) నిర్దేశించిన అర్హ‌త‌లున్న సంస్థ‌లు బంగారం నాణ్య‌త ప‌రీక్ష‌లు, బంగారం సేక‌ర‌ణ‌కు అధీకృత ఏజెన్సీలుగా వ్య‌వ‌హ‌రిస్తాయి. ఈ స్కీమ్‌లో క‌స్ట‌మ‌ర్లు డిపాజిట్ చేయాల్సిన క‌నీస బంగారం ప‌రిమాణం 30 గ్రాములు. బంగారం ఏ రూపంలో అయినా (బులియ‌న్ లేదా ఆభ‌ర‌ణాలు) ఉండ‌వ‌చ్చు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ కేంద్రాల సంఖ్య‌ను ప్ర‌భుత్వం పెంచుతుంది.

గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌

ఈ న‌వీక‌రించిన జిడిఎస్ కింద క‌స్ట‌మ‌ర్లు ఎప్పుడైనా కేవైసీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా గోల్డ్ సేవింగ్స్ ఖాతా తెరుచుకోవ‌చ్చు. ఈ ఖాతా బంగారం ప‌రిమాణంలో ఉంటుంది.

రిఫైన‌ర్ల‌కు బంగారం బ‌దిలీ

ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన బంగారాన్ని ఆయా క‌లెక్ష‌న్ కేంద్రాలు రిఫైన‌ర్ల‌కు పంపుతాయి.బ్యాంక‌ర్లు ఆ బంగారాన్ని త‌మ వ‌ద్ద‌నే ఉంచుకోవాల‌ని భావిస్తే త‌ప్ప రిఫైన‌ర్లు దాన్ని త‌మ ఖ‌జానాకు త‌ర‌లించి భ‌ద్ర‌ప‌రుస్తారు. ఇలాంటి సేవ అందిస్తున్నందుకు రిఫైన‌ర్ల‌కు బ్యాంకులు ఉభ‌యుల‌కు అంగీకార‌యోగ్య‌మైన ఫీజును చెల్లిస్తాయి. ఈ ఛార్జీల భారం క‌స్ట‌మ‌ర్‌పై ఉండ‌దు. ఈ స్కీమ్‌లో భాగ‌స్వాములుగా ఉండేందుకు రిఫైన‌ర్లు, బంగారం స్వ‌చ్ఛ‌త ప‌రీక్షా కేంద్రాలు/క‌లెక్ష‌న్ సెంట‌ర్ల‌తో బ్యాంకులు త్రైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.

కాల‌ప‌రిమితి

న‌వీక‌రించిన డిపాజిట్‌ ప‌థ‌కం కింద బంగారాన్ని స్వ‌ల్ప‌కాలానికైతే ఒక‌టి నుంచి మూడు సంవ‌త్స‌రాల కాలానికి (త‌దుప‌రి ఒక్కో ఏడాది పెంచుకోవ‌చ్చు), మ‌ధ్య‌కాలానికి అయితే ఐదు నుంచి ఏడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి, దీర్ఘ‌కాలానికి అయితే 12 నుంచి 15 సంవ‌త్స‌రాల కాలానికి (కాలానుగుణంగా మార్పులుండ‌వ‌చ్చు) డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇది బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ వ‌లెనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డిపాజిట్ ర‌ద్దు చేసుకోవ‌చ్చు. కాని ముంద‌స్తుగా ఉప‌సంహ‌రించుకున్నందుకు (పాక్షికంగా కూడా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు) పెనాల్టీ మాత్రం ఉంటుంది.

వ‌డ్డీరేటు

డిపాజిట్ల‌పై వ‌డ్డీరేటును స్వ‌ల్ప‌కాలంలో అంత‌ర్జాతీయంగా వ‌డ్డీరేట్లు, ఇత‌ర వ్య‌యాలు, మార్కెట్ ప‌రిస్థితుల ఆధారంగా బ్యాంకులు నిర్ణ‌యిస్తాయి. బంగారాన్ని గ్రాముల రూపంలో మ‌దింపు చేస్తారు. మధ్య‌కాలిక‌, దీర్ఘ‌కాలిక డిపాజిట్ల‌కు ఇచ్చే వ‌డ్డీరేటును ఆర్‌బిఐతో సంప్ర‌దించి ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. బంగారం విలువ ఆధారంగా రూపాయి విలువ‌లో వ‌డ్డీరేటును చెల్లిస్తారు.

ఉపసంహ‌ర‌ణ‌లు

స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్ల‌కు ప్రిన్సిప‌ల్ డిపాజిట్‌, దానిపై వ‌డ్డీని క‌లిపి న‌గ‌దు రూపంలో (డిపాజిట్ చేసిన బంగారం బ‌రువుకు స‌మానంగా అప్ప‌టి మార్కెట్ విలువ‌కు దీటుగా) సొమ్ము ఉప‌సంహ‌రించుకునే వీలుంటుంది లేదా అదే విలువ గ‌ల బంగారాన్ని (డిపాజిట్ చేసిన నాటి బంగారం బ‌రువుకి స‌మానంగా) పొంద‌వ‌చ్చు. ఎలా తీసుకోవాల‌నే స్వేచ్ఛ క‌స్ట‌మ‌ర్‌కే ఉంటుంది. క‌స్ట‌మ‌ర్ తాను సొమ్ము లేదా బంగారం ఉప‌సంహ‌ర‌ణ‌కు తాను ముందుగా నిర్ణ‌యించుకున్న ఎంపిక‌ను మార్చుకోవాల‌నుకుంటే బ్యాంకు విచ‌క్ష‌ణాధికారాల‌కు లోబ‌డి అందుకు అనుమ‌తించ‌వ‌చ్చు. ఒక‌వేళ పాక్షికంగా ఉప‌సంహ‌రించుకోవాల‌నుకుంటే అంత బ‌రువు గ‌ల బంగారం బార్ లేదా నాణెం అందుబాటులో లేక‌పోతే అంత‌కు స‌మానంగా

సొమ్మును మాత్ర‌మే చెల్లిస్తారు. మ‌ధ్య‌కాలిక‌, దీర్ఘ‌కాలిక డిపాజిట్ల‌కు మాత్రం డిపాజిట్ చేసిన బంగారం విలువ‌తో స‌మాన‌మైన మొత్తాన్ని న‌గ‌దు రూపంలో మాత్ర‌మే చెల్లిస్తారు. బంగారం డిపాజిట్ చేసిన స‌మ‌యంలో అమ‌లులో ఉన్న‌ర వ‌డ్డీరేటు, బంగారం విలువ ఆధారంగా వ‌డ్డీ చెల్లిస్తారు.

వినియోగం…

మ‌ధ్య‌కాలిక‌, దీర్ఘ‌కాలిక ప‌రిమితికి డిపాజిట్ చేసిన బంగారాన్ని ఈ దిగువ పేర్కొన్న విధంగా వినియోగంలోకి తెస్తారు.

– వేలం వేయ‌డం

– ఆర్‌.బి.ఐ. బంగారం నిల్వ‌ల్లో డిపాజిట్ చేయ‌డం

– నాణేలుగా మార్పిడి

– స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్ల కింద ఆభ‌ర‌ణాల వ్యాపారుల‌కు అరువుగా ఇవ్వ‌డం

ప‌న్ను మిన‌హాయింపు : జిడిఎస్ కింద ప్ర‌స్తుతం ఉన్న ప‌న్ను మిన‌హాయింపుల‌న్నీ న‌వీక‌రించిన జిడిఎస్ క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా వ‌ర్తిస్తాయి.

గోల్డ్ రిజ‌ర్వ్ ఫండ్ : ప‌్ర‌స్తుత రుణ స‌మీక‌ర‌ణ వ్య‌యానికి, మ‌ధ్య కాలిక‌/ దీర్ఘ కాలిక డిపాజిట్ల‌పై చెల్లించే వ‌డ్డీరేటుకు మ‌ధ్య గ‌ల వ్య‌త్యాసాన్ని ప్ర‌భుత్వం గోల్డ్ రిజ‌ర్వ్ ఫండ్‌కు జ‌మ చేస్తుంది.

న‌వీక‌రించిన బంగారం రుణ ప‌థ‌కం

గోల్డ్ మెట‌ల్ లోన్ ఖాతా : ఈ ప‌థ‌కం కింద బ్యాంకులు బంగారం వ్యాపారుల కోసం గోల్డ్ మెట‌ల్ లోన్ ఖాతాను తెరుస్తాయి. ఈ ఖాతాల‌ను గ్రాముల బంగారం రూపంలోనే లెక్క క‌డ‌తారు. న‌వీక‌రించిన జిడిఎస్ కింద స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్లుగా సేక‌రించిన బంగారాన్ని న‌గ‌ల వ‌ర్త‌కుల‌కు బ్యాంకులు రుణంగా అందిస్తాయి. ఆర్‌బిఐ మార్గ‌ద‌ర్శ‌కంలో బ్యాంకులు నిర్ణ‌యించే ష‌ర‌తులు, నిబంధ‌న‌లు వీటికి వ‌ర్తిస్తాయి.

వ‌ర్త‌కుల‌కు బంగారం డెలివ‌రీ : బ‌ంగారం రుణం మంజూరు కాగానే రిఫైన‌ర్ల నుంచి అంత‌కు స‌మాన‌మైన బ‌రువులో బంగారాన్ని ఆభ‌ర‌ణాల వ‌ర్త‌కులు అందుకోవ‌చ్చు. ఇందుకు అనుగుణంగా బ్యాంకులు వ‌ర్త‌కుల బంగారం రుణ ఖాతాలో ఎంట్రీలు వేస్తాయి.

వ‌డ్డీరేటు : బ‌ంగారం రుణ ప‌థ‌కం కింద ఎంత వ‌డ్డీరేటు వ‌సూలు చేయ‌వ‌చ్చున‌న్న‌ది ఆర్‌బిఐ మార్గ‌ద‌ర్శ‌కాల కింద బ్యాంకులు నిర్ణ‌యిస్తాయి.

కాల‌ప‌రిమితి : ఈ ప‌థ‌కం కింద కాల‌ప‌రిమితి ప్ర‌స్తుతం 180 రోజులుంది. బంగారం డిపాజిట్‌కు క‌నీస లాక్ ఇన్ కాల‌ప‌రిమితిని ఏడాదిగా నిర్ణ‌యించారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి కాలానుగుణంగా బంగారం రుణ ప‌థ‌కం కాల‌ప‌రిమితిని స‌మీక్షించి త‌గు మార్పులు చేయ‌వ‌చ్చు.