Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైడ్రోకార్బన్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ (హెచ్ ఇ ఎల్ పి)


హైడ్రోకార్బన్ ల అన్వేషణ మరియు లైసెన్సుల జారీ విధానం (హెచ్ ఇ ఎల్ పి)కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఈ విధానంలోని నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఇలా ఉన్నాయి.. :

1. అన్ని రకాల హైడ్రోకార్బన్ల అన్వేషణకు, ఉత్పత్తికి ఒకే విధమైన లైసెన్సు;

2. ఓపెన్ ఎకరేజ్ పాలసీ;

3. నిర్వహణ సులభతరంగా ఉండే ఆదాయ పంపిణీ పద్ధతి;

4. ముడి చమురు, సహజవాయువుల విక్రయంలోను, ధరల నిర్ణయంలోను స్వేచ్ఛ.

ఈ నిర్ణయం దేశంలో చమురు. సహజ వాయువుల ఉత్పత్తిని పెంచగలదు. ఈ రంగంలోకి గణనీయమైన పెట్టుబడులు రావడానికి దోహదం చేయగలదు. చెప్పుకోదగినన్ని ఉద్యోగావకాశాలను సృష్టించ‌గ‌ల‌దు. పారదర్శకత్వాన్ని పెంపొందించడంతో పాటు పరిపాలన పరమైన విచక్షణాధికారాన్ని తగ్గించగలగడం అనేవి కూడా ఈ విధానం ధ్యేయాలుగా ఉన్నాయి.

ఒకే విధమైన లైసెన్సు పద్ధతి కాంట్రాక్టరుకు అటు సంప్రదాయ చమురు, గ్యాస్ వనరులతో పాటు ఇటు సి బి ఎమ్, షేల్ గ్యాస్/ ఆయిల్, టైట్ గ్యాస్, గ్యాస్ హైడ్రేట్స్ వంటి సంప్రదాయేతర చమురు, గ్యాస్ వనరులను ను అన్వేషించే వెసులుబాటును కల్పిస్తుంది. ఇక ఓపెన్ ఎకరేజీ పాలసీ ఇ & పి కంపెనీలకు ఫలానా నిర్దేశిత ప్రాంతంలో నుంచి బ్లాకులను ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్ మెంట్ మల్టిపుల్ మరియు కాస్ట్ రికవరీ/ ప్రొడక్షన్ లింక్ డ్ పేమెంట్ పై ఆధారపడిన ఉత్పత్తి పంపకం విధానం స్థానంలో సులభతరంగా నిర్వహించదగిన ఆదాయ పంపకం పద్ధతి అమలులోకి వస్తుంది. ఇదివరకటి కాంట్రాక్టులు లాభాన్ని పంచుకొనే భావన పై ఆధారపడి ఉన్నాయి. వ్యయాన్ని రాబట్టుకొన్న అనంతరం లాభాలను ప్రభుత్వం, కాంట్రాక్టరు పంచుకొనే వారు. లాభాలను పంచుకొనే పద్ధతిలో ప్రయివేటు పార్టిసిపెంట్ ల వ్యయ వివరాలన్నింటినీ నిశితంగా పరిశీలించడం ప్రభుత్వానికి అవసరమయ్యేది. ఇది అనేక జాప్యాలకు, తగాదాలకు దారి తీసింది. కొత్త విధానంలో అయిన వ్యయాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు; చమురు, గ్యాస్ ల వంటి వాటి విక్రయం నుంచి లభించే స్థూల ఆదాయంలో ఒక భాగం ప్రభుత్వానికి దక్కుతుంది. వ్యాపారం చేయడంలో సౌలభ్యం అనే ప్రభుత్వ ప్రవచిత విధానానికి అనుగుణంగా ఈ కొత్త పద్ధతి రూపు దిద్దుకొన్నదని చెప్పాలి.

సముద్ర తీరానికి దూరంగా ఉండే ప్రాంతాలలో గ్యాస్ ను, ఆయిల్‌ ను గుర్తించటం, వెలికితీయడం వ్యయ భరితమే కాక అధిక నష్ట భయంతో కూడిన ప్రక్రియ అని గుర్తించి, అటువంటి ప్రాంతాలకు ఎన్ ఈ ఎల్ పి రాయల్టీ రేట్లతో పోలిస్తే తక్కువ రాయల్టీ రేట్లను నిర్ధరించారు.

రాయల్టీ రేట్లకు గ్రేడ్ లతో కూడిన పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, తక్కువ లోతు నుంచి ఎక్కువ లోతు, బాగా ఎక్కువ లోతులో అన్వేషణ జరిపే కొద్దీ రాయల్టీ రేట్లు తగ్గుతుంటాయి. అదే సమయంలో, భూమి మీది ప్రాంతాలకు మాత్రం రాయల్టీ రేట్లను మార్చలేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలపై ప్రభావం పడకూడదనే దృష్టితో ఇలా చేశారు. నూతన విధానంలో మంజూరు చేసే బ్లాకులకు.. ఎన్ ఈ ఎల్ పి కోవలోనే.. సెస్సు, దిగుమతి సుంకం వర్తించదు. ఈ తరహా బ్లాకుల నుంచి ఉత్పత్తి చేసే ముడి చమురు, గ్యాస్ లను మార్కెట్ చేసుకొనేందుకు ఈ విధానం స్వేచ్చను ప్రసాదిస్తోంది. “కనీస ప్రభుత్వం– గరిష్ఠ పాలన” అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ విధానం ఉంది.

***